బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

222 - వర్ణాశ్రమ ధర్మ వర్ణనమ్‌.

వర్ణ ధర్మములను నాల్గాశ్రమ ధర్మములు వ్యాసభగవాను డిట్లానతిచ్చెను.

బ్రాహ్మణునికి దానము దయ తపస్సు దేవ పితృదేవతా యజ్ఞములు స్వాధ్యాయము ప్రధాన ధర్మములు. నిత్యోదకి (స్నానాదులతో చలికి వెఱువక) త్రిషవణ స్నాన నిరతుడు కావలెను. అగ్నులను ఉపాసింప వలెను. జీవనము కొఱకై యితరుల చేత యజ్ఞములు సేయింప వచ్చును. శిష్యులకు వేదములు చెప్ప వలెను. యజ్ఞ నిమిత్తముగా దెలిసి (పాత్రాపాత్ర వివేకముతో) ప్రతిగ్రహము సేయ వచ్చును. బ్రాహ్మణునికి జెప్ప బడిన షట్కర్మలలో ప్రతిగ్రహము (దానము పట్టుట) కూడ విహిత మయి యున్నది. సర్వలోక మునకు హితమే చేయ వలెను గాని యహితము సేయ రాదు. సర్వ భూతములతో మైత్రి బ్రాహ్మణుని కుత్తమ ధనము. ఋతు సమయ మందే భార్యాభి గమనము దీనికి బ్రశంసా పాత్రము. క్షత్రియుడు మనః స్పూర్తిగ ద్విజులకు దానముల యజ్ఞములు వేదా ధ్యయనము చేయ నగును. జగ ద్రక్షణకై అస్త్రము పట్టి జీవించుట క్షత్రియుని ధర్మము. భూ పాలనము కూడ ప్రధాన ధర్మము. దాననే రాజులు కృతార్థులు. యజ్ఞాది రక్షణము రాజు ధర్మము. దుష్టులను శిక్షించుట శిష్టులను రక్షించుట వర్ణధర్మ వ్యవస్థ చేయుట వలన రాజభీష్ట పుణ్య లోకగామి యగును. పశు పాలనము వాణిజ్యము కృషి (వ్యవసాయము) వైశ్యుని వృత్తిగా (జీవికగా) బ్రహ్మ యొసంగెను.అతనికి గూడ అధ్యయనము యజ్ఞము దానము ధర్మము అనునవి నిత్య నైమిత్తిక కర్మా నుష్టానములు బ్రాహ్మణ పురస్సరముగా కర్మాచరణము విహితము. అందులకే బ్రహ్మణులను బోషించుట అందు కొరకే క్రయ విక్రయ వ్యాపారము వడ్రంగము వైశ్యునికి విహితములు. శూద్రుడు దానము లీయ వలెను. పాక యజ్ఞములు సేయ వలెను. పాక యజ్ఞము చేతనే పితరుల నర్చించుట మొదలగు సర్వకర్మా చరణము విహితము. నౌకరులను భరించుటకు సర్వ పరిగ్రహములు సేయ వచ్చును. ఋతు కాలాభిగమన మందఱికిని సామాన్య ధర్మము, అంతేకాదు సర్వ భూతదయ ఓరిమి దురభిమానము లేమి శౌచము అనాయాసము మంగళ కార్య చరణము ప్రియముగా మాట్లాడుట. సర్వులతో మైత్రి దురాశ లేకుండుట ఇవి యన్ని వర్ణములకు అన్ని యాశ్రమముల వారికిని సాధారణ లక్షణములు. ఇవి గాక బ్రాహ్మణాదులకు ఈ క్రింది ఉప ధర్మములు (అపద్ధర్మము లన్న మాట) కూడ చెప్ప బడినవి. అపద్ధర్మముగా (జీవనము గడువ నపుడు) బ్రాహ్మణుడు క్షేత్ర ధర్మమును క్షత్రియుడు వైశ్య ధర్మమును వైశ్యుడు శూద్ర విహిత కర్మమును జేయ వచ్చును. వైశ్య శూద్రులు సమర్థులై యుండి యీ స్వధర్మము లను విడువ రాదు. అపద్ధర్మములో కూడ వారికిది త్యాజ్యము గాదు. కర్మ సాంకర్యము మాత్ర మెన్నడును జేయ గూడదు. ఇవి వర్ణ ధర్మములు సెప్పితిని. ఇక నాశ్రమ ధర్మములం దెల్పెద నెఱింగి కొనుము.

బాలుడు పనీతుడై వేదధ్యయన తత్పరుడై గురు గృహమందు వసించుచు బ్రహ్మచారియై యుండ వలెను. సదాచారమం దభిలాషగొని గురు శుశ్రూష చేయ వలెను. (శూశ్రూష = విన వలెనను కోరిక అనగా గురువు చెప్పి నట్లు వినుట యనగా నా ప్రకారము నడుచుట) వ్రతములం జేయ వలెను.(అనగా బ్రహ్మచర్య నియమములను బాటింప వలెను.) మనసు నిల్పి (అవధానము గొని) వేదము నేర్చుకో వలెను. మది కుదురు పరచి కొని యుభయ సంధ్యలందు నగ్నికార్య మొనరించి గురున కభివానము సేయ నగును. గురువు నిలువ బడిన తాను నిలువ బడి నడచిన వెంట నడచి యాయనకు క్రిందుగ కూర్చుండ వలెను. గురునకు బ్రతికూల మైన పని వదలి పెట్టవలెను. ఆయనతో వేదము పఠింప వలెను. అతని కెదురుగా గూర్చుండి వేరు తలపు గొనకుండ వలెను. అపై భిక్షాన్నము తెచ్చికొని గురునకు నివేదించి తదను మతిం దానది తిన వలెను. గురువు దిగి స్నానము సేసిన తరువాత నీతీర్థ మందు దాను దిగి స్నానము సేయ వలెను. సమిధులు తీర్థమును నీయనకై ప్రతి కల్పము (అవసర మైనపు డెల్ల) దేవలయును. వేదములు సదివిన తరువాత గురు దక్షిణ సమర్పించి ప్రాజ్ఞుడై గార్హస్థ్య మందు బ్రవేశింప వలెను.

శక్తి కొలది గృహస్థు సేయనగు కార్య మెల్ల జేయ వలెను. పితృ దేవతలను నిర్వాపముచే (తర్పణములచే) దేవతలను నతిథులను యజ్ఞములచే మునుల నన్న దానము స్వాధ్యాయము లచే సంతతి చేత బ్రజాపతిని బలి కర్మచే భూతములను సత్య వచనముచే నెల్ల జగమ్మును నర్చించి పురుషుడు తాజేసిన యీ పుణ్య కర్మ ప్రభావమున బుణ్య లోకముల నందును. భిక్షాన్న భోజనులగు సన్యాసులు బ్రాహ్మచారులు మఱియుం గలవారు యీ గృహము నెడ(గృహస్థు నెడ) నిలుతురు గావున గార్హస్థ్యము. పరమాశ్రమ ధర్మము. వేదములు నేర్చుకొను పనితో తీర్థ స్థానము కొరకు పృథివీ దర్శనము కొఱకు ద్విజులు వసుధపై సంచార మొనరింతురు. ఇల్లు లేక ఆహారము లేక సాయంకాల మందెవరిండ్లకు వత్తు రెవ్వరు. వారికి గృహస్థులు నిలువ నీడ యని చెప్పబడి నాడు. అతడు వారికి మధురాతి మధుర భాషణముల స్వాగతంబు పలుక వలె. (అయ్యా! దయసేయు డన వలయును) ఆ మీద దానములు సేయ గోరు(అన్ని దానాదులు) ఇంటికేగు దెంచిన వారికి పరుండం గూరుచుండ తిన శయనాసన భోజనా దులం గూర్ప వలయును. భగ్నాశుడై యతిథి యెవ్వని యిలు వదిలి పోవునో యా యతిథి తన పాప మాయింటి యజమాని కిచ్చి వాని పుణ్యమం గొని పోవును. ఈసడింపు అహంకారము డాంబికము నింద ఉపఘాత పారుష్యము గృహికి తగదు. గృహస్థీ యుత్తమ ధర్మము పాటించి సర్వబంధ ముక్తుడై యుత్తమ లోకములం బడయును.

వయస్సు పండిన తఱి గృహాశ్రమి కృతకృత్యుడై భార్యను బుత్రుల కప్పగించి వన మేగ వలెను. ఆమెతో నైన నేగ వచ్చును. రాలిన యాకులు దుంపలు రాలిన పండ్లు దినుచు జుట్టు గడ్డము జటలు వెంచికొని నేలం బరుండుచు నట మునియై సర్వులకుం దాన యతిథియై యుండ వలయును. చర్మములు రెల్లు దర్భలతో నల్లిన వానిం గట్టుకొన వలెను. పైని వేసికొన వలెను. తప్పక త్రిషవణ స్నానము సేయ వలెను. దేవతార్చనము హోమము సర్వాభ్యాగత పూజ భిక్ష బలి ప్రదానము నీ వాన ప్రస్థునకు ప్రశస్తమని చెప్ప బడినది. అడవి నూనెలతో నభ్యంగ స్నానమును వీనికి బ్రశస్తము. శీతోష్ణాది ద్వంద్వ సహనము తపస్సునకు నీ నియమము లంబూని వానప్రస్థుడు చరింప వలెను. అట్టి పుణ్యుడు అగ్ని యట్లెల్ల దోషములం దహించి శాశ్వత పుణ్య లోకము లందగలడు.

చతుర్థాశ్రమము భిక్షువునకు సంబంధించి నది. సన్న్యాసమను పేరనగు నా యాశ్రమ ధర్మముం దెల్పెద నెరింగి కొనుడు. కలత్ర పుత్ర దనాదు లందు స్నేహములం బాయవలెను. మాత్సర్య మేమాత్రము నుండ రాదు. త్రైవర్ణిక ధర్మములం గర్మల నన్నింటిని విడువ వలెను. మిత్రాదుల మైత్రుడు సముడునై యెల్ల భూతము లందు నట్లుండ వలెను. జరా యుజములు (మావి వలన బుట్టినవి) అండజములు (పక్షులు) స్వేద జములు (చెమట వలన బుట్టు క్రిములు) ఉద్భిజ్జములు (విత్తు నుండి పుట్టు వృక్షాదులు) నగు వీని యందెందును త్రికరణము లచే నెట్టి ద్రోహము సేయరాదు. సర్వ సంగములు వీడ వలెను. ఒకయూర నొక్క రాత్రి, పురమం దైదు రాత్రులు మాత్రమే యుండ వలెను. పశు పక్ష్యాదు లందు ప్రీతి ద్వేషమును వీని కుండదు. ప్రాణ యాత్రా నిమిత్తము గనే నిప్పు లార్పుకొని జనములు భుజించిన తర్వాత ప్రశస్త వర్ణములు వాండ్లకడ భిక్షాటనము సేయ వలెను. భిక్ష దొరకని చో విషాద పడరాదు. దొరకిన హర్ష పడరాదు. ప్రాణయాత్ర మాత్ర మాత్రాకాల సంగముగొని వెడలి పోవలెను. మితి మీరిన పూజ లాభముల నెల్లడను సహించుకొన వలెను. కామము క్రోధము దర్పము లోభము మోహము మొదలగు దోషములను వీడి నాది నేనను భావము లేక (నిర్మముడు నిరహంకురుడై) యుండ వలెను. వానికి దేహమును వదలు నపుడును భయము కలుగదు. తన మేని లోని యగ్నిని తన ముఖమున నగ్నిహోత్ర మాచరించి అనగా తనలో నున్న జఠరాగ్ని యందు వైశ్వానరాగ్ని యందు హవిస్సుగా పంచాహుతుల రూపమున నాహారమును హోమ ద్రవ్యముగా వేల్చి అది గూడ భిక్షా రూపమున దెచ్చి కొన్న దానినే హోమము సేసి చితాగ్నులైన వారి యొక్క లోకముల కాత డేగును. అగ్ని చయనము సేసిన వారేగు లోకము లందు నన్న మాట) ఇదంతయు వివిదిషాది సంన్య్నాసు లన్నమాట. ఇక మోక్షాశ్రమ సన్యాసియో (విద్వత్స నన్య్నాసి యన్నమాట) యథోక్త విధానమున నాశ్రమ ధర్మము నిర్వహించి సంకల్పిత బుద్ధితో ననింధన మయిన జ్యోతి వలె (కట్టెలు లేని నిప్పు వలె) ప్రశాంత మయిన యా బ్రహ్మ లోకమును బొందును. ద్విజులకు మాత్రమే యీ యాశ్రముము సెప్ప బడినది.