బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

184 - బృందావన గమనమ్‌

వసుదేవుడు కారాగృహ ముక్తినం నందుని బండి యెక్కి నాకు పుత్రుడు గల్గి నాడని యానంద భరితుడగు చున్న నందుని జూచెను. మఱియు నతనితో నాదరము గొని నీకి వార్థక మందు పిల్లవాడు గల్గినాడు. రాజునకు మీరేటేట జెల్లింప వలసిన పన్ను గట్టుటకు వచ్చియది చెల్లింప బడె గదా వచ్చిన పని యైనది. శీఘ్రముగ గోకుల మున కేగుడు నాకు నక్కడ రోహిణి యందు శిశువు పుట్టినాడు మీ బిడ్డనట్లు వానిని తమరు రక్షింప వలయును. అనియె.

నందాది గోపకులిట్లు తెలుప బడి బండ్ల మీద ధన భాండముల నెక్కించుకొని తెచ్చిన ధనమును పన్ను జెల్లించి వ్రేపల్లె యందుండగా బాలఘాతిని యైన పూతన వచ్చి నిదిరించు చున్న కృష్ణు నెత్తుకొని యొకరేయి పాలిచ్చెను. ఆమె యెవ నెవ్వనికి చను గుడిపేనో వాని వాని శరీరము నశించు చుండును. కృష్ణుడా రాక్షసి స్తనము నిరు చేతుల నొత్తి పట్టుకొని కోపమున పాలతో బాటు ప్రాణములం ద్రావి వైచెను. అది యర్చుచు ప్రేవులు దెగి ప్రాణములు వాసి పుడమిం బడి పోయెను. దాని యర్పు విని హడలి పోయి మేల్కని వ్రేపల్లె లోని జనము పూతన యొడిలో నున్న కృష్ణుని గూలిపడి యున్న యా రక్కసినిం గాంచిరి. యశోద తటాలున కృష్ణు నెత్తుకొని జడిసి పోయి అవుతోక తలచుట్టు తిప్పుట నుదుట గోమయము బొట్టు వెట్టుట మున్నగు నంగ రక్షలు సేసి చంటి పిల్లల కగు దోషమును వారించెను. మఱియు నాతల్లి యిట్లు రక్షా కవచముం బఠించెను.

ఎవని బొడ్డునం బొడమిన తామర పువ్వు నుండి జగత్తు పొడమినదో యా సర్వభూత కర్తయగు హరి నిన్ను రక్షించు గాక! ఎవ్వని కోరు తుట్టతుద ధరింప బడిన ధారుణి సర్వ జగత్తును ధరించు చున్నదో ఆ వరాహ రూపముల దాల్చిన వేల్పు కేశవుడు నిన్ను రక్షించు గాక! నీ గుహ్యమును జఠరమును విష్ణువు నీ పిక్కలను బాదములను జనార్దనుడు రక్షించు గాక! ఎవ్వడు వామన మూర్తియై క్షణములో మూడడుగు లిడి ముల్లోకముల నాక్రమించె నా వామన మూర్తి యాయుధముల గొని నిన్ను బ్రోచు గాక, గోవిందుడు నీ శిరస్సును గాపాడు గాక! కేశవుడు నీ కంఠమును రక్షించుత! నీ ముఖము నీ బాహువులు నీముం జేతులను మనస్సును సర్వేంద్రియ ములను ఆ వ్యాహ తైశ్వర్యుడు అవ్యయుడు నగు నారాయణుడు రక్షించు గాక! నలు దిక్కుల నిన్ను వైకుంఠు డేలుగాక! విదిక్కు లందు మదుసూదనుడు బ్రోచుగాక! అంబర వీథిని హృషీకేశుడు మహీధరుడు భూమి యందును నిన్ను రక్షించుత!

అని యిట్లు యశోదమ్మ చేత మంగళా శాసనములు సేయ బడి బాలకుడు బండి క్రింద పొత్తళ్ల బరుండ బెట్ట బడియె. గోపకు లట గూలిన పూతన కళేబరముం జూచి చచ్చిన దానిం జూచియు నడలిపోయి యబ్బుర మందిరి.

ఒకతఱి నా బండి క్రింద బరుండిన మధుసూదనుండు రెండు పాదములు మీదికెత్తి పాలకై యేడ్చు చుండెను. ఆ స్వామి పాదముల తోవున కా బండి తలక్రిందు లాయె. అందున్న పాల కడవ లెల్ల బోర్ల పడియె. అంత నాగోప గోపీ జనము హాహాకార మొనరించిరి. అందఱు వచ్చి వెల్లగిల పరున్న శిశువుం గని యీ బండి యెవ్వని వలన దిరుగు వడినదని యడిగిరి. అటనున్న పిల్ల లీ పిల్లవాని వలననే యిది వడినది. ఏడ్చుచు నీతడు పాదము లాడింప నవి తగిలి యీ బండి తలక్రిందు లైన దీపని మఱి యెవ్వనిది గాదనిరి. అది విని గోపకు లింకను వింత వడిరి.

నందగోపుడా బిడ్డ నెత్తికొని వెఱగు వడియె. యశోద యబ్బుర పడి పగిలిన కుండ పెంకులు గల బండిని పెరుగు పూలు పండ్లు నక్షతలచే నర్చించెను. గర్గాచార్యుల గోకుల మందు వసుదేవు ప్రేరణముచే (కంస భీతిచే) నెవ్వనికిం దెలియ రాకుండనే యా బలరామ కృష్ణులకు జాతకర్మాది సంస్కారము లొనరించె. ఆ ముని పెద్ద వానిని రాముడని యవ్వలి వానిని కృష్ణుడని పేర్కొనియె. అత్యల్ప కాలము ననే యా బాలురు మహాబల సంపన్ను లయిరి. కాలు సేతు లాడించుచు గ్రమముగా బ్రాకుచు వెలి బూడిద మెడల బూసుకొని యిట్టుటు నడయాడు చుండ నా యన్నదమ్ముల నా తల్లి యశోద పట్టలేని దయ్యెను. గోవాటము నందు లేగల దొడ్డి యందు నాబాలు రానాడే పుట్టిన లేగ దూడల తోకలు గొని లాగుచు నిద్ద రోక్కచోట నడ యాడుచు నాట లాడుచుండ యశోద వారి బట్ట లేనిదయ్యె. ఒక్కతఱి నాతల్లి కినుకు గని కృష్ణుని ద్రాడుగొని ఱోలికిం గట్టి ఓరోరి అల్లరి పిల్లవాడ! నీ చేత నైన నేది వెళ్లు మెటు వోదవో చూచెదనని యింటి పనులు సక్కవెట్టు తొందరలో నుండ రోలిడ్చు కొంచు పోయిపోయి కమల నయనుడు హరి రెండు మద్ది చెట్ల నడుమం జొచ్చి యిరుకు త్రోవం జనుచుండ ఱోలు తిఱగుడు వడి తాక నాచెట్లు పెను గొమ్మల గూలి పడి పోయెను. అంత నచ్చట పొడమిన కటకటా శబ్దము విని బెదరి వ్రేపల్లె నము గ్రమ్ముకొని యా పెను మ్రాకుల మొదళ్ళు పెల్లగిలి కొమ్మలు విఱిగి పుడమి బడంజూచిరి. దానితో బాటు వచ్చియు రాని పలు వరుస మందహాస నింపు గులుక నామ్రాకు లజంట నట్ట నడుమ బొజ్జ దిఱుగ పెనురజ్జువున గట్ట బడినా పలు దిట్టనా చిట్టి కుఱ్ఱం గనిరి.

దామముచే నుదరమునం గట్టబడిన వాడు గావున దాన నాతడు దామోదరు డయ్యె. అవ్వల గోప వృద్దులు నందాదులు చెదరి పోయి యెడనెడ నిట్లు గల్గు మహోత్పాతము లకు జడిసి పోయి యిచ్చోటు వలన బని లేదెట కేని కారడవికి బోవుదమని కొనిరి. పెక్కు రకముల వ్రేపల్లెం దోచు నుత్పాతము లివి. పూతన గూలుట బండి తలక్రిందు లగుట పెనుగాలి మఱి యే దోషము లేక చెట్లు గూలి పడుట యివన్నియు మనకు నాశన హేతువులు అందుచే నిట నుండి లేచి యిపుడు బృందావనమున కేగుదుము గాక! భౌమ మయిన యుత్పాత దోష మేర్పడ కుండ నీ పల్లెను విడచి పోవలయు నని నిశ్చయించిరి. మఱియు దమదమ వారిని బందుగులను విలంబము వలదు లెండని హెచ్చరించి యందఱు బండ్లెక్కి గో ధనములతో (మందలతో) నాలమే పరులను వ్రజ వాసులను పిలిచి కొనుచు మందలుగా దరలి చనిరి. క్షణ ములో నా వ్రజవాటము సర్వా వయవ భంగము పొంది కాకికూతల వెఱవై పోయెను.

భగవంతుడు కృష్ణుడు గోవుల క్షేమాభివృద్దు లంగోరి శుభ మయిన మనస్సుతో బృందావనమును ధ్యానించెను. అందుచే మిక్కిలి పరుషమైన గ్రీష్మ కాలమున గూడ వర్షర్తు ధర్మములు దోచి వాన కారునం బోలె నెట జూసిన లేత పచ్చిక లచ్చెరవు గొలిపె. సర్వ గోకుల మట్లు బృందావన నివాసమయ్యె. వారెక్కి వెళ్లిన బండ్లు నిలిపిన యవ్వన వాట మర్ధచంద్రా కారమున శృంగార మొలకించె. రామ దామోదరు లక్కడ యాల కాపరు లైరి. ఆ గోవుల మందలందు గోశాల లందు (గోష్ఠము లందు) సవిలాసముగ నా బలరామ కృష్ణు లాడుకొన జోచ్చిరి. కొండెసిగలం నెమలి పించెములను జెఱవికొని యయ్యడవి పూలం జుట్టులం దురిమి పిల్లగ్రోవు లూది కొనుచు లయా నుగుణముగ వాద్యములు వాయించుచు నిరువంక జునుపములు వ్రెల నగ్ని కుమారుల లోయన్నట్లు (కుమార స్వామి పోలికలతో నన్నమాట) నవ్వుచు గేరుచు గేరింతలు కొట్టుచు నవ్వన మందు సంచరింప దొదంగిరి. ఒండొరులం గని పరియాచకము లాడు కొనుచు నంగడి కాండ్ర గూడి దూడల మరలించు కొనుట నిట్లు సరసన వారేడేండ్ల ప్రాయము వారైరి.

ఎల్ల లోకముల గాచు వారచ్చట నట్లు దూడలం గాచు వారైన తఱి నింగినెల్ల మబ్బుల గ్రమ్మ వారి ధారల దశదిశ లోక్కటి గావించి వానకాల మేతెంచె. ఎటు చూచిన చెట్లు చేమలు తీవలు మొగ్గ దొడిగి కొన్న నలుపూసె. ఇంద్ర గోపములు మెఱసి మరకత మణిం బద్మ రాగములు పొదవి నట్లందము గుల్కి నదీ జల పూరములు కట్టలు ద్రెంచుకొని నడి మంత్రపు సిరినొంది దుందుడుకు వడు చెడగరుల మనస్సు లట్లు ఉన్మార్గములు (దారి తప్పి నడచునవి) అయ్యె. సమయము గాని సమయము నేని స్వేచ్చగ నా మందకు వచ్చి యావీరులు బలరామ కృష్ణు లీడుజోడు వారిం గలిసి యమరు లట్లా బృందావన మందాట లాడిరి.