బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

214 - యమలోక మార్గ స్వరూప వర్ణనమ్‌

మునులు:

“వ్యాస ముని! మీ ముఖముచే గానము చేయబడిన పుణ్య ధర్మముల నెడి గానామృతమునకు దృప్తి జెంద లేకున్నాము. భూతముల యొక్క పుట్టువు ప్రళయము కర్మగతి యంతయు నెరుగుదువు. అందు వలన నిన్నడుగు చున్నాము. యమలోక మార్గము దుఃఖ క్లేశము లను గల్గించు నని సర్వభూత భయంకర మని మిక్కిలి దుర్లభ మని విన్నాము. ఆ దారి వెంట నరులు యమ సదనమున కెట్లు వెళ్ళుదురు. ఆ దారి యొక్క దూరమెంత? నరక దుఃఖములను బొంద కుండుటకు నుపాయము, దాన ధర్మ నియమాదు లెట్టివి? నరులు స్వర్గమెట్లు పొందుదురు. ఆ రెంటికిని స్థానము లెన్ని? పుణ్యాత్ములెట్లు వెళ్ళుదురు. పాపులెట్లు వెళ్ళుదురు? స్వర్గమునుకు గొంపోబడు జీవుని యొక్కయు నరకమునకు గొంపోబడు జీవుని యొక్కయు ఆకారము రంగు ప్రమాణము లెట్టివి?” అన వ్యాసు డిట్లనియె.

“సంసార చక్రము అజరము. అనగ నది యెన్నిటికిని శిథిలము కానిది. నిలుకడ లేక తిరుగుచునే యుండును. ప్రాణోత్ర్కమణము జరిగినది మొదలు జీవుడు పయనించు యమ మార్గ స్వరూపము నేను జెప్పెదను. మఱి యొకడు సెప్పలేడు. యమ లోకమునకు మనుష్య లోకమునకు నడుమ గల యంతరము ఎనుబది యారువేల యోజనములు. కాలిన రాగి వలెనది క్రాగు చుండును. జీవులు తప్పక ప్రయాణము జేయ వలసిన దారి యది. పుణ్యులు పుణ్యలోక మునకు బాపులు నరకమునకు పోవుదురు. యముని రాజధానిలో నిరువది రెండు నరకము లున్నవి. వాని పేరులు స్పష్టము.

ఆ దారిలో చెట్టునీడ చెరువులు సరస్సులు బావులు చలి వెందలి విశ్రమించుటకు గృహము గాని యుండవు. ఆ దారిలో నదులు పర్వతములు గొంచెము విశ్రమించుటకు జోటు లుండవు. మరణ కాలము వచ్చినంతట బందు మిత్రాదులను వదలి సర్వ జీవులు సర్వ వేళల చిన్న పెద్ద యనకుండ గర్భములో నున్న శిశువు సైతము నేస్థితిలో నున్నను దుదకు నిద్రావస్థలో నున్నను బ్రాణములు విడిచిన జీవి యిహము నందు నిర్దిష్టమై యున్న యాయుర్దాయము ననుభవించి తుదకా దారింబడి యేగ వలసినదే. వద్దన్నను నది తప్పదు. జలాగ్నులు విష శస్త్రములు నాకలి పర్వతము నుండి పడుట మొదలగు నేదో నిమిత్తమున దేహి బ్రాణములను వదలి యీ పాంచభౌతిక మహా శరీరము నిక్కడ విడుచును.

తాను జేసిన కర్మా నుసారము యాతనా శరీరమును సుఖ దుఃఖము లనుభవించుటకు మఱొక ధృడమైన దానిని స్వీకరించును. ఆ శరీరముతో బాపి పాపము పుణ్యుడు పుణ్యము ననుభవించును. ప్రాణము పోవు నపుడు తీవ్రమైన వాయువు చేరగుల్కొల్పబడి శరీర మందు సూక్ష్మముగనున్న అగ్ని ప్రకోపించును. అది కట్టెలు లేకుండ గనే మండు నగ్నివలె రగుల్కొని ఆయువు పట్టులను (మర్మ స్థానములు) బ్రద్దలు కొట్టును. అవ్వలను దాన వాయువు మీదికి లేచును. ఆ జీవి తిన్న యాహారము త్రాగిన నీరు క్రిందికి పోకుండ నిరోధించును. ఎవడు బ్రతికి యుండగ మంచి నీళ్ళిచ్చి యెవరి కేని యన్న రసము బెట్టెనో వానికి నా యాపద సమయ మందు హాయి గల్గును. శ్రద్ధా పవిత్రమైన మనస్సుతో నన్నము బెట్టినవాడు ఆ యమ మార్గమున నన్నము లేకుండగనే తృప్తి నొందును. అనృత మాడని వాడు నెదుట వాని ప్రీతికి భంగము చేయని వాడు ఆస్తికుడు శ్రద్ధావంతుడు సుఖమైన మరణము నొందును. దేవ బ్రాహ్మణ పూజా నిరతులు అసూయా రహితులు శుక్లులు (అచ్చము పుణ్యములు చేసిన వారు) దాతలు హ్రీమంతులు (తప్పు పని చేయుటకు గల్గెడి సంకోచము హ్రీ యన బడును) వీరు సుఖ మృత్యువులు. (అనాయాస మరణులు.) కామోద్రేక ద్వేషములకు వశుడు గాక ధర్మము దప్పక చెప్పినట్లు చేయుచు సౌమ్యుడై యుండువాడు సుఖమైన చావొందును. దప్పికకు నీళ్ళు ఆకలికి అన్నముల బెట్టిన నరులు సుఖ మరణ మందుదురు. ధన దాతలు యమ మార్గములో జలిని జయింతురు. మంచి గంధ మిచ్చిన వారు తాపము నొందరు. ఇతరుల యుద్వేగమమును సహించిన వారు ప్రాణోత్క్రమణ వేదనను బొందరు. జ్ఞాన (విద్య) దాతలు దీపమిచ్చిన వారు మోహములో బడరు. కూట సాక్షి యసత్య వాది గురుశిక్ష నొందని వాడు వెద నిందకుడు మృత్యు సమయములో మూర్ఛలో బడుదురు.

ప్రాణము పోవు జీవునకు భయంకరులు పాడుకంపు గొట్టువాడు బడితలు బల్లెములు దుడ్లు చేత బట్టిన వారు క్రూరులు యమ కింకరు లెదురు వత్తురు. వాండ్రు కంట బడగానే యీ ప్రాణికి కంపము పుట్టును. మొర్రోయని బంధువుల కొఱ కేడ్చును. ఆ మాటకూడ స్ఫుటముగా అన్ని యక్షరములు నేక రూపమున వినిపించును. బెదరున జూపు బెదరును. కంఠములో గురగుర పుట్టును. అంతట వేదనా మయమైన యా శరీరము జీవుడు వదలును.

వాయువు ననుసరించి (వ్రాత ప్రకోపముచే) కర్మ యాతనా నుభవమునకు దలిదండ్రుల వలన నేర్పడిన శరీరమును గాక యదే రూపమున నున్న శరీరమును సరిగా నదే ప్రమాణము నదే బాల్యా ద్యవస్థ గల యవయవములతో బొందును. అవ్వల యమదూత పాశములచే గట్టి వేయును. మరణ వేదన పడుచు గాలము రాగా పంచ భూతములు దేహమును విడచి పెట్టును. ప్రాణము కంఠగత మైన సమయమున జీవుడు శరీరము నుండి విడదీయ బడి యెద్దువలె రంకెలు వేయును. షాట్కౌశికమైన ఆనంద మయ (అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ) వాయు స్వరూప మున నిర్గమించును. తల్లి దండ్రి మొదలగు సర్వ సంబంధుల చేత విడువ బడును. బిక్క మొగములు బెట్టి కన్నీళ్ళు గార్చుచు వారు చూచు చుండ తన శరీరమును (గూడును) విడిచి వాయు రూపుడై పోవును.

అంధకార బంధురము చుట్టు చీకటి యావరించి నది సుఖ దుఃఖ ప్రదము దుస్సహము దురంతము దురా సదము దుర్నీరీక్ష్యము, దుర్గమమునై యాదారిం బట్టి పాపాత్ములు వెళ్ళుదురు.

యమకింకరులు పాశములచే గట్టి ముద్గరము లచే గొట్టుచు లాగికొని పోవుదురు. (ముద్గరము=పొట్టి యినుప దుడ్డు) యమ దూతలు జీవుని యాయుర్దాయ మయినట్లు తెలిసికొని బల్లూకములు పెద్ద పులులు గాడిదలు వొంటెలు కోతులు మండ్ర గబ్బలు తోడేళ్ళు గుడ్ల గూబలు పాములు పిల్లులు గ్రద్దలు, డేగలు, నక్కలు, నెక్కి వత్తురు. పెక్కు వికృత రూపములతో అనగా పందులు కుక్కలు, పశువులు దున్నలు మొదలగు రూపములతో వత్తురు. భయంకర మూర్తులు వంకర ముక్కులు, మూడు కళ్ళు పెద్ద దవడలు దీర్ఘాండములు వ్రేలాడు పెదవులు గల్గి రక్త మాంసములు అలమిన శరీరములతో భయంకరమైన కోరలతో మండుచున్న నాలికలతో బాతాళము వంటి ముఖములతో వికృతము లైన నేత్రములతో పిల్లులు గుడ్ల గూబలు మిణుగురు వురుగులు ఆర్ద్ర పురుగు లట్లున్న తిరుగుడు వడుచున్న కన్నులతో మెల్లకళ్ళతో నిప్పులట్లు మెఱయు చూపులతో నాయమ దూతలు కనిపింతురు. భయంకరమైన పాము లట్లుండు అయోమయ ములైన భూషణములతో పుఱ్ఱల మాలలు ధరించి బుసలు కొట్టు నల్ల తాచుల గంఠములకు జుట్టుకొని యగ్ని మంటలట్లున్న నిక్కిన తల వెంట్రుకలతో నూర కదలు రాగి రంగు, గోరోచనపు రంగులో నున్న వ్రేలాడు గడ్డములతో గొందరికి రెండు నాలుగు పదహారు పది, ఇరువది మఱియు లెక్క లేనన్ని చేతులతో కొందరు వేయి చేతులతో మంటలు జిమ్ము వివిధా యుధములతో బాశములతో నినుప గొలుసులతో దండములతో వచ్చి హడలు గొట్టుదురు. యముని యాజ్ఞగొని జీవుల సర్వమూ హరించి కొనిపోయి యమ సదనము జేర్తురు. తడబడుచు నేడ్చుచు బొబ్బ లిడుచు అమ్మనాన్న కొడుకాయని జుట్టాలను బిలిచి యేడ్చుచున్న కర్మచే చెడిన వానిని శూలములచే బొడుచుచు నినుప గుదియలచే నడచుచు వజ్ర సమానము లైన దండములచే బాదుచు గత్తులచే నరకుచు బెల్లుగ నార్చుచు గృద్ధులైన కింకరు లీడ్చుకొని పోవుచుండ నా జీవుడు దుఃఖమున గుమిలి మూర్ఛవడి యుడుకెత్తి పోవ నిట్టటు లాగుచు సూదులట్లు గ్రుచ్చికొను గుశ కంటకముల నీడ్చుచు పుట్ణల దొర్లించుచు శంకు పాషాణముల దొరలించుచు గులకరాళ్ళ కెరలించుచు గనగన మండు మంటలలో కాలెడి యెండలో నొకవంక నక్కలు తినుచుండ జీవుడు నరక మార్గమున బోవును. ఇట పాపులు బెదరి బెదరి తడబడి యాక్రందనము చేయుచు నాదారిం జను చుందురు. కాలిన నేలపై ముండ్ల కంచెలలో కాలుచు దానము జేయని పిసిని గొట్టులు పయనింతురు. జీవ ఘాతకులు రక్తము రసి మొదలగు వాని పాడు కంపుతో గొట్టు మేకపోతు శరీరముతో జర్మము గాలుచుండ వెళ్ళును. మఱియు పులుగుల వలె గూయుచు నాక్రందించుచు వికృతముగ నాక్రోశించుచు వేదనకు గురియై వివిధా యుధములచే నరక బడుచు పొడువ బడుచు జీవ ఘాతకులా దారిం బోవుదురు. మాంసము మెక్కిన జీవులు బల్లెములచే బొడవ బడుచు ఱంపములచే గోయ బడుచు యెడ్లు దున్నలు మొదలగు వానిచే బొడవ బడుచు పందులచే గీర బడుచు సూదులచే బొడవ బడుచు గందురీగలు కుట్ట మధు ఘాతకులు (ఇతరుల నోటి యందలి మధుర మైన కూడు పడగొట్టిన వారు) స్వామి ద్రోహము జేసిన వారు మిత్రఘాత స్త్రీ ఘాత చేసిన వారు యమ కింకరుల శస్త్రములదెగి పోవలసి యుండును. నిరపరాధము లైన సాధుజంతు ఘాత చేసిన వారిని రాక్షసు లాదారిలో గొరికిగొని తిను చుందురు. పర స్త్రీల వస్త్రము లపహరించిన వారు ప్రేతలై దిగంబరులై యమాలయమునకు బరువు లెత్తుదురు. గృహక్షేత్ర సువర్ణ వస్త్ర ధాన్యాదులను దొంగిలించిన పాపులు పాషాణములచే బడితెలచే బాద బడుచు గీలుకీలు పట్టువిడి రక్తములు గార నా దారి వెంట బోవలసి యుండును. బ్రాహ్మణుల గొట్టి ఘోష పెట్టించిన వారు యెండిన కాష్ఠములకు వేసి కట్టబడి కన్ను ముక్కు చెవులు గోయబడ జీము నెత్తురుచే నలము కొనబడి కాలుని గ్రద్దలచె నక్కలచే బీకికొని తిన బడుచు దండములం బాద బడుచు మొర వెట్టుచు నాతెర వునం బోవుదురు. ఇట్టి ఘోరమైన జ్వాలా మయమైన రౌరవ మను నరకము మానవుల కేర్పడినది. కాలిన రాగి వలె మంటలు జిమ్ముచు మిణుగురులు చెదర ముళ్ళ జెముడు డొంకలతో నిండిన నిప్పుల యిసుకతో నిండి వహ్ని కీటకమైన మార్గమున (వహ్ని = నిప్పుచేత కీటకము = నిష్ఠురము) మండుటెండ గాయు దారిని బాసి చన వలసి యుండును. ఇట్లెంతో దూరము గడచిన మీద రాగి యినుముతో నిర్మితమై లక్ష యోజనముల వైశాల్యము గల్గి నలు చదరముగా నాలుగు ద్వారములు గల యమ నగరము వచ్చును. పదివేల యోజనములు ఎత్తైన బంగారు ప్రాకారములు దానికి గలవు. ఇంద్రనీలాది మణులచే నది శోభనించు చుండును. దాని తూర్పు ద్వారమున దేవ దానవ యక్ష రాక్షస పన్నగాది గణ ములుండును. వందల కొలది పతాకము లెగురు చుండును. గంధర్వ అప్సరస లట నాడుచు పాడు చుందురు. ఆ తూర్పు ద్వారమున ప్రవేశము దేవ ఋషి యోగి బృందములకు. యక్ష సిద్ధాదర విద్యాధరులకు మాత్రమే. ఉత్తర ద్వారమున గంటలు మ్రోయు చుండును. ఛత్ర చామరాదులు సొంపు నింపు చుండును. అది నానా రత్నా లంకృతము. వీణా వేణు మృదంగాది మంగళ ధ్వనులు వినిపించు చుండును. ఋగ్యజుస్సామ వేద ఘోషముతో మునిబృంద మందము గొలుపు చుండును. ఆ ద్వారము వెంట ప్రవేశము గలవారు ధర్మజ్ఞులు సత్యవ్రతులు. వేసవిలో మంచి నీరిచ్చిన వారు. చలి కాలమున వెచ్చదన మిచ్చిన వారు. అలసట వడిన వారికి విశ్రాంతి నిచ్చిన వారు. ప్రియ భాషణము చేసిన వారు. దాన శూరులు. మాతా పితృసేవా తత్పరులు. గురు శుశ్రూష చేసిన వారు. అతిథి పూజకులు. వీరికి నుత్తర ద్వారము ప్రవేశ ద్వారము. ఇక పడమటి ద్వారము రత్న భూషితము. రంగురంగుల రత్నాల మెట్లు తొమరములు నచట రాణించును. భేరీ మృదంగ శంఖాదుల ధ్వనులు కాహళముల మేళవింపు (కాహళం = బాకా) వినిపించును. హర్ష భరితులై శుభ ప్రదులైన సిద్దుల యొక్క బృందములచే నది మారుమ్రోయు చుండును. ఆ దారిని ప్రవేశమానంద భరితులకు భక్తులకు సర్వతీర్థ స్నానము జేసిన వారికి. పంచాగ్నుల సేవించిన వారికి పుణ్యతీర్థ యాత్రలందు కాలంజర పర్వతము లందు నగ్నియందు మరణించిన వారికి శత్రు నాశనము చేసికొన్న వారికి స్వామి (యజమాని) స్నేహితుడు లోకము గోపులు మొదలైన వాని రక్షణ కొరకు హతులైన శూరులకు తపోధనులకు పశ్చిమ ద్వారమున బ్రవేశ మీయ బడును.

ఆ నగరమునకు దక్షిణ ద్వారము మహా భయంకరము సర్వప్రాణి భయంకరము. హాహాకార మెత్తు చుండును. అంధకార బంధురము. సూదిమొన గల శిఖరములు ముళ్ళు తేళ్ళు వజ్ర కీటములు (కర్రల దొలుచు పురుగులు) వీనిచే నడు గిడుటకు వీలుండదు. తోడేళ్ళు పులులు నక్కలతో సింహములు పిల్లులు గ్రద్దలు కణకణ మండు ముఖములతో జరించు నా ద్వారమున సర్వాపకారులైన వారికి బ్రవేశము. గో బ్రాహ్మణ వృద్ధులను బాధలలో నున్న వానిని శరణు జొచ్చిన వానిని స్త్రీని మిత్రుని ఆయుధము చేతిలో లేని వానిని జంపిన వారికిది ప్రవేశ ద్వారము. పొందరాని గురు పత్ని మొదలైన స్త్రీలను బొందిన వారు మూఢులు పర ద్రవ్యాహారకులు దాచ నిచ్చిన వస్తువులు హరించిన వారు విషము బెట్టిన వాండ్రు నిప్పంటిన వారు పర భూ గృహశయ్యా వస్త్ర భూషణా పహరులు పరుల లోపములనే వెదకు క్రూరులు ననృత వాదులు గ్రామమునకు రాష్ట్రమునకు పురమునకు దుఃఖము కల్గించిన వారు అబద్ధ సాక్ష్య మిచ్చిన వారు కన్యల నమ్ముకొన్న వారు అభక్ష్య భక్షణ ప్రియులు కోడలిని కూతురును బొందిన వాడ్రు తల్లిని దండ్రిని కటువుగ మాట్లాడిన వారు మరి మహా పాతకులుగ చెప్పబడిన యెందరు దక్షిణ ద్వారమున యమపురము బ్రవేశింతురు.