బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

15 - వృష్ణి వంశ వర్ణనమ్‌

క్రోష్టునికి వృజినీవంతుడు పుట్టెను. వానికి స్వాహి. యజ్ఞ కర్తలలో శ్రేష్ఠుడు. స్వాహి కుమారుడు ఉషద్గువు. అతడు సంతతి కొఱకు భూరి దక్షిణము లైన యజ్ఞములు సేసి చిత్రరథుడను కుమారునిం బడసెను. అతడు మంచి కర్మిష్ఠి. వాని కుమారుడు శశబిందువు యజ్వ. విపుల దక్షిణుడు. రాజర్షుల వర్తనము నను ష్ఠించిన వాడు. శశిబిందుని నందనుడు పృధుశ్రవుడు యశస్వి రాజయ్యెను. పురాణ విదు లాతని కుమారుని అంతరుడని చెప్పుదురు.

ఈతనికి నుయజ్ఞు డుదయించెను. వానికి ఉషతుడు గల్గె. అతడు స్వధర్మా దరుడు. వానికి కొడుకు శినేయుడు. శత్రు తావనుడతడు. వాని తనూజుడు మరుతుడు. అతడు రాజర్షి. వాని జ్యేష్ట సుతుడు కంబలబర్హిషుడు. అతడు ప్రేత్య భాక్కయ్యు మరణో న్ముఖుడై గూడ ఉత్తమ సంతతి గల కుమారుడు గావలె నని గొప్పధర్మా నుష్ఠానమును కోపముతో గావించెను. నూర్గురు పుట్టిన తరువాత నతనికి యుత్తముడగు కుమారు డొక్కడు దయించెను. అతడు రుక్మకవచుడు. అతడు కవచ ధారులైన నూర్గరుత్తమ ధానుష్కులను రణము నందు వాడియైన బాణములతో చంపి అత్యుత్తమ శ్రీ లాభ మందెను. వానికి శత్రు సంహారకుడగు పరాజిత్తు వానికి రుక్మేషువు పృధురుక్ముడు జ్యామఘుడు పాలితుడు హరియను మహా వీరుల పరాజితులు సుతు లైదుగురు దయించిరి. తండ్రి పాలితుని హరిని విదేహ రాజుల కిచ్చెను. ఫృథురుక్ముని యాశ్రయమున రుక్మేషుడు రాజయ్యె. వారిద్దరిచే పంప బడిన జ్యామఘుడు. అశ్రమ మందుండెను, అతడు బ్రాహ్మణులచే లెస్సగ బోధింప బడి ఏకాకియై ధనుస్సు పట్టి ధ్వజము రథముం గొని మరియొక దేశమునకు ఏగెను. నర్మదా తీరమున నొంటరిగా తిరుగుచు మేకల మృత్తికావతి ఋక్ష వంతమను గిరిని గెలిచి శుక్తిమతీ నగరము నందు వసించెను. వాని భార్య శైబ్య. బలశాలిని, పతివ్రత, సంతానము లేకున్నను నాతడు మఱియెక భార్యను జేసి కొనలేదు.

అతని కొకానొక యద్ధ మందు జయము, గల్గెను. అందొక కన్యం గానుకగ బడసెను. ఆమెం గొని భార్య దరికేగి భయముతో కోడలి దిగోయని చూపెను. ఆమె యవరి కోడలు? యని ప్రశ్నించెను, దానిని విని జ్యామ ఘుడిట్లనెను.

నీకు పుట్టబోవు కుమారుని కిది భార్య యనెను.

ఆ కన్య ఉగ్రమైన తపస్సు చేసెను. ఆ తపః ఫలముగా శైబ్య వృద్ధయై విదర్భుడను కుమారుం గనెను, విదర్భుడా రాజ పుత్రిక యందు క్రధ కైశికులను శూరులు విద్వాంసులు నగు నిద్దరు కుమారులుం గాంచెను, వారు రణ విశారదులు. విదర్భుని కుమారుడు భీముడు, వాని తనయుడు కుంతి. వాని కొడుకు దృష్టుడు, అతడు రణ ధృష్టుడు, ప్రతాపశాలి, వాని కొడుకులు ముగ్గురు. శూరులు, పరమ ధార్మికులు, అవంతుడు, దశార్హుడు, విషహరుడు దశార్హ సుతుడు వ్యోముడు, వాని కొడుకు జీమూతుడు, వాని తనయుడు వికృతి వాని వాడు భీమరథుడు. నవరథుడు నవరథుని పుత్రుడు దళరథుడు, వాని కుమారుడు శకుని. శకుని సుతుడు కరంభుడు, కరంభుని తనయుడు దేవరాతుడు, వాని పుత్రుడు దేవక్షత్రుడు. వాని సుతుడు వృద్ధక్షత్రుడు. వృద్ధక్షత్ర నందనుడు, దేవపుత్రనముడు మధువుల వంశమునకు కర్త మధురవక్త యగు మధువను వాడు, మధువునకు వైదర్భి యందు పురుషోత్తము డగు పురుద్వంతుడను వాడు దయించెను. మధుని కైక్ష్వాకి (ఇక్ష్వాకు వంశజాత) యను భార్య యందు సర్వ గుణోపేతుడు సాత్వత కీర్తి వర్ధనుడగు సత్త్వంతుడు అను వాడు పుట్టెను. అతడు సాత్త్వతులను పేరు తెచ్చిన వాడు. మహాత్ముడగు జ్యామఘుని విసృష్టిని విన్న వాడెప్పుడు పరమ ప్రీతి నందును ప్రజావంతుడు నగును.

సత్త్వతుని వలన కౌసల్యయను నామె బలశాలురగు భాగి, భజమానుడు, దివ్యుడు దేవావృథుడు, అంథకుడు యదు నందను డగు వృష్టి అనువారల గనెను. వారి విశేష సృష్టుల నాల్గింటిని విస్తరించి వర్ణించితిమి. భజమానునికి సృంజయ కుమారైలు బాహ్యక ఉపబాహ్యక అను భార్య లుండిరి. వారికి బెక్కురు పుత్రులు కల్గిరి. క్రిమి, క్రమణుడు, ధృష్టుడు, శూరుడు, పురంజయుడు, వీరు బాహ్యక సృంజయి యందు భజమానునకు జన్మించిరి. అయుతాజిత్తు, సహస్రజిత్తు, శతాజిత్తు దాసకుడు అనువారు ఉపబాహ్యక సృంజయి యందు గల్గిన వారు.

దేవవృథుడు యజ్వ, తపస్వి. నాకు గుణశాలి కుమారుడు గావలెనని తపో నిష్ఠగొని పర్ణాశా నదీ జల మాచమించి, తపమా చరించు చుండెను. ఆ నదికి సదా తన యందు స్నానము చేయు నాతనిపై ప్రేమ కలిగెను. కాని యేలాటిప్రియ మాచరించుట యను నాలోచనలో నొక నిశ్చయ మునకు రాజాల దయ్యెను. ఈరాజు కల్యాణ గుణుడు. ఈతని కీడైన కల్యాణి యెవ్వతె? ఇతడు కోరిన గుణశాలి కుమారు డుదయింప వతెనన్న నేలాటి యుత్తమ కన్యయి తనికి పత్ని కావలెను? అని యేమేమో తనలో దాను గుణించుకొని తుదకు నేనే యేగి యీతని కింతి నగదునని పరమ సుందర రూపము ధరించి యా నృపతిని వరించెను. ఆమె నాప్రభు విచ్చగించెను.

ఉదారమతి యగు నా నృపతి యా సతి యందు తేజస్వి యైన గర్భ ముంచెను. పదియవ నెలలో నామె సర్వ కల్యాణ గుణనిధి యగు బభ్రుదేవావృథుడను కుమారుని గాంచెను. ఈతడు యేడు వేల యరువది యాఱుగురు పురుషుల సమృతత్వ మొందించెను. యజ్వ, దానవతి, ధీమంతుడు, బ్రహ్మణ్యుడు, దృఢాయుధుడు నైన యీ బభ్రుని (దేవావృధుని) వంశమున భోజులు సార్తికావతులని బ్రసిద్ధు లైరి. కాశ్యపదుహిత అంధకుని వలని నల్వురం గనెను. కుకురుడు, భజమానుడు, సనకుడు, బలబర్హిషుడు అనువారు వారు. కుకురుని తనయుడు వృష్టి. వాని కొడుకు కపోతరోముడు. వాని వాడు తివిరి. కాని సుతుడు పుశర్వసువు వానికి అభిజిత్తు వానికి పుత్ర ద్వంద్వము ఆహుకుడు, శ్రాహుకుఢను బేర ప్రసిద్ది చెందిన వారు ఆహుకుని గూర్చి పూర్వులు ఈ క్రింది గాధ నుదహరింతురు.

శ్వేత పరివారముతో గూడి (తెల్ల వాళ్ళతో) వశివాని వలె ఆహుకు డెనుబది కవచముల దాల్చి మొదట నేగును. పుత్ర సంతానము లేనివాడు, నూరు వేలేండ్లాయుర్థాయము లేని వాడు ఆపవిత్ర కర్ముడు. యజ్వ కాని వాడు, భోజరాజు వెంట నుండ రాదు. భోజునికి యేనుగులు పదివేలు ధ్వజములు కవచము ధరించిన వారు పదివేల మంది. మేఘ ఘోషములు గల రధములు పదివేలు, బంగారు వెండి యెను బోతులు ఇరువది యొక్క తూర్పు దిక్కున నేగెడివి. ఉత్తరమున నటులనే నేగెడివి. భోజ వంశీయ రాజు లందరు వింటి నారియే చిరు గంటగ మ్రోగించి నట్టి వారు. మహా యోదులన్న మాట. మరియు అంధక వంశీయులు తమ తోబుట్టువును అవంతీయల కిత్తురు అని గాధ.

ఆహుకునికి కాశ్యపియను నామె యందు దేవ కుమారులు బోలు దేవకుడు, ఉగ్రసేనుడ డను వారిద్దరు గుమారులు గల్గిరి. దేవకుని కుమారులు నల్గురు. దేవవంతుడు, ఉపదేవుడు, సందేవుడు, దేవరక్షితుడు, అనువారు. కుమార్తె లేడుగురు. అతడు వారిని వసుదేవుని కిచ్చి పెండ్లి సేసెను. వారు దేవకి, శాంతిదేవ, సుదేవ దేవరక్షిత, వృకదేవి, ఉపదేవి, సునామిన్ని, యనువారు. ఉగ్రిసేనుని కొడుకులు తొమండ్రు కంసుడు, న్యగ్రోధుడు, సునాముడు, కంకుడు, సుభూషణుండు, రాష్ట్రపాలుడు, సుతునువు, అనావృష్టి, పుష్టిమంతుడు, అనువారు. వారి చెల్లెండ్ర యిదుగురు. కంస, కంసవతీ, సుతనువు, రాష్ట్రపాలి, కంకయును వారు. కుకుర వంశీయుడైన ఉగ్రసేనుడు సంతతితో గూడ వర్ణింప బడెను. మిక్కిలి తేజ శ్శాలురైన కుకురుల వంశమును విని ధారణ సేయుట వలన వంశాభివృద్ధి నంది సుఖించును.