4 - బ్రహ్మ వైవర్త మహా పురాణము - శ్రీ కృష్ణ జనన ఖండము
33 - మోహినీశాప, బ్రహ్మదర్ప భంగము
శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణుడు (రాధాదేవితో) పలికెను :
ఓ రాధా! ఇట్లు బ్రహ్మ శ్రీహరిని స్తుతించి నాచేత ప్రసాదించబడిన దివ్యజ్ఞానమనెడి అంకుశము చేత కామాసక్తమై యున్న తన. మనస్సను మదగజమును అదుపులో బెట్టుచు ఆమె సమీపమున నిలిచియుండెను. అప్పుడు మోహిని పరిహాస రూపముగా బ్రహ్మతో ఇట్లు పలికెను.
మోహిన్యువాచ - మోహిని అనెను
విభూ! స్త్రీల మనస్సు కామాసక్తమైనదని చూపు మొదలగు అవయవ వికారములను బట్టి తెలిసికొని వెంటనే ఎవడు చేరదీసి సంభోగమొనర్చునో వాడుత్తముడు. శ్రీచేత ప్రేరణ పొంది స్పష్టముగా ఆమె అభిప్రాయ మెరిగిన తరువాత ఎవడు శృంగార కర్మ చేయునో వాడు మధ్యముడు. కామార్హురాలైన స్త్రీ చేత మరల మరల ప్రేరణ పొంది కూడ ఎవడేకాంతమున ఆమెతో కూడదో ఆ పురుషుడు నపుంసకుడు. ఒక గృహస్థుడు గాని తపస్వి గాని కామి గాని తనను చేరవచ్చిన స్త్రీని త్యజించిన యెడల ఈ లోకమున వాడగౌరవ పాత్రుడగును. పరమున నరకము పొందును. ఓ బ్రహ్మా! స్త్రీ శాపము చేత వాడు సంపద నశించి రూపము భ్రష్టమై బుద్ధి భ్రష్టమై వెంటనే క్షీబత్వమును (నపుంసక స్థితిని పొందును.
ఓ జగన్నాథా! లెమ్ము, ఘోరము దుస్తరము (దాటశక్యము గానిది) భయంకరమైన మన్మధ సముద్రమున మునిగిన నన్ను ఓ నావికుడా! ఒడ్డుకు చేర్చును. ఏ ప్రాణులు లేనట్టి ఏకాంత ప్రదేశమున సుగంధవాయువుతో మనోహరమై గండుకోకీల కూతలు వినవచ్చుచోట ఎల్లప్పుడు నీయందే మనస్సు కలిగియున్న - జన్మజన్మలకు నీ దాసినైన నన్ను వెలగట్టరాని రత్నము వంటి నీ రతీయను వెలతో కొనవలసినది. త్వరపడుము. ఇట్లు పలికి మోహిని కామభావముతో గుండె చెదిరి చిరునవ్వు చిందించుచు వెంటనే ఆ సృష్టికర్త ధరించిన వస్త్రమును లాగివేసెను.
భయాతురుడైన బ్రహ్మ కాలస్థితిని తెలిసికొని వినయపూర్వకముగా శ్రేష్ఠము అమృత సమానము ఐన వచనము పలికెను.
బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :
మోహినీ! సత్యసారము హితము ఐన నా వాక్యమును స్పష్టముగా వినుము. మూడు లోకములందలి స్త్రీలకును సిగ్గుదీయు పనిని చేయకుము.తల్లీ! వృద్ధుడను నిష్కాముడను నీ పుత్రుడనైన నన్ను వదలుము. మంచీ నవ్వు గలదానా! నీ కర్మకు యోగ్యుడైన రసికునిని యావన మందున్న వానిని చూచుకొమ్ము. ఒక భార్య భర్తయొక్క వీర్యమును ధరించుట వలన అతనికి చెందిన సర్వశుభ శుభములను మంత్ర శిల్ప శక్తులను గొప్ప సంతానమును ఈ సర్వమును, ప్రయత్నము లేకుండ పొందును. ఓ సువ్రతా! నీతో నారతికీ శాస్త్రమంగీకరించదు. క్షుద్రమైనది కానీ గొప్పది కాని కర్మమొత్తము దైవ నిర్ణయముతో కూడినది. ఇట్లు పల్కుచు నా పాదపద్మములను స్మరించుచున్న బ్రహ్మను కామము చేత, వివేకము నశించిన ఆవేశ్య మరల లాగెను.
ఇంతలో మిక్కిలి మనోహరమైన ఆ ప్రదేశమునకు బ్రహ్మ తేజస్సుతో వెలుగుచున్న మునులు అత్రీ పులస్త్యుడు పులహుడు వసిష్ఠుడు క్రతువు ఆంగిరసుడు భృగువు మరీచి కపిలుడు వోడుడు పంచశిఖుడు రుచి ఆసురీ ప్రచేతసుడు శుక్రుడు బృహస్పతి ఉతధ్యుడు కరకుడు కణ్వుడు కశ్యపుడు గౌతముడు సనతుడు సనందుడు కర్దముడు సనాతనుడు యోగులకును పరమ గురువగు సనాతనుడు శాతాతపుడు పిప్పలుడు శంకువు పరాశరుడు మార్కండేయుడు లోమశుడు మృకండుడు చ్యవనుడు దూర్వాసుడు జరత్కారు ఆస్తీకుడు విభాండకుడు ఋష్యశృంగుడు భరద్వాజుడు వామదేవుడు కౌశికుడు చేరవచ్చిరి. తపోనిష్ఠులైన మునీశ్వరులక్కడికి రాగా వారిని చూచిన మోహినీ వెంటనే సిగ్గుతో కమలోద్భవుని (బ్రహ్మను విడిచి పెట్టెను. జగత్కర్తయైన బ్రహ్మ, అతని ప్రక్క ఆమెయు ఉండిరి.
వచ్చిన మునులు భక్తితో శిరస్సులు వంచి బ్రహ్మకు నమస్కరించిరి.
విభుడైన బ్రహ్మ వారందరి నాశీర్వదించి కూర్చుండుట కనుమతించి ఆ మునుల మధ్య నక్షత్రముల నడుమ చంద్రుని వలె ప్రకాశించెను. అప్పుడు మునులు “దేవవేశ్యలలో శ్రేష్టురాలైన ఈ మోహిని నీ సమీపమున ఉండుటేమి"? అని ప్రశ్నించగా వారీ వాక్కులు విని బ్రహ్మ స్త్రీల మాటను సిగ్గును కప్పిపుచ్చుచు (గోప్యముగా ఉంచుచు) ఇట్లు పలికెను. బ్రహ్మోవాచ - బ్రహ్మ పలికెను :
ఈ శుభకారిణి చాల సేపు తండ్రీముందు కూతురు వలె నృత్యము చేసి పాటలు పాడి అలిసిపోయి నిలిచియున్నది” అని ఆ జగత్కర్త మునీ గణముతో పలికి నవ్వెను. ఓ రాధా! సర్వజ్ఞులైన ఆ మునులు ఆ సృష్టికర్త మనస్సులోని మొత్తము రహస్యమును తెలుసుకొని వారును నవ్విరీ. నిండుసభలో వారట్లు నవ్వుట వలన ఆ కులట శరీరమంతయు కంపించగా కోపముతో పెదవులు వణుకగా ముఖము బిగించుకొని హఠాత్తుగా కోపము పొంది రక్త పద్మములవలే కన్నులెర్రబడగా ఆ సభలో లేచి వారిముందు నిలిచి మృత్యుకన్య వలె కోపముతో బ్రహ్మను సంబోధించి ఇట్లు పలికెను.
మోహిన్యువాచ - మోహినీ అనెను :
“ఓయీ బ్రహ్మదేవా! నీవు జగన్నాథుడవు. వేదకర్తవు. వేదమందేమి చెప్పబడినది. దానికి విరుద్ధమైన కర్మ ఏది? వేదవేత్తలలో పెద్దవాడా! నీ మనస్సులో విచారించుకొనుము. నీవు గన్న బిడ్డయందే కామవాంఛ పొందిన నీవు నర్తకినైన నన్ను గూర్చి ఎట్లు నవ్వుచున్నావు? నే నీశ్వరుని చేత దేవవై శ్యగా నిర్మించబడితిని. నేనందరు పురుషులను పొందుదును, కానీ నీవు సత్పురుషుల కర్మకు విరుద్ధముగా ప్రవర్తించి గూడ మిక్కిలి లోక వంచనము చేయుచున్నావు, దాసీ సమానురాలను వినయవతిని దైవికముగా నిన్ను శరణు పొందిన దానను. అట్టి నన్ను గురించి గర్వముతో నవ్వుచుంటివి. అందువలన నీవు త్వరలో అపూజ్యుడవగుదువు గాక, త్వరలో శ్రీహరి నీ గర్వమును భంగపరచగలడు. ఓ బ్రహ్మా! ఇపుడు వేశ్యనైన నా మాటవినుము. ఏ నరుడు నీ వచనమును నీ సుతిని గ్రహించునో వానికి విఘ్నములు (కాగ్యభంగము) ఏర్పడగలవు. వాడు నవ్వుల పాలగును. ఇకముందు దేవతలకు యుగయుగములందు ఏడాదికొకమారే పూజ జరుగుగాక. నీకైతే పూజ మాఘ సంక్రాంతి యందు తప్ప మరల జరుగదు, ఈ కల్పమందు గానీ కల్పాంతర మందు గాని ఈ దేహమున్నపుడుగాని మరియొక దేహము ధరించినప్పుడు గాని రెండవ సారి పూజ (ఒక సంవత్సరములో) నీకు జరుగదు. గడిచి పోయిన కాల విషయమైతే గడిచిపోయినదే కదా”. ఇట్లు పలికి {శపించి) మోహిని శీఘ్రముగా మన్మథుని గృహమున కేగి అతనితో శరీర సుఖమనుభవించి జ్వరము లేనిదయ్యెను, ఆ పిదప వివేకము పొంది “నాకు మిక్కిలి ప్రియుడైన సృష్టికర్త నెట్లు శపించితిని! అని మిక్కిలి విలపించెను.
దేవవేశ్య వెళ్లిపోగా మునులు మిక్కిలి దుఃఖించిరి. జగములను సృష్టించు బ్రహ్మ శిరస్సు వంచుకొని మిక్కిలి వణికి పోయెను. క్షేమకారకులైన ఆ మునులతనీకీ వైకుంఠుని శరణు పొందు"మని ఉపాయము చెప్పి తమ స్థానముల కేగిరీ. నా యొక్క మూర్త్యంతరమైన (రెండవ రూపమైన) కమలావల్లభుడు శాంతుడును శ్యామవరడును చతురుజుడునైన నారాయణుని జేరబోయి బ్రహ్మ శరణు జొచ్చెను, విషాద ముఖముతో నమస్కరించీ కంఠము పెదవులు దవడలును ఎండిపోగా నారాయణుని సమీపమున నిలబడి జరిగిన రహస్య వృత్తాంతమును చెప్పెను. దీనబంధువు దయాసింధువు ఆపద తరింపజేయుటకు మూలమైన ఆ నారాయణుడది విని ఒక నవ్వు నవ్వి సత్యమును సారభూతమును జగములకు (జగత్తునందలి జీవులకు) హితమును సుఖమును గూర్చునదియు ఐన వాక్యమును బ్రహ్మతో పలికెను.
శ్రీనారాయణ ఉవాచ - శ్రీమన్నారాయణుడు పలికెను :
ఓయీ! నీవు స్వయముగా వేదమెరిగిన వాడవు. విద్వాంసులకు పరమగురువువు. నీవు చేసినటువంటి పనిని ఎవడును చేయలేదు. స్త్రీజాతి ప్రకృతి యొక్క అంశ. ఈ జగములకు బీజరూపురాలు. స్త్రీలనవమానించుట ప్రకృతి నవమానించుటయే. ఇది సాటిలేని పుణ్యక్షేత్రమైన భారత వర్షము కాదు గదా. క్రీడా (విలాస) క్షేత్రమైన బ్రహ్మలోకములో నీకింద్రయ నిగ్రహమెక్కడ? భారత వర్షమందు కూడ కామార్హురాలై ఒక స్త్రీ స్వయముగా రహస్యముగా చేరవచ్చినప్పుడు జితేంద్రియులును త్యజింపరాదు, త్యజించిన యెడల అట్లు నటించిన (మోసగించిన) వాడు మరణించి నరకమును పొందును. ఆ స్త్రీ దుఃఖార్జురాలై అతనికి శాపమిచ్చుట నిశ్చయము.
లోభముతో గానీ కామ సుఖా పేక్షతో గాని తన భార్యను వదిలి పరస్త్రీని స్వీకరించువాడు (ఇతరుడు వివాహమాడిన స్త్రీని) ఆధముడే. ఆ విషయములో సందేహము లేదు. ఆ పురుషుడు తనకంటే ముందు పది తరముల వారిని తన తరువాతి పది తరముల వారినీ ఉత్తమ గతి నుండి పడగొట్టి తాను నరకములో బడును. ఏ కులస్తీ (వివాహమాడిన స్త్రీ కామముతో తన భర్తను విడిచి పరపురుషుని జేరబోవునో ఆ స్త్రీ అపవిత్రురాలు (పాపమొనర్చినది) అగుచున్నది. వేశ్యకా దోషము లేదు. ఏస్త్రీ అనేక మాయోపాయములతో పర పురుషుని తనకు సాధ్యుని (స్వాధీనునిగా)గా చేసుకొనునో ఆ కులస్త్రి చంద్రసూర్యులున్నంత సుదీర్ఘ కాలము అంధకూపమను నరకములో నుండును. దేవవేశ్య తన జాతి ధర్మమును బట్టి (ఏ పురుషునితో విహరించినను) స్వర్గమునే చేరబోవును. అట్టి దేవవేశ్యనవమానించుట వలన పురుషుడు నిశ్చయముగా అపరాధి యగును. ఓ జగత్కర్తా! శాపము పొందినవాడు సంసార సముద్రములో బడిన పాపి దేని వలన శుద్ధి పొందునో ఆ ఉపాయమును చేయుదును. క్షణకాలమగుము.
ఇట్లు పలుకుచుండగా నింతలో ద్వారపాలకుడొకడు త్వరగా వచ్చి శిరస్సు వంచి శ్రీహరి ముందు ఇట్లు పలికెను.
ద్వారపాలక ఉవాచ - ద్వారపాలకుడనెను :
“వేరొక బ్రహ్మాండాధిపతియైన దశముఖ బ్రహ్మ మహాభక్తుడు నిన్ను దర్శించుటకు వచ్చి ద్వారప్రదేశమున నీలిచియున్నాడు" అని అనెను. ద్వారపాలకుని ఆ వాక్కు విని శ్రీహరి వచ్చిన వ్యక్తిని లోనికి పంపుట కనుమతి నిచ్చెను. ద్వారపాలకుని ఆజ్ఞతో ఆ పదితలల బ్రహ్మ లోనికి వచ్చి భక్తితో చతుర్ముఖ బ్రహ్మ ఇంతకు ముందు వినని చిత్ర విచిత్రములైన స్తోత్రములతో స్తుతించెను. స్తుతించి పిదప శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞ వలన చతుర్మునీ ముందు కూర్చుండెను. శ్రీమన్నారాయణుడు చతుర్భుజులైన తన ద్వారపాలకులను పిలిచి దర్శనార్థము వచ్చిన వారిని కూడ ఆదరముతో లోపలికి ప్రవేశ పెట్టుడని చెప్పెను.
ఓ బృందావన వినోదినీ! (రాధనుద్దేశించి కథలను చెప్పు శ్రీకృష్ణుడు పిలిచిన సంబోధన! ఇంతలో మిక్కిలి వినయముతో వంగియున్న శతముఖ బ్రహ్మ (నూరు తలల బ్రహ్మ) అక్కడికి వచ్చాను, మిక్కిలి సుందరములు సర్వజీవులకు ఆశ్రుతములు (ఇంతకు ముందు విననివి) శ్రేష్ఠములునైన దివ్య స్తోత్రములతో గంభీరము (తత్త్వార్ధము గలవి గా నున్న వాటితో నుతించి ఆ ప్రభువు సభలో ముందు వచ్చియున్న బ్రహ్మలకన్న ముందు కూర్చుండెను. ఇంతలో ఇంకొక బ్రహ్మాండాధిపతియైన సహస్రవదన బ్రహ్మ (వేయి ముఖములవాడు) శ్రీహరి ముందుకు వచ్చి భక్తితో వంగిన తలలు గలవాడై సభలోని బ్రహ్మలకందరికి ఇంతకు ముందు విననట్టి ప్రశస్తమైన స్తోత్రములతో నుతించి కూర్చుండెను. అప్పుడు స్వామి ఆ సహస్ర ముఖుని అన్ని బ్రహ్మాండముల యొక్కయు, ఆ బ్రహ్మాండముల బ్రహ్మల యొక్కయు ఆయా బ్రహ్మాండములందలి దేవతల యొక్కయు వార్తలను వరుసగా ప్రశ్నించెను. చతుర్ముఖ బ్రహ్మకు ఆ బ్రహ్మలను చూచీ గర్వభంగమాయెను.
గర్వముతో తనను విష్ణువుతో సమానునిగా భావించుచున్న చతుర్ముఖ బ్రహ్మకు ఇట్లు గర్వభంగమై చచ్చినవాని వలె ఉండగా శ్రీహరి చూచీ దయదలచి ఇతర బ్రహ్మాండములందలి బ్రహ్మలను చూపలేదు.
నా వాడైన నారాయణుని యొక్క శరీరమందెన్నీ రోమములున్నవో అన్ని సంఖ్యల బ్రహ్మలు బ్రహ్మాండములు ఉన్నవి. ఆ వచ్చిన బ్రహ్మలు నారాయణునికి నమస్కరించి తమ తమ లోకములకు (బ్రహ్మాండములకు వెళ్లిరి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ తాను మిక్కిలి చిన్నదైన దేశమునకు (బ్రహ్మాండమునకు) అధిపునిగా భావించెను. స్వామికి నమస్కరించెను. లజ్జతో శిరస్సు వంచుకొన్న నాలు తలల బ్రహ్మను చూచి విష్ణువడిగెను. “నీవిప్పుడు స్వప్నము వలె ఏది చూచితివో దానిని చెప్పుము”. శ్రీమన్నారాయణుని మాట విని విధి ఇట్లు పలికెను.
“స్వామీ! భూత భవిష్యద్వర్తమానములన్నియు నీ మాయ వలన ఏర్పడినవే”. ఇట్లు పలికి ఆ సభలో సిగ్గుతో నిలిచియుండెను. సర్వాంతర్యామియైన ఆ భగవంతుడు అతనిశాప విముక్తికి ఒక ఉపాయము చేసెను.
ఇది బ్రహ్మవైవర్త మహాపురాణములోని శ్రీకృష్ణ జన్మఖండమందు నారాయణ నారదసంవాదరూపమైన మోహినీ శాపము బ్రహ్మగర్వభంగము అనెడి ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.
