4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
55 - అధ్యాయము
శ్రీనారాయణ ఉవాచ:
అను ॥ గణేశునకు నమస్కారము. నారాయణుడు ఇట్లా అన్నాడు. ఆ భగవంతుడే కృష్ణుడు అన్ని ఆత్మలలోనివాడు (అన్నిటిని ఆత్మగా గలవాడు). పరుడైన పురుషుడు. అతి కష్టముచే ఆరాధించతగినవాడు. సాధించుటకు అతీతమైనవాడు. అందరిచే ఆరాధించతగినవాడు. సుఖమునిచ్చువాడు. (1) తన భక్తులకు సాధించుటకు శ్రేష్ఠమైనవాడు. భక్తునకు ఆరాధించతగినవాడే. తన భక్తునకు ఎప్పుడూ కన్పించేవాడు. భక్తుడుకాని వానికి కన్పించనివాడు (2) అతని చరిత్ర ఎరుగరానిది. హృదయం యందే అతని పని. అందరూ అతని మాయతో బద్ధులైనవారే, అంతము లేని, మాయతో మోహమందినవారే (3) ఆతని భయంవల్ల ఈగాలి వీస్తోంది. ఏ ఆధారము లేకుండా కూర్మమును భరిస్తోంది. కూర్మము అనంతుణ్ణి, ఆతని భయంతో నిరంతరం భరిస్తోంది. (4) ఓ నారద! ఆతని భయంతో శేషుడు విశ్వాన్ని మోస్తున్నాడు. వేయి తలలు గల పురుషుడాతడు. తన తలలోని ఒక భాగంతో మోస్తున్నాడు. (5) ఈ వసుంధర సప్త సాగరములతో కూడినది. ఏడు దీవులు కలది. పర్వతములు, అడవులతో కూడినది. ఏడు పాతాళ(లేక)ములున్నాయి. (6) బ్రహ్మలోకముతో కూడిన వివిధములైన ఏడు స్వర్గములున్నాయి. ఇట్లా మూడు భువనములుగల ఈ విశ్వము కృత్రిమమని చెప్పబడింది. (7) అతని భయంతో బ్రహ్మ ప్రతిసృష్టియందు నిర్మిస్తున్నాడు. ఈ రకముగా విశ్వములు అసంఖ్యాకములైనవి. రోమకూపములతో మహావిరాట్ స్వరూపుడు (8) ఎవని భయంతో ఏ అంశము ధరించబడుతోందో, ఎవనిని ధ్యానిస్తున్నాడో అతడే పరుడు. ఆతని భయంతో కృపగల విష్ణువు సంసారాన్ని రక్షిస్తున్నాడు. (9) ఆతని భయంతో కాలాగ్నిరుద్రుడైన కాలుడు ప్రజలను సంహరిస్తున్నాడు. ఎవని భయంతో మృత్యుంజయుడైన మహాదేవుడు, ఎవనిని ధ్యానిస్తున్నాడో అతడు పరుడు. (10) అనురాగాదులతో షడ్గుణముతో కూడి ఉండి ఎప్పుడూ విరాగిగా విరతుడుగా ఉంటాడు. ఆతని భయంతో అగ్ని కాలుస్తోంది. సూర్యుడు మండుతున్నాడు. (11) ఇంద్రుడు వర్షిస్తున్నాడు. ప్రాణులందు మృత్యువు సంచరిస్తున్నాడు. పాపులను యముడు శాసిస్తున్నాడు. ధర్మము కూడా ఉంటున్నది. (12) భూమి చరాచరలోకములను ధరిస్తోంది. సృష్టియందు ప్రకృతి మహదాదులను వానిభయం వల్లనే సృష్టిస్తోంది. (13) ఆతని అభిప్రాయము తెలుసుకొనుట కష్టము. ఓ పుత్ర! ఎవరు తెలుసుకుంటారు. బ్రహ్మ విష్ణుమహేశ్వరులే ఆతని ప్రభావాన్ని తెలుసుకోలేరు. (14) ఓ వత్స! మిక్కిలి మందబుద్ధిగల నేను ఆతని చేష్టను ఎట్లా తెలుసుకుంటాను. బృందావనమందలి అరణ్యమును వదలి మధురకు ఎట్లా వెళ్ళాడు.
నందనందనుడు గోపికలను, ప్రియమైన ప్రాణాధికమైన రాధను, యశోదను, బాంధవాదులను నందుణ్ణికాని ఎట్లా విడిచి పెట్టాడు.
(16) దర్పమును హరించేవాడు, దర్పమును ఇచ్చేవాడు ఆతడు. అందరికి ఎల్లప్పుడు అన్నీ ఇచ్చేవాడు కూడా. సుదాముని శాప కారణంగా, రాధా దర్పమును భంజింపచేశాడు. (17) అట్లాగే ఇతరులకు భావనననుసరించి బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఇట్లా కొంచం ఆలోచిస్తాడు కూడా కమలోద్భవుడు. (18) ఇదివరలో విభువైన (శాసకుడైన) మహావిష్ణువు, బ్రహ్మకు, విష్ణువునకు, శేషునకు, శివునకు దర్పభంగం చేశాడు. (19) ధర్మునకు (డైన) యమునకు సాంబునకు, చంద్రసూర్యులకు, గరుడునకు, అగ్నికి, అట్లాగే గురువైన దూర్వాసునకు (20) ద్వారపాలకులైన, భక్తులైన జయవిజయులకు, సురలకు-అసురులకు, నీకు కామునకు, శక్రునకు (21) లక్ష్మణునకు, అర్జునునకు, బాణునకు, భృగునకు, సుమేరువుకు, సముద్రములకు, వాయువునకు, వరుణునకు, (22) సరస్వతికి, దుర్గకు, పద్మావతికి, భూమికి, సావిత్రికి, గంగకు, మనసకు (23) ప్రాణాధిష్ఠాతృ దేవతకు (ఐన) ప్రాణములకంటే, ప్రియమైన, ప్రాణాధికమైన రాధకు కూడా దర్పభంగం చేశాడు. ఇతరుల విషయం చెప్పేదే వుంది. (24) అందరి దర్పాన్ని హరించి తిరిగి అనుగ్రహించాడు కూడా ఆతడు. కర్త, హర్త, పాలకుడు, అన్నివిధముల సృష్టికర్తకు సృష్టికర్త (25) ఐదు ముఖములతో) శంకరుడు కూడా ఆతనిని స్తుతించుటకు సమర్థుడుకాడు. జగత్తునకు విధాతయైన బ్రహ్మకూడా (నాలు ముఖములతో) స్తుతింప సమర్థుడుకాడు. (26) వేయి ముఖములతో అనంతుడు కూడా స్తుతింపతగడు (లేడు). విశ్వ వ్యాపియైన, జనార్దనుడైన విష్ణువు స్వయంగా కూడా స్తుతింప సమర్థుడుకాడు. (27) ఆ పరమేశ్వరుని స్తుతించుటకు మహావిరాట్టుకూడా శక్తిమంతుడు కాడు. ఆ పరమాత్మ ఎదుట ప్రకృతి కూడా కంపిస్తుంది. (28) ఆ పరమేశ్వరుని స్తుతించలేక సరస్వతి జడురాలైంది ఓ నారద! ఆతని మహిమను వేదములు కూడా తెలుసుకోలేవు. (29) ఈ విధముగా పరమాత్మ ప్రభావము చెప్పబడింది. ఓ బ్రహ్మ ! నిర్గుణుడైన కృష్ణుని గురించి ఇంకేమి వినదలిచావు. (30) అని శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమందు, శ్రీకృష్ణ జన్మఖండ మందు, ఉత్తరార్ధమందు, నారాయణ నారద సంవాదమందు శ్రీకృష్ణ ప్రభావ వర్ణన మనునది ఏబది ఐదవ అధ్యాయము సమాప్తము.
