బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

26 - స్వయంభూ బ్రహ్మర్షి సంవాదః

ప్రవచన నిపుణా! పృథివి యందుత్తమ మయినది ధర్మార్థకామ మోక్షముల నొసంగునది యగు భూమిని తీర్థముల కెల్ల నుత్తమ తీర్థమును దెల్పుమని అడిగిరి.

 మున్ను మునులీ ప్రశ్నమును మా గురువుల నడిగిరి.

కురుక్షేత్రమున నానాతరు లతా పుష్ప ఫలోప శోభితమైన తన యాశ్రమమునం దాసీనుడై యున్న మహాభారత కర్తను సర్వశాస్త్ర విశారదుని ఆధ్యాత్మ నిష్ఠుని సర్వజ్ఞుని స్వభూత హితాభిరతుని పురాణాగమ వక్తను వేదవేదాంగ పారగుని శాంతుని మతిమంతుల కెల్ల సగ్రేసరుని పద్మ పత్రాయ తేక్ణుని శ్రీ వేద వ్యాసుని దర్శించు వేడుకతో నిశిత వ్రత పరాయణు లైన మును లేతెంచిరి. ఆ వచ్చిన వారు కశ్యపుని మొదలు కృష్ణాను భౌతుకుని దాక గల పేర్లవారు. నక్షత్రములలో చంద్రుని వలె వారిలో పరాశర సూనుడు శ్రీమంతుడు వ్యాసుడు మిక్కిలిగా దేజరిల్లెను. వేదవేత్త యగు నమ్ముని యా మునివరులను బూజించెను. వారును నతనికి ప్రతి పూజ సల్పి కుశల ప్రశ్నము లయిన తరువాత సాత్యవతేయు నిట్లడిగిరి.

ఓ మునివరా! వేదశాస్త్ర పురాణా గమాది సర్వ సారస్వతమును భూత భవిష్యద్వర్త మానములను నెరుంగుదువు. మునిసత్తమా! రాగమను మొసళ్ళు, విషయములను నుప్పు నీరు, ఇంద్రియములను సుళ్ళు గలిగి, దురాశ యను కెరటముల నిండి, లోభ గంభీరము దుస్తరము మోహమును రొంపియు గల్గి దుఃఖ బహుళము కష్టతరము నిస్సారమైన సంసార సాగర మందు మునిగి నిరాలంబ మై యచేతనమై యున్న జగత్తును జూచి మహానుభావుడ వగు నిన్నడుగు చున్నాము. ఈ భయంకర సంసార మందేది సాధింప వలె? ఏది శ్రేయ స్సాధనము? ఉపదేశించి జగముల నుద్ధరింపుము. ఈ యవని యందు దుర్లభము మోక్షదము నైన పవిత్ర క్షేత్రమును చెప్పుడు. ఈ మేదిని యందు గర్మభూమి యేదియో నీ వలన విన దలచితిమి. కర్మ భూమి యందు నరుడు యధా విధిగా గర్మ మొనరించి పరమ సిద్ధిని బొందును. వికర్మ వలన నరకమును బొందును. మోక్ష భూమి యందు మోక్ష మందును గావున మాకీ విషయములు వినిపింపు మన, త్రి కాలజ్ఞుడగు వ్యాస మహర్షి వారి కిట్లా నతిచ్చెను.

మున్ను మేరుపృష్ట మందు నానా రత్నద్రుమ లతా కుసుమ పల్లవ లలితమై నానా మృగ ఖగ కలకలమై నానావర్ణ శిలాధాతు రంజితమై నానా ముని జనాశ్రమ సమన్వితమై రమ్యము నైన ప్రదేశము నందాసీను డై యున్న వాడు.

జగన్నాథుడు, జగద్యోని, చతుర్ముఖుడు, జగన్నాథుడు, జగద్వంద్యుడు జగదా ధారుడు ఈశ్వరుడు, జగత్పతి, దేవదాన వాదులచే వివిధ రీతుల సేవింప బడుచున్న బ్రహ్మను భృగ్వాది మునులు దర్శించి మ్రొక్కి యిదే యంశము నడిగిరి. భగవంతుడా! భూతలమున కర్మ భూమిని దుర్లభమైన మోక్ష ప్రద క్షేత్రమును తెలుపు డనగా సురేశ్వరుండిట్లు తెలుప బూనెను.