బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

18 - భువనకోశద్వీప వర్ణనమ్‌

మహామతి వగు నీవు భారత రాజుల యొక్కయు, దేవ దానవ గంధర్వ యక్షో రగాదుల యొక్కయు అద్భుతములగు చరిత్రలను స్థావర జంగమాదుల సృష్ట్యాదులను మృదు మధురముగ, మన శ్ర్శవణానంద కరముగ జెప్పితివి. ఆహా! ఇప్పుడు భూమండల స్వరూపము విన గుతూహలులమై యున్నాము. భువనకోశ సంస్థాన మవధానమున విననున్న మాకది యాదరములో నాన తిమ్మని మును లడిగిరి.

మునులారా! ఇది నూఱేండ్లు సెప్పినం దీరదు, సంక్షేపించి తెల్పెద వినుండు. జంబూ + ప్లక్ష + శాల్మల + కుశ + క్రౌంచ + శాక + పుష్కరములు అనునవి సప్త ద్వీపములు. ఇవి లవణ = ఉప్పు, ఇక్షు = చెఱకు రసము, సురరా = కల్లు, సర్పిః = నెయ్యి, దధి = పెరుగు, దుగ్ధ = పాలు, జల = నీరు, నుంగల యేడు సముద్రములచే జుట్టుకొన బడినవి. వీని నడుమ జంబూ ద్వీప మున్నది. దానికి నడుమ “మేరువు” అను బంగారు కొండ యున్నది. అది యెనుబది నాల్గు యోజనముల యెత్తు, పదునారు వేల యోజనముల లోతు, ముప్పది రెండు వేల యోజనములు వైశాల్యముగల యుపరి భాగము కలిగి యున్నది. మూలము పదునాఱు వేల యోజనముల విస్తారమై యున్నది. భూమి యను పద్మమున కది నడిమి కర్ణిక = (దుద్దు) వలె నున్నది.

హిమవంతము, హేమ కూటము, నిషధము నను నవి దానికి దక్షిణ మునను, నీలము, శ్వేతము, శృంగి యనునవి యుత్తరము నను వర్ష పర్వతము లున్నవి. రెండు నడుమ నున్నవి. అవి లక్ష యోజన ప్రమాణములు, తక్కినవి తొంబది వేల యోజనముల ప్రమాణము గలవి. రెండు వేల యోజనముల యెత్తు, అన్ని యోజన ముల వెడల్పు గలవి.

భారత, కింపురుష, హరి వర్షములు మేరువునకు దక్షిణమున నున్నవి. రమ్యకము ఉత్తర మందున్నది. అది కనక మయము. ఉత్తర కురు భూము లక్కడనే యున్నవి. ఈ వర్షము లొక్కొక్కటి భారత వర్షము వలె తొమ్మిదివే యోజనముల వైశాల్యము గలవి.

ఇలావృతమ దాని నడుమ బంగారు మేరుగిరి గలదు. మేరుపు నలు దిశల నిలావృతము తొమ్మిది వేల యోజనముల వైశాల్యము గలది. ఇందు నాల్గు పర్వతములు మేరుపునకు విష్కంభములు. (గడియలు) పది వేల యోజనముల పొడవు గలవి. తూర్పున మందర పర్వతము, దక్షిణమున గంధ మాదనము, పడమట విపులము, ఉత్తరమున సుపార్శ్వము ననునవి గలవు. వీని యందు క్రమముగ కదంబము (కడిమి), జంబువు (నేరేడు), పిప్పలము (రావి), వటము (మఱ్ఱి) యను చెట్లు పదునొకండ వందల యోజనముల విరివి గల వృక్షములు “గిరి కేతువులు” (పర్వతాగ్ర పతాకము లట్టివి) గలవు. జంబూ వృక్ష సమృద్ధిం బట్టి యది జంబూ ద్వీపమ్ము నాబరగె.

ఆ నేరేడు పండ్లు మహా గజ ప్రమాణ రూపమున రాలు చుండునట. అవి ప్రిదిలి కారిన రసమేరై పారి జంబూనది యనం బరగు. ఆ జంబూ రసము ద్రావిన వారు కష్టము, దుర్వాసన, ముదిమి, ఇంద్రియ క్షయము నెఱుంగరు. ఆ జంబూ నది యోడ్డు నంగల మన్ను ఆ రసముచే దడిసి సుఖ వాయువున నారి జాంబూ నదమను బంగార మేర్పడును. ఆది సిద్ధ భూషణము అనగా సిద్ధులు ధరించున దన్నమాట.

మేరువునకు తూర్పు దెస భద్రాశ్వము. పడమట కేతుమాలము. అను రెండు వర్షము లున్నవి. వానికి నడుమ ఇలా వృతము. తూర్పున చైత్ర రథము, దక్షిణమున గంధమాదనము, పడమట వైభ్రాజము, ఉత్తరమున నందన వనము నున్నవి. అరుణోదము, మహాభద్రము, అసితోదము, మానసము అను సరస్సులు నాల్గు దేవ భోగ్యములు గలవు.

శాంతవంతము, చక్రకుంజము, కురరీ, మాల్యవంతము, వైకంకము ననునవి మేరుపు యొక్క కేసర పర్వతములు. త్రికూటము, శిశిరము. పతంగము, రుచకము, నిషధము, మొదలైనవి దక్షిణ దిశ మేరుపు యొక్క కేసర పర్వతములు, శిఖి వాసము, వైదూర్యము, కపిలము, గంధమాదనము, జానుథి మొద లైనవి మేరు పశ్చిమ కేసర గిరులు. అవి మేరువు నంటి జఠరాది స్ధానము లందున్నవి. శంఖ కూటము, ఋషభము, హంసము, నాగము, కాలంజరము, మొదలగునవి మేరూత్తర దిశ కేసర శైలములు. మేరువు మీద బ్రహ్మ యొక్క నగరము పదునాలుగు వేల యోజనముల వైశాల్యము గలది. ఆందెనిమిది మూల లందు అష్ట దిక్పాలుర పురములు గలవు. విష్ణు పాదము నుండి వెడలి చంద్ర మండలమున ప్రవహించుచు నాకాశ గంగ బ్రహ్మ పురి నలు వైపుల పడు చున్నది. అట్లుపడి నాల్గు దెసల నాల్గు పాయలైనది. సీత, అలకనంద, చక్షువు, భద్ర. సీత పూర్వ శైలము నుండి మరియొక శైలమున కంతరిక్ష సంచారము సేయును. అవ్వల భద్రాశ్వవర్ష పర్వతము మీదుగా సముద్రుం బొందును. ఆలకనంద దక్షిణ దిశగా భారత వర్షముం జేరి యేడు భాగములయి సముద్రము జొచ్చును. చక్షువు పడమటి గిరులన్నియు దాటి పడమటం గల కేతుమాల వర్షముల జొచ్చి సముద్రముం గలియును. భద్ర ఉత్తర గిరులం దాటి యుత్తర కురు భూములం బ్రవహించి ఉత్తర సముద్రముం జేరును.

నీల పర్యతము నుండి నిషధ పర్వతము వరకు పొడవయినదై మాల్యవంతము గంధమాధనమును గలవు. వాని నడిమి భాగమున తామర పువ్వు లోని దుద్దువలె మేరు వున్నది. మర్యాదా పర్వతమునకు ఆవల లోకాలోక మను పర్వతము నకు భారతములు, కేతు మాలములు, భద్రాశ్వములు, కురు భూములును రేకుల ట్లున్నవి. జఠరము దేవకూటము అనునవి రెండు మర్యాదా పర్వతములు, అవి దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము దాక వ్యాపించి యున్నవి. గంధమాదన కైలాస పర్వతములు తూర్పు పడమర లందు నెనుబది యోజనముల పొడవు గలవై నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు వ్యాపించి సముద్రములో జొచ్చి యున్నవి. నిషధము, పారియాత్రము అనునవి రెండును మర్యాదా పర్వతములు. ఆ రెండు దక్షిణోత్తరము లందు నీల పర్వతము నుండి నిషధ పర్వతము వరకు దైర్ఘ్యము గలవై మేరు పర్వతమునకు పశ్చిమ భాగము నందు యధా పూర్వముగ నున్నవి. త్రిశృంగము, జారుధియు నుత్తరదిశ వర్ష పర్వతములు. తూర్పు పడమరగా వ్యాపించి యవి సముద్ర మధ్యమున నున్నవి. మర్యాదా గిరులు నాచే చెప్ప బడినవి. వీనిలో రెండు రెండు పర్వతములు మేరు పర్వతము నకు జఠర (గర్భ) భాగములుగా నలు దెసల నున్నవి. మేరువు నలుదెసల గల కేసర పర్వతములు చెప్ప బడినవి. అవి చల్లని ఆద్యంతములు గలవి. వాని లోపల గల లోయలు మనోహరములై సిద్ద చారణ సేవితములై యుండును. వానియందు రమ్యము లైన పురములు వనంబులు గలవు. లక్ష్మి, విష్ణువు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు మొదలగు దేవతల ఆలయ శ్రేష్టములు నర కిన్నరులచే సేవితము లై యొప్పును. రమ్యము లైణ ఆ పర్వత ద్రోణు (లోయ) లందు రేయిం బవళ్ళు గంధర్వ యక్ష రాక్షస దైత్య దానవులు గ్రీడించు చుందురు. ఇవి భౌమ స్వర్గములు. అనగా భూమి మీదనున్న స్వర్గ భూములు. ధర్మ నిష్టులకు నివాసములు ఇందెన్ని జన్మముల కైనను పాపాత్ములు చేర జాలరు.

భద్రాశ్వ పర్వత మందు విష్ణు భగవానుడు హయగ్రీవ స్వరూపుడై యుండును. కేతుమాల మందు వరాహ మూర్తి భారత మందు కూర్మ మూర్తి, కురుభూము లందు సనాతను డగు గోవిందుడు మత్స్యమూర్తి యునై యుండును. సర్వత్ర సర్వ స్వరూపు డై యా సర్వేశ్వరుడు హరి విశ్వరూపు డై యుండును. సర్వాత్మకు డైన యా విష్ణువు అందరికి ఆధార భూతుడై యుండును.

బ్రాహ్మణులారా! కింపురుషాది వర్షము లెనిమిదింటి యందు గల జీవులకు శోకము ఆయాసము ఉద్వేగము ఆకలి దప్పిక భయము మొదలైన వుండవు. ఆచటి ప్రజలు స్వస్థులు, నిరాతంకులు (అడ్డు లేని వారు) ఏ దుఃఖ స్పర్శయు లేనివారు గను పది పండ్రెండు వేల యేండ్లాయువు గలవారుగ నుందురు. ఆ వర్షము లందు ఇతరములగు భూమి యందలి బాధలు కృత త్రేతాది యుగ విభాగము లేదు. వాని యందన్నిట నేడేసి కుల పర్వతము లున్నవి. అందుండి వందల కొలది నదులు పుట్టినవి.