బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

57 - పంచతీర్థవిధి వర్ణనమ్‌

ఇక పంచ తీర్థములందు స్నానము దానములు చేయుట అచటి దేవతలను దర్శించుట వలన గల్గు ఫలమును దెల్పెదను.

మార్కండేయమను మడుగున నుత్తరముగ దిరిగి శుచియై ముమ్మారు నీ మంత్రముం జెప్పుచు స్నానము సేయ వలెను. సంసార సాగర మందు మునిగి పాపగ్రస్తుడనై తెలివి దప్పియున్న నన్ను ఓ త్రిపురహర! రక్షింపుము. మంగళ స్వరూపుడు శాంతుడు సర్వపాప హరుడు నగు నీకు నమస్కారము. ఈశ్వర! ఇదిగో స్నానము సేయు చున్నాను. నా పాతకము నశించు గాక!

బొడ్డు లోతున స్నాన మొనరించి యథావిధిగ దేవతలకు ఋషులకు పితరులకు మొదలగు వారికి తిలోదక తర్పణములు గావింప వలెను. అవ్వల దేవాలయ మందు మూడు మారులు ప్రదక్షిణము నేసి మూల మంత్రముతో అఘోర మంత్రముతోను మార్కండే యేశ్వరుని పూజించి సాష్టాంగ నమస్కారము గావించి ఈ విధముగా స్తుతించి ప్రసన్నునిం జేసికొన వలెను.

ఓ త్రినేత్ర చంద్రభూషణ ఓ విరూపాక్ష నన్ను రక్షింపుము. ఓ మహాదేవ నీకు నమస్కారము.

మార్కండేయ హ్రద మందిట్లు స్నానమాడి శంకరుని దర్శించిన యతడు పది యశ్వ మేధములు గావించిన ఫల మందును. సర్వపాప విముక్తుడై శివలోక మేగును. అచ్చట మహా భోగముల నా ప్రళయ మనుభవించి యీ లోకమందు (కర్మభూమి యందు) విప్రుడై జనించి వేద వేదాంగ విద్యా సంపన్నుడై శంకర సాలోక్య సారూప్య యోగము నంది యవ్వల మోక్షముల బడయును.

కల్ప వృక్షము (మఱ్ఱి చెట్టు) దరికేగి ఈ మంత్రము జపించుచు పూజించి ముమ్మారులు ప్రదక్షిణము సేయవలెను. అవ్యక్త మయిన పరమాత్మ యొక్క వ్యక్త రూపము నీవు. మహా ప్రలయ కర్తవు. అనగా ముక్తినిచ్చు వాడవు. అమృత మయుడవు. కల్పాంతము నశింపవు. హరికి నివాసమవు నాపాపము హరింపుము. నీకిదే నమస్కారము.

భక్తితో బ్రదక్షిణము సేసి కల్ప వృక్షమునకు మ్రొక్కిన యతడు పాము కుబుసమును విడిచినట్లు పాపము నుండి విడివడును. ఆ కల్పము నీడ వసించి బ్రహ్మ హత్యా పాపమునే విడుచునే మఱి యితర పాపముల మాట చెప్పనేల? కృష్ణ శరీరము నుండి జనించి బ్రహ్మ తేజస్సుతో నిండిన వటవృక్ష స్వరూపమున నున్న విష్ణువునకు మ్రొక్కి రాజసూయాశ్వ మేధయాగ ఫలము నందును. అట్లు స్వవంశము నుధ్ధరించి విష్ణు లోకముం బొందును.

కృష్ణుని కెదుట నున్న గరుడ మూర్తికి మ్రొక్కి సర్వ పాపము వెడలి విష్ణు లోకముం బడయును. వట వృక్షమును గరుడుని దర్శించి పురుషోత్తముని సంకర్షణుని సుభద్రను దర్శించిన వాడు. పరమోత్తమ గతి కేగును. విష్ణ్వాలయ ముంజొచ్చి ముమ్మారు ప్రదక్షిణ మాచరించి సంకర్షణ మంత్రముచే నామూర్తిని బూజించి యిట్లు ప్రసన్నుని జేసికొన వలెను.

నాగలిందాల్చిన నీకు నమస్కారము. రోకలిచే కొనిన నీకు నమస్కారము. రేవతీ ప్రియ భక్త వత్సల నీకు నమస్కారము. బలశాలుర కెల్ల మిన్నయగు నీకు నమస్కారము. ధరణిం ధరించు నీకు నమస్కారము. ప్రలంబాసురుని సంహరించిని నీకు నమస్కారము. కృష్ణుని కన్నగారైన నీకు నమస్కారము.

ఇట్లు హరిని ప్రసన్నుని జేసికొని నీలాంబరుడైన యేక కుండలుని బలరాముని రోహిణీ కుమారుని యనుగ్రహింప జేసికొని, యాతడు పాపము వాసి విష్ణు లోకమున కేగును. ప్రళయము దాక నట సుఖము లంది పుణ్యానుభవా నంతరము భువికి వచ్చి యోగికుల మందు విప్రుడై జనించి సర్వశాస్త్ర పారంగుడై జ్ఞాన మంది ముక్తి నందును. ఆ మీద హరిని ద్వాదశాక్షర మంత్రముచే బూజించి సద్గతి నందును. గంధ పుష్పాదులచే కృష్ణు నర్చించి జయజయ యని స్వామి నామములను గీర్తించి నిస్సార సంసార సాగర మందు మునిగి తిని. ఇది దుఃఖమను నురుగు క్రోధమను మొసళ్లు విషయములను నుదకము నానా రోగము లనెడి కెరటములు మోహమను సుళ్ళు గలది. ఈ మహా భయంకర స్థితి నుండి నన్ను పురుషోత్తమా! కాపాడుమని స్వామి మూర్తిని పద్మ పత్రాయ తేక్షణాది కల్యాణ లక్షణములు గల దానిని ధ్యానించి మ్రొక్కిన యత డశ్వమేధములు వేయి సేసిన పుణ్యము నందును.

సర్వ తీర్థ స్నానదాన ఫలమును కృష్ణ దర్శనము చేసి పొందును. కొన్ని శ్లోకముల దాక ఫలశ్రుతి సులభముగ నర్థమగును. ఇట్లు కృష్ణ దర్శనము సేయు నతడు పాప రహితుడయి ఐశ్వర్య వంతుడు గుణ వంతుడునై కల్పశత మఖిల భోగముల ననుభవించి గంధర్వాప్సరసలు అనుగమింప విష్ణు లోకమంది యిటకు తిరిగి వచ్చి విప్రుడై జనించి సర్వవేది సర్వజ్ఞుడునై స్వధర్మ నిష్ఠుడై శాంతుడై సర్వభూత హితముం గోరుచు వైష్ణవ జ్ఞానంబడసి ముక్తి నందును. ఆ మీద మంత్రపురస్సరముగా భక్తవత్సలను సుభద్ర నర్చించి నమస్తే సర్వగే అన్న యీ మంత్రముచే నమస్కరించి కామగ విమానమున విష్ణు పురమేగి ప్రళయము దాక నట క్రీడించి బ్రాహ్మణుడై వేద వేత్తయే విష్ణు యోగమంది ముక్తి నందును.