బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

68 - విష్ణులోక వర్ణనమ్‌

విష్ణు లోక ప్రమాణము అచటి భోగములు కాంతి బలము తెల్పుము. ఏ ధర్మాచరణము వలన విష్ణు లోకము లభించునో తెల్పుమన బ్రహ్మ యిట్లనియె.

విష్ణు లోకము సంసార నాశకము. సర్వాశ్చర్య స్థానము. అశోకాది సర్వ వృక్ష సంకులము. కల్పవృక్ష స్థానము. సర్వర్తు పుష్ప ఫల సుందరము. పద్మములు కలువలు నానా విధ జల పక్షులు గల దిగుడు బావులు, సరస్సులు నందు గలవు. కామగము లైన బంగారు విమానములపై వేల్పులు విహరింతురు. అవి వాయువు కంటె మనస్సు కంటె మించిన వేగము గలవి. పరమ సుందరు లైన దేవతా స్త్రీలు అట కేగిన పుణ్యాత్ములను చుట్టుకొని వారు ఛత్ర చామరములు పట్టి సంగీత నృత్యాదులచే నానందింప చేయుదురు.

దక్షిణ సముద్ర తీరమున పెద్దమఱ్ఱి చెట్టు దగ్గర గల కృష్ణ భగవానుడు అప్సరసలతో దర్శన మిచ్చును. కృష్ణ సారూప్యము నందిన కృష్ణ భక్త బృందము విష్ణు పురము నందు దర్శన మిత్తురు.

మేలిమి బంగారము రంగు గల్గి యనేక రత్న భూషితమై బహు పతాక సమలంకృతమై బంగారు ప్రాకారమున జుట్టుకొని యోజన విస్తార మైన హరి మందిరమా విష్ణు పుర మధ్య మందు భాసిల్లు చుండును. చుక్కల నడుమ నున్న శరశ్చంద్రుని వలె యది ప్రకాశించు చుండును. కంచు కధారులైన ద్వార పాలకులు ఆ పురమునకు గల నాలుగు ద్వారములకు రక్ష యిచ్చు చుందురు. ఆ లోపల స్వర్ణ మయము. మరకత మణి మయము ఇంద్ర నీలము మహా నీలము పద్మరాగ మణి మయము వజ్ర మయము వైఢూర్య మయము నైన యేడు పురములు వైకుంఠ లోకములో నున్నవి. అందలి స్తంభములు రత్న మయములు. పవడపు కర్రతో తయారు చేసినవి. అచట మహా సిద్ధులు తమ తేజస్సు చేత దశ దిశలను వెల్గింతురు. వారి నడుమ నక్షత్రములు నడుమ నున్న పున్నమి చంద్రుని వలె మేఘ శ్యాముడు పీతాంబర ధారి శ్రీవత్సాంకితుడు నైస శ్రీహరి శ్రీదేవితో ప్రకాశించు చుండును. ఆయన కుడి చేతిలో సుదర్శన చక్రము ఎడమచేత యచ్చము తెల్లనైన శంఖము విలసిల్లు చుండును. ఆ శంఖము వేయి సుడులు గలది. పాంచజన్య మను పేరు గలది. ఆ శంఖ నాథమున సకల జనము సంక్షోభించును. ఆయన యొక్క కుడి చేతి లోని దైత్య దానవ నాశకము జ్వలదగ్ని ప్రకాశము. సర్వపాప వినాశకము నైన కౌమోదకి యను గద రాణించు చుండును. ఎడమ చేత సూర్యునట్లు వెల్గు శార్ఙ్గమను ధనువు అగ్ని జ్వాలలను చిమ్ము బాణములును దీపించు చుండును. ఆ స్వామి సర్వలోక సృష్టి స్థితి సంహారకుడు సర్వశాస్త్ర నిపుణుడు. సర్వ జగద్గురువు. సహస్ర శీర్షుడు. సహస్ర పాదుడు. ఆ ప్రభువు సింహాసన మందు ఆసీనుడై యుండును. ఆయన కనులు తామర రేకులు. ఆయన మేని తళుకు మెఱపు తీగ సొంపుగులుకు చుండును. సురసిద్ధ గంధర్వాదులతో మునులతో సుపర్ణులతో మరిగల సురాసుర ప్రభువు లందరితో పేరోలగ ముండి వారు చేయు స్తుతుల నవధరించు చుండును. అచట కీర్తి మొదలుకొని మాయ వఱకు గల ఆయా శక్త్యధిష్ఠాన దేవతలు ఆయన భవనమున కొలువు చేయు చుందురు. ఘృతాచి మొదలు నవగర్భ వరకు గల యప్సరసలు రూపయౌవన శాలినులు స్వామి పేరోలగము నందు నాడుచు పాడుచు హరిని సేవించు చుందురు. అటగల వారికి రోగము నీరసము మృత్యువు యెండ చలి ఆకలి దప్పిక దుఃఖము విరూపము కలుగవు. విష్ణు భువనము పరమానంద బనకము. సర్వాభీష్ట ప్రదము. పుణ్యులు పొందుత్తమ లోకము లన్నియు విష్ణు లోకము యొక్క పదునారవ కళకు కూడ సరి తూగవు. ఇట్టి పుణ్య లోకమునకు నాస్తికులు విషయ లంపటులు కృతఘ్నులు పిసినారులు దొంగలు ఆజితేంద్రియులు చేరలేరు. విష్ణు భక్తులై దక్షిణ సముద్ర తీర మందలి క్షేత్రమును సేవించి సుభద్రా రామకృష్ణుల నర్చించిన ధన్యులే పొంద గలరు. పురుషోత్మ క్షేత్ర మందు కల్ప వటవృక్ష సముద్ర మధ్య మందు మరణించిన వారు ఈపర మోత్తమ స్థానమున కేగుదురు. సనాతనము సర్వానందకరము. భుక్తిముక్తి ప్రదమునైన హరి లోకమును గురించి మీకు తెలిపితిని.