బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

182 - శ్రీ కృష్ణ జనన కథనమ్‌

జగత్కర్త్రియైన యా విష్ణుమాయ దేవ దేవుడు సెప్పినట్లు దేవకి యారు కాన్పుల నొనరించి తరువాతి గర్భమును నాకర్షించెను. ఈ తరువాత దేవకీ గర్భ మందు హరి ప్రవేశించెను. అదే సమయమున యోగ నిద్ర యశోద యుదర మందు బ్రహ్మ చెప్పిన విధముగ జనించినది అంతట గ్రహములు శుభ స్థానము లందు సంచరించి నవి. విష్ణ్వంశము భూమియంద వతరించు సమయమున ఋతువులు సుశోభన మయ్యెను. దేవకి ముఖకాంతి యతిశయించి యామె వంక జూచుటకు నెల్లరకు నశక్య మయ్యెను. దేదీప్యమాన మైయున్న యామెను జూచిన వారి మనసులు కలత జెందినవి. ఎవరికిని తేరిపార చూడ శక్యము గాని దివ్య ప్రభతో విష్ణువును దనయుదర మందు భరించు చున్న యామెను దేవత లహర్నిశము నిట్లు స్తుతించిరి.

దేవతలు:

దేవీ నీవు స్వాహా స్వధా విద్యా సుధా స్వరూపిణివి. జ్యోతి స్వరూపు రాలవు. సర్వలోక రక్షణమునకై భూలోక మంద వతరించితివి. దేవీ ప్రసన్నురాల వగుము. ఎల్ల జగత్తునకు మేలొనరింపుము. ఎవ్వనిచే నెల్ల జగము తరింప చేయ బడెనో యయ్యీశ్వరుని నీవు ప్రీతితో ధరింపుము.

ఇట్లు స్తుతింప బడి యాతల్లి జగద్రక్షణ కారణమైన పుండరీకాక్షుని గర్భమున దాల్చెను. అవ్వల యెల్ల లోకము లనెడి పద్మములను వికసింప జేయుటకు నత్యుతుడను సూర్యడు పూర్వసంధ్యా సమయ మందు దేవకీ యందా విర్భావము జేసెను. అఖిల జగదా ధారమూర్తి యైన జనార్దనుడు నడిరేయి జనించు చుండగ మేఘము లల్లన గర్జనము చేసినవి. దేవతలు పుష్ప వృష్టి కురిపించిరి. వికసించిన నల్లకలువ రంగులో నాల్గు బాహువులతో శ్రీవత్స వక్షుడై యున్న యామూర్తిని చూచి వసుదేవుడు స్తుతించెను. ప్రసాద గుణ భరితములైన వాక్కులతో స్తుతించి యాతడు కంసుని వలన జడిసి యిట్లు విన్న వించెను.

ఓ దేవదేవ శంఖచక్ర గదా ధరా నీకల రూపు జూపితివి. నేనది తెలిసి కొంటిని. దయచేసి ఈ రూపమును మరుగు పరపుము. ఇది తెలిసిన యెడల కంసు డీక్షణమ నన్ననేక యాతనలకు గురి చేయును. ఈ కారా గారమున నీవవతారము జేసితివని వానికి దెలియుట ప్రమాదము. అవ్వల దేవకియు నిట్లనియె.

అనంత రూపుడు విశ్వ రూపుడునై తన యందెల్ల లోకములను భరించు దేవదేవుడు తన మాయంగొని బాల రూపమున వెలువడిన యీ స్వామి మా యెడల బ్రసన్నుడగు గాక! ఓ సర్వాత్మ మూర్తి! ఈ చతుర్భుజ రూపము నుప సంహరింపుము. ఓ దైత్యాంతక నీయీ యవతారమును కంసు డెరుగకుండు గాక.

అన విని శ్రీ భగవంతుడు పుత్రార్థినివై మున్ను నన్ను స్తుతించితివి కావున నది యిపుడు సఫల మైనది. నీ యుదరము నుండి యిపుడందులకే యవతరించితిని. అని స్వామి మిన్నకుండెను.

వసుదేవుడా రాత్రియే యా శిశువు నెత్తుకొని కారాగారము వెడలెను. కారాగార రక్షకులు యోగనిద్రా మోహితు లైరి. మధురా నగర పాలకులు గూడ నయ్యెడ నిద్రావశు లయిరి. నడిరేయి మేఘములు మిక్కిలిగా వర్షించు చుండ శేషుడు తన పడగలు విప్పి పైని గప్ప సుళ్ళు తిరిగి కెరట మువ్వెత్తుగ పరవళ్ళు ద్రొక్కు లోతైన యమునా నదిని మోకాలి బంటి లోతు గొన్న దానిని వసుదేవుడు విష్ణువు నెత్తుకొని దాటెను. అదే సమయమున కంసునికి గప్పము జెల్లింప నటకు వచ్చి యున్న నందుడు మొదలగు గోప వృద్దుల నాతడు యమున దరిని దర్శించెను. మఱియు నతడు బాలుని యశోద ప్రక్కలో నుంచి యందున్న పిల్ల నెత్తుకొని వచ్చెను.

అవ్వల యశోద మెళుకువ గొని పుట్టిన కుమారుని జూచెను. నల్ల కలువ రేకుల బోలి నిగనిగ లాడు నల్లని మేని వానిని శిశువును చూచి యెంతేని సంబర బడెను. అట వసుదేవుడును నా బాలికంగొని యింటికి వచ్చి దేవకి పక్కలోనుంచి యప్పటి యట్ల నుండెను. అవ్వల కారాగార రక్షకులు పిల్ల యేడుపు విని తటాలున లేచి దేవకి ప్రసవించిన వార్తను కంసునికి నివేదించిరి. కంసుడు నపుడు వేవేగ వచ్చి యా పిల్లను బట్టుకొనెను. దేవకి మృదు స్వరమున విడువు విడువు మని వారించు చున్నను వాడట నున్న బండపై నా బాలికను విసరి కొట్టెను. ఆ శిశువా క్షణమ యాకశ మందు నిలచి యాయుధములతో గూడిన ఎనిమిది బాహువులతో నపురూప మైన రూపుగొని బిగ్గరగా నవ్వి రోషముగొని కంసునింగని

కంసా! నన్ను విసరి నంతన నే మయ్యెను. నిన్ను జంపు వాడొకడు పుట్టి యున్నాడు. క్రూరుడ వగు నీ పాలిటికి మృత్యువు దేవతల సర్వస్వ మూర్తి యవతరించి యున్నాడు ఇది నీ మనస్సులో బెట్టుకొని నీకేది హితమో యది చేసి కొనుము.

ఇట్లాదేవి దివ్యగంధ మాల్య భూషణ దారిణి యైన కంసుడు చూచు చుండ సిద్ధులు పొగడు చుండ నాకసము వెంట జనియె.