బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

49 - కారుణ్యస్తవ వర్ణనమ్‌

వాసుదేవా! మోక్ష కారణ! జన్మ సంసార సాగరము నుండి రక్షింపుము. అచ్చమైన ఆకాశము వంటి వాడవు నిర్లేపుడవు. (గుణ సంగము లేనివాడ వన్నమాట) ఈ స్తుతి పారాయణ నారాయణ నామావళి. బలరామాది వివిధ మూర్తు లన్నియు నీవే వేఱు వేఱుగా ననిపించు చున్నవి. గరుడుడు శంఖ చక్రాదులు దిక్పాలురు కేశవాది రూపము లన్నియు నీ యవయవములే.

జగన్నాథ! నీ ఆ స్వరూపము లన్నిటి నర్చించితిని. నీ సంకర్షణ అనిరుద్ద ప్రద్యుమ్నాది మూర్తులను నేను కీర్తించితిని. నిన్నేక రూపుని భిన్న రూపుల బేర్కొందురు. ఔప చారికము. అద్వైతుడ వైన (ఏకైక వస్తువైన) నిన్ను ద్వైతునిగా బేర్కొనుట యెట్లు పొసగును? హరీ! నీవు చిత్స్వరూపమున (కేవలము జ్ఞానమై) వొక్కడివై సర్వము వ్యాపించి యున్నావు. నీ పరమ రూపము భావాభావ వర్జితము. ఉనికి మనుకులు లేనిది. కూటస్థము సర్వసాక్షి అచలము ధ్రువము. నామ రూపములు గల దానికి ఉపాధి యని పేరు. నీ రూపముపాధి విడిచినది. కేవలము సత్తా మాత్రము. దానిని దేవతలే యోఱుగరు. నేనట్టె ఱుంగుదును? పీతాంబర ధారి చతుర్బుజము. శంఖ చక్ర గదా పాణీ కిరీటము భుజ కీర్తులు. ధరించిన శ్రీవత్స వక్షము వనమాలా భూషితము నైన నీ మఱొక మూర్తిని (అర్చా మూర్తిని) దేవతలు నీ భక్తులు నర్చింతురు. ప్రభూ రక్షింపుము నేను శరణొంద నీకంటె మఱి యొక్కని గానను. కర్మపాశ బద్దుడనై సంసార సాగరమునం బడి కొట్టుకొను మాయా మోహమున బడిన వానిని నుద్ధరింపుము.

నానా యోనులం బుట్టి నానా కష్టముల నను భవించితిని. సాంగము లైన వేదములను శాస్త్రములను జదివితిని. కళలను శిల్పములను నేర్చితిని. సుఖాలు దుఃఖా లెన్నో యను భవించితిని. సంతోషా సంతోషములు సంచయా ప్రచయములు (కూడ బెట్టుట పో బెట్టుట) పుత్ర మిత్ర కళత్రాదులు తలిదండ్రు లన్నదమ్ముల కలయికలు ఎడబాటు లెన్నో నాకైనవి. విణ్మూత్రముల రొంపిలో (ఆడుదాని గర్భములో) నే నిరికి కొన్నాను. మహా దుఃఖము లందినాను. బాల్య కౌమర యౌవన వార్ధక్యాది దశలం దంతులేని వంత లొందినాను. మరణ మంది యమ మార్గమున నరక మందు పలు యాతనలు పడినాను. కృమి కీటకాదులు పలు మృగ ములు పక్షులు పలు పశువుల బ్రాహ్మణాది శూద్రాంత యోనులందు ధనికులు దరిద్రులు రాజులు రాజర్షులు రాజ సేవకులు మఱి పెక్కు దేహుల గేహములందు మఱల మఱల బుట్టితిని గిట్టితిని.

పెక్కు మంది దాసులకు దాసుడ నైతిని. దరిద్రుడ నైతిని. రాజులకు రాజ నైతిని. భిక్షకులకు భిక్షకు డైతిని. ఒరులకే నిచ్చితిని. ఒరుల కడ దీనుడనై నేను చెయి సాచితిని. ఒరులచే నేబడితిని. నాచే నొరు లెందఱో పడిరి. తండ్రులు తాతలు మిత్రులు భ్రాతలు పుత్రులు కళత్రముల కొఱకు సిగ్గు విడిచి దైన్యము వెళ్ళబోసి కొన్నాను. పశు పక్ష్యాదులలో చరాచర ప్రపంచము నందు దిగులు గడిచి నేను బోయి యీడిగిల బడని చోటన్నది లేనే లేదు. నరక మెప్పుడో స్వర్గ మెప్పుడో వసుధ యైప్పుడో పశు పక్ష్యాదు లందెప్పుడో నాయునికి యెప్పు డెక్కడో యెఱుగను. నీరు తోడు యంత్ర చక్రమున త్రాటితో గట్టిన కుండ నోకమారు క్రిందికి నొకసరి మీదికి నొకపరి నడిమికి వచ్చిన విధమున భైరవమైన యీ సంసార చక్రమున చిరకాలము పరిభ్రమించు చున్నాను. ఈ తిఱుగుడున కంతు గాన కున్నాను. ఇంద్రియుములు వ్యాకులములై యిప్పుడు నేనేమి సేయ వలెనో దెలియ కున్నాను. శోకము తృష్ణకు (ఆశకు) జిక్కినేను మతివోయి కాందిశీకుడనై (భ్రాంతుడనై = భయముచే నట్టిట్టు పరుగు లెత్తు వాడనై) దేవా! ఇప్పుడు నేను విహ్వలుడనై (తపనచే అవయవములు పట్టుతప్పి) బెగ్గలించుచు విలవిల దన్ని కొనుచు మ్రగ్గుచు విరవిర వోవుచు) నిన్ను శరణందు చున్నాను. కృష్ణా సంసార మందు మునిగి పోయిన నన్ను కాపాడుము. జగన్నాథ నన్ను భక్తుడని యను కొందువేని నా యెడ దయ సూపుము. నన్ను గురించి యాలోచించు బంధువు నీకంటె నాకు లేడు. నిన్ను నా నాథునిగ (దిక్కుగ) బొందితిని. మఱి నాకెక్కడను బ్రతుకున జావున యోగమున క్షేమమున నే భయముండదు. అగద్దాతయైన కేశవు నందు భక్తి కలుగని వారికి నిన్ను యధావిధిగ సేవింపని వారికి నరాధములకు సంసార బంధము నుండి సుగతి(విముక్తి) యెట్లగును?

కులముతో శీలముతో విద్యతో బ్రతుకుతో బని నేమి? ఎవరు మోహ వశులై నిను నిందింతురో వారాసుర ప్రకృతిలో నుండి మఱల మఱల పుట్టుచు ఘోర నరక మందు బడు చుందురు. నీ దూషణము సేయువాండ్ర కా నరకము కంటె మఱి ప్రాయశ్చిత్తము లేదు. నా ప్రారబ్దమును బట్టి యెందెందు నాకు జన్మము గల్గునో యందందు నీ యందు నాకు దృఢభక్తి యెల్లపుడు గల్గు గాక! నిన్నా రాధించి సురాసురులు నరులను మనసు నిమిడించు కొని పరమ సిద్దినందిరి. నిన్నెవ్వడు పూజింపడు? బ్రహ్మదు లేని వొగడ లేని ప్రకృతి కంటే పరుడైన నిన్ను మానుష బుద్దిని నేనెక్కడ బొగడ గలను. అయినను దెలియని తనముచే నా చేత వినుతుడ నైతివి. నాయెడ దయగల దేని దీనికి నన్ను క్షమింపుము. సాధువులు మహానుభావులు నపరాధుల యెడం గూడ క్షమ సేయుదురు. భక్త వాత్సల్యము ననుసరించి దేవేశ్వర! నాయెడ బ్రసన్నుడ వగుము. భక్తి భరిత చిత్తమున నుతించితింగాన నే చేసిన పూజ యెల్ల సాంగమగును గాక! వాసుదేవ! నమస్కారము.

ఇట్లాతనిచే బొగడ బడి గరుడ ధ్వజుండు ప్రసన్నుడై యాతడు మనసా రనేది కోరె నది యెల్ల యిచ్చెను. దినదిన మెవ్వడు పూజించి హరి నీ స్తోత్రముచే వినుతించు నతడు నిక్కముగ మోక్ష మందును. ఈ స్తోత్ర వరము నెవ్వడు తెలిసి (అర్థ మెఱిగి) త్రిసంధ్యము శుచియై జపించునో ఆ నరుడు ధర్మ అర్థ కామ మోక్షములను బోందును. దీని జదివిన విన్న వినిపించిన యాతడు పాపము లెడని శాశ్వతమైన విష్ణులోక మందును. ధన్యము పాప హరము భుక్తి ముక్తి దముశివము(మంగళము) గుహ్యము (రహస్యము) సుదుర్లభము పుణ్యము నైన యీ స్తుతి నెవ్వనికి బట్టిన వానికీయరాదు. నాస్తికుడు మూర్ఖుడు కృతఘ్నుడు మాని (నే నే ఘనుడు నను కొనువాడు) దురాలోచనుడు (దుష్ట జ్ఞానము గలవాడు) అభక్తుడు కెప్పుడును దీని నీయరాదు. భక్తుడు గుణ వంతుడు శీలవంతుడు విష్ణు భక్తుడు శాంతుడు శ్రద్దతో ననుష్ఠానము సేయు వాడునైన వారికిది సర్వాఘ విఘాతుకము సుఖ మోక్షదము అశేష వాంచా ఫలదము వరిష్ఠము నైన “కారుణ్య”మను పేరుగల యీ పురుషోత్తమ స్తోత్రమును నేను జెప్పితిని. విశుద్దు లెవ్వరాసునూక్ష్మ వస్తువైన మురారిని పురాణ పురుషుని నిచ్చలు ధ్యానింతురో వారు ముక్తులై మంత్రములచే యజ్ఞాగ్ని యందు హోమము సేయబడిన యాజ్యము వలె హరిం బ్రవేశింతురు. అతడొక్కడే దైవము సంసార దుఃఖ హరుడు పరుడు పరాత్పరుడు, అంతకంటె మఱి యెందులేడు.

ఆ కృష్ణుడు ద్రష్ట (సర్వసాక్షి) పాత (రక్షకుడు) నాశ కర్తయు సమస్త సారభూతుడు జగద్గురువు మోక్ష సుఖ ప్రదాతయు నగును. కృష్ణు నందె వరికి ఇహ మందు భక్తి కలుగదో వారికి విద్యచే నేమి? గుణముల నేమి యజ్ఞములను దానముల నుగ్ర తపముల నేమి ప్రయోజనము? ఎవనికి బురుషోత్తము నందు భక్తి యుండు నాతడు లోక మందు ధన్యుడు. అతడు శుచి అతడు విద్వాంసుడు. సుఖములతో తపస్సులతో గుణములతో నతడు శ్రేష్ఠుడు. జ్ఞాని దాత యతడే సత్యవక్త.