బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

220 - శ్రాద్ధ విధి వర్ణనమ్‌

శ్రాద్ధకల్పము నెవరెవరి కెప్పు డానతిచ్చిరో సవిస్తరముగ తెల్పుడన వ్యాస భగవాను డిట్లనియె.

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులముల వారు తమ తమకు చెప్ప బడిన విధానమున మంత్ర పూర్వకముగా శ్రాద్దము ననుష్టింప వలెను. స్త్రీలు మరి శూద్రాదులు బ్రాహ్మణులు చెప్పినట్లు అగ్ని హోత్రము లేకుండా అమంత్రకము శ్రాద్దము పెట్ట వలెను. పితృ దేవతల నుద్దేశించి శ్రాద్దము పెట్ట వలసిన ప్రదేశములు పుష్కరాది తీర్థములు పుణ్య క్షేత్రములు పర్వత శిఖరములు పవిత్ర నదులు నదములు సరస్సులు నదీ సంగమములు సముద్ర తీరములు ఇవి ముఖ్యములు. గోమయముతో నలికిన స్వగృహము నందు దివ్య వృక్ష మూలము లందు యజ్ఞార్హము లైన మడుగుల యందు శ్రాద్దము పెట్టుట ప్రశస్తము. కిరాత దేశము లందు కళింగము కొంకణము కృమి దశార్ణవము కుమార్య దేశము లందు తంగణమును దేశము నందు క్రథమను దేశము నుందు సముద్రము యొక్క ఉత్తర తీరము నందు (సింధు నది ఉత్తర తీరము నందు) నర్మదానదీ దక్షిణ తీరము లందు కరతోయ అను నదికి తూర్పు ప్రదేశము నందును శ్రాద్దము పెట్టరాదు. ఇదే విధముగా నిత్యశ్రాద్ధ విధానము కూడా చెప్ప బడినది. ప్రతి సంవత్సరము నైమిత్తికము కామ్యము అను శ్రాద్దములు నిత్య శ్రాద్దముతో పాటు నిర్వర్తింప వలెను. జాతకర్మాదుల యందు వృద్ధి శ్రాద్దము పెట్ట వలెను. మంత్ర పూర్వకముగా శ్రాద్దము పెట్ట వలసిన వారు ద్విజులు మాత్రమే( బ్రాహ్మణ క్షత్రియ వైశ్యలు మాత్రమే)

సూర్యుడు కన్యా రాశిలో నున్నపుడు పదునైదు రోజులు శ్రాద్ధము పెట్టుటకు ఉత్తమము లని చెప్ప బడినది. శ్రాద్ధము పాఢ్యమి నాడు పెట్టిన ధనాలాభము. విదియ పశు సంపద నిచ్చును. తదితయ పుత్ర ప్రదము. చదుర్ది శత్రు నాశనకము. పంచమి ఐశ్వర్య ప్రదము, షష్టి లోక పూజ్యునిం జేయును. సప్తమి గణాధి పత్యమును కూర్చును. అష్టమి జ్ఞాన ప్రదము, నవమి స్త్రీ లాభము కలిగించును. దశమి సర్వా భిష్టములను జేకూర్చును. ఏకాదశి సర్వ వేద సంపన్నుని చేయును. ద్వాదశి జయకరము. త్రయోదశి సంతా నాభివృద్ధి పశు సంపద మేధ స్వాతంత్ర్యము నుంచి పుష్టని దీర్ఘ యార్థయము నైశ్వరమును జేకూర్చును. ఇందు సందేహము లేదు. చతుర్ధశి నాడు లభించినంత అన్నముతో శ్రద్దతో శ్రాద్దము పెట్టిన యెడల ఆయుధముల దెబ్బతిని చనిపోయిన వారు యువకు లుగ చనిపోయిన వారు సంతృప్తి నొందుదురు. అమావాస్య నాడు శ్రార్ధమ పెట్టిన యితడు సర్వ కామములను బడసి స్వర్గము బడయును.

పితృ దేవతలు సంప్రీతు లగుటకు శ్రాద్దము లందు వినియోగింప వలసిన ద్రవ్యములను గురించి చెప్పెద వినుండు. హవిష్యాన్నముతో పితృ శ్రాద్ధము పెట్టిన యెడల పితృ దేవలకు నెల రోజులు తృప్తి కలుగును. మత్య్స మాంసము చేత పితృ దేవలతు రెండు మాసములు తృప్తు లగుదురు. లేడి మాంసము మూడు నెలలు పితృ దేవతలకు తృప్తి కలిగించును. శశ మాసంము (కుందేలు) నాలుగు మాసములు తృప్తిని కలిగించును. పక్షి మాంసము ఏడు నెలలు తృప్తి నిచ్చును. శూక మాంసము(పంది మాంసము) ఆరు మాసములు తృప్తి నిచ్చును. మేక మాంసము ఏడు నెలల తృప్తి నిచ్చును. ఐణేయము (లేడిది) ఎనిమిది మాసములును, రురు (దుప్పి) మాంసము తొమ్మిది నెలలు తృప్తిని కూర్చును. గోమాంసము పితృ దేవలకు దశమాస తృప్తి నొసంగును. ఔరభ్రము (పొట్టేలు మాసంము) పదకొండు మాసములు తృప్తి నిచ్చను. ఆవు పాలు గాని పాయసము గాని సంవత్సర తృప్తి కలిగించును. గండక పక్షి మాంసము నేత్తు రన్నము కరివేప కూర తేనే ఎఱ్ఱ మేక మాంసము అన్నము తన వంశీయులచే పెట్ట బడినవి అనంత తృప్తిని పుత్రులను కలుగ జేయును.

గయా శ్రాద్ధము అనంత ఫలదము, బెల్లముతో కలిపి నువ్వులను శ్రాద్ధమందు యోగించిన విశేష ఫలమొసగును. తేనెకాని తేనెతో కూడిన పదార్ధము గాని పితృ దేవతలకు నొసంగిని అక్షయ ఫల మొసంగును. మా కుల మందు పుట్టినవాడు మాకు జలాంజలు లొసగి (పితృ తర్పణములు చేసి) వర్ష ఋతువు నందు మాఘ ఫాల్గుణము లందు తేనెతో కూడిన పాయసమును మాకు నివేదించు నాయని పితృ దేవల తువ్విళ్ళూరు చుందురు. బహుపుత్ర సంతానము మాకు కావలయు నని కోరుట అందరిలో నేయొక్కడేని గయకు వెళ్ళునేమో యని? గౌరీ (కన్యా వివాహము చేయునా? దశ వర్ష) నీల వృషభోత్సర్జనము చేయునా? అని పితృ దేవత లుబలాట పడుదురు. కృత్తికా నక్షత్ర మందు శ్రాద్ధము పెట్టిన స్వర్గము నందును. రోహిణీ నక్షత్ర మందు పితృ శ్రాద్ధము సంతాన ప్రదము, సౌమ్య దేవతా (మృగశిర) నక్షత్రమందు పెట్టిన శ్రాద్ధము మంచి తేజశ్శాలిం జేయును. ఆర్ధ్రా నక్షత్ర శ్రాద్ధము శౌర్య వంతుని చేయును. పునర్వసు నక్షత్రము క్షేత్ర సందర్శన భాగ్యము నొసంగును. పుష్యమి అక్షయధన మొసగును. ఆశ్లేష పూర్ణా యుర్దాయ మిచ్చును. మఘ సంతానమును పుష్టిని గూర్చును. పూర్వ ఫల్గుణీ నక్షత్రములు సౌభాగ్య ప్రదములు, ఉత్తర ఫల్గుని యందు పెట్టిన శ్రాద్ధముత సంతాన మొసగును. హస్తా నక్షత్ర మందు శ్రాద్ధము పెట్టి నతడు శాస్త్ర సారంగతు డగును. చిత్రా నక్షత్రము తేజస్సును సంతానమును నొసంగును. స్వాతి వ్యాపార మందు లాభము గూర్చును. విశాఖ పుత్ర ప్రదము. అనూరాధ నక్షత్ర మందు పితృ శ్రాద్ధ మొనరించిన చక్ర వర్తిత్వము నొసంగును. జ్యోష్ఠ ఆధిపత్య మొసంగును. మూలా నక్షత్ర మారోగ్య ప్రదము, పూర్వాషాడ యశస్కరము, ఉత్తరాషాఢ శోకము హరించును. శ్రవణము శుభలోక ప్రదము ధనిష్ఠ ధన సమృద్ధిదము. అభిజిత్తు వేదవేత్తను గావించును. వారుణము (శతభిషము) వైద్యసిద్ధి నిచ్చను. పూర్వాభాద్ర అజావికమును ఉత్తరాభాద్ర గోసంపద నొసంగును. రేవతి రజత సమృద్ధిదము. అశ్విని అశ్వ సంపత్తి గూర్చును, భరణీ నక్షత్ర శ్రాద్ధము దీర్ఘాయుర్భాగ్య మిచ్చును. కావున కామ్యము లయిన శ్రాద్ధముల చేగూడ పితృ దేవతా సంప్రీతి గావింప వలయును.

సూర్యడు కన్యా రాశి యందు న్నపుడు శ్రాద్ధము పెట్టిన నేయే కోరికలు కోరునో యవన్నియు నెర వేరును. వారాహ పురాణము నందు జెప్ప బడినట్లు పౌర్ణమాసి యందు పితృ శ్రాద్ధముపెట్టిన యెడల దివ్యభౌమ అంతరిక్షములకు స్థావర జంగమములకును సంబంధించిన సర్వ కామములను బొందుదురు. సూర్యడు కన్యారాశి యందు న్నపుడు పితృ దేవతలు పిండముం గోరుదురు. రవి కన్యారాశి యందున్న పదునాఱు రోజులందు పితరలకు పిండ ప్రదానము సేయుట సర్వ క్రతువులు సేయుటయే యని నారాయణుడు పలికెను. రాజసూయాశ్వ మేధముల ఫలమును సూర్యుడు కన్యారాశి గతు డైనప్పుడు నీళ్ళు ఆకు కూరలు దుంపలు మాత్రముతో పెట్టిన శ్రాధ్దము వలన నందును. ఉత్తరహస్త నక్షత్రము లందు సూర్యుడు కన్యారాశి గతుడైనప్పుడు భక్తితో పితృదేవ తార్చనము సేసిన స్వర్గము సిద్ధించును. రవిహస్త యందు ప్రవేశించి వృశ్చకా రాశి ప్రవేశము చేయుదాక పితృపురి శూన్యమయి యుండును. వృశ్చికమును గూడ రవిదాటి పోయిన తఱి పితృ దేవతలు దేవతలతో గూడ నిట్టూర్పు పుచ్చి తనకులము వారికి శాపమిచ్చి తిరిగి పోవుదురు. అష్టకలందు మన్వంతరము లందు గ్రహణమందు వ్యతీపాత మందు రవి చంద్ర సమాగమ మందు (అమావాస్య నాడు) జన్మనక్షత్ర మందు గ్రహ బాధలు గల్గి నపుడు పెట్టు శ్రాద్ధము పార్వణశ్రాద్ధ మనంబడును. రెండు ఆయనము లందు రెండు విషవత్తులందు సంక్రాంతు లందును యథా విధిగ శ్రాద్ధము పెట్టవలెను. వీనిలో పిండ ప్రదాన నిర్వాహణము లవసరము గావు. వైశాఖ శుక్ల తదియ యందు కార్తిక నవమి యందును సంక్రాంతి శ్రాద్ధ విధానమున పితరుల నర్చింప వలెను. భాద్రపద శుక్ల త్రయోదశి యందు మఘ యందు చంద్రక్షయ పర్వమందు పాయసముతో శ్రాద్ధము పెట్టవలెను. ఆది దక్షిణాయన శ్రాద్ధ తుల్యము, వెదవేత్త శ్రోత్రియుడు నిత్యాగ్నిహోత్రియు నైన బ్రాహ్మణు డింటిక రుదెంచె నేని ఆ యొక్కని తోనే యథావిధిగ శ్రాద్ధము పెట్ట వచ్చును. శాస్త్రీయమైన శ్రాద్ధీయ ద్రవ్య సంపద సమకూరి నపుడు పార్వణ విధానమున పితృ శ్రాద్ధమున సేయవలెను.

తల్లిదండ్రులకు సంతానము లేని పిన తండ్రులకు పెద్ద అన్నకు ప్రతి సంవత్సరము విశ్వే దేవతలతో కూడ పితృ దేవతలకు తద్దినము పెట్ట వలెను. విశ్వేదేవులు లేకుండ ఏకోదిష్ట శ్రాద్ధము నందు దేవ పితృ స్థానము లందిద్దరు బ్రాహ్మణులను అర్చింప వలెను. ఇట్లే మతా మహాదులకును జరుప వలెను. ప్రేతీ భూతడైన జీవునకు భూమిపై పిండమును జల మును తిలలతో కుశలతో జలసమీప మందు పెట్ట వలెను. బ్రాహ్మణులు పదు నొకండవ దినమునను క్షత్రియులు పదు మూడవ దినమునను వైశ్యులు పరునారవ దినమునను శూద్రుడు ముప్పది ఒకటవ దినమునను శుద్ధల గుదురు. అనగా ఆశౌచ మును విడుచును. సూతకము తుదను గృహ మందు పండ్రెండవ దిన మందును మాసమందును త్రిపక్ష మందును ఏకోద్ధిష్ట శ్రాద్ధము పెట్టవలెను. సంవత్సరము తుదదాక ప్రతినెల మాసికము పెట్ట వలెను. ఆపైన సపిండీకరణము పార్వణ విధానమున జరుప వలెను. అప్పటి నుండి చనిపోయిన జీవుడు ప్రేతత్వమును విడిచి పితృదేవ తాత్వమును పొందును. పితృ దేవతలు అమూర్తులు మూర్తిమంతులు నని రెండు విధములుగా నుందురు. నాందీ ముఖులు అమూర్తులు, పార్వణులు మూర్తి మంతులు.

సపిండీకరణ విధానము నానతిమ్మని యడుగ వ్యాసుండింట్లనియె.

సపిండీ కరణము నందు విశ్వే దేవతలు ఆహ్వానింప బడరు. అందొకటే అర్ఘ్యమీయ వలెను. అగ్నౌకరణ ముండదు. ఆవాహనము కూడ నుండదు. బ్రాహ్మణులు బేసి సంఖ్యలో నర్చింప బడుదురు. అ సపిండీకరణ విధనమున మరోక విశేషము తెలిపెదను. తిలగంధో దకములచే కూడిన నాల్గు పాత్రము లుపయోగింప బడును. వానిలో పితరులకు మూడు ప్రేతకు నొకటి. ప్రేత పాత్ర మందలి యర్ఘ్యము చేత మిగిలిన మూడు పాత్రములను ‘‘యేనమానాః’‘ అను మంత్రము జపించుచు ఉదకము చల్లవలెను. స్త్రీలకు గూడ ఈ ఏకోద్దిష్ట విధానమున జరుప వలెను. సంతానము లేని స్త్రీలకు సపిండీ కరణము పెట్ట నవసరము లేదు. స్త్రీలకు సంతానము లేని వారికి ఏకోద్దిష్ట విధానమున ప్రతి సంవత్సరము నిది విహితము. కొడుకులు లేని స్త్రీలకు జ్ఞాతులు, జ్ఞాతులు కూడ లేనపుడు. సోదరులు శ్రాద్ధము పెట్ట వలెను. మాతా మహులకు దౌహిత్రుడు (కూతురి కొడుకు) ద్వ్యాముష్యాయణులను పేర పిలువ బడు మనుష్యులు మాతామహ వర్గమును యథా విధిగ పూజింప వలెను. వారికి నిత్య శ్రాద్ధమే కాక నైమిత్తిక శ్రాద్ధములు కూడ దౌహిత్రుడు పెట్ట వలెను. సర్వాభావమందు అనగా తద్దినము పెట్టువాడు లేనపుడు స్త్రీలు స్వయముగా మంత్ర రహితముగా శ్రాద్దము పెట్ట వలెను. ఏ దిక్కును లేని జీవులకు రాజు ఆయా జాతి పురుషులచే శవ వాహనము దగ్గర నుండి జరిపింప వలెను. సర్వ వర్ణములకు రాజు బంధువు.

నిత్యనైమిత్తిక శ్రాద్ధస్ విధానము చెప్పెద వినుడు. నిత్య శ్రాద్ధము సపిండీ కరణా నంతరము జరుప వలెను. అందు తండ్రికి పెట్టిన పిండము నుండి లేపము ప్రపితా మహుడు పొందును. వానకి పైన నాల్గవ వాడును లేపభుజుండగును. అతడును తండ్రి తాత ముత్తాత అను నీ ముగ్గురు పురుషులు పిండ భుక్కులు. మిగిలన పై మూడు తరముల వారు పిండ లేప సంబంధులు. ఇట్లు పితృ పితామహ ప్రపితా మహులు వారికి వెనుకటి మూడు తరముల వారు యజమానుడు కలసి మొత్తము వీరేడుగురు. వీరి అన్యోన్య సంబంధము సాప్త పౌరుషము. యజమానికి పై వారిలో అనులేప భుక్కుల వానికంటె ముందు ఆ కుటుంబమున బుట్టిన వారును నరకమున కేగిన వారు పశు పక్ష్యాది జన్మ లెత్తిన వారు భూతాదు లందు వ్యాపించి యున్నవారు ఇందరను యమాని శ్రాద్ధము పెట్టి సంతృప్తి పరచును. ఆసంతృప్తి పరుచుటలో అన్న ప్రకిరణము అన్నపు మెతుకులను చిమ్ముట అనుక్రియ చేయ బడును దాని వలన పిశాచాది జన్మలందిన వారు తృప్తి పొందుదురు. స్నానము చేసి వస్త్రమును పిడిచిన నీటిచే వృక్ష జన్మ పొందిన వారు తృప్తి బడయుదురు. భూమి మీద పడిన గంధోదక బిందువుల చేత ఆ కులములో దేవత్వము పొందిన వారికి ఆప్యాయనము కలుగును. పిండము లుద్దరించిన తరువాత చల్లిన నీటి చినుకులచే పశు పక్ష్యాది జన్మలెత్తిన వారకి తృప్తి కలుగును. దంతములు కూడ రాని బాలురు కర్మ బహిష్కృతు లైనవారు అనధికారులుగ మరణించిన వారు పితృ స్థాన మందు సమ్మార్జనము చేసిన ఉదకము చేతను బ్రాహ్మణ పాద ప్రక్షాళనము చేసి ఉదకము బొందియు తృప్తి నొందుదురు. ఈ విధముగ యజమాని నిర్వర్తించిన శ్రాద్ధము నందు చిందిన నీరు చిమ్మిన అన్న విక్షపము అది శుచి యైనను కాకున్నను దానిని పొంది ఆ కులము వారు ప్రస్తుతము అన్య యోను లందు బుట్టిన వారు ఆప్యాయనము బడయుదురు.

విధానము ననుసరించి శ్రాద్ధము చేసిన వారి పితరులు ఆప్యాయనమును తృప్తిని పొందుదురు. అన్యాయార్జిత విత్తముల చేత పెట్టిన శ్రాద్దము చండాల పుల్కసాది జాతు లందు పుట్టిన వారికి తృప్తి కూర్చును. కనుక మానవుడు తుదకాకు కూరతో నైన భక్తితో శ్రాద్దము పెట్టిన యెడల వాని కుల మందొక్కడును దుఃఖ పడడు. ఆచార వంతులను నిత్యాగ్ని హోత్రులను జ్ఞానులను నిత్య శుచులను విశేసించి శ్రోత్రియు లను భోక్తలను నిమంత్రించి శ్రాద్ధము పెట్టుట ప్రశస్తమైన విషయము. త్రిణాచికేతుడు, త్రిమధువు, త్రిసువర్ణుడు (నాచికేతాగ్ని విద్యను త్రిమధు విద్యను త్రిసుపర్ణ విద్యను ఈ మూటిని అధ్యయనము చేసి వాని అర్థముకు ఎరిగి ఆ అగ్నిచయనమును అనుష్ఠించిన వారు) వేదాంగముల నారింటిని అధ్యయనము చేసిన వారు మాతృ పితృ భక్తులు మేనల్లుడు సామ వేదము నెరిగిన వారు యజ్ఞమున జరుగు అన్ని క్రియా కలాపము లలోను యజ్ఞమును జరుపు జరిపించు అందరలోను మంచి చెడ్డలను పరిశీలించి చెప్ప గల మహా పండితుడు ఇట్టి వారిని భోక్తగా తీసికొన వలెను. మేనమామ తన భార్యకు తండ్రి తన భార్యకు సోదరుడు వియ్యంకుడు, ద్రోణపాఠకుడు, నాలుగు వందల గ్రామముల మొత్తములో ముఖ్య వేద పండితుడు, మండల బ్రాహ్మణుడు, ఒక మండల ప్రదేశము మొత్తములో ప్రధాన వేద పండితుడు, పురాణముల లోని తత్త్వ విషయముల నెరిగిన వాడు కూడని దానము గ్రహించని వాడు అకల్పుడు, దుస్సంకల్పములు లేనివాడు, కల్ససంతుష్టుడు, తన సత్సంకల్పము నెరవేరగనే సంతృప్తి నొందువాడు, ఇట్టి వారిని శ్రాద్ధము నందు భోక్తలుగ పెట్ట వలెను. పంక్తిపావనులైన తాము ఏ పంక్తిలో కూర్చుండి భుజించెదరో ఆ పంక్తిలో భుజించిన వారందరను తమ శక్తిచే పవిత్రు లను చేయ గలవారు అట్టి బ్రాహ్మణులను గూడ శ్రాద్ధమున భోజనమునకు పిలువ వలెను. శ్రాద్ధమునకు ముందటి నాడే వీనిని పిలిచికొని వచ్చి విశ్వేదేవ పితృ స్థానము లందు కూర్చండ బెట్టి ఆర్చింప వలెను. శ్రాద్దము చేయు యజమానుడు కూడ వారితో పాటు మౌనాది నియములను బూన వలయును. శ్రాద్ధ భోజనము చేసిన వాడు మైథునము సలిపిన యెడల వాని పితరులు ఆ రేతస్సు నందొక్క నెల పడి యుందురు. స్త్రీని పొంది శ్రాద్ధము నందు బ్రాహ్మణుడుగ కూర్చండి భోజనము చేసిన వాని పితృ దేవతలు రేతో మాత్రము లాహారము గొని నెలరోజులు కుములుదురు. కావున చక్కగ తెలిసి ఉత్తము డైన బ్రాహ్మణులను నిమంత్రణము సేయ వలయును. ఇది ప్రథమ కర్తవ్యము, తద్ధినము నాడు స్త్రీ మైథునము సేసిన వారి నేమాత్రము నిమంత్రింప రాదు. ఉత్తమ బ్రాహ్మణుడు అభింప నపుడు భిక్ష కొరకు వచ్చిన వారిని సరిగా ఆ సమయమున నింటికి వచ్చిన యతులను యోగులను సాష్టాంగముగ మ్రొక్కి బ్రతిమాలి శ్రాద్ధమందు భోజనము పెట్ట వలెను. పితృ దేవతలు యోగము మీద నాధార పడిన వారు కావున వారి ప్రీతికి పూజింప వలసిన వారు యోగుల వేయి మంది బ్రాహ్మణులలో నొక్క యోగి సమానుడు, ఆతడు వీటిలో నౌక యట్లు యజమానిని భోక్తలను (పితృ దేవతలను) తరింప చేయగలడు. ఈ విషయములో బ్రహ్మ వాదులు గానము సేసిన పితృ గాథల తాత్పర్యము ఇది.

ఐలుడను రాజు నుద్దేశించి పితృ దేవత లిట్లు గానము సేసిరి. మాసంతతిలో పరమ శ్రేష్ఠుడు ఒక్క కుమారుడు కల్గునా? యోగుల భుక్త శేషాన్నము భూమిపై మాకు పిండములు పెట్టునా? లేదా గయ యందు పిండ దానము చేయునా? ఖడ్గ మృగ మాంసము హవిస్సు, పులుపు కారము చురుకు వస్తువులు లేని సాత్వికమైన ఆహారము, బలుసు కూర తిలలు ఆజ్యము కృనరము (పులగము) మాకు పెట్టునా? కొమ్ములు మాత్రము విడిచి, పాదము మొదలు శిరసు దాక గల ఖడ్గమృగముల మాంసము త్రయోదశి నాడు మఖా నక్షత్ర మందు తేనె నెయ్యితో కలిపిన పాయసముతో దక్షిణాయనము నందు మాకు నివేదించునా? అని యుబలాట పడు చుందురు. కావున భక్తితో పితృ దేవతల నర్చించి సర్వా భీష్టములను బడయ వలయును ఆ పితృప్రీతి వలన వసుపులు రుద్రులు ఆదిత్యులు నక్షత్ర దేవతలు గ్రహములు తారా గ్రహములు పితృ శ్రాద్ధము వలన తృప్తులై ఆయువును సంతానమును ధనమును విద్యను స్వర్గమును మోక్షమును పితృదేవత లోసంగుదురు. అపరాహ్ణ కాలము నుండి పితృ కాలము. అపుడు స్వాగతము చెప్పి పవిత్ర పాణియై ఆచమించి అభ్యాగతుడైన ద్విజులను ఆసనము లందు పవిష్టులను జేయ వలెను. శ్రాద్ధము పూర్తి చేసి ఉత్తమ ద్విజులకు భోజనము పెట్టి ప్రియ సంభాషణముల చేత ప్రణమిల్లి భక్తితో ద్వారము దాక అనుగమించి విసర్జించి వారి అనుమోదము పొంది వచ్చి నిత్య క్రియా కలాపము పూర్తి చేసికొని అతిథులకు భోజనము పెట్ట వలెను. పితృ దేవతలకు సంబంధించిన తర్పణాది నిత్య క్రియలు అపుడే చేయ వలయు నని కొంద రందురు. కాదని కొంద రందురు. అవి వేరుగా చేయ వలెను. కొందరు ముందే చేయ వలెనని చెప్పుదురు. అటుపై యాజమానుడు శ్రాద్ధాన్నమును తమ వారితో పరివారముతో భుజింప వలెను. ఇట్లు ధర్మజ్ఞుడైన బ్రాహ్మణుడు బ్రాహ్మణు లందురు సంతోషించు నట్లు శ్రద్ధతో శ్రాద్ధము నిర్వహింప వలెను.

శ్రాద్దము నందు భోక్తులుగా పెట్ట తగని అదమ బ్రాహ్మణులను పేర్కొందును వినుడు. మిత్ర ద్రోహి పుప్పి గోళ్ళ వాడు నపుంసకుడు క్షయ వ్యాధి బొల్లికల వారు వాణిజ్యము చేయు వాడు గార పండ్ల వాడు బట్టతల వాడు మెల్లకంటి వాడు గ్రుడ్డి వాడు చెవిటి వాడు మంద బుద్ధి మూగ వాడు కుంటి వాడు పీలచేయి గాని వంకర చేయి గాని కలవాడు పౌరుష శక్తి లేనివాడు చర్మవ్యాధి కలవాడు అవయవములు తొలగింప బడిన వాడు ఓర వంకర చూపు గలవాడు కుష్ఠ వ్యాధితుడు ఎఱ్ఱని కండ్లవాడు మరుగుజ్జు పొట్టి వాడు వికట మైన ఆకారము గలవాడు చురుకు దనము లేనివాడు మిత్రుని శత్రునిగా భావించు వాడు. నీచ వంశమున బుట్టిన వాడు పశు పాలనచే జీవించు వాడు. వెలివేయ బడిన వాడు పరివిత్తి (తమ్మునికి వివాహ మైన తర్వాత తాను పెండ్లి చేసికొన్న వాడు) పరివేత్త (అన్న కంటె ముందు తాను పెండ్లాడిన తమ్ముడు) పరి వేదినికా సుతుడు (అన్న కంటె ముందు పెండ్లాడిన వాని భార్య కడుపున పుట్టిన కొడుకు) శూద్ర స్త్రీని పెండ్లాడిన బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు శూద్ర స్త్రీని పెండ్లాడిన పుట్టిన కొడుకు ఇట్టి వారిని శ్రాద్థమున భోక్తలుగా తీసికొన కూడదు. ఇట్టి శూద్ర స్త్రీకి ఉప నయనాది సంస్కారములు జరిపించిన బ్రాహ్మణుడు పెండ్లాడని వాడు దిధుషూవతి (భర్త మరణించిన తరువాత మరల పెండ్లాడిన స్త్రీ యొక్క భర్త) జీతము తీసికొని వేదాధ్యయనము చేయించు వాడు జీతమిచ్చి వేదము నేర్చకొను వాడు సూతాకాన్నము చే జీవించు వాడు వేటాడు వాడు సోమ రసమును సోమ లతను అమ్మువాడు అభిశస్తుడు (వేదాధ్యయనము చేసిన క్షత్రియుని గాని వధ చేసిన పాపి) దొంగ భ్రష్టుడు వడ్డీ వ్యాపారముచే జీనించు వాడు మోసము చేసి జీవించు వాడు కొండెములు చెప్పువాడు వేదాధ్యయనము దానము అగ్ని హోత్రము చేయక విడిచి కాఠిన్యము వహించిన వాడు రాజ పురోహితుడు రాజ సేవకుడు విద్యా విహీనుడు ఇతరుల మేలు ఓర్చని వాడు పెద్దలను ద్వేషించు వాడు భరింప రాని దుష్టుడు రుక్రూడు మూఢుడు గుడి పూజారి నక్షత్ర సూచకుడు (జాతక ఫలములు చెప్పి జీవించు వాడు) పర్వకారుడు (రాతిపని చేయు వాడు) లోక నింద పొందు వాడు యాగము చేయింప కూడని వారిచే యాగము చేయించిన వాడు ఇట్టి వారిని శ్రాద్ధమున భోక్తలుగ గ్రహింప కూడదు. అపాత్ర దానము పట్టువాడు సత్పరుషుల నవమానించు వాడు. వారికి దైవము అప్పటి కప్పుడు దారుణమైన దండనము విధించును. వీరు బహు నిషిద్దులు. ఆగమ విహితుని విడిచి నీచునికి భోజనము పెట్టిన యజయాని ధర్మ మూలమునకే దూరుడై నశించును. తనతో తననాశ్రయించి యుండు బ్రాహ్మణుని విడిచి యింకొకనిని గొని వచ్చి భోజనము పెట్టినచో ఆ ఆశ్రయించు కొనిన బ్రాహ్మణుని నిట్టూర్పు నిప్పుచే దగ్ధుడై దాన నశించును. వస్త్రము లేని క్రియ లేనే లేదు. యజ్ఞములు లేవు. వేదములు లేవు. తపస్సులు లేవు. కావున శ్రాద్ధకాల మందు పితృ దేవతలకు వస్త్రములు తప్పక ఇచ్చి తీర వలెను. పట్టు పంచె పొత్తు పంచె నూలు వస్త్రము క్రొత్త దుకూలము శ్రాద్ధము నందిచ్చిన వాడు పరమోత్త మాభిలాషలను బడయును.

ఆవుల మందలో దూడ ఎట్లు తమ తల్లి పొదుగునకే చేరునో శ్రాద్దము నందు విప్రులకు పెట్టిన అన్నము ఆ జీవుని అట్టే పొందును. నామము గోత్రము మంత్రము అనునవి ఈ యన్నమును ఆయా స్థానముల కందించును. ఆ కులము నందలి అందరకును తృప్తి కలుగును.

దేవతలకు పితరులకు మహా యోగులకు నమస్కారము. స్వధా దేవికి స్వాహా దేవికి నమస్కారము. వీరందరు నిత్యము నాయందుందురు. అను నీ మంత్రమును శ్రాద్ధము ముందు అవసానము నందు ముమ్మారులు జపింప వలెను. పిండ నిర్వహణ సమయ మందు కూడ నిట్లు జపింప వలెను. ఈ మంత్రము వలన పితృ దేవతలు పరుగు పరుగున వత్తురు. రాక్షసులు పారి పోవుదురు. ముల్లోకములు తృప్తి చెందును. ఇది తరింప జేయును.

పిండములను అగ్ని యందుంచిన భోగ సమృద్ధి గలుగును. భార్యకు పెట్టిన సంతానము కలుగును. మధ్య పిండము మాత్రము ఇట్లు చేయ వలెను. గోవులకు పెట్టినచో మంచి తేజస్సును బడయును. ఉదకము లందు వేసిన ప్రజ్ఞ కీర్తి యశస్సు కలుగును. దీర్ఘా యుర్దాయము కోరువాడు కాకులకు పెట్ట వలెను. కుమారశాలను కోరువాడు కోళ్లకు పెట్ట వలెను. కొందఱు పండితులు ఆగ్రభాగము నుండి పిండముల నెత్తవలె ననిరి. బ్రాహ్మణానుజ్ఞ పొంది పిండో ద్ధరణము చేయ వలెను. ఇది యథావిధిగ ఋషులు చెప్పిన శ్రాద్ధ విధానము. ఇంకొక లాగు చేసిన దోషము కలుగుటయే గాక పితృ దేవతలకు ముట్టదు. యవలు వ్రీహులు తిలలు గోధుమలు శనగలు పెసలు చామలు ఆవాలు నీవారములు హస్తిశ్యామాకములు ప్రియంగులు సతూలిక ప్రాసాతిక = అణువ్రీహి ఇవి శ్రాద్ధ ప్రశస్తములు. మామిడి కాయ ఆమ్రాతకము భిల్వము దానిమ్మ బీజ పూరము ప్రాచీనామలకము పాలు కొబ్బరి పరూషకము నారంగము (నారింజ) ఖర్జూరము ద్రాక్ష నల్లవెలగ పొట్ల ప్రియాలు = చారకర్కంధువు బదరము (రేగు) వితంకతము (కానరేగు) వత్సకము = కొడిసె చెట్టు కస్తాళువు వారకము వీని పండ్లను శ్రాద్ధము నందు పెట్ట వలెను. ఆవు పాలు పెరుగు నెయ్యి నువ్వుల నూనె సైంధవ లవణము సముద్ర లవణము సారసము = సరోవర జలము వీనిని నివేదింప వలెను. చందనాగురు కుంకుమాది సుగంధములను కాలశాకము = కరివేము జాజి చంపకము లొద్దుగ మల్ల బాణ కుసుమము బర్బరి అశోకము వృంతాశోకము అటరూశము మామిడి తిలకము తామర గంధ సేఫాలిక కుబ్జకము తగరము ఆరణ్య మృగమను నొక జాతిపువ్వు మొగలి యూధిక ఆలిముక్తము కమలము కుముదము పద్మము పుండరీకము ప్రయత్న పూర్వకముగ కొనివచ్చి పితరుల నర్చింప వలెను. నల్ల గలువ ఎఱ్ఱ గలువ కల్హావారము (ఎర్రతామర) కుష్టము మాంసి బాలకము కుక్కటి జాతివశ్రకము (జాపత్రి) నశిక ఉసీర ముస్తమలు గ్రంధివర్ణి మొదలైన పరిమళ ద్రవ్యములు పితృ ప్రీతికరములు. ఆగరు గుగ్గులు చందనము శ్రీవాసము మొదలగు నవి పితృ యోగ్యము లైన ధూపములు. ఋషి గుగ్గులము కూడ. రాజమాషములు (బొబ్బర్లు) శనగలు మనూరములు కోర దూషకములు విప్రషములు మర్కటములు కోద్రనములు అనునివి పితృ తిధి యందు నిషిద్ధములు. గేదెపాలు పెరుగు. తాటిపండు జంబీరము ఎర్రమారేడు పండు శాల ఫలము నిషిద్దములు. చేప పంది తాబేలు ఆవు అనువాని మాంసములు మిక్కిలి వర్జ్యములు. పూతికము మృగనాభి గోరోచనం పద్మ చందనము కాలేయకము ఉగ్ర గంథము తురుష్కము పాలంకము వరుమచనుపత్రిక కుమారి కిరాతము పిండ మూలికము గ్రుంజనము చుక్రికచుక్రము జీవశత పుష్ప నాలిక గంధ శూకరము హలభృత్యము సర్షపము నీరుల్లి వెల్లుల్లి మాన కందము విష కందము వజ్ర కందము గదాస్థికము పురుషాల్వము పిండాలువు నిషిద్ధములు. ఆనప తిక్తపర్ణ గుమ్మడి (త్రికటుకము) కరక తిండి ఉసిరికను వార్తకము (వంకాయ) శివి జాతము. కాలీయము రక్తవాణ చిలికల కుచము విభీతక ఫలము (తాండ్రము) ఆరనాలము. శుక్తము శీర్ణము పర్యుషితము ఉగ్ర గంథము కోవిదారము (కాంచన వృక్షము) శిగ్రువు (ములగ) పనికి రావు. మిక్కిలి పులుపు పిచ్ఛిలము. సూక్ష్మము యాతయామము గతరనము మద్య గంధము ఇంగువచే నుగ్ర గంధమైన పదార్థములు ఫణిశము భూనింబము నింబము రాజికము కలింగదేశపు కుస్తుంబరువు (కొత్తిమిర) అమ్ల కేతనము (పుబ్ల ప్రబ్బ) నిషిద్ధములు. దానిమ్మ మాగది నాగరము ఆర్ద్రక తిత్తిడి అమ్రాతకము జీవకము తుంబురువు అనునవి వినియోగింప వచ్చును. పాసము శాల్మలీ ముద్రములు (కజ్జి కాయలు) మోచ కాదులు పానకము తియ్య మామిడి పండ్లు ఆవు పాలు ప్రశస్తములు. రుచి గల్గి స్నిగ్ధములు కొలది పులుపు కొలది కారము గల పదార్థములు ప్రశస్తములు. కాఱు పులుపు కాఱు ఉప్పు మిక్కిలి చేదు కారము గల ఆసురా హారములను దరికి చేరనీయ రాదు. స్వాదువులై దైవ భోజ్యము లయిన వానినే యేర్పరుప వలెను. మేక కార్తిక పక్షి తిత్తిరి కుందేలు మున్నగు వాని మాంసములు పెట్ట వచ్చును. వాఘ్రాణసము రక్తశివము శల్కముతో గూడిన లోహము సింహతుండము ఖడ్గము ననునవి యోజ్యములు. రోహితమును (చేపను) హన్యకవ్యము లందు పెట్టవచ్చు నని మనువు చెప్పెను.

ఈ శ్రాద్ధ కల్పము వారాహుని చేత తృష్టము దీతికి వారహ శ్రాద్ధ కల్పమను ప్రసిద్ధి కలదు. ఇందు నిషిద్ధ పదార్ధము లను శ్రాద్ధము లందు బ్రాహ్మణులకు పెట్ట రాదు. తినరాదు. రోహితము శూకరము తాబేలు ఉడుము మాంసము పనికి రాదు. చక్రవాకము మద్గువు = నీటి కాకి ఎముకలు లేని చేపలు ఎముక లేని కురరము = కురల పక్షి కలవింకము = ఊర పిచ్చుక నెమలి భారాద్వాజ పక్షి శార్జక పక్షి ముంగిస గుడ్లగూబ తిత్తిరిపక్షి నక్క పెద్దపులి ఎలుగొడ్డు తరక్షువు ఈ పదార్ధములు పెట్టిన రౌరవ నరకము వచ్చును. అదిగాక స్వర్గము నందున్న పితృ దేవతలును కూడ నరకమున బడ వేయుదురు. కుసుంభ శాకము జంబీరము సిగ్రుకము కోవిదారము పిణ్యాకము(తెలక పిండి) విప్రుషము మసూరము. గుంజనము శణము కోద్రవము కోకిలాక్షము చక్రము కంబుకము పద్మకము చకోరము డేగ గుండ్రానపు కాయ తాళిని తాటుపండు నివి నరక ప్రదములు. వానిని పెట్టిన యజమాని పితృ దేవతలతో బాటు పూయవహమను నరకమున బడును. వరాహ శ్రాద్ధ కల్ప నిషిద్ధము లైన యీ వస్తవులను పెట్టి తినుట కంటె ఆత్మ మాంస భక్షణము సేయుట మేలు. పొర బాటుచే తెలియక యివి పెట్టినను తిన్నను ప్రయశ్చిత్తము చేసుకొన వలెను.

ప్రాయశ్ఛిత్తములు

పళ్ళు దుంపలు పాలు పెరుగు మజ్జిగ గోమూత్రము గంజి ఏడు రోజులు తీసు కొనినచో అభోజ్యాన్న భోజన దోషము పోవును. మరియొక విశేషము. విష్ణు భక్తుడు విధి విధానముగ నిట్లు శ్రాద్ధము పెట్టి ఆబ్రాహ్మస్తంబ పర్యంతమైన జగత్తును సంప్రీతి నందించును.

తండ్రి బ్రతికి యుండగ దండ్రి యొక్క తలిదండ్రులు పోయి నపుడు చేయ వలసిన విధాన మేమన

తండ్రి బ్రతికి యుండి ఎవనికి తద్దినము పెట్టునో కొడుకు దానిని స్వయముగ పెట్ట వలెను. లౌకిక వైధిక ధర్మములు రెండును దీని వలన లోపింపవు. (తండ్రి తన తండ్రికి తద్దినము పెట్టుచుండ కొడుకు తాతకు తద్దినము పెట్టనక్కర లేదన్న మాట) తండ్రి పోయి పితామహుడు బ్రతికి యున్నప్పుడు కొడుకు తండ్రికి పిండము వేసి పితా మహునిచే భుజింప జేయ వలెను. ప్రపితా మహుని నుద్ధేశించి పిండమును వేయ వలెను. ఇది శాస్త్ర నిర్ణయము. పోయిన వారికి పిండము పెట్ట వలెను. ఉన్న వారికి అన్నము పెట్ట వలెను. సపిండీ కరణము పార్వణ శ్రాద్ధము వీని యందు లేవు. పితృమేధ కల్ప మనుసరించి ఆచారము పాటించిన వాడు ధనధాన్య ఆయురారోగ్య పుత్ర పౌత్రాదులతో వర్థిల్లును. ఈ పితృమేధా ధ్యాయమును శ్రాద్ధకాల మందు పఠించిన యెడల ఆ యజమాని ఇడిన అన్నమును పితృ దేవతలు మూడు యుగము లనుభవింతురు. ఈ పితృ మేథ కల్పము పాపహరము. పుణ్య వివర్థనము శ్రాద్ధము లందు దీనిని కీర్తింప వలెను. శ్రద్ధతో విన వలెను.