బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

223 - సంకర జాతి లక్షణ వర్ణనమ్‌

మహానుభావ! నీవు సర్వజ్ఞుడవు. మఱియు సర్వ భూత హితా భిలాషివి. భూత భవిష్య వర్తమానములు నీకు గరతలా మలకములు. ఏకర్మచే నటచే వర్ణముల కధమ స్థితి వచ్చును? ఉత్తమ స్థితియుం గల్గు నానతిమ్ము. శూద్రుడే కర్మ మాచరించి బ్రాహ్మణత్వ మందును. వినగోరెదమన వ్యాస భగవాను లిట్లనిరి.

హిమగిరి శిఖరి మందాసీనుడై యున్న మహాదేవుం ద్రిలోచనుని శైలరాజ తనయ మ్రొక్కి యిట్లదే ప్రశ్న మడిగినది.

ఓ భగనేత్ర నాశన! పూషదంత వినాశన! దక్షక్రతు హర! బ్రహ్మమున్ను చాతుర్వర్ణ్య ధర్మముల నడిగెను. ఏకర్మ విపాకముచే బ్రాహ్మణాదులు క్షత్రియాది జన్మము లందుదురు. ఈ అనులోమ విలోమ వర్ణ సాంకర్య మెట్లు గలుగునో నాసంశయ వారింపు మన శివుండిట్లనియె.

దేవి! బ్రాహ్మణ్యము దుర్లభము. బ్రహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వభావము చేత నేర్పడి రని నా తలంపు. తరువాత దుష్కర్మ మొనరించి సహజ సిద్దమైన బ్రాహ్మణ్యము నుండి దిగజారును. బ్రాహ్మణుడు మొదలయిన వారు తమ స్వధర్మ మందుండి రేని బ్రాహ్మణ్యమును పరమా వధిగ బడయుదురు. ఎవ్వడు విప్ర ధర్మము విడిచి క్షత్రియ ధర్మము నాచరించు నతడు విప్రత్వము గోల్పోయి క్షత్రియ యోనిం జనించును. ఇట్లే వైశ్యాది వర్ణము లందును స్వధర్మ పరిత్యాగము చేసిన వాడు జనించును. శూద్రత్వము దాక పతన మైన విప్రుడు బ్రహ్మ లోక భ్రష్టుడై వర్ణ సాంకర్య మందును.

శూద్రుడు స్వధర్మముచే జ్ఞాన విజ్ఞానముల నంది శుచియై ధర్మజ్ఞుడై ధర్మ నిరత్తుడై స్వదర్మ ఫలము వడయును. అనగా క్రమముగ ఉన్నత వర్ణము లందు జన్మించి బ్రహ్మత్వ సిద్దిని గూడ నందును. మున్ను బ్రహ్మా యుదాహరించిన అధ్యాత్మ జ్ఞానము నిష్ఠా సిద్దిని ధర్మ పరులెట్లు పొందుదురో యా విషయము లివి. ఉగ్రాన్నము గణాన్నము శ్రాద్దాన్నము మైల అన్నము ముష్టాన్నము శూద్రాన్నము నెన్నడుం దినరాదు. ఇది బ్రహ్మ ముఖము నుండి వచ్చిన వాక్కుగాన (వేదము) పరమ ప్రమాణ మని నా అభిప్రాయము.

శూద్రాన్న శేషము కడుపులో నుండగా చని పోయిన ద్విజుడు అహితాగ్ని యజ్ఞ కర్తయు శూద్రడై పుట్టును. దానికి ప్రాయశ్చిత్తము గూడలేదు. ఏయే వర్ణముల వారి యన్నము జఠర మందుండగా నెవ్వడు చని పోవునో వాడు వాడా వర్ణము లందు బుట్టును. అక్కడ విమర్శ లేదు. దుర్లభ మైన బ్రాహ్మణ జన్మ మంది యభోజ్యాన్న ములం దిన్నవాడో పతితుడై తీరునో బ్రాహ్మణుడు సురా పానము బ్రహ్మ హత్య దొంగతనము వ్రత భంగము శౌచ లోపము స్వాధ్యాయ లోపముసే లుబ్దుడై నైకృతికుడై శదుడై వ్రత దూరడై వృషలిని సంగ మించి కుండాశనము సేసి సోమమమ్మి నీచుల సేవించి భ్రష్టు డగును. గురుతల్పగుడు గురుద్వేషి గురువుల పరిహసించు వాడు బ్రహ్మద్వేషి బ్రాహ్మణ్య పతితుడు గాను శూద్రుడు న్యాయము దప్పక యథావిధిగ స్వధర్మా చరణము సేసి అందరికిం దానతిథియై అందరి భుక్త శేషముందిన్న వాడు, వారికి శుశ్రూష పరిచర్య చేసిన వాడు సన్మార్గ మందు స్థిరుడైన వాడు దేవతల భూ దేవులను బూజించిన వాడు ఋతకాల స్త్రీ సంగమము చేసిన వాడు నియత మయిన ఆహారము దిన్నవాడు. వృథా మాంసము తినని వాడు వైశ్యత్వముం బడయ గలడు.

ఋత వచనుడు అహంభావము లేని వాడు. సుఖ దుఃఖాది ద్వంద్వముల కతీతుడు. సామ నిపుణుడు బ్రహ్మ యజ్ఞాది నిత్య యజ్ఞములు సేయు వాడు స్వాధ్యాయ పరుడు అచార శీలుడు ఇంద్రియముల నదిమిన వాడు సత్కార్య కర్త సర్వ వర్ణముల యెడ నసూయ లేనివాడు గృహస్థ వ్రతమూని రెండు వేళల మాత్రమే భూజించుచు శిష్ట శేషము యజ్ఞ శేషము నారగించుచు నిష్కాముడు నిరహం మతి యథావిధి కాలముగ హోమము సేయుచు నగ్న్యు పాసన సేయు వాడు నర్వులకు నాతిథ్య మొసంగుచు శేషాన్నము మాత్రమే తాను భుజించు వాడు నగు వైశ్యుడు త్రేతాగ్ని మాత్ర సంపాద్య మైన బ్రాహ్మణ త్వము లడుగ ఆ వైశ్యుడు తొలుత క్షత్రియుడై పుట్టి జన్మాది సంస్కారములు వొంది మంచి దక్షిణ నిచ్చి యజ్ఞములు సేయు వారికి దానములు సేసి స్వర్గము కోరి అధ్యయనము సేసి త్రేతాగ్ని హోత్రియై ఎల్లపుడు తడి చేతితో దానములు సేయును. చేయు ఆరకుండ ధారా పూర్వకముగ (బహుదానములు చేయుచు నన్నమాట) ప్రజలను ధర్మమున బాలించుచు సత్య వచనుడై ఆచార వంతుడై సత్యము అయిన ధర్మములను జేయుచు ధర్మ దండముచే దగ్దుండు గాక (రాజందఱిని దండించు వాడయ్యును నాతనిపై శాస్త్ర విహిత ధర్మ దండన మనునది యొకటి యుండి యాతని నదుపులో పెట్టు చుండును. దానిచే రాజు దగ్ధుండు కాక పోవుట యనగా దానికి లోబడి ప్రజా రక్షణ శిక్షణలు చేసి దానికి విదేయుడై యుండవలె నన్నమాట) ధర్మ కామార్థము లను మూడు పురు షార్థములను సాధించుచు కార్యములచే కార్య సాధనములచే నియమింప బడిన వాడై ప్రజల వలన నాఱవ వంతు మాత్రమే పన్ను గ్రహించు వాడై స్వేచ్చగొని గ్రామ్య ధర్మ ములను సేవింపక అర్థ శాస్త్రము చక్కగ నెఱిగి ఋతు కాలమందు పత్నీ సమావేశము నొంది (సదా బ్రహ్మచారియై) సదోప వాసియై (నియమిత భోజనములు రెండిటి నడుమ నెట్టి అల్పాహారములు గొనకుండు వాడు సదోవవాసి) స్వాధ్యాయ నిరతుడై శుచియై గృహమంద యుండి మూడు వర్ణముల వారికిని అతిథ్య మిచ్చుచు మంచి మనసుతో నిత్యము నన్న మడుగు శూద్రులకు సిద్దమై యున్నది రండనుచు స్వార్థముచే కాని కామముచే గాని యేకొంచెమును జూడక కేవలము పితృ దేవాతిథి నిమిత్తము గానే సాధనము సేయుచు దన యింటనే తాను భిక్షాన్నమును సేవించి ద్వికాల మగ్ని హోత్రములు సేయుచు గో బ్రాహ్మణ హితమునకై మాత్రమే ప్రవర్తించుచు యుద్ద మందు వెన్ను జూపక యటం గూలి యత్రేతాగ్ని మంత్ర పూత మయిన ఉపాధితో శరీరమిం కోకటి ప్రవేశించి ద్విజు డగును. అప్పుడు జ్ఞాన విజ్ఞాన సంపన్నుడై వేద పారగుడై సుసంస్కృతుడై వైశ్యుడిట్టి క్షత్రి యత్వమును బడయును. శూద్రుడును అగమ విధానముచే (వైదిక ప్రక్రియతో గాదు) సంస్కారముల నంది ద్విజు డగును.

బ్రాహ్మణుడుడేయగు గాక అసద్వృత్తముచే సర్వ సంకర భోజనముచే బ్రాహ్మణ్యముం గోల్పోయి శూద్రత్వ మందును. శుచి కర్మా చరణముచే దేవీ కటాక్షముచే మనస్సు శుద్దినంది జితేంద్రియు డైన శూద్రుడును ద్విజుని యట్ల సేవింప దగిన వాడని బ్రహ్మ స్వయముగ బల్కెను. స్వభాకర్మ చేత శూద్రుడు ప్రవర్తించు నేని అతడు ద్విజుల కంటెను విశుద్దుడని నాతలంపు. యోని కాదు (జన్మకాదు) సంస్కారము కాదు శ్రుతి కాదు సంతానము గాదు. ద్విజత్వమునకు కారణము కేవలము వృత్తమే (నడవడియే). బ్రాహ్మణుడను నీ సర్వ జాతియు లోకమందు వృత్తము ననుసరించి విధింప బడును. వృత్తమున నున్న శూద్రుడు గూడ బ్రాహ్మణత్వ మందును. ఓ రమణి! బ్రహ్మ స్వభావ మనగా సర్వత్ర సమత్వమని నా తలంపు. నిర్గుణము నిర్మలము నైన బ్రహ్మ యెవ్వని యందుండు నతడు ద్విజుడు (బ్రహ్మ విషయక జ్ఞానము కలవాడన్న మాట) ఇట్టి పవిత్రులు ఒక స్థానము ఒక అధికారము నని లేని యొక విలక్షణ స్థితికి నిదర్శనమై యుందురు. ప్రజాసృష్టి సేయు బ్రహ్మయే స్వయముగా నిట్లు సెప్పెను. బ్రహ్మ పదార్థము యొక్క మహా క్షేత్రము పాదములచే నీలోక మందు బ్రాహ్మణ రూపమున సంచారము సేయు చున్నది. అక్కడ పడిన విత్తనము ఈ కృషి (వ్యవసాయము) పరమందు ఫలవంత మగును. నిత్య సంతుష్టుడై బ్రాహ్మ మార్గము ననుసరించి సంహితా ధ్యయనము నిత్యము సేయుచు గృహ మందుత్తము గృహస్థై నిత్యము స్వాధ్యాయమే బ్రతుకుగా వేదాధ్యయన ముచే సంపాదన సేసి బ్రతుకక యుండు విప్రుడు నిత్య సన్మార్గ వర్తి అహితాగ్ని అధ్యయన పరుడునైన విప్రుడు బ్రహ్మ భావమున కర్హు డగును. బ్రహ్మాణ్యము వీడక మనసు నియమించు కొని దానిం జన్మ కారణమైన సహజ ద్విజత్వము. చేతను సత్ర్పతి గ్రహము చేత దానముల చేయుట చేతను విహిత కర్మాచరణముల చేతను గాపాడు కొన వలయును. ఇది చాల గుహ్యమైన విషయము. శూద్రుడు ద్విజుడు కాగల విధానము ద్విజుడు ధర్మచ్యుతి నొంది శూద్రుడగు రీతియు నీకు దెల్పితిని.