బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
7 - సూర్యవంశ నిరూపణమ్
వైవస్వత మనువునకు తొమ్మండ్రు కుమారులు గల్గిరి. వారు తండ్రియంత వారు. ఇక్ష్వాకువు, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, ప్రాంశువు, రిష్టుడు, కరూశుడు, పృషధృడు యనువారు. వారు కల్గక ముందు మనువు మిత్రా వరుణుల నుద్దేశించి పుత్రకామేష్టి నొనరించెను. అందతుడు మిత్రా వరుణుల నెంచి యాహతు లిచ్చెను. అక్కడ దివ్యాంబరా భరణములు దాల్చి దివ్య శరీరముతో ఇల యను నంగన యావిర్భ వించెనని వినికిడి. మనువు దండ ధరుడై యామెను ఇలా ఇలాయని పేర్కొని ఓ కల్యాణి నా వెంట రమ్మని పిలిచెను. పుత్రకామి యైన యా ప్రజాపతింగని ధర్మయుక్త ముగ నిట్లు పల్కెను.
నేను మిత్రా వరుణుల యంశమున బుట్టిన దానను. వారి సన్నిధి కేగెదను. నన్ను ధర్మదూరు రాలింగా వింపకు మని పలికి వారికడ కేగి ప్రాంజలియై యిట్లనియె.
ఓ మిత్రా వరుణ దేవతలార! మీ యంశముచే జనించి నదాన. మీకేమి సేయుదును. మనువు తన నమవర్తింపు మన్నాడని యిల పలికినంత వారు ధర్మ పరాయణ యగు నా సాధ్వింగూర్చి యిట్ల పలికిరి.
మానిని! నీ ధర్మము వినయము ఇంద్రియ నిగ్రహము సత్యమను వానికిం బ్రీతు లైతిమి. ఓ సుందరి! మహానుభావ యగు నీవు మా కన్యవుగా ఖ్యాతి నందుదువు. మనువునకు వంశ కరుండగు కుమారుడవు గూడ నీవ యయ్యెదవు. జగత్ర్పి యుడవు ధర్మ శీలుడవు. మను వంశ వర్ధనుడ వయ్యెదవు. నుద్యుమ్నుడను పేర ముల్లోకము లందు ప్రసిద్ధుడ వయ్యెదవు.
అంతనామె వారి మాటలు విని వెనుదిరిగి పోవుచు దారిలో బుధునిచే గామింప బడి సంగమము వడసి సోమ పుత్రుడగు నాతని వలన పురూరవు డను కొడుకుం గనియెను. అవ్వల నామె సుద్యుమ్నుడను పేర మగవా డయ్యెను. సుద్యుమ్నుని దాయాదులు పరమ ధార్మికులు ముగ్గురు.
ఉత్కలుడు, గయుడు, వినతాశ్వుడు ననువారు ఉత్కలుని భార్య ఉత్కల, వినతాశ్వుని వల్లభ పశ్చిమ దిక్కు, గయుని భార్య ప్రాగ్దిక్కు గయ యను పేర్లందినది. మనువు సూర్యునందు జొచ్చి నంతట నీతని దాయాదులు క్షత్రజాతి వారీ పృథివిని బది భాగము లొనరించిరి. జ్యేష్ఠుడు ‘ఇక్ష్వాకువు’ మధ్య దేశమును బడసెను. సుద్యుమ్నుడు మున్ను కన్యయై యున్నందున రాజ్య భాగము లేని వాడయ్యెను. వశిష్ట వచనముచే ప్రతిష్ఠాన మందు ధార్మికుడైన సుద్యుమ్నునకి ప్రతిష్ఠ (ఉనికి) లభించెను. దానినితడు పురూరవున కొసంగెను. సుద్యుమ్నుడు మనువు కుమారుడయ్య స్త్రీ పుంస లక్షణములు గలవాడై (ఇల-సుద్యుముడు నని పిలువ బడుచు) పృథివిం ధరించెను.
నాభాగుని కొడుకులు నరిష్యంతులు శకులు ననువారు. అతనికి అంబరీషుడును పుత్రుడై జనించెను. ధృష్టునికి రణదృప్త మయిన క్షత్రజాతి ధార్ష్టికమను పేర నుదయించినది. కరూశునికి కారూశులు కల్గిరి. వారును యుద్ధమునం దుద్ధతులు. నాభాగ ధృష్ట సంతానమైన క్షత్రియులు వైశ్యత్వము నందిరి. ప్రాంశువునకు ప్రజాపతి యను కుమారుడు గల్గెను. నరిష్యంతుని దాయాది దతంధరుడు. శర్యాతికి ఆనర్తుడను కుమారుడు సుకన్య యను కన్యయు మిథునము దయుంచెను. సుకన్య చ్యవన మహర్షి కిల్లా లయ్యెను అనర్తుని దేశ మానర్తము. అతని రాజధాని కుశస్థలి. ఆనర్తుని దాయాది రైవుడని నాతడు మహా తేజస్వి. రైవుని పెద్ద కొడుకు (రైవతుడు కకుద్మియను పేరు గలవాడు ధార్మికుడు. కుశస్థలి రాజధానిగా రాజ్య మేలినవాడు. తన కన్యకతో నేగి బ్రహ్మ సన్నిధి నొక్క ముహూర్త కాలముండి గాంధర్వమును (సంగీతమును) విన్నవాడు. అమ్ముహూర్త కాలము పుడమిపై పెక్కు యుగమ్ము లయ్యెను. అతడు తన రాజధానికి దిరిగి వచ్చెను. అప్పుడా నగరమును యాదవు లావరించి యుండిరి. పెక్కు ద్వారములు గలదియై యప్పుడది ద్వారకయను పేర మనోహర మయ్యెను. అది భోజన వృష్ణ్యంధక కులము వారగు వసుదేవాదుల పాలన మందుండెను. రైవతుడది తెలిసి కొని బలదేవునకు దన కన్యను (రేవతిని) సుభద్రయను పేరు గల దానిని నొసంగెను. ఆ మీద మేరు శిఖరమున కేగి తపస్సు నందుండెను. ధర్మాత్ముడగు బలరాముడును రేవతీదేవితో సుఖముగ విలసించెను.
పెక్కు యుగములు గడచె గదా? రేవతికి కకుద్మికి (రేవతుని కుమారునికి) ముదిమి రాలేదేమి? మేరువున కేగిన శర్యాలికిని గల్గిన సంతతి యిప్పటికిని పృథివియం వెట్లున్నది. ఈ విషయము స్పష్టముగ వినగోరు చున్నాము.
అనఘులార! బ్రహ్మ లోకమున ముదిమి యుండదు. అకలి దప్పిక లుండవు మృత్యు వుండదు. ఋతు చక్రము తిఱుగదు స్వర్లోక మేగిన రేవత కుమారుడగు కక్కుద్మి యొక్క రాజధాని కుశస్థలి రాక్షసులచే హరింప బడెను. అతనికి సోదరులు నూరు గురుండిరి. కాని వారు రక్షోగణము బారిబడి చావు దప్పి నలు దెసలకు బారి పోయిరి. వారి వంశ మందందు చెల్లా చెదరైనది. వారి పరంపర వారు శర్వాతులను పేరందిరి. గుణ వంతులయిన యా క్షత్రియులు సర్వ దిక్కులంటి పోయి గహనములం జొచ్చిరి. నాభాగుని యొక్కయు నరిష్టుని యొక్కయు కొడుకు లిర్వురు వైశ్యులు బ్రాహ్మణత్వముం బడసిరి. కరూశుని సంతతి కారూశులు. వృషదుడను వాడు గురు ధేనువును హింసించి, గురు శాపముచే శూద్రత్వ మందెను. ఇది యా తొమ్మండ్ర చరిత్ర.
వైవస్వత మనువు మునియే. అతడు తుమ్మగా నందుండి ఇక్ష్వాకువు పుట్టెను, అతనికి నూర్గురు పుత్రులు పుట్టిరి. వారు భూరి దక్షిణ లిచ్చి యజ్ఞములు గావించిన వారు, వారు వికుక్షి పెద్దవాడు . కుక్షిలేని వాడగుటచే అయోధ్యత్వమును పొందెను (ఎదిరి యుద్ధము చేయ నశక్యము గాని వాడయ్యెను.) అందు చేతనే యతని రాజధాని అయోధ్య యన బడెను. అయన పుత్రులు శకుని మొదలయిన వారయిదు వందల మంది ఉత్తరా పథము నేలు వారైరి. మహా బల శాలురు. యేబది ఎనిమిది మంది దక్షిణ దిశను బాలించిరి. ఇక్ష్వాకువు వికుక్షిని అష్టకా శ్రాద్ధమందు మాంసము తెమ్మని పంపెను. శ్రాద్ధ నిమిత్తము గనుక శశమును (కుందేటి జాతి) జంపి యతడా మాంసమును తానే దిని శశాదుడను పేరంది, వశిష్ఠు మాటం బట్టి ఇక్ష్వాకుచే పరిత్యక్తుడై వేటకు బోయెను.
ఇక్ష్వాకు వుండగనే శశాదుడు రాజయ్యెను. శశాదుని దాయాదుడు కకుత్థ్సుడు. మంచి బలశాలి. ఆయన కొడుకు అనేనుడు. (ఏనస్సు పాపము ఆది లేనివాడు అనేనస్సు) అతిని కొడుకు ప్భథుడు. వానికి విష్టరాశ్వుడు. వానికార్ద్రుడు. వానికి యువనాశ్వుడు, వానికి శ్రావుడు, గల్గిరి. శ్రావస్తకుడు శ్రావుని కుమారుడు శ్రావస్తి నగర నిర్మాత. వాని కొడుకు బృహ దశ్వుడు వాని సుతుడు కువలాశ్వుడు. పరమ ధర్మమూర్తి. ధుంధువను వానివ సంహరించి ధుంధుమారు డననయ్యె.
ఓ సూత! ఎవని వధించి కువలాశ్వుడు ధుంధుమారు డయ్యెనో ఆ ధుంధువధను గూర్చి విన గోరు చున్నాము.
కువలాశ్వునికి నూర్గురు కొడుకులు ఉత్తమ ధానుష్కులు అందరు విద్వాంసులు. అజయ్యులు ధార్మికులు. ఎల్లరు భూరి దక్షిణులయిన యజ్వలు. బృహదశ్వుడు కువలాశ్వుని రాజ్య మందుంచి వనమునకు ప్రస్థానము సేయబోగా యతని నుత్తంక మహర్షి పోవలదని వారించెను.
నీవు రక్షణ సేయ వలసిన వాడవు అందల కర్హుడవు. నేను ఆందోళనము లేకుండ తపస్సు జేయుటకు చాలను నా ఆశ్రమ సమీపమున చదునైన మరుధన్వము లనెడి ప్రదేశము లందు సముద్రుడు వాలుకా పూర్ణుడై (ఇసుక మేటలు వేసినది) ఉద్దాకుడని పిలవ బడును. ఆ సుముద్ర మందు దేవతలకేని యవధ్యుడు మహా కాయుడు బలశాలి ఇసుక లోన శయనించి యుండు మధు పుత్రుడగు ధుందుడను మహాసురుడు. లోక నాశనమునకు దారుణ తప మొనరించు చుండును. సంవత్సరము చివర వాడొకసారి నిట్టూర్పు పుచ్చును. అప్పుడు భూకంపము వచ్చును. వాని నిఃశ్వాస వాయువుచే నిసుకలేచి ఏడు రోజులు ఆదిత్య మండలము దాక కప్పి వైచును. మిణుగురులతో, నిప్పులతో, పొగతో నది యతి దారుణము నగనుండును. నేనచట తప మొనరింపం నిలువ లేకుంటిని. లోక క్షేమమునకు నీవు వాని సంహరింపుము. తన్మారణ మొనరింప లోకములు స్వస్థము లగును. నీవొక్కడవ వాని సంహరింప సమర్ధుడవు. వానం జంపిన వానికి వరములిచ్చి వాని ప్రతాప ఖ్యాతి గావింపు మని విష్ణువు నాకు వరమిచ్చెను. వాడు మహా తేజస్వి. అల్ప తేజస్వి చేత మడియడు అన నా ఉత్తంకుని పలుకులు విని
తన సుతుని కువలాశ్వుని జూపి స్వామి! నేనస్త్ర త్యాగము చేసితిని. ఈతడు ధుంధు వధ యొనరింప జాలునని చెప్పి తీవ్రతపో నిష్ఠకై పర్వతమున కేగెను.
ఓ బ్రాహ్మణులారా! కువలాశ్వుడు నూర్గురు కొడుకులతో ధుంధుని పైకి దండెత్తెను. ఉత్తంకు డాతని వెంట నుండెను. అప్పుడు విష్ణు భగవాను డాతని నావేశించెను. అతడెత్తి చసువేళ ‘‘నీతడు శ్రీమంతుడు. అవధ్యుడు. తప్పక ధుంధువును జంప గలడ’’ ను శబ్దము నింగిని విన బడెను. అతనిని దేవతలు దివ్య గంధ మాల్యములచే ముంచెత్తిరి. దేవ దుందుభులు మ్రోగెను. అతడు సుతులతో నేగి సముద్రమును మూల మట్టుగా త్రవ్వించెను. పడమటి దిశ నా రక్కసుడు బయలువడి వారి నెదిరించెను. వాని ముఖాగ్ని పెనుగాలితో రేగి లోకముల దహించి నట్లయ్యెను. వెల్లువలై నీరుబికెను. మువ్వురు దక్క తక్కిన వారెల్లరు దగ్ధులయిరి. అవ్వల రాజు వాని పైకెత్తెను. యోగి గావున యోగ బలమున జలము నించి యగ్నిని శమింప జేసెను. ఉదక రాక్షసుడగు వానిని గూల్చి యుత్తంకునికి జూపెను. అక్షయ ధనము అరి విజయము ధర్మ మందాసక్తి అక్షయ స్వర్గ వాసమను వరములుత్తం కుడాఱేని కిచ్చెను. రాక్షసుని చేగూలిన కుమారులకు క్షయ లోకములు గలుగు నట్లును వర మిచ్చెను.
వానికి మిగిలిన కుమారులు ముగ్గురు. పెద్దవాడు దృఢాశ్వుడు, చంద్రాశ్వ కపిలాశ్వులు తరువాతి వారు. ధుంధుమార కుమారుడైన దృఢాశ్వునికి హర్యశ్వడను వాడు కలిగెను. వానికి నికుంభుడు దయించే. అతడు క్షత్ర ధర్మపరుడు. అతని కొడుకు సంహతాశ్వుడు. రణ విశారదుడు. వాని తనయులు అకృశాశ్వ కృశాశ్వులు. కూతురు హైమవతి, దృషద్వతి అని ఖ్యాతి గాంచెను. ఆమె కొడుకు ప్రసేనజిత్తు. అతడు గౌరియను భార్యను బడసెను. ఆమె మహాసాధ్వి. భర్తృ శాపముచే నామె బాహుద యను నదియయ్యె. అతని కొడుకు యువనాశ్వుడు వాని కొడుకు మాంధాత. త్రిలోక విజయి యాయన. అతని భార్య చైత్రరథి. శశిబిందుని కూతురు సాధ్వి. బిందుమతి యను పేరు కలది. పరమ సుందరి పదివేల మంది కామె యప్పగారు. ఆమె యందు మాంధాత యిర్వురు కుమారుల గనెను. పురుకుత్సుడు ముచికుందు డనువారు వారలు. పురుకుత్సుని సుతుడు త్రసదస్యుడు. నర్మద యందు గలిగిన వాడు. వాని కొడుకు సంభూతుడు. వాని కుమారుడు త్రిధన్వుడు. శత్రు మర్దనము జేసిన వాడు. ఆయన తనయుడు విద్వాంసుడు త్రయ్యారుణుడు ప్రభువు. వాని కుమారుడు సత్య వ్రతుడు మహా బలాశాలి క్రూరుడు. పరిగ్రహణ మంత్రములకు విఘ్నముల కల్పించి మరొక్కని భార్యను హరించిన వాడు. బాల్యము చేత కామముచే మోహముచే సాహసముచే చాపల్యముచే వాడంతః పురమున నివసించు నొక గృహస్థుని కన్యను హరించెను. త్రయ్యారుణుడు ఆ యధర్మ శంకచేత క్రోధ సమన్వితుడై అతనిని నిందించి పరిత్యజించెను. నేనెక్కడకు బోదునని వాడనెను. నీవు శ్వపచులతో గూడి యుండుమని తండ్రి యనెను. నీవు కుల పాంసనుడవు. నీచే నేను పుత్రవంతుడ గాననియె. వాడు తండ్రి మాటను బట్టి నగరమును వీడి పోయెను. ఋషియైన వశిష్ఠ భగవానుడు పోవలదని వానిని వారింపడయ్యె. ఆ సత్య వ్రతుడు శ్వపాకుల పాకలదరి వసించు చుండెను. కొన్నాళ్ళకు దండ్రియు నవ్వనంబున కరిగెను. అంతట నింద్రుడా రాజ్యమున వర్షింప డయ్యె. ద్వాదశ వర్ష క్షామ మేర్పడెను. విశ్వామిత్రుడు తన భార్య నాతని దేశమున వదలి సాగరాంతమున విపుల తప మ్మెనరించెను. ఆయన భార్య నడిమి కొడుకును గల మందు బంధించి కొనపోయి తక్కిన బిడ్డలను బోషించుటకై నూరు గోవుల వెల కమ్మెను. అట్లు గలమందు బంధితుడైన వాని జూచి సత్యవ్రతుడు (రాజ కుమారుడు) విడిపించి యాతనిం దాను భరించెను. విశ్వామిత్రుని సంతోష పెట్టుటకు, అతని యను గ్రహము బొందుటకు నతడట్లు సేసెను. గలబంధన మందిన కతన నాతడు ‘గాలపుడు’ అనంబరగెను. కౌశిక మహర్షి యా వీరుని వలన నటు విముక్తి బడసెను.
