బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

10 - సోమ వంశ వర్ణనమ్‌

ఓ ముని శ్రేష్ఠులారా! బుధుని కుమారుడు పురూరవుడు. విద్వాంసుడు, తేజశ్శాలి, దాత, విపుల దక్షిణ లిచ్చిన యజ్వ. బ్రహ్మవాదీ యుద్ధము నందు శత్రువుల కందని వాడు. నిత్యాగ్నిహోత్రి, యజ్ఞకర్త. మహీపతి సత్యవాది, పుణ్యమతి, నిగూఢ మైథనుడు, ముల్లోకము లందు అనుపమ కీర్తిశాలి. అట్టి వానిని బ్రహ్మ వాదిని (వేదాధ్యయన రతుని) శాంతుని ధర్మజ్ఞుని సత్య వచనుని యశస్విని యగు ఊర్వశి అభిమానము (గుట్టు) విడిచి వరించెను.

బ్రాహ్మణులారా! ఆ రాజు ఊర్వశితో గూడి చైత్ర రథమను సుందర వనమందు పది సంవత్సరములు, మందాకినీ నదీ తీరమున నైదు సంవత్సరములు, అలకాపుర మందు ఆరు సంవత్సరములు, బదరీ పురము నందు అయిదు సంవత్సరములు, నందన వనమునం దేడు సంవ్సతరములు, మనోహర ఫల వృక్షములతో గూడిన ఉత్తర కురు దేశము నందెనిమిది సంవత్సరములు, గంధమాదన పర్వతముపై పది సంవత్సరములు సుమేరు పర్వతోత్తర భాగమున నెనిమిది సంవత్సరములు నివసించెను. ఈ ప్రధాన వనము లందును, దేవతల క్రీడా స్థానము లందును, ఊర్వశితో గూడ నారాజు పరమ హర్షమున క్రీడించెను. ఇలా పుత్రుడగు పురూరవుడు పవిత్ర తమము మహర్షులచే స్తుతింప బడినదియు నగు ప్రయాగ క్షేత్రము నందు రాజ్యము నేలుచు మహా ప్రభావశాలి యగు నరశ్రేష్ఠుడై యొప్పెను.

ఆ ఇలుని (పురూరవుని) కుమారు లేడుగురు. దేవ కుమా రోపములు, గంధర్వ లోక ప్రసిద్దులు. ఆయువు ధీమంతుగు అమావసువు ధర్మాత్ముడగు విశ్వాయివు, శ్రుతాయివు, దృఢాయువు, వనాయువు, బహ్వాయువు నను వారూర్వశికి జనించినారు. అమావసు పుత్రుడు రాజరాజగు ఖీముడు. వాని కొడుకు శ్రీమంతుడగు కాంచనప్రభ నామ ధేయుడు. వాని తనయుడగు సుహోత్రుడు బలశాలి, విద్వాంసుడు. వాని తనయుడు. జహ్నువు కేశిని కుమారుడు.

అతడు సర్ప మేధమను మహా యాగమను, అచరించెను. గంగ వతి లోభముచే నతని బతిగ వరించి యభి సరించెను. అతని యంగీకారము లభింప యజ్ఞ సదస్సును ముంచెత్తెను. యజ్ఞ వాటము నట్లు ముంచుట జూచి సుహోత్రుని కుమారుడు ఆ జహ్నువు క్రుద్ధుడై “నీ జతనమిది విఫల మొనరింప నిదిగో నీ నీటినెల్ల ద్రావెదను. నీ గర్వమునకు ఫలమిపుడే యను భవింపు మని శపించి అతడెల్ల గంగను ద్రావి వైచెను. అవ్వింతగని మహర్షు లాతనికి అభ్రాపగను గన్న కూతురి గావించిరి. దాన నామె జాహ్నవి యయ్యె.

యువనాశ్వుని పుత్రి యగు కావేరిని జహ్ను మహర్షి పరిణయ మాడెను. యువనాశ్వు డిచ్చిన శాపముచే గంగలో నర్దాంశ మయి ఏతెంచి జహ్ను భార్య, సరిద్వర యగు కావేరిలో కలసెను. జహ్నుడు ధర్మ పరుడయిన సునద్యుడను కుమారుని కావేరి యందు బడెసెను. వాని కుమారుడు అజకుడు. వాని బిడ్డడు బలాకాశ్వుడను రాజు. మృగయా భిరక్తుడగు కుశుడు వాని కొడుకు. వాని కుమారులు దేవ వర్చస్కులు నల్వురు. 1) కుశికుడు, 2) కుశనాభుడు, 3) కుశాంబుడు, 4) మూర్తిమంతుడను వారు. పల్లవులతో నిరంతరము పెంపు వడసి వనచరుడై కుశికుడు ఇంద్ర తుల్యుడైన కొమరునిం గోరి తప మెనరించెను.

అతనికి బెదరి వేయేండ్లు ముగియగా నుగ్ర తపమ్మున యాఱేనింగని పుత్రునీయ సమర్థుండయ్యు తాన యాతనికి పుత్రు డాయెను. కుశికు పుత్రుడగు ఇంద్రుడే గాధియను రాజాయెను.

కుశికుని భార్య యగు పౌర యందు గాధి పుట్టెను. గాధి కుమార్తె సత్యవతి. మహానుభావు రాలు. గాధి రాజామెను సక్రుని పుత్రుడగు ఋచీకుని కిచ్చెను. అమె యెడగల ప్రీతిచే భార్గవుడు (ఋచీకుడు) గాథికి (మామ గారికి) కుమారుడు గలుగ వలెనని యజ్ఞమున చరువును సాధించి యిచ్చెను. ఋచీకుడు తాన భార్య సత్యవతి బిల్చి ఈ చరువుగు నీవును మీ అమ్మయి స్వీకరింపుడు అమె యందు దీప్తిగల క్షత్రి యోత్తము డుదయించును. క్షత్రియుల కతడ జయ్యుడు క్షత్రి యాంతకుడును కాగలడు. కల్యాణీ! నీవీ రెండవ చరువు సేవించి నంతట ధృతి మంతుడు తపో ధనుడు శాంతడు నైన ద్విజ శ్రేష్ఠుడు దయించును. అని పలికి దపో నిరతుడై యరణ్యముం బ్రవేశించెను.

గాథియు నింతితో నప్పుడు ఋచీకు నాశ్రమమున కేగెను. తీర్థయాత్రా ప్రసంగమున కూతుం జూడ ఆ రాజు జామాతృన గృహంబున కేతెంచెను. సత్యవతి యా రెండు చరువులను గైకొని తల్లికి నివేదించెను అ తల్లి దైవ వశమున తాను దై కొన వలసిన చరువును కూతురున కిచ్చి అమెకీయ దగిన దానిని తాను గైకొనెను. అటుపై సత్యవతి సర్వక్షత్రి యాంతక తేజముం గర్భమున దాల్చిన కతన ఘోరమైన యాకారముతో గన నయ్యెను. ఋచీకు డా యింతింగాని యోగ దృష్టిచే గ్రహించి ద్విజ శ్రేష్ఠుండాతడు భార్యంగని కల్యాణీ! చరు వ్యత్యాసము చే మీ అమ్మచే నీవు వంచింప బడితివి. నీకు క్రూర వర్తనుడు అతి దారుణుడునగు తనయుడు దయించు వానికి భ్రాత బ్రహ్మణ్యుడు తపోధనుడు గల్గును. తపస్సుచే నేనీ యెల్ల బ్రహ్మమును వాని యందర్పించితిని. అన విని సత్యవతి నీ వలన నాకిట్టి క్రూర కర్ముడు బ్రాహ్మణా వసదుడు కొడుకుగా వలదనిన ఋచీక ముని యిట్లనియె.

కల్యాణి! నేనిట్ల కావలయు నని సంకల్పింప లేదు. పితృ మాతృ నిమిత్త మున దనయు డుగ్ర మూర్తి కాగలడు. ఇది విని మరల సత్యవతి యిట్లనియె. నీవు, తలచిన లోకములను సృజింప గల వాడవు. కొడుకు నిచ్చు మాట తెక్కేమి శమాత్మకుని ఋజు స్వభావుని పుత్రుని నాకనుగ్రహింపుము. ఇది వేరొక విధముగ జేయ వలను పడటేని మనకు దయింప గల మనుమడు మీరన్నట్లు క్రూరమూర్తి యగునట్లను గ్రహింపుడని భర్తను వేడు కొనెను. అది విని యమ్ముని తపో బలమున నట్ల యగుగాక యని యనుగ్రహము సేసెను. మరియు సుందరి పుత్రు నందును పౌత్రు నందును నాకు భేదము లేదు. నీవెట్లంటి వట్టే యగుట నా యభిమత మని యామెనా తపస్వి లాలించెను. అవ్వల సత్యవతి భార్గవునిం గుమారునిం గనెను. అతడే తపో నిరతు డతిదాంతుడు శాంతుడు నగు జమదగ్ని ఈ భృగు వంశమంద వతరించెను. పుణ్యురాలు సత్యవతి సత్యధర్మ పరాయణ కౌశికియను బేర మహా నదియై ప్రవర్తిల్లె.

ఇక్ష్వాకు వంశజుడు రేణువను రాజు కూతురు కామలి యను పేరుగలది (రేణుక) మహానుభావురాలు. అమె యందు తపోవిద్యా సమన్వితుడు ఆర్చీకుడు (జమదగ్ని) భయంకరుడైన జామదగ్న్యుని (పరుశు రాముని) గాంచెను. అతడు సర్వ విద్యా పారంగతుడు ధనుర్వేద విశారదుడు క్షత్రి యాంతకుడు ప్రజ్వలి తాగ్నివోలె నుండెను. పరశురాము డా జమదగ్ని తపో వీర్యమున జన్మించెను. మధ్యముడు శునశ్శేపుడు కనిష్టుడు శునఃపుచ్చుడు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి సముడై బ్రహ్మయు నయ్యెను. విశ్వరథుడనియు నాయనకు బేరు. విశ్వామిత్రుని కుమారులు దేవరాతుడు మొధలయిన వారు. విఖ్యాతులు. దేవరాతుడు. కలి యాయన సంతతియే కాత్యాయనులు. శాలావతి యందు హిరణ్యాక్షుడు రేణువు. రేణుకుడు సాంకృతి గాలవుడు ముద్గలుడు. మధుచ్చందుడు జయుడు, దేవలుడు కచ్ఛపుడు, హారితుడు ననువారు జనించిరి. కౌశికుల గోత్రములు ప్రఖ్యాతి చెంది యున్నవి. పాణినులు, బభ్రవులు, ధ్యానజప్యులు, దేవరాతులు, శాలంకాయనులు, బాష్కలులు, లోహితులు, యమ దూతలు, కారూషకులు నను వారు కౌశికులు, పౌరవుడను బ్రహ్మర్షి యొక్కయు కౌశికుని యొక్కయు వంశ మందు బ్రహ్మక్షత్ర సంబంధము ప్రసిద్ద మయ్యెను. విశ్వామిత్రుని కొడుకులలో శునఃశేపుడు పెద్దవాడు. భార్గవుడు కొశికత్వముం బడసిన వాడు. శునఃశేవుడు హరిదశ్వుని యజ్ఞ మందు పశువుగా విని యుక్తుడయ్యె. దేవత లాతనిం దిరిగి విశ్వామిత్రునకు క్షేమముగ నిచ్చిరి. దేవతలచే నీయబడిన వాడగుటచే దేవరాతు డనియు పేరొందె. దేవరాతాదు లేడ్వురు విశ్వామిత్రుని కుమారులు. దృషద్వతి సుతుడు అష్టకుడును వైశ్వామిత్రుడే అష్టక కుమారుడు లౌహి. జహ్ను ముని గణము నాచే చెప్ప బడినది ఇటుపైని అయువు యొక్క వంశమును చెప్పెదను.