బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

2 - సృష్టికథనము

ఇట్లు ప్రజాపతి ప్రజలను సృజించి అయోనిజయైన శతరూపను బత్నిగ బడసెను. ద్యులోకము నావరించి యుండెడి ఆపవుని యొక్క మహిమచే ధర్మముచే శతరూప జనించినది, ఆమె పదివేలేండ్లు దుశ్చర తపమ్ము జేసి తపో దీప్తుని స్వాయంభువ మనువును భర్తనుగ బొందెను. డెబ్బది యొక్క మహా యుగము లా మనువు యొక్క ఆయుర్దాయము. అదే మన్వంతర మన బడును.

ఆ పైరాజుని వలన శతరూప వీరుడను కుమారుని గనెను. ప్రియవ్రత ఉత్తాన పాదులను గూడ గనెను. వీరునికి కామ్య జనించెను. కామ్య యొక్క కుమారులు నల్వురు సమ్రాట్టు, కుక్షి, విరాట్టు, ప్రభువు అనువారు, ఉత్తాన పాదుని వలన సూసృత నల్వురు కొడుకులం గాంచెను. ఆమె ధర్ముని కూతురు. సూనృత (సునీత) అశ్వ మేధము చేయుటచే జనించినది. ఆమె ధ్రువుని తల్లి. ఉత్తాన పాదునికి ధ్రువుడు, కీర్తి మంతుడు, ఆయుష్మంతుడు, వసువు అను నల్వురు కుమారులు సూనృత యందు గల్గిరి. ధ్రువుడు గొప్ప కీర్తి కావలెనని కోరి మూడు వేల దివ్య సంవత్సరములు తప మాచరించెను.

ఆతని కబ్జయోని ప్రీతుడై తన స్థాసమునకు సమాన మైన స్థానము నిచ్చెను. అది సప్తర్షుల పురో భాగమందు అచలమయి (ధ్రువమయి) వెలుగు చున్నది. ఆతని అభిమానము సమృద్ధిని మహిమను గని దేవాసుర గురుండు శుక్రు డీక్రింది శ్లోకమును జెప్పెను. “ఆహా ఈ ధ్రువుని తపస్సు, వీర్యము, శ్రుతము (పాండిత్యము) అద్భుతము. ఈతని ముందిడుకొని సప్తర్షులు విలసించు చున్నారు”. అని, ధ్రువుని వలన శంభువను నామె శ్లిష్టి, భవ్యుడు నను కుమారుల గనెను. శ్లిష్టి వలన సుచ్ఛాయ యను నామె రిపువు, రిపుంజయుడు, వీరుడు, వృకలుడు, వృకతేజనుడు నను నైదుగురు తనయులం గాంచెను. రిపువు వలన బృహతి యను నంగన సర్వ తేజ శ్శాలియైన చక్షుస్సును గనెను. అతడు వీరణుడును ప్రజాపతి యొక్క కూతురగు పైరణి యందు చాక్షుష మునువుం గాంచెను.

అతనికి నడ్వలయను నామె యందు పది మంది పుట్టిరి. నడ్వల పైరాజ ప్రజాపతి కుమార్తె. ఆ పది మంది కుత్సుడు, పురుషుడు, శతద్యుమ్నుడు, తపస్వి, సత్యవాక్కు, కవి, అగ్నిష్టుత్తు, అతిరాత్రుడు,సుద్యుమ్నుడు, అభిమన్యుడు ననువారు, పురుని వలన ఆగ్నేయి యనునామె అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడునను నాఱ్వురు కుమారులం గనెను. అంగుని వలన సునీథుని కుమారి వేనుడను కొడుకుం గాంచెను. వాడు చేసిన యపచారముచే ఋషులు కోపోద్రిక్తులైరి. వాని సంతానమునకై వాని కుడి హస్తమును మథించిరి. అపుడు ఒక మహాను భావుడు దయించెను. మును లాతనిం గని యితడు ప్రజా రంజకుడుగ ననిరి. ఆ బాలుడు ధనువూని కవచము తొడిగికొని జ్వలించు నగ్నివోలె నుదయించెను. అతడె పృథువు. ఈ నేల నేలిన వాడు. (అతని పేర నిల పృథివి నాబడెను.)

ఆ వసుధాధీశుడు రాజసూయ యాగాభిషేకము నందిన రాజుల కెల్ల మొట్ట మొదటి వాడు. అతనికి నిపుణులయిన సూత మాగధు లిర్వురు జనించిరి. అతనే భూమిని గోవు నొనరించి సస్యరూప మయిన క్షీరమును బిదికిన మహానుభావుడు. అట్లు పిదుక బడిన గోవు (భూమి) ప్రజా జీవన మునకు పాలు చేసినది. దేవతలు ఋషులు పితృ దేవతలు దానవులు అప్సరసలు నాగులు (సర్పములు) పుణ్య జనులు (రాక్షసులు) వీరుధులు పర్వతులు తమతమ కాయా పాత్రము లందు పిదుక బడిన క్షీరమును ద్రావి ప్రాణధారణ మొనరించు కొనిరి. వసుంధర వారి వారికి పాలిచ్చెను. పృథుని కుమారులు ధర్మజ్ఞులు అంతర్థి, పాతి, యనువారు గల్గిరి. అంతర్థానుని వలన శిఖండిని యను నామె హవిర్ధానుడను కొడుకుం గాంచె. హవిర్ధానుని వలన ఆగ్నేయి యార్వురు కుమారులం గాంచెను. వారు ప్రాచీన బర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు ననువారు. ప్రాచీనబర్హి భగవానుడు మహానుభావుడు ప్రజాపతి యయ్యెను. హవిర్ధానుని కుమారుడు ప్రాచీనబర్హి యేలు నేలలో నీటిలో దర్భలు ప్రాచీనాగ్రములు గానే మొలచెనట. (అందుచే నాతడు ప్రాచీన బర్హియయ్యె.). ఆ ప్రభువు సముద్రుని కూతురు సవర్ణ యను నామెం బరిణయ మాడెను. తీవ్ర తపస్సు చేసిన మీదటనే యతడు పెండ్లి చేసికొని సవర్ణ యందు పది మంది కుమారులను ధనుర్వేద పారగులను గాంచెను. ప్రాచేతసులగు వారందరు నొక్కటియై తప మాచరించిరి. ఏక రీతిగ ధర్మము నిర్వహించిరి. పది వేలేండ్లు సముద్ర జలము లందుండి తీవ్ర తపము సేసిన మహాను భావులు వారు. వారు తపము సేయు తఱి, రక్షణ లేనిక తన మహా వృక్షములు (అంగుళ మెడము లేకుండ) మొలచి యీ పృథివిని కప్పి వేసినవి. అందు వలన ప్రజాక్షయ మేర్పడెను. వాయువు వీచరాదయ్యె. వాయు పధము చెట్లచే నిండి నిబిడీకృత మయ్యె. పది వేలేండ్లు ప్రజలు కదలను మెదలను వశము గాదయ్యె. అది విని తపస్సులు ప్రాచేతనులు కోపించి మొగముల నుండి వాయువును అగ్నిని జనింప జేసిరి. వాయువు తరువుల నెల్ల మొదలిటికి బెల్లగించి బడద్రోసి తడియార్చి వైచెను. వాని నగ్ని దహించెను. ఇట్లు సర్వద్రుమ నాశన మయ్యెను. కొలదిగ మిగిలిన తరువులం గని సోముడేతెంచి వారింగని యిట్లనియె. రాజులారా ! కోపము నాపుడు. పృథివి యెల్ల వృక్ష శూన్యయయ్యె. అనలా నిలములను శమింప జేయుడు. ఈ వృక్షములు గన్న కన్యారత్న మిదిగో పరమ సుందరి, భవిష్య వృత్తాంత మెరిగి నేనీమెం గడుపులో దాచితిని. ఇది మారిషయను పేరు గలది. ఈమె మీకు భార్య యగు గాక ! సోమవంశ వర్ధని ఈమె. మీ తేజస్సులు సగము నా తేజస్సులో సగము వహించి యీమె యందు దక్షుడను ప్రజాపతి ఉదయింప గలడు. మీ తేజముచే దగ్ధ మయిన యీ పృథివిని అగ్ని కల్పుడగు నాతడు చల్లార్చి ప్రజలను వృద్ధి నందింప గలడు. ప్రచేతనులా సోముని పలుకు లాచరించి కోప ముపసంహరించి వృక్షముల నుండి మారిషయను నా కన్యం గైకొనిరి. ఆ ప్రచేతసులు పదిమంది వలన మారిష యందు సోమాంశమున మహాతేజస్వి దక్షుడు దయించెను.

అతడు చరాచర భూతములను ద్విపాచ్చ తుష్పాద పశువులను మనసు చేతనే సృజించి యా మీదట స్త్రీ సంతా నమునం గనెను. అందు ధర్మునికి పది మందిని, కశ్యపునకు ఐదుమువ్వుర నిచ్చి తక్కిన వారిని నక్షత్ర నామ ధారిణుల నిర్వది యేడ్గురను సోముని కొసంగెను. వారి యందు దేవతలు, పక్షులు, గోవులు, నాగులు, దైత్యులు, గంధర్వులు, అప్సరసలు మఱి పెక్కు జాతులు జనించెను. అది మొదలు మైథున సంభవు లయిన ప్రజలు పుట్ట నారంభించిరి. పూర్వము సంకల్ప మాత్రమున, దర్శన మాత్రము, స్పర్శ మాత్రమున సృష్టి యయ్యెడ జరుగు చుండెను.

సూత! శుభవ్రతి యైన దక్షుడు బ్రహ్మ యొక్క అంగుష్ఠము నుండి కదా జనించెనని వినబడును. ఆయన బొటనవ్రేలి నుండి కదా యీయన భార్య జనించెను. అట్టితఱి దక్షుడు ప్రాచేతసులకు జనించె నంటిరే! ఇది సంశయము వివరింప నీవ యర్హుడవు. సోముని కూతురు బిడ్డ వీరి మామ యెట్లయ్యె అన

విప్రులార! భూతము లందు జరుగు పుట్టువు నిరోధమును గురించి తెలియక మునులే తికమక పడు చుందురు. విద్యా వంతులకే ఇది దుర వగాహము. ఈ దక్షాదులు రాజులు యుగయుగ మందు తిరిగి పొడము చుందురు. తిరిగి చాటగు చుందురు. విద్వాంసుడేని యక్కడ పొరబడును. వీరిలో జ్యేష్ఠ కనిష్ఠ భావములు మున్ను లేకుండెను. తపస్సు ప్రభావమును బట్టియే చిన్న పెద్ద పరిగణనము. దక్షుని యీ విసృష్టి నెఱింగిన యాతడు సంతాన వతుడయి, పూర్ణాయువై స్వర్గ మందు వసించును.