బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

190 - కేశివధ నిరూపణమ్‌

అరిష్ట ధేనుకాది రాక్షసులు హతులుగాగా గోవర్ధ నోద్దరణము జరుగ నారదుండు సని కంసునకు యశోదా గర్భము మార్పు మొదలైన విశేషముల శేషము నివేదించెను. విని కంసుడు వసు దేవునిపై పగ బట్టెను. యాదవ సభలో యాదవులను దుయ్య బట్టి తనలో నిట్లా లోచించెను. బాలురైన బలరామ కృష్ణులను బలవంతులు కాకుండనే నేను వధింప వలయును. యౌవన మొందిన తరువాత వారసాధ్యు లయ్యెదరు. ఇక్కడ చాణూరుడు ముష్టికుడును. మంచి బలశాలురు. వీరితో నా బాలురకు మల్ల యుద్దము పెట్టి యా దుర్మదులను జంపెద గాక! ధనుర్యాగమను మిష పెట్టి వ్రేపల్లె నుండి వారల రావించి వారు గడ తేఱుట కెట్లెట్లు సేయ వలెనో యట్లు సేసెద. అని తలచి యా దుష్టు డొక నిశ్చయము నకువచ్చి అక్రూరునితో నిట్లనియె.

ఓ దానవేశ! నా ప్రీతి కొఱకు నీవిట నుండి రథమెక్కి గోకుల మేగుము. హరి యంశమున బుట్టిన వసుదేవుని కొడుకులను గొనిరమ్ము. వారలు నా చావునకు బుట్టి పెరుగు చున్నారు. ఈ చతుర్ధశి నాడు ధనురుత్సవమను మహా యాగము జరుగ గలదు. అందువల్ల యుద్ధమునకై యేర్పాటు జరుగును. నా కడ చాణూర ముష్టికు లను మల్లురు యుద్ధ కుశలురు. వారలతో నీ బలరామ కృష్ణులకు జరుగు యుద్దమును సర్వ లోకము జూచు గాక! కువలయాపీడ మను నేనుగు మావటీండ్ర కెల్ల మేటి యైన వానిచే దోలబడి యా యిద్దఱు శిశువులను మట్టుపెట్ట గలదు. వారిం జంపి వసుదేవుని నందునిం గూల్చి నా తండ్రి దుష్టుడగు నుగ్రసేనునిం జంపెదను. అటుపై గోపాలుర గో ధనములను గొల్ల గొట్టెదను. వారు నాకు శత్రువులు. నీవు దప్ప యీ యాదవు లందురు పరమ దుష్టులు. నాకు గిట్టరు. ఈ యందఱను గూడ జంపుటకు క్రమముగ నీతో నేను యత్నించెద. ఆ గొల్లలు గేదినెయ్యి పెరుగును కాన్కగ గొని నీ వెంబడిన వచ్చునట్లు నీవట్లట్ల నచ్చె జెప్పుము.

అని యిట్లాజ్ఞాపించ బడి మహా భాగవతుడు (భక్తా గ్రేసరుడు) మధు ప్రియుడు (మద్య ప్రియుడు) అగు నక్రూరుడట్లే యని కంస రాజునకు దెల్పి మధురాపురము నుండి బయలు వెడలెను.

అవ్వల గంసుని వాహనమగు గుఱ్ఱము రూపము గల కేశి యనువాడు కంస ప్రేరితుడై కృష్ణుం జంపనెంచి బృందా వనమునకు వచ్చెను. వాడు కాలి డెక్కలం ధరణీ తలముం జిమ్ముచు జూలు విదలలించి మేఘములు జెదరించుచు చంద్ర సూర్య మార్గము నాక్రమించి గోపకుల దరి కేతెంచెను. వాని సకిలింపును విని గోపాలురు గోపికలు భయమునం బెదరి పోయి గోవిందుని త్రాహిత్రాహి (రక్షింపు రక్షింపుము) అని శరణొందిరి.

హరియు నదివిని జలములతో నున్న మేఘము యొక్క గర్జనమట్ల గంభీరముగ నిట్లు పల్కెను. గోపకులార జడియ వలదు. గోప జాతి పరాక్రమము లోప మగును. అల్ప బలము రాక్షస బల భారముచే జిందులు ద్రొక్కుచు సకలించుచు నున్న ఈ పాడు గుఱ్ఱము వలన నేమగును. అని ఓ క్రూర! రా రా నేను గృష్ణుడను. పినాక పాణి(హరుడు) పూషుని (సూర్యుని) యొక్కవలె నీ యెల్ల పండ్లూడ గొట్టెద నని కృష్ణుడు వాని కెదురు నడచె.

వాడున్ను నోరుతెఱచి హరిపై కెగబడెను. తన నిండు భుజమును వాని నోటిలో దూర్చెను. దాన వాని పండ్లెల్లం దెలి మేఘవు దునుకు లట్లూడి రాలిపోయె. కృష్ణ బాహువు లోన కేగిన కొలది బంధువు లుపేక్షింప బెఱిగిన వ్యాధి యట్లూరక పెరిగి దవడలు బ్రద్దలయి నురుగులం తోడి రక్తముం గ్రక్కికొని వాడు సెలవులు విచ్చి కీలు కీలూడి వడి పాదములు చాచి విణ్ణూత్రములు విడుచుచు పుడమిపై బడెను. మఱియు ముచ్చెమటలు పోసి చచ్చువడి వాడు చేష్టలు దక్కెను. హరి బాహువుచే నోరు విచ్చిపోవ మహ రౌద్రాకారి యగు వాడు పిడుగు వడిన చెట్టువలె బెండై రెండై కూలెను. రెండు పాదములు పిరుదు తోక రెండుగా నై చెవి కన్ను ముక్కు నొక్కటి వంతుననై మొత్తము శరీరము రెండు ముక్కలై వాడు కూలబడెను. కృష్ణుడిట్లు కేశి సంహరము చేయ సంతోష బడిన గోపకులతో గూడుకొని శరీర మించుకయు నాయాస పడకుండ స్వస్థుడై నవ్వుచు నచ్చటనే యుందెను. గోపికలును గోపకులును గేశి హతు డగుట జూచి వింతబడి యనురాగ మనోహర ముగ బుండరీకాక్షుని గొని యాడిరి. కేశి హతు డగుట చూచి నారదుడంత మేఘముల నుండి వెలువడి వెవేగ వచ్చి మనసానంద భరితము గాగ కృష్ణునిట్లు గొనియాడెను.

బాగు బాగు జగన్నాథ స్వర్గ వాసులకు బీడ గల్గించు క్రేశిని లీలామాత్రముగ చంపితివి. ఈ యవతారమున నీ చేసిన లీలలు ఆద్భుతములు. దీన నా మనసు అశ్చర్యమును ఆనందమును జెందినది. ఈ హయాసురునకు నింద్రుడు దేవతలును హడలి పోవుదురు. వీడు విదిలించి సకలించుచు నాకసము వంకకు జూచిన వానిం జూచి దేవతలు హడలెత్తి పోవుదురు. కేశివధ సేసి నందున లో కమందీవు కేశవ నామమున గీర్తింప బడుదువు. నీకు మంగళ మగుగాక. వెళ్లు చున్నాను. కంసుని తోడి యుద్దమున నెల్లుండి నిన్ను గలిసి కొందును. ఉగ్రసేనుని కొడుకు కంసుడు సపరివారముగ గూలగనే నీవు పృథివీ భారహర్త వగుదువు. అక్కడ రాజుల తోడి యుద్దము లనేకములు నాకు దర్శనీయము కాగలవు. ఓ జనార్దన గోవింద నేను వెళ్లి వచ్చెదను. దేవ కార్యము చాల గొప్పగ జరుప బడినది. నీచే నేను గారవింప బడితిని. నీకు శుభమగు గాక

యని నారదుడేగ కృష్ణుడు గోపకులతో గోపికలు తమ నయనము లచే దన లీలా సౌందర్య పానము చేయు గోకులమున బ్రవేశము చేసెను.