బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
192 - అక్రూర ప్రత్యాత గమనమ్
ఇట్లా యాదవు డక్రూరుడు గోవిందుని దలచుచు వచ్చి నేనక్రూరుడ నని పేరు సెప్పికొని తల వంచి హరికి నమస్కరించెను. (గోత్ర నామములు సెప్పికొని నమస్కరించుట విశిష్ట గౌరవపాత్రులగు గురువులకు దైవ సమానుల యెడ జేయ వలసిన లక్షణము శాస్త్రీయము.) శ్రీహరియు ధ్వజ వజ్ర పద్మ చిహ్నములు గల హస్తముచే నక్రూరుం దాకి దరికి దీసికొని ప్రీతితో గాఢాలింగనము సేసికొనెను. బలరామ కృష్ణు లాతనితో కుశల సంభాషణాదులు నెఱిపి వెంటనే యాతనిం జేకొని తమ మందిరమునం బ్రవేశించిరి. అతడును వారితో ముచ్చట లాడుచు విందారగించి సముచితముగ వారికి దావచ్చిన విశేషముం దెలిపెను. కంసుడు దేవకీ వసుదేవులను బెదరించుట తన తండ్రి యగు నుగ్రసేనుని యెడ నతడు వర్తించు తీరు తన్నెందులకు కంసుడు పంపెనో యా విషయము నెల్లను నాతడు తెలుప విని కేశి సంహారకు డగు భగవంతుడు దానపతీ! (ఓ అక్రూరా) ఇదెల్ల నాకు దెలిసినది. ఇందేమి యుచితమో యదియా లోచించి చేసెదను. ఓ మహానుభావ! నీవింకొక లాగను కొనకుము. నాచే కంసుడు హతు డయినట్లే తెలియుము. నేనును నన్నయ్య బలరాముడును నీతో రేపు మథురకు వత్తుము. గోప వృద్ధులు గూడ యుపాయనములం బెక్కింటిని గొని వత్తురు. ఈ రేయి విశ్రమింపుము. చింతింపం బనిలేదు మూడు రాత్రుల లోగా గంసుని పరివారముతో సంహరింతునని కృష్ణుడు పల్కెను.
అక్రూరుడు నా రాత్రి గోపకులకుం జెప్పి కృష్ణునితో బల భద్రునితో నందుని మందిరమున నిదురించెను. బలశాలు రగు రామకృష్ణు లవ్వల సుప్రభాతమునం దక్రూరునితో మధురకేగ సన్నద్ధు లైరి. గోపిక లది చూచి కన్నుల నీర్నిండ దుఃఖము నంజిక్కి ముంజేతుల గంకణములు జార నిటూర్పుపుచ్చుచు నొండొరులతో నిట్ల నుకొనిరి. గోవిందుడు మధుర కేగి మరి వ్రేపల్లె కెట్లు రాగలడు. ఆ నాగరిక సుందరుల అవ్యక్త మధుర భాషణ మధుధారల వీనులం గ్రోలును. ఆ నగర కాంతల మెరమెచ్చుల ముచ్చట లందిరపుకొన్న యీతని చిత్త మిక నీపల్లెం గల గొల్ల పడుచుల వంక కెట్లు తిఱుగును. ఈ గోష్ఠము యొక్క (వ్రేపల్లె యొక్క) సమగ్ర సారమైన హరి నిట్లు హరించుకొని పోవు నా పాడు దైవము నిర్థయమై గోపాంగనల సర్వస్వము దోచు కొన్నాడు. పరిహాస భావగర్భిత మైన యాపలుకు లాయొయ్యారపు నడక లా నెఱజాణలు మధురాపురీ సుందరుల య వ్వాల్చూపు టురులం జిక్కి ఈ పల్లెటూరి దేవయ్య మీ ప్రక్కకు మఱి యే యుక్తిని రాగలడు. పేరు మాత్రమున కక్రూరు డయిన యీ క్రూరునిచే నీహతాశునిచే మోసగింప బడి యిదె మాధవుడు రథమెక్కి మధుర కేగు చున్నాడు. ఈ నీచుడింత యెరుగడా యీతని పై వలపుగొన్న యీజనమును తఱుగని తఱి తీవుగొని మఱగిన మనసామిని హరిని గొంపోవు చున్నాడు. ఇతడో! దయమాలి రమ్మన్నదే తడవుగ నివ్వనమాలి హలితో వీని వెంటం బడి రథ మెక్కి (ఎన్నడు నెక్కని రథమెక్క నుబలాట వడి కాబోలు) చను చున్నాడు. వలదని వారింపం ద్వర పడుదము? పెద్దల యెదుటంబడి మా కేదిగతి ఏమందు వని మొర వెట్టుదము. ఆ పెద్దవాండ్రు మాత్రము విరహాగ్నిచే గ్రాగుమన కేమిసేయ గలరు? నంద గోపుడు మున్ను గానిచె వీరును ప్రయాణ సన్నద్దులగు చున్నారు. గోవిందుని మఱలింప నొక్కరే నిందు యత్నించుట లేదు. మథురా వాసులగు విలాసినుల కీరేయి యిపుడు సుప్రభాతము. అచ్యుతుని ముఖా రవిందమునకా సుందరుల కనుగవలు భోగ్య వస్తువులు కాగలవు. (అనగా కృష్ణుడా పడతుల వాల్చూపుల సొంపుల ననుభవించు నన్న మాట) ఇట నుండి కృష్ణు డేగుచుండ దారిలో నిలిచి యెవ్వరు వలదు వలదని వారింప బడక స్వేచ్ఛగా నా సొగసుగాని సొగసు గని నెమ్మేనం బులకింతురో యయ్యింతులు ధన్యులు గదె. గోవింద వదనా రవింద సందర్శనమున నిపుడు మధురా పుర పౌరుల నయనముల కిదియొక మహోత్సవము గానున్నది. కను లంతంతలు సేసికొని యే యభ్యంతరము లేకుండ భాగ్యవతులగు నాపుర యువతుల ధోక్షజుం జూడ నున్నారిది యొక కలగాదు గదా? ఈ గోపికల కొక పెన్నిధిం జూపించి నయవ్విధి (బ్రహ్మ) యింతలో జాలిమాలి మన కన్ను లందిగ నడచి నాడు. మాధవు నెడ ననురాగమున నతడేగుటకు మన యందు శైథిల్య మేర్పడ (ఏ కీలున కాలు పట్టు విడుచుండ) మాతో బాటు మా ముంజేతుల నున్న వలయములును (కంకణములు) పట్టుదప్పి జారిపోవు చున్నవి. అక్రూరుడు క్రూర హృదయుడు, అల్లదె గుఱ్ఱములను త్వరత్వరగా దోలు చున్నాడు. ఇట్లార్తలై యలమటించు నబలల పై నెవ్వనికిం దయ పుట్టదు? ఓఓ కృష్ణా! అల్లదె రథ చక్రముల రేగిన రేణు వరదముపై గ్రమ్మినది చూడుడు. దానహరి దూరము సేయబడి నాడు ఆ రేణువు గూడ గనబడుట లేదు అని యిట్లు హార్దమైన భావముతో గోపిక లలమటింప నెవరికి జాలి కలుగదు!
జవనాశ్వమ్మగు రథమునం జని బలరామ కృష్ణులు నక్రూరుండును మధ్యాహ్నమునకు యమునా తీరమును జేరిరి. అంతట నక్రూరుడు తామిద్దరు నిట గూర్చుండుడు. నేనీ కాళి జలములం దాహ్నిక కృత్యము నొనరింతు ననియె. వారట్లేయన నతడు యమునా జలములం జొచ్చి యాచ మించి స్నానము సేసి పరబ్రహ్మాముం ధ్యానించెను. అన్నీటిలో నత డయ్యెడ వేయి పడగలతో నున్న శేషునిగ బలరాముం దర్శించెను. అతడు మల్లెదండ వంటి శరీరము ధరించి తామర రేకులట్లున్న కన్నులలో వాసుకి గన్న డింభకులు పవన భక్షులు చుట్టు నుండి స్తుతింప వనమాలం దాల్చి నల్లని వస్త్రముం దాల్చి చక్కని అవతంసముతో (శిరో భూషణముతో) నింపైన కుండలములు దాల్చి నీటిలో నుండం గనెను. ఆతని యొడిలో మేఘ శ్యాముని అంతట నెఱ్ఱనగు కన్నులు గల వానిని నలు చేతలు గల వానిని ఉన్నత శరీరుని చక్రాద్యాయధ ధారిని పీతాంబ రోత్తరీయముల రంగు రంగుల పూల మాలల దాల్చి ఇంద్రధనుస్సు మెఱపు దీగల తోడి విచిత్ర మగు తోయదము(మేఘము) వలె నున్న వానిని శ్రీవత్సాంకిత వక్షుని చక్కని భుజ కీర్తులు కీరీట ముందాల్చి మిఱుమిట్లు గొల్పుచున్న వానిని తెల్ల దామర పువ్వు సిగపూవు ధరించి యున్న యానంద మూర్తిని గృష్ణుని పుణ్యులగు సనకస నందనాది సిద్ద యోగులు ముక్కుగొనం జూపు విలిపి మనస్సుచే ధ్యానించు వానిని గృష్ణునిం గనెను.
అయ్యెడ నక్రూరుడు వీరు బలరామ కృష్ణులని దెలిసికొని యాశ్చర్యపడి యా వెంటనె వీరెట్లిచ్చటికి వచ్చి నారని యాలోచించెను. పలుక బోయిన యాతని వాక్కును హరి స్తంభింప జేసెను. అంతట నాతడు నీరు వెడలి వెలి కేగుదెంచి రథము నందుమ నయ్యిరువురిం దర్శించెను. మునుపటి యట్ల వారు మానవులట్లు ప్రాకృత రూపమున గోచరించురి. తిరిగి యతడు నీటను మునిగి మున్నట్లవ్రాకృత దివ్యమూర్తుల నందు గనియె. గంధర్వులు మునులు సిద్ధులు నాగులు నయ్యిద్దఱ నయ్యెడ స్తుతించు చుండం జూచెను. అంత నద్దాన పతి (అక్రూరుడు) సర్వసత్తా స్వరూపము నెఱింగికొని సర్వ విజ్ఞాన మయుడగు నచ్యుతు నీశ్వరుని స్తుతించెను.
పంచతన్మాత్ర రూపుడు ఊహింప నలవి గాని మహిమ గలవాడు సర్వ వ్యాపకుడు అనేక రూపుడు నైన వాడు నగు పరమాత్మకు నమస్కారము. శబ్ద రూపము హవి స్స్వరూపము విజ్ఞాన రూపము నైన వానికి బ్రకృతి కంటె పరునికి నమస్కారము. భూతాత్మయు నింద్రియాత్మయు ప్రధానాత్మయు నీవే. ఆత్మయు (జీవుడు) పరమాత్మయు నీవే. ఇట్లు నీవోక్కడవే యైదుగా నున్నావు. క్షరము (సర్వ భూతము) అక్షరము (కూటస్థుడు) సర్వధర్మ మూర్తిని బ్రహ్మ విష్ణు శివాది నానా విధ కల్పనలచే బిలువ బడు నీవు ప్రసన్నుడవు కమ్ము. నీ స్వరూపము పలుక నలవి గానిది. నీవేమి ప్రయోజనము గలవాడనో తెలుప శక్యము గాదు. నీ యభిదాన మిదియని చెప్ప వశము గాదు. అట్టి పరమేశ్వరుని నిన్ను గూర్చి వినతుడ నయ్యెదను. నామము జాతి మొదలైన కల్పన లెందులేవో అట్టి పరబ్రహ్మము నిత్యము అవికారి అజము నైనది నీవే. కల్పన గాకుండ సకల పదార్ధము అందదు గావున కృష్ణ అచ్యుత విష్ణు నామములచే (కల్పన లచే) నీవు స్తుతింప బడు చున్నావు.
నీవు సర్వమున కాత్మవు. వికల్పనములచే నీవే దేవతలు విశ్వమును. ఓ విశ్వాత్మ! నీవు వికార భేదము లేని వాడవు. అంతట నీకంటే వేరొకటి యించుకయు లేదు. నీవు బ్రహ్మవు పశు పతివి అర్యముడవు (సూర్యుడు) విధాతవు ధాతవు ఇంద్రుడవు వాయువు అగ్నివి. జలాధిపతి వరుణుడవు. ధనేశుడవు (కుబేరుడు) నీవు. అంతము చేయు వాడు (యముడు) నీవు. ఒక్క డయ్యు భిన్న భిన్న శక్తులచే భిన్న భిన్న రూపుడవై జగత్తును రక్షించు చున్నావు. కిరణ రూపమున నీవు జగత్తును సృజించి హరింతువు. ఈ విశ్వము పంచభూత వికారము. గుణ మయము. సత్ అను శబ్దమున కర్ధమైన పరము స్వరూపము అక్షరమునై సదస ద్రూపుజ్ఞాన రూపునగు నీకు నమస్కారము. వాసు దేవుడవు సంకర్షణుడవు ప్రద్యుమ్నుడవు అనిరుద్దుడవు నగు నీకు నమస్కారము (చతుర్వ్యూహాత్మకమైన పరమాత్మకు నమస్కారము).
అని యిట్లు నీళ్లలో కృష్ణునిం బొగడి యయ్యాదవుడు మనస్సు చేత గల్పింప బడిన ధూప దీప పుష్పాదులచే షోడశోప చారములచే శ్రీహరి నర్చించెను. మానసిక పూజ చేసెనన్న మాట. ఇతర విషయముల విడిచి మనస్సును కృష్ణ రూప పరబ్రహ్మ మందు నిలిచి చిర కాలమునకు సమాధి నుండి విరమించెను. తనును గృతార్ధునిగ భావించి యమునా జలముల నుండి వెడలి మరల రథము దరికి వచ్చెను. వచ్చి రామ కృష్ణులను ముంటివోలె నున్నవారిం గాంచెను.
ఆశ్చర్యము నంజూచు నక్రూరునితో గృష్ణుడు యమునా జలమున నీవేమి వింత చూచితివి నీకన్ను లాశ్చర్య వికసితము లైన వని యనగ నక్రూరుం డిట్లనియె.
అచ్యుతా! నీళ్ళలో నేనేమి వింత గన్గొంటినో యది యిచటనే రూపొంది నా ముందర గను గలదు. ఈ జగచ్చిత్రమే మహాత్మనిచే యాశ్చర్య రూపమై యున్నదో అట్టి యాశ్చర్యముల కవధియైన నీతో నేనిపుడు గూడి కొన్నాను. ఈ వింతతో మనము మధురకు వెళ్ళుదమా! కంసునకు నేను జడియు చున్నాను. ఛీ!ఛీ! పరులు పెట్టిన పిండముచే బ్రతుకు వాని జన్మమేమి జన్మము.
అని వాయు వేగమున రథాశ్వములను దోలెను. సాయాహ్నామున కక్రూరుడు మధురం బ్రవేశించెను. మధురం గని బలరామ కృష్ణులతో నాత డిట్లనియె.
మీరిరువురు నడచి రండు. నేను రథమున నొక్కడనే నగరముం బ్రవేశింతును. మీరు వసుదేవు గృహమున కేగకుడు మీ నిమిత్తమున నా వృద్ధుని గంసుడు లేవగొట్టును. అని యక్రూరుం డొక్కడే మధురం జొచ్చెను. రామ కృష్ణులు రాజ మార్గమున వచ్చిరి. స్త్రీల పురుషుల యానంద భరితములైన చూపులం జూడ బడుచు వారు విలాసముగ నేనుగు గున్నలట్లు రాజ వీధిలో నడచిరి. అచట నట్టిట్టు దికుగుచు వారొక చాకలిం జూచి చక్కని చలువ మడతల నిమ్మని యడిగిరి. వాడు కంసుని చాకలి గావున మిగుల విస్మయ మంది రామకృష్ణులం గూర్చి యాక్షేప వాక్యములు పెక్కులు బిగ్గఱగా నరచెను. అంతట గినుక గొని కృష్ణుండర చేతం గొట్టి వాని తలను బుడమిం బడ గొట్టెను. వానిం జంపి పీత నీలాంబరులు కృష్ణుడు రాముడును నా బట్టలం గొని ముదమున మాలాకారు నింటికిం జనిరి. చక్కని వారింగని వాడు దేవత లవనికిం దిగిరని యెంచి మోములు వికసింప వారు పువ్వు లిమ్మని యడిగి నంతట చేతులం బుడమిందాకి తలతో నేలనంటి ప్రసన్న సుముఖులై ప్రభువులు నా యింటికి వచ్చితిరి నేను ధన్యుడను. మిమ్మర్చిం చెదనని యామాల్య జీవికుండు పలికి హర్ష వదనుడై పరమళించు చక్కని పువ్వులేరి యేరి మురిపించుచు మఱిమఱి మ్రొక్కి యా పెద్దమనిషి కోరి వారికి కాన్క వెట్టెను. కృష్ణుడును బ్రసన్నుడై మాలా కారునికి వరమిచ్చెను. ఓ భద్రుడా! (శుభ లక్షణా యన్నమాట) నన్నా శ్రయించిన సిరి నిన్నెప్పుడును విడువదు. నీ బలమునకు హాని గలుగదు. ఓ మంచివాడ! ధన హానియు నీకు గలుగదు. నీవు విపులము లైన భోగము లనుభవించి తుదకు నా ప్రసాదము వలన నా అనుస్మరణ మంది దివ్యలోక మందెదవు. నీమన నెల్లవేళల ధర్మము నందుండ గలదు. నీ సంతతికి బుట్టిన వారికి దీర్ఘాయువు గల్గును. నీ సంతరి సూర్యు డున్నంత కాలమెట్టి యిబ్బందులకు లోను గాదు అని యిట్లు పల్కి మాలాకారుని పూజగొని వాని యింటి నుండి కృష్ణుడు బలదేవుని తోడుగా బయలు వెడలెను.
