4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము

Table of Contents

6 - శ్రీకృష్ణస్తోత్ర రాజపఠనము

శ్రీనారాయణ ఉవాచ :

నారాయణ ఋషి ఇట్లు పల్కెను :

ఆ దివ్య తేజస్సు ముందు నీలచిన దేవతలిట్లు ధ్యానించి. స్తుతించి ఆ తేజస్సు నడుమ కోరదగిన సుందర రూపమును దర్శించిరి, నీటితో కూడిన మేఘము వన్నెవంట (నీల) వర్ణము గలదియు, మనోహరమైన చిరునవ్వుతో కూడినదియు, మూడు లోకములందలి జీవుల మనస్సులను మోహింపజేయునదియు, పరమానంద కరమైనదియు, రెండు చెంపల మీద వెలుగుచున్న మొసలి ఆకారము గల చెవుల కమ్మలు గలదియు, పాదపద్మములకు జాతి రత్నముల అందెలు గలదియు, అగ్నిలో కాల్చి శుద్ధి చేయబడిన పసుపువంటి రంగు గల అమూల్య వస్త్రముతో విరాజిల్లుచున్నదియు, శ్రేష్ఠమైన మణులతో రత్నములతో తన కోరికకు ఆసక్తికి తగినట్లుగా నిర్మించబడిన భూషణములతో అలంకరింపబడి సుందరమైన తన రూపము చేత ఆ నగలకే ఆభరణముగా ఒప్పుచున్నదియు, దొండపండువలె మనోహరమైన క్రింది పెదవి మీద విలాసముగా పిల్లనగ్రోవి గలదియు, ప్రసన్నమైన చూపులతో చూచుచున్నదియు, భక్తులననుగ్రహించుటకై త్వరపడుచున్నదియు, రత్నగుటికలతో (గుండీలు} కూడియున్న కవచము వక్షస్థలమున మెరయుచున్నదియు, కౌస్తుభము మొదలగు మేలి రత్నముల దివ్యతేజస్సుతో గొప్పగా వెలిగిపోవుచున్నదియునగు (శ్రీకృష్ణరూపమును) ఆకారమును దేవతలు దర్శించిరి.

దేవతలా తేజస్పులో (శ్రీకృష్ణరూపముతో బాటు) రాధికయను పేరు గల సుందరమూర్తిని దర్శించిరి. చిరునవ్వుతో తనను చూచుచున్న తన ప్రియుని (శ్రీకృష్ణుని) ఆమె ఓరచూపులతో దర్శించుచుండెను. ఆమె పలువరుస ముత్యాలపంక్తిని తిరస్కరించునదిగా యుండెను. కొద్దిపాటి నవ్వుగల ప్రసన్నముఖ మండలముతో, శరదృతువు నందలి పద్మములవంటి కన్నులతో, శరత్పూర్ణిమనాటి చంద్రకాంతిని వెక్కిరించు సుందరముఖముతో, బంధుజీవ పుష్పవస్త్రమును దొంగిలించునట్టి క్రింది పెదవి వలన సుందరముగానున్న ఆననముతో, మ్రోయుచున్న అందేల జంటతో వెలయుచున్న పాదపద్మములతో, ఎర్రని మణుల కాంతిని తిరస్కరించునట్టి గోళ్లతో, కుంకుమ పువ్వు వన్నెను కప్పి పుచ్చునంతటి పాదముల క్రింది భాగపు (అరికాళు) ఎర్రదనముతో, అమూల్యములు శ్రేష్ఠములైన రతనాల మొలనూలుతో అలంకృతమైన శ్రోణి భాగముతో, నడుము క్రింది (వెనుకవైపు) భాగము) కణకణలాడు అగ్నివలె వెలుగుచున్న పవిత్ర వస్త్రము చేత గొప్పగా ప్రకాశించుచున్న వెలుగుతో, శ్రేష్టమైన మహామణుల మువ్వలు గల నడుముతో, రత్నములు ముత్యములు కూర్చిన కంఠహారముతో, దండకడియములు కంకణములు గల హస్తములతో, ఆ దేవి అద్భుతముగా విరాజిల్లుచుండెను. గరుడుని ముక్కువంటీ ఆమేనాసాగ్రమున ఏనుగు ముత్తైపునగ అలంకరింపబడి ఉండెను. ఒకప్రక్కకు వంకరగా చుట్టిన ఆమె కొప్పు పైన మాలతీపుష్పమాల శోభిల్లుచుండెను. పారిజాత ప్రసూనముల మాలలతో ఆమె వస్త్రములు వెలిగిపోవుచుండెను. ఆమె వక్షస్థలమున కౌస్తుభమణుల హారము శోభిల్లుచుండెను. ఆమె కరాంగుళులు (చేతులళు) రత్నాల ఉంగరములతో అలంకరింపబడియుండెను. - దివ్యశంఖముయుములైన, సన్నని సూత్రరూపములుగానున్న, చిత్రవర్ణములతో గూడిన శంఖ భూషణములు (కంకణములు కడియములు గాజులు) ఆమె హస్తములకు ధరించియుండెను. మిక్కిలి కాల్చిన బంగారు వన్నెవంటీ కాంతిగల తన సుందర విగ్రహమును మేలిమి రత్నములను గ్రుచ్చిన సూత్రములతో (రత్నాల కవచముతో) కప్పిపుచ్చుచు - సుందరమైన శ్రోణి నితంబములతో, నడుము క్రింది భాగము పిరుదులు పుష్టిగానున్న స్తన భారముతో వంగినట్లున్న ఆకారముతో, తన సౌందర్యము చేత ఆభరణములకు వన్నె తెచ్చుచున్న అలంకారముతో వెలుగుచున్న ఉత్తమరాలు, ఈశ్వరి అగు రాధాదేవిని దర్శించి త్రిదశులందరు ఆశ్చర్యపడి నిండిన మనోరథములతో ఇట్లు స్తుతించిరి.,

బ్రహ్మోవాచ :

బ్రహ్మ ఇట్లు పలికెను :

ఓ ప్రభూ! నామనస్సనెడి తుమ్మెద నీ పాదమను పద్మమునందు ప్రేమభక్తులతో ఎల్లప్పుడు తిరుగాడుగాక. లోకాధిపత్యమను సంపద యొక్క అనుభవము వలన ఏర్పడిన తాపము శమించుటకు ఔషధముగా నీయందు సుదృఢముగా నిలుచునట్టి, సుపరిపక్వమైన భక్తిని, నీ దాస్యమును నాకిమ్ము.

శంకర ఉవాచ :

శంకరుడిట్లు పలికెను :

సంసార సముద్రమున మునిగిన నా చిత్తమనెడి చేప ఎల్లప్పుడీ ఘోరమైన సంసార కూపమున (ఇరుకు చేదబావి) తిరుగుచున్నది.

విషయ సుఖములందు తగుల్కొని యున్న మనస్సు చేత మీక్కిలి నిందింపదగిన, జన్మ మృత్యురూపమైన ఈ సంసార బంధమును తొలగించుము. నీ పాదపద్మములందు భక్తిని నాకొసగుము.

ధర్మ ఉవాచ :

ధర్ముడిట్లు పలికెను :

ఓ నా ప్రభూ! నా విషయవాంఛయను బంధమును ఛేదించుటకు నీ భక్తవర్గముతో సహవాసము అనెడి వాడికత్తె నాకు సమకూరుగాక. నీ పాదపద్మముల వద్ద స్థానమిచ్చుటకు మూలమైన నీపాదారవింద భక్తీని జన్మ జన్మకు ప్రసాదించుము.

మన్మధ సుందరాకారుడైన రాధికాపతి (శ్రీకృష్ణుడు) ముందు నీలిచి దేవతలిట్లు స్తుతించి పరిపూర్ణమైన తృప్తి చెందిన మనస్సులు గలవారు కాగా ఆ దయానిధి వారి స్తోత్రమును విని చిరునవ్వు గల ముఖపద్మము గలవాడై హితము సత్యమైన వాక్కుతో వారితోనిట్లు పలికెను.

శ్రీకృష్ణ ఉవాచ :

ఓ సురలారా! రండి. నిలవండి. మీరు నావారు. ఈ విషయములో సందేహము లేదు. శివుని ఆశ్రయించి యున్న మిమ్ము ఇప్పుడు 'కుశలమా' అని ప్రశ్నించుట యోగ్యము కాదు. నేనుండగా మీకు విచారమెందుకు, నిశ్చింతులుకండి. సర్వజీవులందు నేనున్నాను. ఈ మీస్తోత్రము చేత మీకు కన్పించితిని. మీ మనస్సులలో నిశ్చయించుకొన్న అభిప్రాయమంతయు నేనెరుగుదును. శుభము అశుభము అగు కర్మలు అన్నియు కాలమును బట్టి ఏర్పడుచున్నవి. ఓ దేవతలారా! గొప్పది చిన్నది (ఉత్తమము-నీచము) అను కర్మలన్నీయు కాలకృతములు. చెట్లు తమతమ ఋతువు (కాలములో పుష్పించును, ఫలించును. కాలమును బట్టి కాతకాయును. పండు పండును. సుఖము-దుఃఖము, ఆపద-సంపద, శోకము-చింత, శుభము-ఆశుభము, అన్నవి తమ తమ కర్మనిష్ఠను - ఫలనిస్థను బట్టి సర్వకాలమునందు ఉపస్థితమగును (ఎదుట వచ్చి నిల్చును).

ఈ ముల్లోకములలో ఎవనికెవడు ప్రియుడు గాని అప్రియుడు గాని లేడు, ఆయా కాలములలో కార్యకారణములను బట్టి ప్రతివాడు ప్రియమైనవాడు అప్రియమైనవాడు అగుదురు. భూమియందలి షోడశమహారాజులు పదునాలురు మనువులు అందరును తమతమ కర్మఫలము పండి కాలవశులైరి (మరణించిరి. దేహములు త్యజించిరి) గోలోకమున మీకిప్పుడు ఒక్క క్షణకాలమేది గడచినదో ఆ క్షణకాలములో భూలోకమున ఏడు మన్వంతరములు గడచిపోయినవి. ఏడుగురింద్రులు గతించి ఎనిమిదవ ఇంద్రుడిప్పుడు పదవిలో సాగుచున్నాడు. ఈ నాకాలచక్రము రాత్రింబవళ తిరుగుచునే యుండును. ఇంద్రులు మనువులు మానవులు భూపాలురు అందరును గతించిరి. ఇప్పుడు భూమండలమున కీర్తి పుణ్యము అన్నవి పేరుకు మాత్రమే మిగిలియున్నవి. ఇప్పుడును భూమి మీద దుష్టులు హరినీందకులు మహాబలపరాక్రమములు గలవారు అగు రోజులున్నొరు. ఆ రాజులందరు నిశ్చయముగా కాలమునకు వశులై మరణింతురు. ఇట్టి కాలము వచ్చినను నా ఆజ్ఞ వలన వాయువు ఆగక ఎల్లప్పుడు వీచుచునే యున్నాడు, అగ్ని కాల్చుచునే యున్నాడు. సూర్యుడు ఎండగాయుచునే యున్నాడు. దేహములకు వ్యాధులేర్పడుచున్నవి. జీవులపై మృత్యువు కదలుచునే యున్నది. మేఘములు వర్షించుచునే యున్నవి. నా యాజ్ఞ వలన సర్వదేవతలు, స్వజాతి కర్మలయందు నిష్ఠగలవారై బ్రాహ్మణులు, తపస్సునందు నిష్ఠగలవారై తపోధనులు, బ్రహ్మమునందు నిష్ఠగలవారై బ్రహ్మఋషులు, యోగాభ్యాసము (భగవద్ధ్యానము) నందు నిష్ఠగలవారై యోగులు-వీరందరు నాశాసనము దాటరాదను భయముచేత భీతులై తమతమ కర్మలయందు ధర్మములందు తత్పరులై (ఆసక్తిగలవారై} స్వజాతికుచితమైన ఆయా కర్మలు ధర్మములు తమ పూర్వకర్మలను నిర్మూలించునన్న విశ్వాసముతో సందేహము లేనివారై నా భక్తులై ఉన్నారు.

ఓ దేవతలారా! నేను కాలమునకు కాలపురుషుడు {శాసించువాడను సృష్టికర్తకు సృష్టికర్తను. సంహారకర్తకు సంహారకుడను. పాలన చేయు వానికి పరాత్పరుడగు పాలకుడను. నాయాలను బట్టియ, ఇతడు సంహర్త హరుడు అన్న నామముతో చెప్పబడినాడు. - సృష్టిని చేయుట వలన నీవు {బ్రహ్మ) విశ్వసపు ఐతివి. ధర్మరక్షణను ఐటి ఉడు {ధర్మదేవత) పాలకుడు ఆమెను. బ్రహ్మ మొదలుకొని అల్పమైన గడ్డిపరక వరకు అందరు జీవులకు నేను శాసకుడనగు ప్రభువును (ఈశ్వరుడను) . సమస్త జీవులకు తమ తమ కర్మలను బట్టి ఫలమిచ్చువాడను వారి వా కర్మలను నశింపజేసి మోక్షమిచ్చువాడను నేనే. సవరీని సంహరింతునో వారిని రక్షించువాడెవడు? నేనెవరిని పాలింతునో వారిని చంపువాడెవడున్నాడు {లేడు) అందరిని సంహరించువాడను సృష్టించువాడను రక్షించువాడను నేనే. ఐనను శాశ్వత దేహములు (జ్ఞానానందమయములైన ముక్తిదశయందట అకారములు) ధరించిన భక్తులను సంహరించుటకు {శరీరముల నుండి జీపులను వేరుచేయుటకు) నాకును శక్తిలేదు. నా పాదములనర్చించుటయందే ఆసక్తి గలవారై యుండు భక్తులు ఎల్లప్పుడు నన్ననుసరించియే ఉందురు. నేనెల్లప్పుడు వారిని రక్షించుటకొరకై భక్తుల వద్దనే ఉందును. సమస్త జీవులు ఈ బ్రహ్మాండమున మరల మరల చచ్చుచు పుట్టుచున్నారు. నా భక్తులు మాత్రము సందేహము లేక ఆపదలు లేక {భయాందోళనారహితులై) ఉందురు. వారెప్పుడును నళింపరు. అందువలననే జ్ఞానులందరు. దాస్యము కోరుదురే కానీ తమకొరకై వరములు కోరరు. ఎవరు నా దాస్యము కోరుకొందురో{యాచింతురో) వారు ధన్యులు. ఇతరము {దాస్యము కాక ఇతర భోగములు) కోరుకొనువారు విధివంచితులు. చావుపుట్టుకలు, ముసలి తనము, రోగముల వలన భయము, యమయాతనలు (పాపఫలితముగా యముని వలన వడు నరకబాధలు) ఇవి యన్నియు కర్మలు చేయు (కర్మిషులకు) వారి సంభవించును. కాని భక్తులకెప్పుడును లేవు. అన్ని కర్మలు చేయువారైనను భక్తులకు పుణ్యపాపములంటవు. వారి కర్మఫలములను {అవశ్యము అనుభవింపదగినవైనను) నేను వారికంటకుండ (భక్తులగుట వలన) విసిరివేయుదును. నేను భక్తులకు ప్రాణమును, వారు నాకు ప్రాణములు. వారు ఎల్లప్పుడు నన్నే తలంతురు. నేను రాత్రింబవళ్లు వారినే స్మరింతును. వాడియే పదహారు అంచులు గల సుదర్శనమనెడి చక్రము యొక్క తేజస్సులో పదునారవ భాగము తేజస్సు కూడ అందరు జీవులలో (సమిష్టిగా కలిసి లేదు. అట్టి కోరదగిన చక్రమును వారిరక్ష కొరకు ఇచ్చి భక్తుల వర్ధ ఉంచినపుడును నాకు నీలుకడగాని తృప్తిగానీ ఉండవు. నేను గూడ వారి రక్షణార్థము భక్తుల సమీపమునకీ వెళ్లుదును. నాకు వైకుంఠమున గాని గోలోకమున రాధికా సమీపమున గాని నాకు నిలుకడ (చలనములేని స్థితి) ఉండదు. ఎక్కడ భక్తులు నివసింతురే అక్కడ రాత్రింబవళ్లు నిలిచియుందును. నా ప్రాణముల కన్న ప్రియురాలైన రాధీ రాత్రింబవళ్లు నా వక్షస్థలమున నిలిచియుండును. నాకు మీరు గాని ప్రాణములకంటే అధికురాలైన లక్ష్మీగాని భక్తుల కంటే ఎక్కువ ప్రియులు కారు. ఓ సురలారా! భక్తులు నాకు సమర్పించిన ఏ పదార్థమున నను పరమ ప్రీతీతో నేను భుజింతును. భక్తుడు గానీ వాడిచ్చినదానిని వాస్తవముగా నేను తినను. ఆ నైవేద్యమును స్వయముగా వాడే భుజించుము. భక్తులు తమభార్యా పుత్రులను తమవారినందరిని విడిచి నన్ను రేయింబవళ్లు ధ్యానింతురు. కాబట్టి మిమ్ము విడిచి నేను కూడ ఎల్లప్పుడు వారినే స్మరింతును.

ఏ దురాత్ములు నాభక్తులకు బ్రాహ్మణులకు గోవులకు యజ్ఞయాగాదులకు దేవతలకు పీడలు కల్గొంతులో (హింసింతురో) ఆ దుర్జనులు అగ్నిలో ఎండుగడ్డివరి తొందరగా నశించిపోదురు. వారిని సంహరించుటకు నేనుద్యమించినపుడు ఎవడును రక్షింపజాలడు. ఓ దేవతలారా! నేను భూలోకమున కేగుదును.. మీరు మీ గృహములకు తిరిగిపొండు. మీరు కూడ మీమీ అంశలతో త్వరగా భూతలమునకు వెల్లుడు జన్మలెత్తుడు). ఇట్లు పలికి జగన్నాథుడు గోపfపీ గణములను పిలిచి సమయోచితమైన వాక్యమును మధురముగా సత్యముగా వారితో ఇట్లు పలికెను.

ఓ గోపాలులారా! గోపికలారా! నేను చెప్పునది వినుడు. మీరెల్లరు శ్రేష్ఠమైన నందవ్రజమునకు (నందుని రేపల్లె) వెళ్ళడు (అక్కడ జన్మించుడు). రాధా! నీవు కూడా త్వరగా వృషభానుని గృహమునకు వెళ్ళము. వృషభానుని భార్య కళావతి. ఆమె పతివ్రత, పితృదేవతల మనస్సంకల్పము వలన లక్ష్మీదేవి అంశతో సుబలుడన్న వానికి బిడ్డగా జన్మించిన కన్య ఆమె. స్త్రీలలో ధన్యురాలు మాన్యురాలు. పూర్వము దూర్వాసమహర్షి శాపము కారణముగా లక్ష్మీదేవి వ్రజములో అతని (సుబలుడు) యింట జన్మించినది. వృషభానుని భార్యయగు కలావతి గర్భమున జన్మించి త్వరగా నందుని ప్రజమునకు పొమ్ము. ఓ పద్మముఖీ! నిన్న చ్చట బాలరూపమున నున్న నేను చేపట్టుదును. రాధా ! నీవు నాకు ప్రాణముల కంటే అధికురాలవు. నీకును నేనట్లే కదా! మన యిద్దరిలో రవ్వంత గూడ భేదము లేదు. ఎల్లప్పుడు ఇద్దరమొక్క శరీరమే. ఇట్లు చెప్పగా రాధాదేవి విని ప్రేమ చేత విహ్వలురాలై (మనస్సు భయముతో చెదరి) ఒక్కసారి ఏడ్చెను. ఓ నారదా! శ్రీహరి ముఖమనెడీ చంద్రుని {చంద్రకాంతిని-ముఖకాంతిని} తన నేత్రములనెడి చకోరములతో త్రాగెను.{చకోర పక్షులు ప్రియముగా చంద్రకాంతీని త్రాగినట్లు శ్రీకృష్ణముఖమును రాధ తన నేత్రములతో తనివిదీర దర్శించెను).

గోలోకమందలి గోపాలకులు గోపికలు భూలోకమున ఉత్తమములైన గోపకుల గృహములలో ప్రతిశుభమందిరమందును జన్మలెత్తిరి. ఇంతలో గోలోకవాసులందరు అక్కడ ఒక ఉత్తమరథమును చూచిరి. అది శ్రేష్ఠమైన మణులతో వజ్రములతో అలంకృతమై ఉండెను. ఒక లక్ష తెల్లని చామరములు పదివేల నిలువుటద్దములు వేయి రత్నకలశములు పారిజాత పుష్పమాలల సమూహములు అగ్నివలె మెరయుచున్న సన్నని కాషాయవస్త్రములు వెలయుచుండగా ఆ రధము స్వర్ణమయమై ఉండెను. శ్రేష్ఠులైన పార్షదులు కొలుచుచుండగా వాడి నడుము రధము పై నూరు సూర్యమండలములకు సాటివచ్చు తేజోరాశీ నడుమ ఒక సాటిలేని విగ్రహము గల వాడుండెను. కోరదగిన సుందర శ్యామల పురుషుడతడు. పీతాంబరమును శంఖచక్ర గదా పద్మములను ధరించి కిరీటముతో కుండలములతో కూడి చందనము అగురు కస్తూరి కుంకుమ పువ్వుల యొక్క ద్రవము పులుముకొని నిలువెత్తు వనమాల యను పూదండ ధరించి యుండెను. నానావిధ సారరత్నముల ఆభరణములతో అలంకృతుడై చిరునవ్వు మొగము భక్తులననుగ్రహించుట కొరకైన తొందర తనము గల చతుర్భుజమూర్తి అతడు (వారికి కన్పించెను).

ఆ స్వామికి ఎడమవైపున సుందర మనోహరముగా తెల్లని వర్ణముతో రత్నాభరణముల శోభతో ఆడ్యురాలైన, పసుపు పచ్చ వస్త్రముతో (పీతాంబరము) శోభించుచున్న, శరదృతువునందలి పున్నమి నాటి చంద్రుని వంటి ముఖము గల, శరత్కాల పద్మముల వంటి నేత్రములు కల, పక్వమైన దొండపండు వంటి క్రింది పెదవి గల, మనోహరముగా చిరునవ్వు నవ్వుచున్న, వేణువు, వీణావాద్యము, పుస్తకములు చేతులందు ధరించియున్న, భక్తులను గ్రహించుటలో త్వరగల, విద్యలకు అధిష్టానదేవత యగు, జ్ఞానరూపీణీ సరస్వతీదేవి వెలసియుండెను. ఆ స్వామికి కుడివైపున కాల్చిన బంగారు వంటి ఎరుపు పసుపు వర్ణకాంతితో, శరత్కాల చంద్రుని వంటి ప్రభతో, సుందర సుమనోహరముగా చిరునవ్వు చిందించుచు, మేలిమి రతనాల కుండలముతో చెక్కిళ్లు వెలిగిపోవుచుండగా, శ్రేష్ఠరత్నములు కుట్టిన అమూల్య వస్త్రము ధరించి అమూల్య రత్నములు గల దండ కడియములు చేతికంకణములు శోభించుచుండగా, సారవంతములైన రత్నాల అందెల యొక్క ముగ్ధమనోహరమైన ధ్వనితో, మణుల మొలనూలు బిగించిన నడుముతో, పారిజాత పుష్పమాలలు వక్షఃస్థలమున ప్రకాశించుచుండగా, నిండుగా విచ్చుకొన్న మాలతీ కుసుమముల దండలు కొప్పున వెలయుచుండగా, శరత్కాల చంద్రుని కాంతిని దోచుకొనెడి ముఖమున సుందరమైన అలంకృతులతో, నల్లని కస్తూరి చుక్క తో భాటు ఎర్రని సిందూర తిలకము గలదియు, సుందరముగా తీర్చిన కాటుకతో వెలయుచున్న శరత్కాల పద్మముల వంటి కన్నులతో, వేయి రేకులతో కూడిన లీలాకమలము చేత ధరించి సుందరముగా తన్ను చూచుచున్న నారాయణుని ఓరచూపులతో విలాసముగా చూచుచున్న లక్ష్మీదేవి ఒప్పుచుండెను. ఆ చతుర్భుజ మూర్తియగు నారాయణుడు ఈ యిద్దరు స్త్రీలతో బాటు పార్షదులతో బాటు త్వరగా రథము దిగి గోపీ గోపగణములతో నిండియున్న ఆ సుందమైన సభను చేరబోయెను. దేవతలు గోపగోపీగణములు సంతోషముతో చేతులు జోడించి నిలిచిరి. సురరులు (దేవఋషులు నారదాదులు) సామవేదమున చెప్పబడిన స్తోత్రములతో స్తుతించిరి. శ్రీమన్నారాయణుడట్లు పోయి తన పరివారయుక్తముగా శ్రీకృష్ణ రూపములో లీనమయ్యెను. మిక్కిలి ఆశ్చర్యకరమైన ఆ దృశ్యమును చూచి అక్కడి వారందరు పరమాశ్చర్యమును పొందిరి.

ఇంతలో అచ్చటికీ బంగారు రథము పై వచ్చిన గత్పతి, స్వయముగా స్థితికార్యముతో జగత్తులను కాపాడు (పాలించు) విష్ణువు, వనమాలా విభూషితుడు, పీతాంబరధారి, లక్ష్మీసమన్వితుడు, నాల్గు భుజములవాడు, చిరునవ్వుతో సుమనోహరుడైన అతడు ఆ రథము నుండి దిగి, సర్వాలంకార శోభతో కోటి సూర్య సమాన తేజస్సుతో రా అక్కడి వారందరు లేచి నిలచి (అతనిని చూడగనే) స్తోత్రము చేసిరి. ఆ స్వామి కూడ రాధికాప్రభు శరీరములోనే లీనమయ్యెను. ఆ గొప్పవింతను అక్కడివారు చూచి మిక్కిలి విస్మయము పొందిరి.

శ్వేత ద్వీపమునందు నివసించు విష్ణుదేవుడు అట్లు హరి (గోలోకకృష్ణుడు అంగమున లీనము కాగా- ఇంతలోనే శుద్ధమైన స్ఫటికమణి వంటి శరీర వర్ణముగల, సంకరణుడన్న నామము గల, సూరురు సూర్యుల వంటి తేజస్సు గల, సహస్ర శిరస్సులు గల పురుషుడు త్వరగా అక్కడికి వచ్చెను. వచ్చిన ఆ విష్ణుస్వరూపునీ చూచి అక్కడి వారందరు స్తోత్రమొనర్చిరి. అతడు రాధికా ప్రభువును స్తోత్రమొనర్చి భక్తితో వేయి తలలు వంచి నమస్కరించెను. ఓ నారదా! ధర్మఋషి పుత్రులము నారాయణుడు నరుడు అను నామములు గలవారమగు మేమిద్దరమున్నాము గదా. నేనా గోలోకమున కృష్ణపాదపద్మమున లీనమైతిని. (కృష్ణావతారకాలమున రెండవవాడగు నరుడు అర్జునుడు(ఫాలునుడు)గా జన్మించేను, అక్కడ బ్రహ్మ శంకరుడు ఆదిశేషుడు (సంకర్షణుడు) ధర్మదేవత ఒకచోట.

ఇంతలో దేవతలచ్చట ఒక ఉత్తమమైన రథమును చూచిరి. ఆ రథము మేలిమి బంగారుతో చేయబడినది. నానావిధ రత్నాలంకార శోభితము. శ్రేష్ఠమైన మణుల సారము గలది. అగ్నివలె స్వచ్ఛమైన (ఎరుపు) వస్త్రముతో కూడినది. శ్వేతచామరములు నిలువుటద్దములతో అలంకరింపబడినది. వేయి చక్రములు గలిగి మనస్సు అంత వేగముగా ప్రయాణించుచు మనోహరమైనది. శంకరుని ప్రీత్యర్థము విశ్వకర్మ చేత పూనికతో దేవదానవులందరి రథములలో శ్రేష్ఠముగా నిర్మించబడినది. గ్రీష్మ ఋతువులోనీ రెండు జాముల సూర్యతేజస్సును దోచుకొనునట్టిదిగా, ముత్తెముల యొక్క మణుల యొక్క వజ్రముల యొక్క సమూహముతో వెలుగునది. కీలుబొమ్మలు పుష్పవనములు సరస్సులు అడవులు చిత్తరువుల రూపమున చిత్రించబడినది. ఏబది యోజనముల ఎత్తుతో నాలు యోజనముల వెడల్పుతో, రతీదేవికి సాటివచ్చు సుందరీమణులు గల రతీ మందిరములతో ఆ రథము అద్భుతముగా నుండెను.

అక్కడిపోరు ఆ రథము మీది నున్న ఈశ్వరియైన మూలప్రకృతిని దర్శించిరి. జ్వలించుచున్న మేలిమి బంగారపు వన్నెను దోచుకొనుచున్న వెలుగుతో, సాటిలేని తేజస్స్వరూపముతో రత్నాలంకార భూషితయై, నానావిధములైన ఆయుధములు ధరించి సహస్రజనముతో ఇద్దరు కుమారులతో కొలువై యున్న ఆ దేవి కొద్దిపాటి నవ్వుతో ప్రసన్నమైన ముఖమండలము, భక్తుల ననుగ్రహించుటలోని త్వర, చెంపల మీది నుండి క్రిందికి ప్రసరించుచున్న రత్నకుండలముల ప్రభతో వెలయుచుండెను. మేలిరత్నములచే నిర్మించబడిన కాలియందేల ధ్వనితో, నడుము మీద వెలయుచున్న మణుల ఒడ్డాణముతో, రత్నసార నిర్మితములైన దండకడియములు కరకంకణముల అలంకారముతో, మందార పుష్పమాలలు ప్రకాశించుచున్న వక్షస్థలముతో, పుష్టిగా కఠినముగానున్న నితంబ శ్రేణీప్రదేశములతో పుష్టిగా ఎత్తుగా బరువైయున్న స్తన మండలము వలన కొద్దిగా వంగినట్లు తోచు పై భాగముతో శరత్కాలమందలి అమృత కీరణుని (చంద్రునికి కాంతినీ తిరస్కరించు నెమ్మోము (ముఖము}తో, చూచువారికి మనోహరముగా వెలయుచు, మెరుపు కాటుకను రేఖగా తీర్చిన. శరత్కాల పద్మములవంటి లోచనములతో (కన్నులు) చందనము అగురు కస్తూరి ద్రవ్యముల చేత చిత్రితములైన మకరికా పత్రరేఖల అలంకారము (చెంపల పైన రంగురంగులుగా గీసిన మొసలి చేషవంటి ఆకారరేఖలు} ముత్యాల వరుసల వన్నెను దోచుకోను పలు వరుసతో, నిండుగా విచ్చిన మాలతీ సుమమాలలలంకరించిన కొప్పుతో, గరుడుని ముక్కువంటి ముక్కు చివర వెలుగుచున్న ఏనుగు ముత్తైపు పోగుతో, అగ్నివలె ఎఱ్ఱగా మెరయుచున్న మేలి వస్త్రధారణముతో ప్రకాశించుచు ఆ దేవి సింహాము పైన.

ఆ దేవి కొడుకులతో బాటు రథము దిగి శ్రీకృష్ణునకు నమస్కరించి ఒకచోటనుండెను, గణేశుడు కుమారస్వామి పరాత్పరుడైన కృష్ణునకు నమస్కరించి ఆ వెనుక ఉన్న శంకరునకు, ధర్మదేవతకు అనంతునకు (సంకర్షణుడు - సహస్రశీరుడు} కమలోద్భవునకు (కమలమున పుట్టిన బ్రహ్మ} నమస్కరించి నిలిచిరి. దేవతలు వారిని చూచి ఆశీర్వాదములు చేసి సమీపమున కూర్చుండ పెట్టుకొని సంతోషముతో ఆ యిద్దరితో చక్కని సంభాషణము చేసిరి {ముచ్చటలాడిరి)

ఆ సభామధ్యమున శ్రీహరి ముందు దేవతలందరు నిలిచి యుండిరి. ఆ దృశ్యమును చూచి గోలోకమందలి గోప గోపీగణములు మిక్కిలి విస్మయపడిరి.

అప్పుడు చిరునవ్వుతో వెలుగు ముఖపద్మముతో శ్రీకృష్ణుడు లక్ష్మీదేవితో "ఓ దేవీ! సనాతనురాలా! నీవు నానావిధ రత్న సంపద గల భీష్మకునింటికి పోయి అతని భార్య (వైదర్భి గర్భమున జన్మనెత్తుము. నేను కుండిన పురికి వచ్చి నీ పాణిగ్రహణము చేయుదును” (నిన్ను వివాహమాడుదును) అనెను.

ఓ నారదా! పార్వతీదేవిని చూచి త్వరగా తమ ఆసనములనుండి లేచి ఆ దేవీ మణులు (లక్ష్మి, సరస్వతి) అందమైన రత్నసింహాసనము పై ఆ ఈశ్వరిని కూర్చుండ బెట్టిరి. పార్వతి లక్ష్మీసరస్వతి ఒకే పీఠమున కూర్చుండి యథోచితముగా మాట్లాడుకొనిరి.

ఆ ముగ్గురు గోపకన్యలతో సంప్రీతితో మాట్లాడిరి. ఆ గోపికలలో కొందరు వారి సన్నిధిలో సంతోషముగా పలికిరి.

జగత్పతియైన శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ పార్వతీ దేవీతో ఇట్లనెను. ఓ దేవీ! నీవు అంశరూపముతో శుభమైన నందుని వ్రజమునకు పొమ్ము. ఓ సృష్ట సంహారము చేయుదానా! మహామాయా! కల్యాణీ! నందుని వీర్యము ద్వారా యశోదాదేవి గర్భమున జన్మించుము. భూమండలమున భూమియందు ప్రతీనగరములో ప్రతి వనములో ప్రతి గ్రామమున భక్తితో జనులు అక్కడక్కడ అధిష్టాన దేవతగా (ప్రధాన దేవతగా పూజించునట్లు నీ పూజలు చేయింతును. మానవులు నానావిధ ద్రవ్యములతో దివ్యమైన బలులతో సంతోషముగా నిన్నర్చింతురు. నందుని యింట యశోద సూతికా గృహమున నీవు భూమిని తాకినంత మాత్రమున (పుట్టగానే నన్ను గన్న తండ్రి నన్నక్కడ ఉంచి నిన్ను తీసుకొని పోవును. కంసుడు నిన్ను దర్శించగానే నీవు (అవతారము చాలించి) శివుని సమీపమునకు పోదువు. నేను భూమీ యొక్క భారమును దింపి సోలోకమునకు వెళ్లిపోదును.

ఇట్లు పలికి శ్రీహరి ఆరు ముఖములు గల కుమారస్వామితో నాయనా! నీవును అంశరూపమున భూతలమునకు వెళ్లుము. ఓ సురేశ్వరా! నీవు జాంబవతి గర్భమున జన్మించుము. దేవతలారా మీరందరు తమ అంశలతో ధరణీ తలమునకు పొండు. నిశ్చయముగా భూదేవీ భారమును తొలగింతును అని పల్కి రాధానాధుడు సింహాసనముపై కూర్చుండెను.

బ్రహ్మోవాచ :

ఓ నారదా! దేవతలు దేవీమణులు గోపాలకులు, గోపికలు నిలిచి యుండగా ఇంతలో బ్రహ్మ శ్రీహరి ముందు చేతులు జోడించి జగన్మనోహరుడైన స్వామితో వినయముతో ఇట్లు పలికెను. ఓ ప్రభూ! ఈ సేవకుని విజ్ఞాపనమును చిత్తగించవలెను. సేవకులమగు మాకు నీవు ప్రభువువు. మమ్ము భరించువాడవు పొలించువాడవు, ఉద్ధరించువాడవు నీవే. ఓ మహానుభావా! భూమండలమున ఎవరికెక్కడ జన్మస్థలము? ఏ దేవతలు ఏ దేవీ మణులు ఏ రూపమున ఏ కళతో జన్మించవలెను? ఎవనికీ ఏ పేరుతో వ్యవహారము? మహీతలమున ఏ దేశము ఎవరికి నిర్దేశించబడినది? ఎవడు ఈశ్వరుడవగు నీ ఆజ్ఞను సర్వదా పాలించునో వాడే నీ భక్తుడు. నీచేత పోషింపబడువాడు అని అనెను.

శ్రీకృష్ణ ఉవాచ :

ఇట్లు పలికిన బ్రహ్మవాక్కులు విని జగన్నాథుడు “ఎక్కడ ఎవనికి ఏయవకాశమీయబడినదో క్రమముగా చెప్పుదును” అని శ్రీకృష్ణపరమాత్మ ఇట్లు పలికెను. మన్మధుడు రుక్మిణీ పుత్రుడుగా జన్మించును. రతీదేవి మాయలెరుగునది కాన శంబరాసురుని గృహమున ఛాయారూపమున నీలిచియుండును. ఆ రతీ ప్రద్యుమ్నులకు (రుక్మిణీ పుత్రుడు) నీవు పుత్రుడవై జన్మించి అనిరుద్ధనామముతో వ్యవహరింపబడుదువు. భారతీదేవి శోణితపురములో బాణాసురుని పుత్రికగా జన్మించును. జగత్పతి యగు అనంతుడు దేవికీ గర్భమున ప్రవేశించి మోయవలన ఆమె గర్భమునుండి సంకర్షింపబడి (చక్కగా లాగబడి) రోహిణీ గర్భము చేరి ఆమె పుత్రుడుగా జనించును. ఆ ప్రభువు గర్భసంకర్షణ కారణముగా సంకర్షణుడన్న నామముతో ప్రసిద్ధుడగును. సూర్యపుత్రీకయగు యమున కాళిందియన్న పేరుతో గంగాదేవి అంశతో జన్మించును. తులసీదేవి అర్ధాంశతో లక్ష్మణయను రాజకన్యగా, వేదమాత యగు సావిత్రీ దేవి నాగ్నజితియను నామముతో, భూదేవి సత్య భామగా, సరస్వతీదేవి శైబ్యగా, రోహిణీ దేవి (చంద్రుని భార్య) మిత్రవిందయను రాజకన్యగా, జగత్ర్పభువగు సూర్యుని యొక్క భార్య అంశతో రత్నమాల, స్వాహాదేవి (అగ్ని భార్య) అంశతో సుశీల, ఇట్లు రుక్మిణి మొదలగు స్త్రీలు తొమ్మండుగురు జన్మింతురు. దుర్గాదేవి అర్ధాంశయగు జాంబవతితో కలిసి పదిమంది మహిషులు (శ్రీకృష్ణావతారమున పట్టపురాణులు) చెప్పబడుదురు. ప్రస్తుతము పార్వతీదేవి తన అర్థాంశతో జాంబవంతుని గృహమునకేగుగాక. పూర్వము పార్వతీ దేవికి కైలాస పర్వతము మీద శంకరాళ్ల లభించినది. శ్వేత ద్వీప నివాసియగు విష్ణువు కైలాసమునకేగగా “ఓ ప్రియురాలా! పార్వతీ!} నా ఆజ్ఞతో ఈ విష్ణువునకు ఆలింగన మిమ్ము నీకు దోషము లేదు” అనెను.

బ్రహ్మోవాచ :

శ్రీ భగవానువాచ :

 ఓ రాధినాధా! శ్వేత ద్వీపవాసియగు విష్ణువుతో సంభాషించునప్పుడు పార్వతీదేవికి శివుని ఆజ్ఞ ఎట్లు లభించెను? అని బ్రహ్మదేవుడడుగగా భగవంతుడగు రాధాపతి ఇట్లు పల్కెను. పూర్వము గణేశుని దర్శించుటకై సర్వదేవతలు శంకరునీ నివాసమునకు (కైలాసమునకు వెళ్లిరి. స్వయముగా విష్ణువు శ్వేతద్వీపము నుండి అక్కడకు పోయెను. అతడు గణేశుని దర్శించి సంతోషించి ఉత్తమాసనము మీద కూర్చుండెను. అప్పుడక్కడి వారందరు ముల్లోకములను మోహింపజేయు విష్ణువును సుఖముగా దర్శించిరి.

నవయౌవనము గలవాడు సుందరుడు శ్యామవర్ణుడు కిరీటధారి కుండలాలంకృతుడు పీతాంబరధారి చందనము ఆగురు కస్తూరీ మొదలగు సుగంధ వస్తువుల ద్రవము పులిమిన విగ్రహము గలవాడు, రత్నాలంకారముల శోభతో అధికుడై చిరునవ్వు ముఖపద్మమున వెలుగగా పార్షదుల చేత చుట్టు సేవింపబడుచు రత్న సింహాసనముననున్న విష్ణువును దర్శించి సురలందరు నమస్కారములు చేయగా శివుడును పూజించి స్తుతించెను. అట్టి విష్ణువును పార్వతీ దేవి ప్రసన్నముఖము, కన్నులు కలదై చూచీ విలాసముగా ఆ సాధ్వి వస్త్రముతో తన ముఖము కప్పుకొనెను.

మిక్కిలి సుందరముగా నున్న ఆవిష్ణురూపమును ముఖమునకు కప్పుకోనియే మరల మరల చూచి చూచి ఆసతి కనురెప్పపాటు లేనిది. పరమాద్భుతమై ఆ వేషమును చిరునవ్వుతో వంకరచూపుతో చూచి శరీరము పులకలేత్తగా సుఖసముద్రమున మునిగిపోయెను. ఒక క్షణము సేపు ఐదు ముఖములు గలవాడును,' మూడు కన్నులు గలవాడును త్రిశూలము పరిఘ ధరించినవాడును కోటి మన్మధ సుందరుడును తెల్లని వర్ణము గలవాడగు శంకరుని దర్శించి మరియొక క్షణము నల్లనివాడును ఏకముఖుడును రెండు కన్నులు గలవాడును నాల్గు భుజములు (హస్తములు) గలవాడును పీతవస్త్రము (పసుపు వన్నె వస్త్రము) వనమాలల చేత అలంకృతుడగు విష్ణువు నామె చూచెను. ఒకే పరబ్రహ్మ యొక్క ఆకారము వలన ఏర్పడిన భేదము భేదరహితముగా నిరూపింపబడినదో అన్నట్లున్న తత్త్వమును చూచి ఆ మాయాదేవి వీపుమాయ చేత కోరికలు కలదయ్యెను. (సకామా-కాముకురాలు.

ఓయీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురు దేవతలు నా అంశలే ఐనను ఆ బ్రహ్మమ హేశ్వరుల కంటె సత్త్వగుణమే తన స్వరూపమగుట వలన (బ్రహ్మమహేశ్వరులు రజస్తమో, గుణాత్మకులు) ఉత్కృష్ణస్థితి కలిగీ విష్ణువు శ్రేష్ఠుడయ్యెను. (ఇది కథ నడుమ శ్రీకృష్ణుని వివరణము).

మొదట మనోవికారము పొందిన పార్వతీదేవి అతనిని చూచి భక్తితో పులకలెత్తిన శరీరము కలదై ఆ పరమాత్మను మనస్సులో పూజించెను.

జగత్ర్పభువు సర్వజీవుల కంతరాత్మ ఆత్మలలో వెలుగువాడు భగవంతుడు అగు శంకరుడు పార్వతి చెప్పకుండగనే ఆమె అభిప్రాయమును తెలిసికొనెను.

పార్వతిని ఏకాంత ప్రదేశమునకు పిలిచి శంకరుడామెకు స్వయముగా హితము సత్యము ఐనదానిని భిన్నభిన్నముగా నుండియు అఖండితము {ఏకస్వరూపము) ఐన తత్త్వమును బోధించెను.

శ్రీ శంకర ఉవాచ :

శ్రీశంకరుడిట్లు పలికెను :

ఓ శైలపుత్రీ! నేను నివేదించు మాటను వినుము. పరమాత్మయగు శ్రీహరికి శృంగార సేవచేయుము. నీకు మంగళమగును. నేను బ్రహ్మ విష్ణువు ముగ్గురము సనాతనమైన ఒకే పరమాత్మ (బ్రహ్మ) రూపులము. వేదములకతీతమైన ఏకరూపమని తెలిసికొనుము. సృష్టిస్థితి సంహారములు రజస్సత్త్వ తమస్సులు అన్న విషయములను బట్టి వేరు వేరు ఆకారములతో సున్నాము. జీవకోటికంతటికి మూలమైన నీవు ఒకే ఒక మాతవు. సర్వరూపములు నీవే. బ్రహ్మ వద్ద సరస్వతివి నీవు. నారాయణుని వక్ష స్థలమున లక్ష్మివి నీవు. నా హృదయమున దుర్గవు నీవు. ఇది అధ్యాత్మ తత్త్వముగా తెలిసికొనుము. ఇట్లు పల్కిన శివుని వాక్కు విని పార్వతి అతనితో ఇట్లనెను.

పార్వత్యువాచ :

పార్వతి ఇట్లు పలికెను :

దీనులకు బంధూ! కృపా సముద్రుడా! నా యందు నీకీ నిర్దయ ఎందులకు? ఓ జగత్తులకు నాధుడా! నేను చిరకాలము తపస్సు చేయగా నాకు లభించితివి. నావంటి సేవకురాలిని నీవు విడిచి పెట్టవలదు. ఓ మహేశ్వరా! అయోగ్యమైన ఇబీమాట నన్ననవలదు. స్వామీ నీ మాటను ఆజ్ఞగా తప్పక పాలింతును, మరల నేను జన్మించి ఇంకొక దేహముతో విష్ణువును సేవింతును. ఇట్లు పల్కిన ఆమె మాటలు విని అభయప్రదుడు అగు మహేశ్వరుడు బిగ్గరగా నవ్వి పార్వతికి అట్లే అని అభయమిచ్చి సంభాషణ చాలించెను.

ఓ బ్రహ్మదేవుడా! (శ్రీహరి వాక్కు) పార్వతీదేవి ఆ ప్రతిజ్ఞను పాలించుట కొఱకే జాంబవతియన్న పేరుతో జాంబవంతుని ఇంట జన్మనెత్తగలదు.

బ్రహ్మోవాచ :

బ్రహ్మ ఇట్లనెను :

భూమియందు ఎందరో రాజులుండగా పార్వతి భారతవర్షమున నిందించబడు ఎలుగుబంటి గృహమున ఎందుకు జన్మపొందెను?

శ్రీకృష్ణ ఉవాచ :

శ్రీ కృష్ణుడిట్లనెను :

త్రేతాయుగమున రామావతార కాలమునందు దేవతలు తమ అంశలతో భూమికి పోయిరి. హిమాలయ పర్వతాంశతో జాంబవంతుడన్న పేరుతో ఎలుగుబంటీగా సేవచేసి రాముని వరదానము వలన చీరంజీవియై రామభక్తి యను సంపద గలవాడై ఆ మహాబలుడు కోటిసింహముల బలము ధరించెను. అట్టి తన తండ్రి అంశగలవాని యింట జన్మించుటకై పార్వతి తన అంశతో భూమి మీదికి వెళ్లెను. ఇంతవరకే కొంత పూర్వవృత్తాంతము చెప్పితిని కదా. ఇంకను నావలన తరువాత వచ్చు విషయములు వినుము.

ఓ బ్రహ్మా! మొత్తము దేవతల వంశములు భూతలమునకు పోదురు గాక. వారు రాజపుత్రులై యుద్ధరంగమున నాకు సహాయమగుదురు. కమల (లక్ష్మి అంశతో దేవతాస్త్రీలందరు రాజకన్యలుగా జన్మించీ ఒక వేయి పదహారుగురు నాకు మహిషులుగా అగుదురు. ఈ ధర్మదేవుని అంశతో పొండు పుత్రుడైన ధర్మరాజు, వాయువు అంశతో భీమ సేనుడు స్వయముగా ఇంద్రుడు అర్జునుడై, "దేవవైద్యులైన అశ్వినీ దేవత లిద్దరీ ఆంశలతో నకులసహదేవులు జన్మింతురు. వీరుడైన కర్ణుడు సూర్యాంశతో, యముడు స్వయముగా విదురుడై కలి అంశతో దుర్యోధనుడు సముద్రుని అంశతో శంతనుడు, శంకరాంశతో అశ్వత్థామ, అగ్నీ అంశతో ద్రోణుడు జన్మింతురు. భగవంతుడగు హుతాశనుని {అగ్నియొక్క) అంశతో మహాబలవంతుడైన ధృష్టద్యుమ్నుడు, చంద్రుని అంశతో అభిమన్యుడు, వసువు భీష్ముడుగా జన్మీంతురు. కశ్యపప్రజాపతీ అంశతో వసుదేవుడు, అదితీ అంశతో దేవకీదేవి, నందగోపుడు వసువు అంశతోను, యశోద వసువు భార్య అంశతో ను, యజ్ఞకుండమున జన్మించిన ద్రౌపది లక్ష్మి అంశతోను, దేవకీ గర్భమున జన్మించు సుభద్ర శతరూప అంశతోను జన్మింతురు. దేవతలందరు తమ అంశలతో భూమిభారమును హరించు పొరుగా, దేవపత్నులు తమ అంశలతోను పృథివి మీదికీ పోదురుగాక. ఓ సారదా! ఇట్లు భగవంతుడైన శ్రీహరి పలికి ముగించెను. ఈ వివరణమంతయు వినీ ప్రజాపతి (బ్రహ్మ) అక్కడ నిలిచియుండెను.

కృష్ణునకెడమవైపున సరస్వతీయు కుడివైపున కమలాలయము (లక్ష్మి) ముందర దేవతలందరు పార్వతియు, గోపాలకులు గోపికలు చుట్టును, స్వామి వక్షస్థలమున రాధాదేవియు ఉన్న సందర్భమున ప్రజేశ్వరి గోలోకనాయిక) అగు రాధ హరితో ఇట్లు పలికెను.

రాధికో వాచ:

రాధాదేవి ఇట్లు పలికెను :

ఓ ప్రభూ! నొ నాథా ! ఈ నీ సేవకురాలు పలుకు మాటలు వినుము. నాప్రాణములు కొలుచున్నవి, ఎల్లప్పుడు నా మనస్సు ఊగిసలాడుచున్నది. నీ దివ్యదర్శన సమయములో కన్ను మూయుటకుసు అశక్తురాలనగు నేను నీవు లేకుండ భూతలమున కెట్లు వెళుదును? ఓ ప్రాణేశ్వరా! ఎంతకాలము తరువాత మరల గోకులమున గోలోకము) నీతో నాకు కలయిక ఏర్పడును? సత్యము చెప్పుము. నీవు లేకుండ నాకు ఒక నిమిషము నూరు యుగములగును. ఎవరిని చూతును? ఎక్కడకు పోదును? నన్నెవరు పాలింతురు? ఓ ప్రాణేశా! నీవు కాకుండ తల్లిని గావి, తండ్రిని గాని, చుట్టమును గాని, అన్నదమ్ములను గాని, అక్క చెల్లెండను గాని, ' ఎవరిని కూడ స్మరించను. ఓమాయేశా! నన్ను భూతలమున నీ మాయతో కప్పుదువేని. (మరువబడిన పూర్వవైభవము గలదానీగా చేతువేని) నా శపథమును (ముందు వివరింపబోవుదానీని) సత్యమొనర్చుము. ఓ మధువను రాక్షసుని చంపిన మహానుభావా! నా మనస్సనెడి తుమ్మెద - తేనెలూరు నీపాదపద్మమునందు ప్రతిక్షణము విడువకుండ తిరుగుచుండుగాక. ఎక్కడెక్కడ ఏయే తల్లి గర్భమునందు (ఏయే శరీరరూపమున) నాకు జన్మ ఏర్పడునో ఆ ప్రతిజన్మలోను నీ స్మరణము { నీమీద. తలంపు! నీ దాస్యము నా కోరికగా నాకు అనుగ్రహింపుము. నీవు శ్రీకృష్ణుడవు నేను రాధను అనియు, మన యిద్దరి ప్రేమ సౌభాగ్యమును భూమి యందలి జన్మలో నేను మరువకుండునట్లు శ్రేష్టమైన వరము నాకిమ్ము, శరీరముతోపాటు ప్రాణములవలె ఆకారముతో పాటు నీడవలె మన ఇద్దరి జన్మ అవినాభావమై ఒకటి లేకుండ ఇంకొకటి ఉండనట్లు) ఉండునట్లు నాకు వరమిమ్ము స్వామీ! ఓ శ్రీహరీ! నా ప్రాణముతో నీ శరీరము, నా ఆత్మతో నీ మురళి, నామనస్సుతో నీ పాదములు నాయొక్క ఏదో అంశతో నీ దయ నీర్మించబడినవి. ఓ నిగమసంస్తుతా! స్త్రీలుగాని పురుషులు గానీ ఎన్నోవిధములుగా నున్నారు. కానీ ఎక్కడ కూడ ఏ స్త్రీ కూడ కాంతిలో శక్తితో నావంటిది లేదు. మన ఉభయులకు భూమండలమున కేగినపుడు గాని ఎక్కడ గాని కనురెప్పపాటంతకాలము వియోగము ఏర్పడకుండుగాక. అట్టి వరము నాకిమ్ము. నేను నీ దేహమందలీ ఏదో ఒక అర్థభాగము చేత నిర్మించబడితిని. అందువలననే మన ఇద్దరికి భేదము లేదు. అందువలననే నా మనస్సు నీపై నిలిచియున్నది. నా ఆత్మ, మనస్సు. '.. ప్రాణములు నీయందు సంస్థాపితములై ఉన్నట్లే నీ ఆత్మ మనఃప్రాణములు సాయందు నిలిచియున్నవి. అందువలననే ఒక నిమిషము ... పాటు ఎడబాటు {వీరపాము) వలన మన మనస్సు విక్షబము (తల్లడము) పొందును. వియోగమన్న మాట విన్నంతనే మనస్సు కాలిపోవును. ప్రాణములు మండిపోవును. ఇట్లు దేవతాగ్రేషురాలగు రాధాసుందరి పలికి ఆ స్వామి పాదములు పట్టుకొని ఆ గోలోక సభలో పెద్ద ధ్వనీతో మరి మరి ఏడ్చెను.

ఆమెను శ్రీకృష్ణుడు ఒడిలోనికి చేర్చుకొని వస్త్రముతో ముఖము తుడిచి త్రికాల సత్యము హితకరము వాస్తవము ఐన వాక్కుతో అనేక విధములుగా బోధచేసెను.

శ్రీకృష్ణ ఉవాచ :


 

శ్రీకృష్ణుడిట్లు పలికెను :

ఓ దేవీ ! యోగీంద్రులకు దుర్టభమైనట్టి జీవుల శోకమును ఛేదించుటకు మూలమైనట్టి శ్రేష్టమైన అధ్యాత్మ యోగమును చెప్పేదను వినుము. ఓ సుందరీ! మొత్తము బ్రహ్మాండము ఆధార, ఆధీయముల (ధరించునది ఆధారము, ధరించబడునది ఆధేయము) మయము. ఆధారమునకు భిన్నముగా ఆధేయము యొక్క పుట్టుక ఉండదు, ఫలమునకు ఆధారము పుష్పము. పుష్పమున కాధారము చిగురు. చిగురుకు ఆధారము స్కంధము {చెట్టుకొమ్మ లేదా బోది) స్కంధమునకు ఆధారము చెట్టు చెట్టుకు అంకురము (మొలక) ఆధారము. అది జీవశక్తితో (విత్తనములోనిది) కూడియున్నది. అట్టి అంకురమునకు తల్లి వేరు ఆధారము. దానికి భూమి ఆధారము. భూమికి ఆదిశేషుడు అతనికి కచ్చపము (తాబేలు) ఆ ఆదికూర్మమునకు పాయువు ఆధారము. వాయువునకు ఆధారము నేను. నాకు ఆధార స్వరూపురాలవు నీవు, ఇప్పుడు నేను నీయందే నిలిచియున్నాను. నీవు శక్తుల నమూహము గల మూలప్రకృతి నాయికవు. సత్వ రజస్తమోగుణాత్మికవు. శరీరస్వరూపిణివి. ఆధారరూపిణివి. నేను నీకాత్మను. నిరీహుడనై ఉండి {కోరికలు లేనివాడను} కూడ నీతో కలిసి చేష్టలు గలవాడనైతిని. పురుషుని నుండి వీర్యము జనించును.వీర్యము వలన సంతానము కలుగును. ఆ రెంటికాధార రూపురాలు ప్రకృతి అంశమైన కామినియే (స్త్రీ). దేహము లేకుండ ఆత్మ గాని ఆత్మలేకుండ శరీరము కాని ఎక్కడివి? నీవు లేకుండ శరీరాత్మలకు ప్రాధాన్యము ఎట్లేర్పడును? సంసార బీజభూతులమైన మన యిద్దరికి భేదమెక్కడిది? ఎక్కడ ఆత్మయుండునో అక్కడ దేహముండును. ఆ రెంటికి భేదము లేదు. ఇక వినయముతో పనియేమి?

పాలలో తెల్లదనము, అగ్నియందు కాల్చెడి శక్తి, భూమియందు గంధము (పాసన) నీటిలో చల్లదనము వలె మన ఇద్దర ముందుము. . తెల్లదనమునకు పాలకు, కాల్చుశక్తికి అగ్నికి, భూమికి గంధమునకు జలమునకు శైత్యగుణమునకు, ఐక్యమే తప్ప భేదము లేనట్లు మన . ఉభయులకును ఐక్యమే తప్ప భేదము లేదు.

నేను లేకుండ నీవు జీవరహితవు. నీవు లేకుండ నేను కన్పించను. ఓ సుందరీ! నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు లేకుండ సృష్టిచేయుటకు నేను సమర్థుడను కాను. మట్టిలేకుండ కుండలు చేయుటకు కుమ్మరి ఎట్లు అశక్తుడో, బంగారము లేకుండ నగలు చేయుటకు ఎట్లు కంసాలి అసమర్థుడో (అట్లుగానే మనస్థితి ఉన్నది) ఆత్మరూపుడనగునేనెట్లు నిత్యుడనో ప్రకృతిరూపిణీవీ అగు నీవు అట్లే సర్వశక్తులు గల, సర్వాధారవగు సనాతనివి. లక్ష్మీ, సరస్వతి, పార్వతీ, బ్రహ్మ, అనంతుడు, ధర్ముడు, వీరు నాకు ప్రాణసములు. నీవు నాకు ప్రాణముల కన్న అధికముగా ప్రియురాలవు. ఇక్కడ నున్న సర్వదేవతలు దేవతాస్త్రీలునాకు ప్రాణసములే. నీవు వీరందరికంటే అధికురాలవు కాకున్నచో నా వక్షస్థలమందేట్లు నిలచితివి? రాధా! కన్నులనీరు విడుచుట త్యజించుము. నిష్ఫలమైన భ్రాంతిని శంకను విడిచి సందేహించకుండ వృషభానుని ఇంటికి పొమ్ము.

ఓ సుందరీ! వృషభానుని భార్యయగు కళావతి గర్భమును మాయాశక్తితో తొమ్మిది నెలలు వాయువుతో నింపి నిరోధించుము. పదియవ నెల రాగానే నీ ఆత్మరూపమును వదిలి పెట్టి శిశురూపమును కూర్చుకొని భూతలమందు జన్మించుము. గర్భమున నిరోధించిన గాలి బయటకు వచ్చువేళకు కళావతి సమీపమున నగ్నరూపముతో భూమి పై పడి నీవు (శిశువు వలె ఏడవు. గోకులమున నీవును నేనును (గర్భమున ప్రవేశించుట మొదలగు లక్షణములు లేకుండ} అయోని సంభవులముగా జన్మింతుము. మన ఇద్దరికిని, మనుష్య గర్భమునందుండుట అన్నస్థితి ఉండదు. నేను భూమి మీద పడగనే {మధురలోని చెరసాలలో) నన్ను (వసుదేవుడు) నందుని గోకులమునకు చేర్చును. కంసుని వలన ప్రమాదమును భయమును ఒక మీషగా చూపి నీకొరకు గోకులమునకు వత్తును. యశోదా మందిరమున నందుని కుమారునిగానున్న నన్ను నీవు ప్రతిరోజు కౌగిలించుకొనుచు దర్శించుచుందువు. ఓ కల్యాణీ! రాధా!! నా వరము వలన నీకప్పుడు పూర్వస్మృతి ఉండును, సుందర బృందావనములో స్వేచ్ఛగా నీతో కలిసి విహరింతును. సుశీల మొదలగు ముప్పది ముగ్గురు స్నేహితురాండ్రతో, డెబ్బది మూడు శతకోటుల గోపికలతో (దాసీజనము) నీవు గోకులమునకు పొమ్ము.

ఈ గోపికా సమూహమును లేక్కకందనంతగా గోకులమున నిలిపి గోలోక మెడబాసినందు వలన వారికి కలుగు విచారమును అమృతము వంటి ఉపదేశవాక్కులతో పోగొట్టుము. సా మీత్రులైన ఈ గోపాలకులను కూడ అచ్చట ఏలిపి తరువాత మధురాపురిలోని వసుదేవుని మందిరమునకు పోదును. నా సంగమునే ఇష్టపడుట వలన మిక్కిలి ప్రియులైన వీరందరు నాతో విలాస క్రీడల కొరకుగాను గోకులమునకు పోదురు గాక. ఆక్కడి గొల్లల యిండ్లలో గోపాలకులుగా జన్మింతురు గాక. ఓ నారదా! శ్రీకృష్ణుడిట్లు పలికి సంభాషణ చాలీంచెను. దేవగణము గోపకుల గణము అచ్చటనే నిలిచియుండెను.

బ్రహ్మ శంకరుడు ఆదిశేషుడు ధర్మదేవత లక్ష్మి పార్వతి సరస్వతి పరాత్పరుడైన శ్రీకృష్ణుని పరమ సంతోషముతో స్తోత్రమొనర్చిరి.

స్వామియందలి ప్రేమచేత చెదరిన మనస్సులు గలవారును, స్వామి ఎడబాటు అనెడి జ్వరమునకు బెదిరిపోవువారును ఐన గోపికలు గోపాలకులు తమ ప్రాణములకంటె అధికప్రియుడు రాధాదేవి కోరికల పంట ఐన శ్రీకృష్ణుని స్తుతించి భక్తితో నమస్కరించిరి.

గోపాలకుల భక్తికి స్వామి మిక్కిలి సంతోషించెను. తన వియోగ (జ్వరమునకు)నకు భయపడుచు కన్నీరు విడుచుచు దుఃఖించుచున్న రాధాదేవిని స్వామీ స్వయముగా వినిపించదగిన ప్రబోధ వాక్కులతో ఇట్లు ఓదార్చెను.

శ్రీకృష్ణ ఉవాచ :

శ్రీకృష్ణుడిట్లనెను :

ఓ మహాదేవీ! సుందరీ! నా ప్రాణములకంటె అధికురాలా! మనస్సు కుదుట పరచుకొమ్ము, భయము త్యజించుము. నీకెట్లు విచారపడుచున్నావో నీవియోగమునకు నేసల్లే విచారించుచుంటిని, నేనుండగా నీకుందుకు చింత? ఒకమాట వినుము. మనకొక ఆపద ఏర్పడినది. శ్రీరాముని శాపము వలన ఏర్పడిన కర్మానుభవమది. నిండుగా నూరేళ్లు నా వీయోగము నీవనుభవించవలసియున్నది. అందువలననే నేనును మధురకేగవలసి వచ్చినది.

భూలోకమున నా కార్యము భూభారమును తొలగించుట. తలిదండ్రులను కారాగృహము నుండి విడిపించుట, మాలాకారునకు (పూలదండలిచ్చిన వానికీ) వస్త్రములు చేయువానికీ కుళ్లకు మోక్షప్రదానము, యవనుని సంహరించి ముచుకుందునకు మోక్షమిచ్చుట, ద్వారాకనగర నిర్మాణము, రాజసూయయాగము దర్శించుట, ఒకవేయి పదునారుగురు రాజకన్యలను వివాహమాడుట, నూటపదిమంది ముఖ్యశత్రువులను వధించుట, మిత్రులకుపకారము చేయుట, కాశీనీ గాల్చుట, శంకరుని నిలదీసి బాణాసురుని భుజములను నరికివేయుట, పారిజాత వృక్షమును స్వర్గము నుండి తెచ్చుట, తీర్థయాత్రలకేగుట, మునిదర్శనము, బంధుసహవాసము, తండ్రిచేయు యజ్ఞమును నిర్వహించుట, ఒకశుభవేళలో నీకును గోపికలను దర్శనమిచ్చి నీకు ఆధ్యాత్మవిద్యను బోధించుట, రాత్రింబగళ్లు ఎడబాటు లేకుండ మనము కలిగియుండుట, నీతో కలిసి మరల గోకులమునకు వెళ్లి అచ్చట బృందావనములో నీతో రాసకేళి యొనర్చుట, అచ్చట మరల నందయశోదలను {పెంచిన తలిదండ్రులను) గోపికలను నా వియోగ దుఃఖితులైన వారినీ ఓదార్చుట నారాయణాంశతో నున్న నేను మరల ద్వారక కేగుట ఇట్లు నూరేండ్లలో ఏయే కర్మలు చేయవలసి యున్నవో అన్నిటిని నిశ్చితముగా చేసి భూభారము తొలగించి మరల ఇచ్చటికి వచ్చుట జరుగును. ఓ ప్రియురాలా! ఈ నూరు సంవత్సరముల మన వియోగకాలములో ప్రతిదినము స్వప్నములో నీతో సమ్మేళనము (కలియుట) సంభవించును.

నీవు ఈ గోపాలకులు గోపికలు మీ అందరితో బాటు మరల గోలోకమునకు తిరిగి వచ్చుట సంభవించును.

నారాయణాంశతో నిత్యుడనై పరమాత్మగా నున్న నేను వాణీ లక్ష్మీయుతముగా వైకుంఠమునకేగుటయు, నా ఇతరాంశలు శ్వేతద్వీపమునకు ధర్మదేవ గృహమునకు చేరుటయు జరుగును. దేవులు దేవపత్నులయొక్క అంశలు తమ తమ నివాసస్థానములకు చేరుదురు. గోలోకమున నీతోబాటు నేను మరల నీవసింతును. ఇట్లు జరుగనున్న విషయము మొత్తము శుభాశుభములతో బాటు నీకు చెప్పితిని. నా చేత ఇట్లు జరుగవలయునని నిరూపణ (నిర్ధారణ చేయబడినప్పుడు ఓ ప్రియా ఎవడు నివారించును. ఇట్లు పలికి శ్రీకృష్ణుడు రాధాదేవిని తన వక్షస్థలమున చేర్చుకొని నిలిచెను. సర్వదేవతలు వారి భార్యలును ఆ దృశ్యమును గాంచీ ఆశ్చర్యపడి అట్లే నిలిచి యుండిరి.

శ్రీహరి అప్పుడు సమయోచితముగా దేవతలతో "ఓ దేవతలారా! ప్రస్తుతోంశమునకు తగిన కార్యము కొరకుగాను మీమీ నివాస స్థానములకు (లోకములకు వెళ్లడు. ఓ పార్వతీ! నీవు నీ భర్తతో ఇద్దరు కుమారులతో కలిసి కైలాసమునకు పొమ్ము. నాచేత నియోగించబడిన సర్వకార్యములు తగిన కాలములో జరుగును. ఓ ప్రజేశ్వరీ! రాధా! ఒక వినాయకుడు తప్ప మిగిలిన అందరు దేవతల జన్మము ఉచ్ఛనీచ భేదము లేకుండ నా అంశతోనే సంభవించును,

దేవతలు పురుషోత్తముడైన శ్రీహరికి లక్ష్మీ సరస్వతులకు భక్తితో ప్రణమిల్లి (నమస్కరించి తమ తమ లోకములకు వెళ్లిరి. ఆ ప్రభువుచేత తమకు ఏర్పరచబడిన కర్మ నెరవేర్చుటకు (విధి నిర్వహణకు) శ్రద్ధగలవారై భూలోకమునకు వెళ్లిరి. ఆ స్వామి నిరూపించిన స్థానము {అవతారములో తమ పాత్రను) స్వయముగా లభించుట దేవతలకును అసాధ్యమే కదా!

రాధాదేవీతో శ్రీకృష్ణుడు “ఓ ప్రియురాలా! పూర్వము నిర్ధారించిన గోప గోపీ జనముతో గూడి నీవు వృషభాను గృహమునకేగుము. నేను మధురలోనీ వసుదేవుని గృహమునకేగుదును. ఆ తరువాత అటనుండీ కంసభయమును ఒక మిషగా పెట్టి గోకులమునకు నీ వద్దకు వత్తును” అనేను.

ఎర్రదామరల వంటి నేత్రములు గల రాధాదేవి శ్రీకృష్ణునకు నమస్కరించి ప్రేమ విచ్ఛేదమునకు (ఎడబాటు వలన ప్రేమ తరిగిపోవునేమో అని భయము కలదై స్వాతి ముందు మిక్కిలి దుఃఖించెను. నిలిచి నిలిచి కొద్దిగా ముందుకు పోయి పోయి మరల వెనుకకు వచ్చి కలిసి మాటి మాటికి హరి ముఖము చూచుచు - కనురెప్పలు వాల్చక శరదృతువులోని పున్నమినాటి చంద్రుని వలె అమృత పూర్ణమై యున్న ప్రభువు ముఖమును తన నయన చకోరములతో (చకోర పక్షి చంద్రునిలోని అమృతము వంటి వెన్నెలను త్రాగునట్లు) త్రాగెను (అత్యంత ప్రేమతో చూచెను). ఆ తరువాత ఆ పరమేశ్వరి ఏడుసార్లు ప్రదక్షిణించి ఏడు విధములుగా నమస్కరించి హరీ ముందు మరల నిలిచెను.

ఓ నారదా! ఇరువది యొక్క శతకోటుల గోపికలును కోటిసంఖ్య గల గోపాలురును అక్కడికి వచ్చిరి. ఆ సమూహముతో గూడి పోవలసిన రాధ మరల నమస్కరించి నిలిచెను. ఆ సుందరి ముప్పది ముగ్గురు స్నేహితురాండ్రతో బాటు గోపికలు గోపాలకులను సమూహములుగా గ్రహించి స్వామికి నమస్కరించి భూమికి ప్రయాణించెను. శ్రీహరి ఏర్పరచిన స్థానములకు నందగోకులమునకు వారు చేరబోయిరి. రాధాదేవి వృషభాను గృహమున కేగెను.

గోపగోపీజనముతో రాధాదేవి భూమికి వెళ్లిన వెనుక వెంటనే శ్రీహరి కూడ పృధివీతలమున కేగుటకు ఆసక్తి గలవాడై మిగిలిన గోప గోపీజనముతో మాట్లాడి వారి వారి విధులలో (కర్మలలో) వారినీ నియోగించి ఆ జగన్నాధుడు మన స్సే వాహనముగా ప్రయాణము చేసి మధురానగరికి వెళ్లాను. ఇతనికన్న ముందు దేవకీ వసుదేవులకు ఎట్లెట్లు సంతానము కలెనో అట్లట్లు వెంటనే కంసుడు ఆ సంతానమును (ఆరుగురు పుత్రులను సంహరించెను. శేషుని అంశతో దేవకీకి ఏర్పడిన ఏడవ గర్భమును హరియాజ్ఞననుసరించి మాయాదేవి రోహిణీదేవి గర్భమున చేర్చి (గర్భసంకర్షణము - పిండమును ఒక గర్భము నుండి వేరొక గర్భములోనికి మార్చుట) తనకు నిర్దేశించిన స్థానమునకు - (యశోద గర్భములోనికి) పోయెను.

ఇది బ్రహ్మవైవర్త పురాణములో శ్రీకృష్ణ జన్మఖండములో నారాయణ నారద సంవాదములో ఆరవ అధ్యాయము నమాప్తము.