బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

240 - సాంఖ్యవిధి నిరూపణమ్‌

ఓ విప్రేంద్రా! శిష్ట సమ్మత మగు యోగమార్గ ప్రక్రియను తాము యుక్తి యుక్తమగు శిష్యులగు మాకు హితముగా ప్రతిపాదించితిరి. లోక త్రయము నందును ప్రసిద్ధి పొంది యున్న సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన శాస్త్ర తత్త్వమును దాని యందు సిద్ధిని పొంద గోరిన వారు పాటించ వలసిన ధర్మమును ఉన్నది ఉన్నట్లుగా మాకు ప్రవచింప గోరు చున్నాము.

ఓ మునులారా! వినుడు. అత్మ తత్త్వము నెఱిగిన వారును సమర్థులును నగు కపిలాది వృద్ధ యతులు తెలిపిన విషయమును తెలిపెదను. వారిలో కొందరు ఉత్తమమగు బుద్ధి వైశారద్యము కల ముని సత్తములును కలరు. వారు చెప్పిన వానిలో సుగుణము లెన్నియో కలవు. దోష మొక్కటియు లేదు. అది యేమనిన వివేకముచే దుర్జయము లగు విషయము లను వాని యందలి దోషములను ఎరుగ వలెను. ఆ విషయములు మనుషులు పిశాచులు ఉరగులు గంధర్వులు పితరులు తిర్యక్ర్పాణులు గరుడులు మరుత్తులు మహర్షుష్యులు రాజర్షులు అసురులు విశ్వేదేవుడు దేవర్షులు యోగులు బ్రహ్మ వీరనుభవించు విషయములు వేరువేరు విధములుగా నుండును. వాని యందలి దోషములును వివిధములు. కాల పరిమాణము ఆయువు సుఖము ననుభవించ వలసిన కాలము విషయాభిలాష వలనను తిర్వగ్జన్మల యందును నరకము నందును గల దుఃఖములును దోషములును స్వర్గ సుఖము నందలి గుణములును దోషములును వేద వాదము జ్ఞానము సాంఖ్య యోగము దశ గుణములు కల సత్త్వము నవ గుణములు కల రజస్సు, అష్ట గుణములు గల తపస్సు, సప్త గుణములు కల బుద్ధి షడ్గుణ యుక్తమగు సభస్సు (ఆకాశము), త్రిగుణ మగు తమస్సు ఏక గుణ మగు సత్త్వము మోక్షము నకు కొనిపోవు మార్గము. ప్రళయ తత్త్వ స్వరూపములు ఎరిగి ఈ చెప్పిన వాని యందలి గుణ దోషము లను గుర్తెరిగి ఆత్మ తత్త్వాభ్యాసము చేసిన వారు చెప్పిన యుక్తులతో జ్ఞానమును, విజ్ఞానమును. జ్ఞాన మనగా విషయమును ఎరుగుట, విజ్ఞాన మనగా తెలిసిన దానిని అనుభవము లోనికి తెచ్చు కొనుట, సంపాదించి నిఃశ్రేయసమను సర్వ శుభతమ మగు మోక్షమును పొందుదురు. చక్షుస్పు రూపముతో అగ్నితో ఘ్రాణము గంధముతో పృథివితో శ్రోత్రము శబ్దముతో ఆకాశముతో జిహ్వ రసముతో జలముతో త్వగింద్రియము స్పర్శముతో వాయువుతో నిత్య సంబంధము కలవి. తమస్సు నందు మోహము మొహము నందు లోభము నిలిచి యున్నవి. నడక యందు విష్ణువు బలము నందు ఇంద్రుడు ఉదరము నందు అగ్ని జలము నందు భూదేవి తేజస్సు నందు జలము వాయువు నందు తేజస్సు ఆకాశము నందు వాయువు మహ త్తత్త్వము నందు ఆకాశము మహస్సు నందు సత్త్వ రజ స్తమస్సులు నిలిచి యుండును. సత్త్వము ఆత్మ యందు ఆత్మ నారాయణు నందు ఆశ్రయించి యుండును. నారాయణుడు మోక్షము నందు నిలిచి యుండును. మోక్షమున కాశ్రయ మేదియు లేదు. స్థూల దేహము పదునారు గుణములతో ఏర్పడినది. స్వభావము భావన అనునవి దేహము నాశ్రయించి యుండును. ఆత్మ మాత్రము ఏ పాపములు అంటక తటస్థమయి యుండును. విషయ సుభాభిలాష కలవాడు చేయు కర్మలను ఇంద్రియములను ఆత్మ యందలి ఇంద్రి యార్థములను మోక్షము దుర్లభమను విషయమును శాస్త్ర ప్రమాణమున తెలిసికొన వలెను. ప్రాణా పాన వ్యానోదాన సమాన వాయువులను ప్రాణ తత్త్వోత్పత్తిని ఏడు విధములుగా నున్న శీర్షణ్యము లగు ప్రాణములను ప్రజాపతులను ఋషులను సృష్టులను సప్తర్షులను రాజర్షులను దేవర్షులను మరుత్తులను సూర్య సమాను లగు బ్రహ్మర్షులను ఉత్తమ లోక సుఖా నుభవము తరువాత అచటి నుండి జారి అధోలోక గతి పొందు వారిని మహాభూత సంఘ నాశమును శుభమగు వాక్కుల గతులను దశలను పూజార్చనోపాస నాదులను పాప కర్మలు పొందెడి వైతరణి యమ లోకము లందలి దుఃఖమును వివిధ జన్మల యందు జీవుని అశుభ సంచారమును శోణితము ఉదకము శ్లేష్మ మూత్ర పురీషములు తీవ్ర దుర్గంధము, వీటితో నిండిన మాతృ గర్భమున నివాసము శుక్రము శోణితము మజ్జ స్నాయువు వందల కొలది సిరలు, వీటితో ఏర్పడిన ద్వారములు గల పురమగు దేహమున జీవుని నివాసమును తనకు హితమైన దానిని తామస రాజస సాత్త్వాక ప్రాణులు సాధించ గల యోగముల వైవిధ్యమును తమః ప్రధాన యోగ సాధకుల కుత్సిత గతి విశేషములను ఆత్మ తత్త్వము నెరిగిన సాంఖ్యులు ఉత్తమ విషయములు సాధించుటలో పొందు ఉపద్రవములను గ్రహముల తారల చంద్రుని యొక్క నక్షత్రముల యొక్క పతనములను నక్షత్రముల తారు మారును జంటలు దీనముగా ఎడ బాయుటను ఆయా ప్రాణులు పరస్పరము భక్షించు కొను అశుభ కృత్యకమును బాల్యము నందలి అజ్ఞానమును స్థూల దేహపు అశుభ స్థితిని సత్త్వ గుణమును ఆశ్రయించి కూడ ఉండెడి రాగ మోహములను వేల మందిలో ఏ ఒక్కడో మాత్రమే ముముక్షువు అగుటను వేద ప్రమాణ విజ్ఞానముతో సాధించు మోక్షము దుర్లభము అగుటను లభించని కోరికలపై ఆదరమును అది తీరగానే ఉపేక్షా భావమును విషయ సుఖముల లోని దోషములను ప్రాణము పోయిన వారి అశుభ స్థితులను ప్రాణ త్యాగము తానే చేయ నిశ్చయించు కొనిన మహానుభావులు తమ శుభమైన దేహములను కూడ భేదించుకొని పోవుటను శుభమైన వంశముల యందు తమ సంకల్పముతో జన్మింప గలుగుటను సాత్త్వికు లైన ప్రాణులు కూడ దుఃఖ మనుభవించుటను బ్రహ్మఘ్నలు పతితులు పొందెడి దారుణ గతిని బ్రాహ్మణులై ఉండియు దురాత్ములై సురాపానము గురుదార గమనము మొదలగు మహా పాపముల చేసి పొందు దుర్గతిని మాతృ ద్రోహి పొందు దుర్గతిని ఉత్తములు పొందెడి దేవలోక గతిని అశుభ కర్మల గతులను తిర్యక్‌ ప్రాణులు పొందెడి మూఢ గతులను వేద వాదముల వైవిధ్యమును ఋతువుల తారు మారును సంవత్సర మాస పక్ష దివసముల క్షయమును చంద్రుని వృద్ధి క్షయములను సముద్ర వృద్ధిని ధన క్షయమును మరల అది పెరుగుటను యుగముల సంయోగములను దేహము శిథిల మగుటను దేహము మూలమున ఆత్మయందు కలుగు దోషములను మలిన దేహము నుండి వెలువడు అశుభ గంధములను ఎరిగి వివేచించి ముముక్షుకై యత్నించి దానిని పొంద వలెను.

జీవుడు దేహమును గ్రహించుట వలన కలుగు దోషముల విషయములో మాకు గల సంశయములను బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడవగు ఓవ్యాస మహా మునీ! తీర్చ వేడెదము.

 ఓ ముని సత్తములారా! కపిలుడు ప్రవచించిన సాంఖ్య మార్గము నెరిగిన విద్వాంసులు దైహిక దోషములు కామ క్రోధ భయ నిద్రా శ్వాసములు ఐదనియు అని అన్ని ప్రాణులకు కల వనియు చెప్పుదురు. క్షమచే క్రోధమును సంకల్పములు విడుచుటచే కామమును సత్త్వ గుణము నాశ్రయించి నిద్రను ఎచ్చరికచే భయమును అల్పాహారముచే శ్వాస అయాసమును జయింప వలెను. అనేక గుణముల నుండి ఉత్తమ గుణమును అనేక దోషముల నుండి ప్రధాన దోషములను అనేక యుక్తుల నుండి మోక్ష సాధక మగు యుక్తులను అనేక వైచిత్ర్యముల నుండి ప్రధానమైన వైచిత్ర్యములను గుర్తించి విష్ణుని అనేక మాయలతో ఏర్పడిన ఈ లోకము నీటి మీద నురుగుతో సమానమని తెలిసికొని అజ్ఞానముచే నీటి బుడగ వలె తిరుగుచు సుఖము వలె కన బడుచు నాశముతో నిండి నాశము తరువాత మహా భయము కలిగించుచు బురదలో దిగిన ఏనుగు వలె రజ స్తమో గుణము లందు దిగబడి ఉన్నదని గుర్తించి వైరాగ్యము పొంద వలెను. మహా ప్రాజ్ఞులగు సాంఖ్య తత్త్వము ఎరిగిన వారు దార పుత్రాదులపై ప్రీతి లేక పూజ్యమై సర్వ వ్యాపియైన సాంఖ్య జ్ఞానముచే రాజస తామస అశుభ సంస్కార ములను సత్త్వ గుణ ప్రధాన మైన పుణ్య సంస్కారము లను విషయాభిలాషలను తపస్సు అనెడి కఱ్ఱతోను ఆత్మ జ్ఞానమును ఖడ్గము తోను ఛేదించి దుఃఖ చింతా శోకము లనెడి పెద్ద గోతిని దాట గలుగుదురు. ఆ గోతిలో వ్యాధులు మృత్యువు వలన మహా ఘోర భయమనెడి సర్పములు అజ్ఞాన మనెడి తాబేళ్ళు రజోగుణ మనెడి చేపలు కలవు. దానిని దాటుటకు ప్రజ్ఞయే నావ. అది యొక సముద్రము. ప్రపంచ విషయముల పై ప్రీతి అనెడి బురద ముసలి తనము అనెడి దుర్గములు విషయ సుఖము లనెడి ద్వీపములు కథలు అనెడి అగాధములు సత్త్వము అనెడి తీరము హర్షములు అనెడి మహా వేగములు అనేక అభిరుచులు అనెడి కల్లోలములు నానా విషయములపై ప్రీతి అనెడి మహా రత్నములు దుఃఖ సంతాపములు అనెడి వాయువు శోకము అనెడి పెద్ద సుడులు. తీక్ష్ణవ్యాధి మహాబాధలు ఎముకల రాశులు అనెడి ఎదురు దెబ్బలు దానము అనెడి ముత్యముల రాసులు రక్తము అనెడి పగడములు నవ్వులు అనెడి అలల ధ్వనులు నానా విధములైన అజ్ఞానములు దుఃఖా శ్రువులు అనెడి ఉప్పు ఈ సముద్రము నందు కలవు. దీనిని సిద్ధులై పూజ్యులైన యతులు జ్ఞాన యోగమును నావతో తరింతురు. వారు దేహ త్యాగము తరువాత నిర్మల మగు ఆకాశములో ప్రవేశించ గానే అది ఎరిగి సూర్యుడు తన కిరణములతో విరిని పైకి కొని పోవును. తపో ధనులును యోగ వీర్య వంతులును వైరాగ్య వంతులును సిద్ధులును అగు ఆ యతులను సప్త వాయువులలో శ్రేష్ఠుడును చల్లనై సుఖ స్పర్శ గలిగి సుగంధముతో కూడి సూక్ష్మమైన ప్రవహము అను వాయువు ఆకాశములో అత్యున్నత స్థానమునకు కొనిపోవును. ఆ అకాశోన్నత స్థానము వారిని రజో గుణము యొక్క సత్త్వ గుణము యొక్క ఉన్నత స్థితికిని సత్త్వోన్నత స్థితి శుద్ధత్ముడగు పరమ ప్రభువగు నారాయణుని లోనికిని కొనిపోగా ఆ నారాయణుడు ఈ యతులను తనలో చేర్చుకొని తన రూపమునకు తీసికొని పోవును. ఇట్లు అమలులగు ఈ యతులు నారాయణుడు అను పరమాత్మ తత్త్వమును చేరి ఆ తత్త్వముగానే ఆ అమృతులు అగుదురు. వారు మరల జన్మ పరంపర లోకిని రానక్కర లేదు. సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతులై సత్యము అర్జవము సర్వభూత దయ కలిగి వర్తించిన ఆ మహాత్యములకు అసాయుజ్య స్థితి పరమోత్తమ గతి.

ఉత్తమ మగు ఆ భగవత్తత్త్వ రూపమైన ఉత్తమ స్థానమును చేరిన ఆ స్థిర వ్రతులు జన్మ మరణ రూపమైన సంసార ప్రవృత్తిని నారాయణుడు మరల ఆరంభించు వరకు ఆ మోక్ష స్థితిలో అనందించు చుందురా లేదా? ఈ విషయము లలో వాస్తవమేమో చెప్ప వేడెదము. ఓ ఋషి సత్తమా! ఈ సంశయము నిన్ను తప్ప ఎవరిని అడుగ జాలము. ఏలయన ఈ స్థితి పొందిన ఋషులు అచ్ఛటనే అనుభూతి యందు ఉండి పోయినచో మరల ఈ లోకమున ప్రవృత్తి లక్షణమైన ధర్మమును దేనిని చూచు చున్నామో దానిని సాధించు వారెవరు? లేక వారు మరల జీవులై లోక ప్రవృత్తి లోనికి వచ్చినచో మరల దుఃఖము లోనికి వచ్చుటయే గదా? ఈ విధముగా మీరు వివరించిన మోక్ష స్వరూపములో దోష మొకటి కనబడు చున్నది. ఈ సంశయమును తీర్చ ప్రార్థించు చున్నాము.

ఓ ముని శ్రేష్ఠులారా! ఈ ప్రశ్నము యుక్తి యుక్తమే గాని మిగుల క్లిష్ట మైనది. ఈ విషయములో మహాత్ములగు కపిలా చార్యుల జ్ఞానమే శ్రేష్ఠ మైనది. ఇంద్రియములు దేహ మందుండి దానిని ఎరుగును. అవి ఆత్మకు ఉపకరణములు కాని ఆత్మ లేనిచో కఱ్ఱల వలె గోడల వలె జడము లై నశించును. ఇంద్రియము లతో కూడ జీవుడు నిద్రించి ఆకాశములో వాయువు వలె సూక్ష్మ రూపమున సంచరించుచు ఎన్నియో చూచుచు మరల మేల్కాంచిన తరువాత నిద్రకు పూర్వము తన అనుభవములో ఉండిన భవములో ఉండిన వాటిని మరల జ్ఞాపకము చేసికొని ఆయా పనులలో మొదటి వలె ప్రవృత్తు లగును. ఆత్మ నిద్రావస్థలలో నున్నప్పుడు మాత్రము ఆ ఇంద్రియములు తామేమియు చేయలేక లయము నొంది పడి ఉండును. కాని ఆత్మ ఆ ఇంద్రియముల సూక్ష్మ తత్త్వమును తీసికొని సత్త్వ రజస్తమో గుణముల మనో బుద్థుల పంచ భూతముల లక్షణములను వెంట బెట్టుకొని స్వప్న లోకమున సంచరించును. అట్లే ఓ బ్రహ్మణులారా! ఇచ్చటను పరమాత్ముడగు నారాయణుడు లోక వ్యవహారము నందలి ఆత్మ వంటివాడు ఆయనలో సాయుజ్యము పొందిన ఈ ముక్త యతులు ఈ ఆత్మకు ఉపకరణము లైన ఇంద్రియముల సత్త్వ రజస్తమో గుణముల, మనో బుద్దుల, వంటి వారు. ఆ పరమాత్మునిలో లయము నొందిన ఈ మహా యతులు మరల నారాయణుని సృష్టి కాలమున నిద్ర మేల్కాంచిన జీవుని ఆధీనములో ఈతని ఇంద్రియాదులు మొదటి వలె పనిచేసి నట్లే వీరును సృష్టి ధర్మములో ప్రవృత్తి పొంది లోక వ్యవహారములో ప్రవర్తిల్ల జేయుదురు. ఇదియే వాస్తవ మైన సాంఖ్య తత్త్వము. దీనిలో సమానమైన జ్ఞాన తత్త్వము మరి యొకటి లేదు. ఈ చెప్పిన నారాయణ పరమాత్మ తత్త్వము అక్షరము ధ్రువము సర్వ పూర్వము సనాతన బ్రహ్మ తత్త్వము ఆనాది మధ్య నిధనము ద్వంద్వ రహితము సర్వకర్త శాశ్వతము కూటస్థము (ఎట్టి స్థితులలో ఏ మార్పులను పొందని అఖండ తత్త్వము) ఆ తత్త్వము నుండియే సృష్టి స్థితి లయములు విప్రులు వేదములు ప్రవర్తిల్లును అని శాస్త్ర ప్రవక్తలగు మహర్షులు సర్వ విప్రులు ప్రణవ తత్త్వము ఎరిగిన మహానీయులు చెప్పు చున్నారు. సాంఖ్య, యోగ, పరు లిద్దరును ఆయన తోడి సాయుజ్యమే కోరి సాధన చేయుదురు. ఏమైనను ఈ ప్రపంచము నందలి భూతములు అగమ్యములు గమ్యములు అని రెండు విధములు. ఈ రెంటిలో గమ్య భూతములు మేలైనవి. (అగమ్యము అనగా తాము పొందు సుఖ దుఃఖాది అనుభవము లను స్పష్ట వాక్కుతో చెప్ప జాలనివి) వేద పురాణ యోగములు ఇతిహాస శాస్త్రము లోక వ్యవహారము వీటి యందు కనబడు జ్ఞాన మంతయు సాంఖ్య తత్త్వము నుండి వచ్చినదే. పరమాత్ముని ఉత్తమోత్తమ బలము జ్ఞానము మోక్షము తపస్సులు వేద శాస్త్ర విహితములైన ఇతర సూక్ష్మ విషయములు ధర్మము అన్నియు సాంఖ్యము నుండి వచ్చినవే. కనుక ఈ పై చెప్పిన ముక్త జీవాత్మలు ఈ ఉత్తమ తత్త్వములను తమలో నిలుపుకొని సాయుజ్య మోక్షముతో కృతార్థులై యుండి మరల సృష్టి కాలమున పవిత్రు లైనవారి గృహముల యందు జన్మింతురు. మరల ఈ దేహమును విడిచిన తరువాత మొదటి వలె మోక్షమును పొందుదురు. ఇట్టి వారికి ఉత్తరోత్తర ముగ ఉన్నత గతులే కాని తిర్యక్‌ జన్మలు నరక నివాసము కలుగవు. ఈ చెప్పిన సాంఖ్య తత్త్వము విశాలము శ్రేష్టము విమలము ఉదార మైనది. అనాది మహా సముద్రము వంటిది. కనుక మీరును ఓ మునులారా! సాంఖ్య తత్త్వ పరాయణులై అప్రమేయుడును మహాత్ముడును అగు నారాయణని యందు చిత్తము నిలుపుడు. నేను చెప్పిన ఈ పరమతత్త్వ సారాంశ మేమనగా అనాది యగు ఈ ప్రపంచము నారాయణుని నుండియే ప్రభవించినది. అతడే దీనిని సృష్టి కాలములో సృజించును. ప్రళయ కాలము వచ్చి నప్పుడు సంహరించును.