బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
187 - రామ కృష్ణ కృత బహువిధ లీలా వర్ణనమ్
గర్దభా సురుడు తమ్ములతో హతుడైన దరువాత గోపీ గోపాల బృందమునకు దాళ వనము చక్కని విహార స్థాన మయ్యెను. బలరాములు లేగొమ్ములు గల వృషభము లట్లా గోప సమాజమున రాణించిరి. ఆల మందలను దూర దూరములకు దోలికొని పోయి వానిని రకరక ములైన పేరులం బిలుచు చుండిరి. లేగల పలుపులను భుజము లందు వైచుకొని వన మాలలు దాల్చి సువర్ణాంజన చూర్ణముల చేత మెరయు వలువలం దాల్చి యింద్ర ధనస్సు లట్లు తెలుపు నలుపు మోఘము లట్లు గన వచ్చుచు విచిత్రములైన జాతీయము లయిన యాట లాడుచు విహరింప జొచ్చిరి. సర్వలోక నాథులు నందరకు దిక్కై యవనిం జొచ్చి మనుష్య ధర్మా భిరతులై మానవత్వమును సమ్మానించుచు మానవజాతి కనుగుణ మైన యాట లాడుచు నా వనమున గ్రీడించిరి. మఱియు తూగు టుయ్యా లలూగుచు కుస్తీ మొదలైన జిన్న చిన్న యుద్దము లందల పడుచు నుండీల బద్దలు గొని మీదికి రాళ్ళు విసరుట మొదలగు విచిత్ర వ్యాయామములను వినోదించు చుండిరి.
అంతట ప్రలంబాసురుడు గోప వేషమున మాటువడి యా గోపకుల నడుమ బ్రవేశించెను. అవకాశము వెదకుచు నా బలరామ కృష్ణులను నప్పట్టున సంహరింప దలచెను. ఒండొరులను భుజముల నెక్కించుకొని మోయుట యనునొక వింత యాటకు జొచ్చి బలరాములతో దలపడెను. శ్రీదాముడను గోపకునితో గృష్ణుడు ప్రలంబునితో బలరాముడు మఱి గోపకులతో గోపకులు నెగిరి యెగిరి యయ్యాటలో వినోదించిరి. కృష్ణుడు శ్రీదాముని బలరాముడు ప్రలంబుని నోడించిరి. కృష్ణుని వైపు గొల్ల లెదిరి గొల్లలను గెలిచిరి. ఓడిన వారోడని వారిని భాండీర స్కందము దాక మోసికొని పోయి తీసికొని రావలెనను బందెము వెట్టి యాడుకొన జొచ్చిరి. ఆ దానవుడు తానే యోడినట్లు నటించి మబ్బులో నున్న చంద్రునట్లు తాను బలరాము నెత్తుకొని పోవుచు నా బరువు మోయ లేనట్లు వర్ష మేఘమట్టి తన కాయమును బెంచెను. బలరాముడు కార్చిచ్చున గాలు పర్వత మట్లు పూలమాలలు వ్రేల దలపై కిరీటము దాల్చి బండి చక్రముల బట్టి మిడి గ్రుడ్లతో రౌద్రకారుడై పాదము లతాకిడిచే భూమి యదర దనను మోసికొని పోవుచున్న వానిని గని కృష్ణా! పెద్దకొండ వలెనై మాయా గోపాల రూపముతో రాక్షసుడే యొకడు నన్ను మోసికొని పోవు చున్నాడు. వీడు పరమ దుర్మార్గుడు. ఇప్పుడు నేనేమి చేయవలెనో దెలుపు మన గోవిందుడు చిరునవ్వునం బెదపులు తెరువ బడ బలరాముని బల పరాక్రమము లెరిగిన వాడు కావున నిట్లనియె.
సర్వాత్మకుడు సర్వ రహస్యము లకు రహస్యము నైన నీవు మానవ రూపము ధరించుట వినోదార్థము. ఒకానొక కారణమున నాకు నన్నవై యశేష జగత్ర్పభు వైన నీవు సర్వ కారణమైన నీ స్వరూపమును దలచు కొనుము. జగమెల్ల నేకార్ణవమై నపుడు నీవును నేను నుంగలిసి యేకైక పరబ్రహ్మ మగుటయు, నీ జగము నిలుపుటకు వేరగుటకు వేరగుటయు సత్యము. కావున తన్ను దానెరిగి యీ దానవుని సంహరింపుము. మానుష భావమిట్లు పూని మన వారికీ బంధువులకు హితవు జేయుము.
ఇట్లు కృష్ణ భగవానునిచే జ్ఞప్తి చేయబడి హలి యల్లన నవ్వి ప్రలంబుని బట్టియెత్తి కోపముచే కన్ను లెర్రబడ బిడికిట వాని నడి నెత్తిపై గ్రుద్దెను. ఆ దెబ్బతో వాడు కనుగ్రుడ్లు వెలికి జన తల పగిలి నోట రక్తము గ్రక్కికొని భూమిపై బడి మృతి నొందెను. అద్భుతమైన బలముచే బలుడట్లు ప్రలంబుని గూల్ప గోపకులు బాగు బాగని యానంద భరితులై రాముని స్తుతించిరి. అవ్వల గోపకులతో కృష్ణునితో బలరాముడు గోకులమున కేతెంచెను.
రామ కేశవు లట్లు విహరించు చుండగ వర్ష ఋతువు గడచి తామర పూలు వికసింప శరద్దృతువు వచ్చెను. ఆకాశము స్వచ్ఛమై నక్షత్రములు కాంతులం జిమ్మ జక్కని యా సమయ మందు వ్రేవల్లె జనము ఇంద్రోత్స వారంభము సేయ గుతూహల పడుట చూచి కృష్ణుడు పెద్ద వాండ్రతో ముచ్చటగ ఈ యింద్రోత్సవ మనగా నేమి? దీనికి మీరింత యానంద పడుటకు గారణ మేమి యని యడుగ నందు డతనితో నిట్లనియె.
మేఘములకును జలములకును దేవేంద్రు డధిపతి. అతని ప్రేరణముచే జల రూపమున సర్వప్రాణ ధారక మయిన రసము నవి వర్షించును. ఆ వర్షముచే బండిన పంటను మనము మఱి యితర ప్రాణులు. దిని బ్రతుకుదుము. దేవతలను దానిచే దృప్తి పరుతుము. ఆవులు పాలిచ్చును. లేగ తలతో నవి వాన వలన గల్గిన సస్యము సంతృప్తి వడును. సస్య సమృద్ధి పచ్చిక (మేత) సమృద్ధి మేఘ నిమిత్తమే. సకాలమున వర్షించు మేఘములు గలచోట నాకలి కలమటించు జన ముండదు. సూర్య కిరణముల చేత మేఘ మీ భూమి యందలి యుదకమును జేకొని ధరించును. సర్వలోక జీవనమునకు భూమిపై నది వర్షించును. అందు వలన వర్షఋతువు నందెల్ల రాజులు సంతోషముతో నీ యుత్సవము నందు దేవేంద్రుని గొలుతురు. మనము మఱి యెల్ల జీవులు నమర పతిని గొలుచుటయు నందులకే. అని తెలుప నందుని మాట విని యింద్రుని బూజించు విషయమున కృష్ణుడు దేవేంద్రునకు గోపము గలుగ నిట్లనియె.
మనము కర్షకులము గాము. వర్తక మును జేసి జీవించు వారము కాము. గోవులే మనకు దైవము. వనము నందు సంచరింతుము. ఆన్వీక్షకి త్రయీ వార్తా (వర్తకము) దండనీతి అని విద్య నాల్గు విధములు. వీనిలో వార్త యనగ వ్యవసాయము వాణిజ్యము పశు పాలనము నను పేర మూడు వృత్తులు చెప్ప బడినవి. కర్షకులకు గృషి పణ్య జీవులకు (వర్తకులకు) వర్తకము వృత్తులు మన కన్ననో గోపాలనము ముఖ్య వృత్తి. ఈ విధముగ వార్త యనునది మూడే తెఱంగుల చెప్పబడినది. ఎవ్వడే విద్యను నేర్చునో యదే వానికి పరమ దైవము. అదే పూజింప దగినది ఆరాధింప దగినదియు అదే వాని కుపకారము కూడ. ఒకదాని ఫలము అనుభవించుచు వేరొక విద్యను బూజించు వాడు ఇహపరము లందు శుభ మందడు. ప్రసిద్ధమైన మన హద్దులను (ఆవుల దొడ్లను) బూజింతము. వాని కన్నిటికి హద్దు గానున్న వనమును బూజింతము. వనములకు బరమావధు లైన కొండలు మనకు పరమ దైవములు. కావున గిరి యజ్ఞము (కొండ దేవతల పూజ) గో యజ్ఞము (గో పూజ) మనము కావింతము. ఇంద్రునితో మనకేమి పని? గోవులు కొండలు మనకు దేవతలు. విప్రులు మంత్ర యజ్ఞ పరులు. మంత్రా నుష్ఠానమే వారికి యజ్ఞము. కర్షకులకు యజ్ఞము నాగలి. కొండ లందును అడవు లందు నుండు మనకు గొండలను గోవులను గొలుచుటే యజ్ఞము (పూజ). కావున తామందరు రకరకము లైన పూజా ద్రవ్యములచే బశువును బలియిచ్చి యథా విధిగ గోవర్ధన గిరి నర్చింపుడు. వ్రేపల్లెలో నున్న సర్వ సంభారములను జేకొనుడు ఆలోచింప వలదు. ఆ సామాగ్రిచే విప్రేలకు మఱి యన్నార్దులకు సంతర్పణము జేయుదుము గాక! ఆ అర్చింప బడిన కొండ నుద్ధేశించి హోమములు సేసి ద్విజులకు సంతర్పణము సేసిన తరువాత శరద్దృతువు నందలి పూలను శిరముల దాల్చి మన యావుల మందలె వ్రేపల్లెకు మరలును గాక! ఇది నామతము. దీనిని బ్రీతితో జేసిన యెడల గోవులకు బ్రీతి గల్గును. గోవర్ధన గిరికిని నాకును కూడ సంతోష మగును. అని తెలుప గృష్ణుని పలుకులు విని నందాదు లందరు సంతోషముచే మోములు విప్పార బాగు బాగని వత్సా! నీ యభిప్రాయము పరమ శోభనము. నీ చెప్పిన మాట నేమను సరింతుము ఈ గిరి యజ్ఞము సాగింప బడుగాక! యని ప్రజ వాసులెల్లరు పెరుగు పాయసము మాంసములతో గొండకు బలి యిచ్చిరి. నూర్లు వేలుగ విప్రులకు విందులు సేసిరి. అట్లు కొలువ బడిన యా గిరికి గోవులు ప్రదక్షిణము సేసినవి. నజల జలదము లట్లు వృషభములు రంకెలు వేయుచు గిరిప్ర దక్షిణము సేసెను. గోవిందుడు కొండ నెత్తమున గూర్చుండి నేనే మూర్తి ధరించిన కొండ దేవతనని యా గోప శ్రేష్టులు గొనివచ్చి నివేదించిన పలు తెరంగులైన యన్నముల నారంగించెను. మఱియు నదే రూపమున కృష్ణుడు గిరి శిఖరమున కెక్కి యది తన రెండవ మూర్తిగ బూజించెను. తరువాత నతడంతర్థానము కాగ యతని వనల గోపకులు వరములం బొంది యిట్లు గోవర్ధ నోత్సవము సేసి తమతమ గోష్ఠములకు (గోశాలలకు) తరలి వచ్చిరి.
