బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

227 - ముని వ్యాస సంవాదే విష్ణుపూజా కథనే వైష్ణవానాం గతిఖ్యాపన వర్ణనమ్‌

ఆశ్చర్యకరమును సర్వపాప హరమును పుణ్య కరమును ధన్యత కలిగించునదియు సంసార బంధ నాశనము నగు శ్రీకృష్ణ మహాత్మ్యమును మేము వింటిమి. చాల సంతోష మయినది. ఓ మహామునీ! మానవులు వాసుదేవుని అర్చించుట యందాసక్తులయి భక్తితో విధి విధానమున అతని నర్చించు వారు ఏ గతిని పొందుదురు? స్వర్గమునా? మోక్షమునా? రెంటినా? మా ఈ సంశయమును ఛేదించుము. ఓ మునిశ్రేష్ఠా! అందులకు నీవు తప్ప సమర్థులు మఱెవ్వరును లేరు. అని మునులు వ్యాసునడిగిరి.

ముని శ్రేష్ఠులారా! వైష్ణవులకు సుఖము కలిగించు మీ ప్రశ్నకు సమాధానమును వినుడు. నరులు కృష్ణుని దీక్షా మాత్రము చేతనే ముక్తి పొందుదురు. ఎల్లప్పుడును భక్తితో ఆ అచ్యుతుని పూజించు వారి విషయము చెప్ప వలసిన దేమి? ఓ మునిసత్తములారా! వారికి స్వర్గము కాని మోక్షము కాని దుర్లభము కాదు. వైష్ణవులు తాము కోరిన కోరికలు ఎంత దుర్లభము లైనను పొంద గలరు. రత్న పర్వతము నెక్కిన వారు రత్నములను వలెను కల్ప వృక్షము నాశ్రయించి ఫలములు కోసి కొన్నట్లును వారు జగద్గురుడగు వాసుదేవుని విధి ననుసరించి అర్చించి నందులకు ఫలముగా ధర్మార్థ కామ మోక్ష ఫలములను పొందుదురు. జగన్నాధుని విశుద్ధమగు అంతఃకరణముతో ఆరాధించిన మానవులు దేవతలకును దుర్లభములగు కామితములు పొందుదురు. సర్వ పాప హరుడును సర్వ కామిత ఫలముల నిచ్చు వాడునగు శ్రీహరిని అర్చించు నరులు లోకమున ధన్యులు. ఏల యన బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులును కడజాతి వారును స్త్రీలును ఆ దేవ శ్రేష్ఠుని అర్చించుటచే ఉత్తమ గతిని పొందుదురు. కనుక ఓ మునులారా! అట్టి మహనీయులు పొందు ఉత్తమ గతిని సంగ్రహముగా చెప్పెదను. వినుడు.

రోగములకు ఆశ్రయము అస్థిరము జరా మరణ యుక్తము నీటి బుడగతో సమము మాంస రక్తముల దుర్గందము కలది మల మూత్రాది యుక్తము ఎముక లనెడి కట్టు కొయ్యలతో కూర్చ బడినది అపవిత్రము నులి నరములతో చర్మముతో రక్త నాళములతో కూడినది అగు మానవ దేహమును విడిచి సంకల్పముతో నడచునది దివ్య గంధర్వుల సంగీతముతో కూడినది లేత సూర్యుడు వలె ప్రకాశించు నది చిఱు మువ్వల గుత్తుల మాలలు కలది అగు విమానము నెక్కి గంధర్వులు గానము చేయు చుండ అప్సర లలంకరించు చుండ వేరు వేరుగా ఆయా లోకపాలుర లోకములకు పోవుదురు. ఒక్కొక్క లోకమున ఒక్కొక్క మన్వంతర కాలము సర్వ భోగములను అనుభవించి వారు అంతట సర్వసుఖ ప్రదమగు అంతరిక్ష లోకమునకు వత్తురు. అచ్చట శ్రేష్ఠ మగు భోగములు పది మన్వంతరముల పాటు అనుభవించి అక్కడ నుండి గంధర్వ లోకమునకు పోయి ఇరువది మన్వంతరముల పాటు మనోహరములు భోగము లనుభవింతురు. అచటి నుండి అదిత్య లోకములకు ఏగి అచ్చట చక్కగా పూజల నందు కొనుచు ముప్పది మన్వంతరముల కాలము దేవతలకును దుర్లభము లగు భోగము లనుభవింతురు. అట నుండి సుఖ ప్రదమగు చంద్ర లోకమునకు పోయి నలువది మన్వంతరములు అట నుండి నక్షత్ర లోకమున ఏబది మన్వంతరములు దేవ లోకమున అఱువది మన్వంతరములు అట నుండి ఇంద్ర లోకమున డెబ్బది మన్వంతరములు అట నుండి ప్రజాపతి లోకమున ఎనుబది మన్వంతరములు జరా మరణములు లేక ఉత్తమము లగు భోగములను అనుభవించి బ్రహ్మ లోకమునకు పోవుదురు.

ఇట్టి వైష్ణవులు బ్రహ్మ లోకమున తొంబది మన్వంతరములు నమస్త సుఖములను అనుభవించి మరల ఈ భూ లోకమునకు వచ్చి బ్రాహ్మణులలో ఉత్తమ వంశమున యోగులుగా వేద శాస్త్రార్థ పారము నెఱిగిన బ్రాహ్మణులుగా జన్మింతురు. మరల క్రమ క్రమముగా పైకిపైకి పోవుచు ప్రతి జన్మము నందును నూఱేసి నంవత్సరమలు జీవించి యథేప్సితము లగు భోగముల ననుభవించి లోకాంతరము నకు పోవుదురు. ఇట్లు పది జన్మము లైన తరువాత వారు బ్రహ్మలోకము నుండి దివ్య మగు విష్ణు లోకమున కేగుదురు. అచ్చట నూర మన్వంతరముల కాలము సర్వ గుణములతో కూడిన అక్షయ భోగములను అనుభవించి జన్మ మరణములు లేని వారయి వారాహ మూర్తి యొక్క లోకమున కేగుదురు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా! ఈ వైష్ణవులు అచ్చట మహా బలము చతుర్బాహువులు కలది యగు దివ్య మగు మహా శరీరము కలిగి సర్వ దేవతల నమస్కారము లందు కొనుచు పదివేల కోట్ల సంవత్సరములు ముక్తి సుఖము ననుభవించు చుందురు. అట నుండి నరసింహ దేవుని గృహమున కేగి పదివేల కోట్ల సంవత్సరములు విహరించి తదంతమున విష్ణు లోకమునకు పోయి అచ్చటను అనేక కోట్ల సంవత్సరమలు ఆనందింతురు. తరువాత ఈ సాధ కోత్తములు బ్రహ్మ లోకమున నూర్ల కోట్ల సంవత్సరము లనేకము లానందించి నారాయణుని పురమున కేగి అర్బుదముల కోట్ల సంవత్సరము లుండి యానందించి దివ్య రూపులై మహా బలులై సురాసురుల స్తోత్రము లందు కొనుచు అనిరుద్ధుని పురమున జరా మరణములు లేక పదు నాలుగు వేల కోట్ల సంవత్సరము లుండి ఏ సంతాపము లును లేక ప్రద్యుమ్న పురమునకు పోయి అచట మూడు వందల లక్షల కోట్ల సంవత్సరములు సుఖింతురు. తరువాత ఈ యోగులు బల శక్తితో కూడి స్వచ్ఛంద గమనము కల వారగుచు సంకర్షణ లోకము చేరి అచట చాల కాలము సహస్ర విధములగు భోగముల ననుభవించి సర్వ మోక్షమును పొంది సర్వదోష రహితము జరా మరణ రహితము నగు వాసుదేవ నామము గల పరతత్త్వము నందు ప్రవేశింతురు. ఇది నిశ్చయము. ఓ ముని శ్రేష్ఠులారా! వాసుదేవా ర్చనమున ఆసక్తులు పొందు ఫలములు సుఖములు ఇట్టివి.