బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
19 – జంబూ ద్వీప వర్ణనమ్
సముద్రమున కుత్తరమున హిమాలయమునకు దక్షిణమున భారత వర్షము గలదు. అందలి సంతతి “భారతి” యన బడును. ఇతి తొమ్మిది వేల యోజనముల వైశాల్యము గలది. కర్మ భూమియని దీనికి పేరు. కోరిన వారికి స్వర్గము, మోక్షమును గూడ నిందే యున్నవి.
ఇందు మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋక్షము, వింధ్యము, పారియాత్రము లను సప్తకుల పర్వతము లున్నవి. భారత వర్షము నుండియే స్వర్గ మోక్షముల జీవులు పొందుదురు. పశు పక్ష్యాది జన్మములను నరకమును గూడ నిట నుండియే పొందుదురు. ఆవాంతర కర్మఫలము స్వర్గము పర్యవసాన మందాత్యంతిక ఫలమైన మోక్షము గూడ ఇట నుండియే మానవుడు పొందును. ఈ భూ మండల మందిక్కడనే కర్మానుష్ఠానము విధింప బడినది. అందు చేతనే దీనికి కర్మ భూమియను పేరు సార్ధకము.
భారత వర్షమున తొమ్మిది ద్వీప విభాగము లున్నవి. ఇంద్ర ద్వీపము, కశేరువు (కశేతు మంతమని కూడ యందురు) తామ్రపర్ణము, గభస్తి మంతయు, నాగ ద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము. ఈ భారత ఖండ మందు తొమ్మిదవది. సముద్ర సంవృతము ఇది దక్షిణ దిశ నుండి యుత్తర దిక్కుకు వేయి యోజనములు. తూర్పున కిరాతులు, పడమట యవనులు, నడుమ బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నుందురు. యజన యాజనములు. యుద్ధము వాణిజ్యము కృష్యాదులు వృత్తులు క్రమముగా వీరికి విహితములు,
హిమవత్పర్వత ప్రత్యంత పర్వతము నుండి శతద్రు (సట్లజ్) చంద్రభాగ వేదము, స్మృతి మొదలయిన నదులు ప్రవహించు చున్నవి. నర్మద, సురస మొద లయినవి వింధ్య గిరి నుండి వెడలు చున్నవి. తాపి, పయోష్ణి నిర్వింధ్య, కావేరి మొద లయినవి ఋక్ష పర్వత పాద మందు జనించి నవి, గోదావరి, ఖీమరధి, కృష్ణవేణి మొదలగునవి సహ్యగిరి పాద మందు బుట్టినవి. కృతమాలా, తామ్రపర్ణీ ప్రముఖములు మలయాద్రి సంభవములు. త్రిసాంధ్య, ఋషికుల్య మొదలయినవి మహేంద్ర గిరి జన్యములు. ఋషికుల్యా, కుమారి మొదలైనవి శుక్తి మత్పర్వత పాద మందు బుట్టినవి. వీని యుప నదులు వేల కొలదియు గలవు.
వాని యందు కురు పాంచాల దేశ ప్రజ నివసించు చున్నది. తూర్పన కామరూప దేశ వాసులు, కళింగులు మగధులు నున్నారు. దాక్షిణాత్యులు, దక్షిణము నందుండు వారు. పశ్చిమమున సౌరాష్ట్రులు శూద్రులు ఆభీరులు, అర్బుదులు, మారుకులు, మాళవులు, పారియాత్ర నివాసులు, మద్రులు, రాములు, అంబష్ఠులు, పారసీ కాదులు వీరందరు నీయీ నదుల జలములం ద్రావుదురు. ఈ దేశమలు కలిసి మెలసి ఆనంద భరితులై పుష్టి వంతులు నైన జనులతో నిండి యుండును.
కృత త్రేతా ద్వాపర కలియుగ విభాగ మిక్కడనే కలదు. అన్యత్ర లేదు, ఇందు యతులు తపస్సు చేయుదురు. యజ్వలు హోమములు (యాగములు) సేయుదురు. పరలోకము గోరి యిచట దానము లాచరింప బడును.
జంబూ ద్వీప మందు యజ్ఞ పురుషుడుపాసింప బడును. విష్ణువు యజ్ఞ రూపుడుగ యజ్ఞే శ్వరుడుగ నిచట నుపాసింప బడును. ఇతర ద్వీపము లందు మఱియొక పేరున గొల్వ బడును. ఈ జంబూ ద్వీపమున భారత వర్షము శ్రేష్ఠము. ఇది కర్మభూమి. తక్కినవి భోగ భూములు, బహుజన్మ ఫల భోగముగ నిందెంతో కాలమునకు మనుష్య జన్మము గల్గును.
దేవతలీ భారత భూమిని గూర్చి యిట్లు గానము సేయు చుందురు. స్వర్గాప వర్గము లొసంగు భారత భూమి యందు మనుష్యులయి, వారిలో పురుషులయి పుట్టి, అట్టి కర్మ భూమి యందు జన్మము వడసియు ఫలాభి సంధి లేక సర్వ కర్మ ఫలమును పరమేశ్వరా ర్పణమని పరమాత్మ యగు విష్ణువు నందర్పించి పాపదూరులై యా పరబ్రహ్మ మందు లీనమగు వారు ధన్యులు. అనగా పరమేశ్వరార్పణముగ నాచరించిన స్వర్గప్రద మగు కర్మ లీనమై పోయిన తర్వాత దేహ బంథమును మఱి యెందు పొందుదురో యెఱుగము. ఇంద్రియ వంతులై భారత వర్షమున పుట్టిన వారు ధన్యులు. తొమ్మిది వర్షములు గల్గి లక్ష యోజనముల విరివి గల యీ జంబూ ద్వీపమును గూర్చి సంక్షేపముగా దెల్పితిని. ఈ ద్వీపము నావరించి లక్ష యోజనములు విస్తారము గల క్షీర సముద్రము వలయా కారముగ నున్నది.
