బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

193 - కుబ్జోద్ధార వర్ణనమ్‌

అవ్వల కృష్ణుడు రాజ మార్గము వెంట సుగంధ ద్రవ్య పాత్రను జేకొని వచ్చు చున్న నవ యౌవనశాలిని యగు కుబ్జను జూచెను. ఇందీవ రాక్షి! ఈ యనులేపన మెవఱి కొఱకు గొంపోవు చున్నావు. నిజము జెప్పుమని పలుకరించెను. సాభిలాషముగ హరి ముచ్చటింప నదియు ననురక్తి గొని యా సుందరుని జూచి నంత వివశమైన మనస్సును బలిమియై నిలిపి హరితో సొంపుగ నిట్లు పలికెను.

“కాంత! నీవేల యెరుగవు. నేను సుగంధ ద్రవ్యాను లేపన కార్యక్రమమున కంసునిచే నియోగింప బడిన దానను. లనేక వక్ర యను బ్రసిద్ది గన్న దానను. కంసునికి నాకూర్చిన కలపము దప్ప ఇతరము ప్రియము కాదు. అతని యనుగ్రహ సంపదకు నేను పాత్రమును”

 “సుందరముఖి; రాజున కర్హమైన యీ మంచి గంధము మేమిద్దరము పూసికొన దగినది. అది మాకిమ్ము”.

అన నది వెనువెంటన ‘దీసికొమ్మ’ని యాదరముతో వారి కిచ్చెను. వారు చిత్ర చిత్ర రచనలుగా నా గంధమును బూసికొని యింద్ర ధనస్సుతో శోభించు తెల్లని నల్లని మేఘము లట్ల భాసించిరి. అంతట హరి యుల్లాపన నిపుణుడు గావున (మధుర హాస్య వచన రచనా నిపుణుడు గావున) దాని గడ్డము క్రింద జేయి జేర్చి దాని పాదము లందన యదుగులం ద్రొక్కిపట్టి (భక్రుల నుద్ధరించు నెరజాణ గావున) యామెను మీదికెత్తి లీలగ నిట్టట్టు లూచెను. దాన నయ్యింతి మేని మంద్రముగ మా యింటికి రమ్మని పలికి సవిలాసముగ నతని పై వలువ గొని యాకర్షించెను. స్వామి తప్పక వచ్చెద ననెను. ఆ విలాసిని బలభద్రుని వంక నల్లనం గనుచు బిట్టు నవ్వి కృష్ణుని వదలెను. ఆమె యిచ్చిన యామంచి గంధము నయ్యిద్దరు బూసికొని రంగు రంగుల పూల మాలలం దాల్చి నీలాంబర పీతాంబర ధారులై ధనుశ్శాలకుం జనిరి. ధనుర్యాగమునకు నిర్దిష్టమైన ధనుశ్రేష్ఠ మెక్కడ నున్నదని శాలా రక్షకుల నడిగి తెలిసికొని హరి యపుడ దానం గొని యెక్కు పెట్టెను. ఎక్కిడి నది తడవుగ నది విరుగ నెడలిన చప్పుడు మధుర నలు మూలల నలమెను. అవ్విల్లు విరుగుట జూచి శాలా రక్షకులు మీరెవ్వరని ప్రశ్నింప బదులు వలుకకయే యా యన్న దమ్ములు ధనుశ్శాల నుండి వెడలిరి.

కంసు డక్రూరుని రాకను రామ కృష్ణులు ధనస్సును విరచుటను విని చాణూర ముష్ఠికులను జూచి

“గోపాల బాలకు లిద్దరు వచ్చినారు. మల్ల యుద్దమున నా ప్రాణమును హరించు వారిని మీరు సంహరింపుడు. అందు వలన నేను సంతోషిం చెదను. న్యాయాన్యాయ విచక్షణ లేకుండ నెట్లైనను మీరు వాండ్రసు గడతేర్ప వలెను. దాన మీకోరిన దెల్ల దీర్చ గలను. వారి వధ వలన నీ రాజ్యము నాకును మీకును నుమ్మడి సొత్తు కాగలదు” అని యా మల్లుర కాజ్ఞ యిడి మావటి వానిం బిలిచి “నీవు మదపు టేనుగును సమాజ ద్వారమున నిలుపుము. కువలయా పీడమను నమ్మదగజము చేత మల్ల రంగ ద్వారమునకు వచ్చిన యా గొల్ల పిల్లలను ద్రొక్కింపుము”. అని యాన యిచ్చి కంసుడు పోగాలము దాపురించిన యా దుష్ఠుడు సూర్యో దయమున కెదురు చూచు చుంచెను.

పౌరులు మంచెము లందును రాజులు భృత్యులతో నేగి రాజుల కుచితము లగు మంచెము లందధిష్ఠించిరి. మల్లురు ప్రాశ్నికులు (మధ్య వర్తులు) అ సభా రంగమున నడిమి భాగమున వసించిరి. కంసుడు అందరి కంటె నెత్తైన మంచెము నందు (సోఫా) ఆసీను డయ్యెను. అంతఃపుర జనము వసింప వేర్వేర మంచెము లమర్ప బడెను. వార స్త్రీలకు నొకచో నగరాంగనల కొకచో నందాది గోపకు లొకచో నాసీను లయ్యిరి. అక్రూర వాసుదేవులు ఆ మంచె ప్రాంతమున నుండిరి. పౌరాంగనల నడుమ పుత్ర వాత్సల్య భరిత యగు దేవకి నా బిడ్డ నెమ్మోము తుది గడియలో నైన జూతును గాకయని కూర్చుండెను.

ఉత్సవ వాద్యములు మ్రోయ చాణూరు డెగిరెగిరి గంతు లిడుచుండ ముష్ఠికుడు బాహువులు చరచ లోకము హాహాకార మొనరింప మావటీడు తమ మీదికి దోలిన కువలయా పీడమును జంపి దాని మదముచే రక్తముచే శరీరములు పూతవడ దాని దంతములు పెరికి ఆయుధము లుగ ధరించి సగర్వ విలాసమున జూచుచు మృగముల నడుమ మృగరాజు లట్లు బలరామ కృష్ణులు మల్ల రంగమును బ్రవేశించిరి. అంతట నన్ని రంగము లందు నితడే కృష్ణుడు ఇడుగో బలభద్రుడని వింతగొని జనము చేయు ఆహాకారము మిన్నంటెను. “ఘోర రాక్షసిని పూతనను జంపిన యతడే యితడు. శకటాసుర భంజనము యమలార్జు నోన్మూలనము జేసిన యతడు కాళియ ఫణి ఫణాగ్రమున నర్తనము జేసిన యా బాలు డితడే. గోవర్థన మహా గిరిని యేడు రోజులు ఎత్తి పట్టిన బలుదిట్ట యాతడు. అరిష్ట, ధేనుకులను గేశి యను హయమును విలాసముగ జంపిన మహాత్ము డచ్యుతు డీతడే. ఇతని ముందు సవిలాసముగ నీ మల్ల రంగమున పచారు చేయుచున్న సుందరీ నయనా నందనుడు యదు నందనుం డిడుగో! బలరాముడు. ఈ స్వామి హరి పురాణార్ధములను లెస్సగ చూచిన ప్రాజ్ఞులు. గోపాల మూర్తియై కంసునిచే దిగబడి యున్న యదు వంశము నుద్ధరింపగలడని పొగడొందిన బాలు డిడుగొ. ఇతడు సర్వసృష్టి హేతువు సర్వము దానైన విష్ణువు నంశమున నవతరించి భూ భారము హరింప నున్నాడు.” అని యిట్లు బలరామ కృష్ణులను బౌరులు కొనియాడు చుండ దేవకి పాలుచేపుకొన నా బిడ్డలం గని మనసు నందాపము వొందెను. మహోత్సవము చూచు చున్న నెపమున తన పుత్రులనే చూచుచు పై గదిసిన ముదిమిని (వార్ధక్యము) బాసి యువకు డట్లై వసుదేవుడు తనిసెను. శుద్ధాంతః స్త్రీలు నాగర స్త్రీ సమాజము కనుగవ లల్లార్చి యవిరామముగ నా రామ కృష్ణులను దిలకించిరి. మఱియు నిట్లొండొరులతో మురిసి ముచ్చటింప జొచ్చిరి.

సఖులార! కమలము లట్లింపు గొలుపు కృష్ణుని నెమ్మోము గనుడు. ఏనుగు తోడి పెనుగు లాట నొడవిన శ్రమచే గ్రమ్మిన చెమట బిందువులతో హరి వదనము మంచు బిందువులు పైబడిన వికసిత నవాంబుజ మట్లు సొంపు గులుకు చున్నది. అల్లదే చూడుడు. అక్షరము (ఆవినాశి) అయిన పరబ్రహ్మమును మరచి వినశ్వర మగు నీ జగ ద్దృశ్యమును మరిగిన మన యీ జన్మమును మన కన్నులను సఫలములను జేసు కొందము. శ్రీవత్సలాంచితమై సర్వ జగదావాస మై వివక్ష క్షపణమైన (శత్రువులను మట్టువెట్టు) ఈ వీరుని పెడద యురంబును విశాల భుజ యుగమును సఖీ! కన్గొనవె. గంతులిడు ముష్ఠికునితో రంతులు చేయు చాణూరునితో తక్కుంగల మల్లురతో వీరా లాపముల మేలమాడు బలరాముని నెమ్మోము గనరె! సఖులారా. బలు దిట్టయగు చాణూరునితో బసి బాలుడు గోపాలుడు తలపడు చున్నాడు. అన్యాయ మిది యని చెప్ప గల పెద్ద లెవ్వర నిక్కడ లేరా? ఇపు డిప్పుడ యంకురించు యీ వనమున కున్ముఖుడై సుకుమార శరీరుడై యున్న యీ హరి యెక్కడ వజ్ర కఠినమై నిండు మదమెక్కి యుక్కు మిగులు నెమ్మేన యున్న యీమహా రాక్షసు డెక్కడ? పరమ సుకుమారులు చిరుత ప్రాయము వారు గోపాలు రీకంగ మందున్న వారు. వీరితో నుజ్జీగ పరమ రాక్షసులు నతి దారుణులు చాణూరాదులు మల్లు లెదుర నున్నారు. ఈ విపర్యయము నీమర్యాదను ఇటనున్న మధ్యవర్తు లుల్లంగించుట కడు విపరీతము. మధ్యస్థులిది చూచి యుపేక్షించు చున్నారు. అని యిట్లూరక పౌర సుందరులు పరితపించుట గని పుడమి గంపింప హరి చూపరు లకానందో త్కర్షమును వర్షించుచు సమర సన్నద్దు డయ్యెను. బలరాముడును బాహువులు చరచి చక్కగ నిటునిటు దూకి నంతట నడుగడుగున నవని పగులు పడ వలసిన దట్లుగా కుండుట యదియు నొక యద్భుత మయ్యెను.

అంతట చాణూరునితో కృష్ణుడును మల్లయుద్ధ విశారదుడైన ముష్టికుడు బలదేవుని తోను దలవడిరి. ఒండొరులం దూరముగ విసరుట గ్రుద్దుట పట్టుగ దచినంత చేబట్టి దిగ నడచుట బాదము లందన్నుట మర్దించుట మొదలగు మల్లయుద్ద భంగిములచే వారి కస్త్రములు లేని యతి ధారుణమైన సమర మయ్యెను ధనుర్యాగోత్సవ మందు దన బల ప్రాణములచే నెంతెంత సేయ గలదో అంతకు చుట్టరిక మని లేకుండ బోరెను. జగదంత ర్యామియైన కృష్ణుడును వానితో విలాస మాత్రము గనే పోరెను.

అంతట కంసుడు ఖేదాత్‌ = ఖేదము వలన నిజ = తన యొక్క శేష= వధను కరం= చేయ నున్న కరం= చేతిని చాలయతా= చలింప జేయుచున్న కృష్ణుచే గల్గిన కోపాత్‌ = కోపము వలనను (అనగా కృష్ణుడు విజృంభించి చేయు భీషణ మైన యుద్ధము చూచి నందు వలన గల్గిన బాధ వలనను తనను జంపనున్న హస్తమును పాము పడగ నట్లోడించు చున్న కృష్ణుని యెడల నుడుకు మోతు తనము వలన గల్గిన క్రోథము వలనను) చాణూరుని యందు బలక్షయమును కృష్ణుని యందు బలవృద్దినిం జూచి యుద్ధ వాద్యముల నాపు చేసెను. మృదంగాది వద్యము లట్లాప బడినంత నాక్షణము నాకస మందలి దేవ వాద్యములు (దుందుభులు మొద లయినవి) భోరన మ్రోసినవి.

జయింపుము గోవింద! చాణూరుని సంహరింపుము కేశవ యీ దానవుని అని అంతర్థాన గతులై వేల్పు లానంద మంది హరిని స్తుతించిరి. మధుసూదనుడు చాలసేపు చాణూరునితో నాడికొని తుదముట్టింప దలచి వాని లేవనెత్తి యంతకు నూఱుఱెట్లు యూపున గిరగిరం ద్రిప్పి గగన మంద ప్రాణములు వాసిన వానిం బుడమిపై విసరి వేసెను. ఆ వ్రేటున వాడు నూరు వ్రక్కలై రక్త స్రావము సేసికొని యా నేలనెల్లం బెను బెందడి గావించెను.

బలదేవుండును చాణూరునితో హరి యట్ల ముష్టికునితో బోరెను. అతడును వీని ముష్టిచే నడి తల నడచి మోకాలను ఱొమ్మునం బొడిచి పుడమిపై బడవేసి ప్రాణములు వోవగా అఱచెను. కృష్ణు డెడమ పిడికిలిం గ్రుద్ది మల్లవీరుని మహాబలుని నవ్విధమున భూతల మునం బడనేసెను. చాణూరుడు నిహతుడు కాగా ముష్టికుడు గూల్ప బడగా నెల్ల మల్లురుం బారి పోయిరి. అపుడు కృష్ణ సంకర్షణు లిద్దరు నవ్వీర విహారమున తమ యీడు వారలం బలాత్కార ముగ నాకర్షించి యారంగ భూమిపై గుప్పించి గంతులు వెట్టిరి. అంతట గంసుడు గినుకచే గను లెఱ్ఱవడ యట చెదఱి యున్న తన మనుజులతో ఈ గోపకుల నిద్దరినీ సమాజము గుంపు నుండి బలత్కారమున గెంటి వేయుడు. పాపాత్ము నందుని నిప్పుడ సంకెళ్ళం బంధింపుడు వృద్ధుల కుచితము గాని దండనమున వసుదేవుం గూడ గట్టి వేయుడు? కృష్ణునితో నెగి రెగిరి గంతులు నెట్టు నీ గొల్లల గో ధనములను గొల్లగొట్టు డనియె.

ఇట్లాజ్ఞయిచ్చు నా కంసుని గని యల్లన నవ్వి మధుసూదనుడు మీదికిం దూకి యమ్మంచ మెక్కి కంసునిం బట్టి జుట్టు వట్టిలాగి కిరీటము దొలగి యిలపై బడ వానిం బడవైచి వానిపై బడెను. ఎల్ల జగముల కాధార మైన బరువుచే మీద బడిన కృష్ణునిచే నయ్యుగ్ర సేని (ఉగ్రసేనుని కొడుకు) కంసరాజు ప్రాణములం బాసెను. చచ్చిన వాని కేశములం బట్టి కేశవుడు వాని దేహము నారంగ మధ్య మందు బరబర యీడ్చి వైచెను. సహజముగ నది పెద్దది బరువైనది క్రోధముచే మఱియు బరు వెక్కినది అగు కంసుని శరీరము మహాత్మడగు కృష్ణునిచే గూల్పబడి కడు వేగమున నీడ్వ బడినది కూడ. అది చూచి వాని తమ్ముడు సునిము డెత్తి రాగ బలభద్రుడు లీలగ వాని బడగొట్టెను. హరిచే నవమానము నకు గురియై మధురా ధీశ్వరుడు కంసుడు హతుడౌట గని యారంగ మండప మెల్ల హాహాకారముల నిండి పోయెను. కృష్ణుడును వెను వెంటనే బలరామునిలో చని దేవకీ వసుదేవుల పాదములం బట్టు కొనెను. వసుదేవుడు దేవకియుం జనార్దను నెత్తి జన్మ సమయ మున (పురిటింట) స్వామి పల్కిన పల్కులం దలచి కొని వారే వారికి ప్రణతులై నిలిచిరి. అయ్యెడ వసుదేవుడా ప్రభువు నిట్లు వినుతించెను.

స్వామి! ప్రసన్నుడౌము సురవంద్య సురేశ్వర! మాకునై కదా

యీమహి నుద్ధరింప భజియింపగ నేము ననుగ్రహింపcగా

దామఱి నిగ్రహింప ఖలులందఱ మా గృహమందుc బుట్టినా

వో మహనీయ! మాకుల మహో! యిది పావన మయ్యెరా హరీ!

భూతము లన్నిటం గలవు భూతము లన్నిట నంతరాత్మవున్‌

భూత భవిష్య మిప్పుడు ప్రభూ! జఱుగుంగద నీదు చేతనే

నేతవు నీవు యజ్ఞమును నీవ యజించుట నీవ యజ్ఞమం

దాతతమైన ద్రవ్యనుది యైనను నీవ పరాత్పరా! హరీ!

నామనసేని దేవకి మనన్ముదియున్‌ నిను బిడ్డ వంచు న

జ్ఞానమునం బడెన్‌ నిజము చాటెద! కర్తవు నీద భర్తవున్‌

దేనికి మొదల్తుదయు దేవరకుం గనరావు మానుష

మ్మౌనొక నాల్క పుత్రియని యర్భక యంచిది పిల్చు నంతియే

జగముల కెల్లనుం బ్రభువ! సర్వ జగమ్మిది మాయగాక వే

రగు మఱి యేమియు క్తినిది యైనది అయ్యెడ నీవు మాకుcగ

ల్గగ సబబేమి! సృష్టిసక లమ్మిట చుట్టిన దున్న చట్టిసౌ

భగము మనుష్య కోష్ఠమున బావురె యయ్యొడి నుంట యెట్లనే

ఇట్టడ వీవు పాహి పరమేశ్వర విశ్వము; విష్ణునంశమై

పట్టివి గావునాకు విను బ్రహ్మ మొదల్మఱి చెట్టు పుట్టదా

కట్టిమమున్‌ విమోహమున నర్భకుడం చనిపించు మాయ యా

కట్టిడి చేcత చిట్టులికి గాసిలితిం డయcజూడవే హరీ!

కన్నులcగ్రమ్ము మాయ నను గన్నయ వీవని కంసభీతి నా

వన్నత చెంది వారి పరివారముచే నట జేరినాడ నో

యన్న యట్లైన నాతలపునం దొకయించుక యేని దొలంగ కీ

వున్నది నిక్క మీశ్వర! ఆహో! జగదీశ్వర! గోకులేశ్వరా!

రుద్రమరుత్తు లశ్వినులు రూఢిశతక్రతుముఖ్యులేని ని

ర్నిద్రులు సేయలేని కననేరని వింతలు సేసినావు సా

ముద్రికమేటికిం దడవ భూమిపయిం దిగినావు విశ్వమున్‌

భద్రమొనర్ప విష్ణువవు పాహి హరీ! తలcగెన్‌ విమోహమున్‌