బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

1 - అధ్యాయము

ఎవని వలన నీ కనిపించెడి పంచభూత పంచీకృతము మాయా కల్పితమునైన జగమెల్ల పుట్టు చున్నదో యెవ్వని యందునికిని (స్థితిని) పొందు చున్నదో ఎవ్వని యందు చిట్టచివఱ కల్పము నందు అనుకల్పమునను లీనమగు చున్నదో యెవ్వని ధ్యానించి మునులు దృశ్యాత్మక ప్రపంచమునకు నతీతమైన, శాశ్వతమైన, మోక్షమును బొందుదురో యట్టి నిత్యమైన నిశ్చలమైన స్వయం ప్రకాశమైన పురుషోత్తముడని పిలువబడు స్వచ్ఛమైన తత్వమును పరమాత్మను నమస్కరించు చున్నాను.

ఎవనిని శుద్ధుని (గుణ రహితుని) యాకాశము వలె సర్వ వ్యాపకుని సమాధి సమయ మందు జ్ఞానులు ధ్యానింతురో యట్టి నిత్యానంద స్వరూపుని ప్రసన్నుని, నిర్మలుని నిర్గుణుని సర్వేశ్వరుని వ్యక్తావ్యక్త స్థితికి నతీతమైన వానిని ప్రపంచ శూన్యుని (ద్రష్టయైన వానిని) ధ్యానమాత్ర గమ్యమైన ప్రకాశ రూపుని, జనన మరణాత్మక సంసార వినాశ హేతువైన వాని నజరుని మోక్ష మనుగ్రహించు వానిని (ముకుందుని) హరిని ధ్యానింతును.

నైమిశారణ్య వర్ణనమ్‌

అది మిక్కిలి పుణ్య వంతమైన నైమిశారణ్యము. పవిత్రభూమి. పరమ సుందరము. మునిజన సమ్మర్దము. పలు రకముల పువ్వులతో శోభించు చున్నది. సరళ = తెల్లతెగడ, కొండగోగు, పనస, ధవ = ఉమ్మెత్త, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ మఱ్ఱి, దేవదారు, రావి, పారిజాత, చందన, అగరు, పాటల (కలిగొట్టు) వకుల (పొగడ) సప్తవర్ణ (ఏడాకుల అరటి), పున్నాగ సుర పొన్న నాగకేసర = నాగ కింజల్కము, శాల = బొద్దుగ తాల (తాడి) తమాల (చీకటి మ్రాను) నారికేళాది, అర్జున (జువ్వి) మహా వృక్షములతో, చంపకాది (సంపెంగ) లతలతో శోభితము, వినిధపక్షి మృగకుల సంకులము, నానావిధ పుణ్య సరస్సులు దిగుడు బావులతో శోభిల్లు చున్నది. బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు, బ్రహ్మచర్యాది నాల్గా శ్రమముల వారు స్వధర్మానుష్ఠాను నిరతులై యందు వసింతురు. సర్వ సంపన్నమైన గో సంపదతోనది రాణించును. యవ గోధుమ, చణక (సెనగలు), మాష (మినుము) ముద్గ = (పెసర), తిల = (నువ్వు), ఇక్షు = చెఱకు మెదలగు సస్యములతో నిండినది. అందగ్ని హోత్రుడు ఆజ్యాదిహవిర్హోమములచే నుద్దీపింప నైమిశారణ్య వాసులగు మును లారంభించిన ద్వాదశ వార్షిక సత్ర యాగమునకు మునులు మఱి ద్విజు లెందఱో యేతెంచిరి. వారి వారికి యజమానులు యథోచిత పూజ లాచరించిరి. ఋత్విక్కులతో వారు యజ్ఞ సదస్సు నందాసీనులై యుండ బుద్ధిమంతుడు లోమహర్షణుడను సూతు డరుదెంచెను. మునివరులాయనం గని ముదముతో పూజించిరి. ఆయనయు వారికి బ్రతి పూజ చేసి వారిడిన యాసన మలంకరించెను. ఋషు లన్యోన్య ప్రసంగములు కావించిరి.

ఋత్విక్కులతో సదస్సులతో గోష్ఠి అయిన తరువాత యజ్ఞ దీక్షితు లాయన నిట్లు ప్రశ్నించిరి. సాధూత్తమ వేదశాస్త్ర పురాణము లందు భారతే తిహాస మందు మోక్ష శాస్త్రమగు భాగవతము నందును నీవు సర్వము తెలిసిన వాడవు. దేవతల యొక్కయు దైత్యుల యొక్కయు జన్మకర్మ వృత్తాంతములు నీకు తెలియనివి లేవు. సురాసుర యక్ష గంధర్వ పన్నగ రాక్షస వర్గము తోడి యీ సృష్టి యెట్లు జరిగినది? ఎట్లు పెరిగినది ఎట్లంత మయినది వినదలంతు మానతిమ్ము.

అవికారుడు = షడ్భావవికారములు 1. ఉనికి, 2. పుట్టుట. పెరుగుట, 4. తఱుగుట, 5. పరిణమించుట (మార్పు చెందుట) 6. నశించుట అను నాఱు వికృతులు లేని వాడు, శుద్ధుడు (ఎట్టి గుణ సంగము లేనివాడు) నిత్యుడు నిత్యసత్తా స్వరూపుడు విష్ణువు (సర్వ వ్యాపకుడు) సర్వము జయించు వాడు హిరణ్య గర్భుడు సృష్టికర్త హరి శంకరుడు. వాసు దేవుడు సర్వ దేవతలకు (జ్యోతి స్వరూపులకు) నివాసమైన వాడు తరింప జేయువాడు సృష్టి స్థితి లయములను జేయువాడు ఏక రూపము నానారూపము తానేయైన వాడు స్థూలము= సాకారస గుణ రూపము. సూక్ష్మము= అంతర్యామి జ్ఞాన రూపము నైనవాడు. ఆవిధముగ వ్యక్తము అవ్యక్తము నైనవాడు ముక్తికి కారణమైన వాడు, జగన్నిర్మాణ పరిపాలన లయములు చేయువాడు, అజరుడు ముదిమి లేనివాడు, అమరుడు, మరణము లేనివాడు, సర్వ మూలము (బీజము) నైనవాడు నైన యా పరమాత్మకు నమస్కారము. నమస్కరించుట యనగా ప్రహ్వీ భావము విధేయు డననుట అభేదాను సంధానము కూడ.

వ్యాస స్తుతి

ప్రపంచమున కాధారమైన వాడు అణువు కంటె నణువైన వాడు సర్వ భూతము లందుండు వాడు అచ్యుతుడు, జ్ఞాన మూర్తి మిక్కిలి స్వచ్ఛమైన వాడు పరమార్థముగ నిర్మలుడు (గుణ సంగములేని వాడు) భ్రాంతి దృష్టికి జగముగ (వస్తువుగ) దోచువాడు సర్వ వ్యాపకుడు సర్వము కబళించు వాడు సృష్టి స్థితుల జేయు స్వతంత్రుడు సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పుట్టుట హానివృద్ధులు లేనివాడు ఆద్యుడు మిక్కిలి సూక్ష్మమయిన వాడు నగు విశ్వేశుని బ్రహ్మాదులకు నమస్కరించి ఇతిహాస పురాణ వేత్త వేదవేదాంగ పారగుడు సర్వశాస్త్ర తాత్పర్య రహస్య మెఱిగిన వాడు పరాశర కుమారుడు నగు వ్యాస భగవానుని నా గురుని మ్రొక్కి వేద తాత్పర్యమయిన పురాణమును జెప్పు చున్నాను.

శా: సాంగో పాంగ సమగ్ర వేదవిదునిన్‌ శాస్త్రార్థ తత్వైక వే

త్తం గంభీర పురాణ భారత మహార్థ జ్ఞానసంపన్ను న

న్నుం గారామున నేలినట్టి గురునెంతున్‌ వ్యాసు బారాశరున్‌

రంగత్సర్వ పురాణ పుణ్య వచన ప్రారంభ సంరంభినై

తే.గీ. అణువుకంటెను నణువు మహత్తుకంటె

మఱి మహత్తౌచు విశ్వ సంభరణ దక్షు

డైన పురుషోత్తముని నెందు నంతువడని

వాని భగవంతు పరమాత్మ భక్తి గొలుతు

సీ. బుద్ధికి సాక్షియై పోల్పరాకయు మనోవ్యాప్తికిన్‌, ధ్యానాన నందువాని

శుద్ధ బుద్ధ ముక్తి సూక్ష్మాత్ముడై సర్వ భూతమ్ము లందును బొలుచు వాని

పుట్టింప బెంపంగ గిట్టింప హేతువ ట్లుండి హేతువు కాక యుండు వాని

అచ్చమౌ తెల్వియై యానందమై భ్రాంతి దృష్టికి జగముగా దెలియు వాని

పుట్టుటయు గిట్టుటయు లేక పొలుచు వాని

యునికిలేములు లేనట్టి యునికి వాని

పూర్ణు విశ్వాత్ము విష్ణువున్‌ మ్రొక్కి బ్రహ్మ

మొదలుగాగల వేల్పుల నిదె వచింతు

మును దక్షాది మును లడుగగ బ్రహ్మ పలికిన కథ పాపహర మిదే చెప్పెద వినుడు. ఇది యర్థ గంభీరము బహు చిత్రము వేదార్థ విస్తరము. దీని నెపుడు ధారణ జేయువాడును, వినునతడును స్వ వంశోద్ధరణ మొనరించి స్వర్గ మందాదరింప బడును.

ఆది సర్గవర్ణనమ్‌

తెలియ రానిది యవ్యక్తము సర్వ కారణము నిత్యము నున్నదియు లేనిదియు నైనది ప్రధాన మొకటి గలదు. దాని నుండి విశ్వమును సృజించెను. అదియె తత్త్వము బ్రహ్మ. సర్వభూత స్రష్ట, ఆతడు నారాయణ పరాయణుడు. అదిమ మహత్తత్వము (బుద్ధి) అందుండి యహంకారము అందుండి భూతములు (5) జనించెను. వాని స్థితి భేదమును బట్టి వివిధ భూతకోటి పుట్టినది. ఇదియ సనాతన మగు ధర్మము సర్గము (సృష్టి) మీ కీర్తి నినుమడింప జేయునది ఇవే యీ సృష్టి విలాసము. నా విన్నంత శ్రుతుల వలన నా తెలిసినంత సవిస్తరముగ విన్నవింతు వినుండు. ఇది కీర్తి శాలుర కెల్లరకు పుణ్యము బెంచును.

ఆ మీద స్వయంభువు (బ్రహ్మ) తొలుత అప్పులను సృజించెను. అప్పులు అనగా ప్రకాశోదకము. అందు తన వీర్యమును వదలెను. వీర్య మనగా సృష్టి సంకల్పము. “సఐక్షత బహుస్యాం ప్రజాయేయేతి” అనగా తానే బహు రూపములుగా పుట్ట వలెనని చూచెను. అని ఈ సంకల్పమునే వేదము తెల్పినది. అప్పులకు నారములని పేరు. అవి నరుల సృష్టికి మూలములు. అవి మొదటి గమ్య స్థానములయి నందున ఆయన నారాయణుడను పేరొందెను. ఆయన వదలిన వీర్యము బంగారు గ్రుడ్డయి అప్పుల యందు (ఉదకము లందు) తేలినది. ఆ ఆండము నందు బ్రహ్మ తానే స్వయంభువు అనుపేర జనించెను. అందుచే నాయనకు “హిరణ్య గర్భుడ”ను పేరు వచ్చెను.

ఆ హిరణ్య గర్భుడు ఒక పరివత్సర మట్లే యుండి యబ్రూపమైన యా తత్వమును దివము. భువమను పేర రెండుగా నొనరించెను. ఆ రెండు శకలముల నడిమి యవ కాశమును నాకాశముగ గావించె. అప్పులందు మునిగిన భూమిని దేల్చి దిక్కులను బదింటిని గల్పించెను. అందే కాలము మనస్సు వాక్కు కామము క్రోధము రతియను వానిని సృజించెను. ఆ రూపమున సృష్టిని గావింప నెంచి మరీచి అత్రి అంగిరస్సు పులస్త్యుడు పులహుడు క్రతువు, వసిష్ఠుడు నను వారిని మనస్సు చేత సృజించెను. వీరు సప్త బ్రహ్మలను పేర ప్రసిద్ధి చెందిరి. ఈ సప్త బ్రహ్మ మానస పుత్రుల కంటె ముందే బ్రహ్మ తన రోషము నుండి రుద్రుని సృజించెను. పూర్వుల కెల్ల బూర్వుడయిన సనత్కు మారుని గూడ సృజించెను. మును చెప్పిన సప్తబ్రహ్మల నుండి ప్రజలు రుద్రులు జనించిరి. స్కందుడు సనత్కుమారుడును దమ తేజస్సును దమలో గుప్త పఱచుకొని యుండిరి. అనగా వారు సృష్టి కున్ముఖులు కారైరి. సప్త బ్రహ్మల వంశములు దేవతలు దేవ గణములతో గూడినవి. వారందరు క్రియా వంతులు నగు గృహస్థులైరి. మహర్షుల పరంపర యిదియే, బ్రహ్మ మెఱుపులను పిడుగులను మేఘములను లోహితములను ఇంద్ర ధనుస్సును పక్షులు మొదలగు వానిని సృజించెను. యజ్ఞార్ధము ఋగ్యజు స్సామ వేదములను జనింప జేసెను. సాధ్యులను గనెను. ఆయన మేని నుండి యుచ్చా వచములగు భూతములెన్నో పొడమెను. అట్లు గావించు తన సృష్టి వృద్ధి బొందకుండుట గాంచి తన శరీరమునే రెండు గావించి సగ భాగమును పురుషుడు సగ భాగమున స్త్రీయు నయ్యెను. ఆ స్త్రీయందాతడు వివిధ ప్రజలను గనెను. అతడు భూర్భువ ర్లోకములను వ్యాపించి విష్ణువని పేరందెను. ఆయన విరాట్పురుషుని సృజించెను. అతడు మనువును సృజించెను. ఆయన తరమే మన్వంతరము. బ్రహ్మ మానస సృష్టిలో నిది రెండవది. ఆ మనువు ప్రజాసర్గ మొనరించెను. నారాయణుని విసర్గ మిది. ఈ సృష్టిలోని సంతానము కూడ నయోనిజమె బ్రహ్మ పురాణ మందాది సర్గమను దీనిని దెలిసిన యతడు ఆయుష్మంతుడు కీర్తి మంతుడు నగును. సంపూర్ణ ప్రజ్ఞావంతుడై యభీష్టగతి నొందును.