బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
215 - దక్షిణ మార్గ వర్ణనమ్
మునులు తపోథనా! పాపులు దక్షిణ మార్గమున నెట్లు వోదురో సవిస్తరముగ నాన తిమ్మన వ్యాసులిట్లనియె.
ఆ మార్గము ఘోరాతి ఘోరము. ఆ ద్వారము ఘూతుక మృగ సంకులము. భయంకరము. నక్కల యరపులతో బ్రతిథ్వనించును. అగమ్యము. భూత ప్రేత పిశాచ రాక్షసంకీర్ణము. తలచి కొన్న తనువు గగుర్పాటు చెందును. పాపులా ద్వారముం దూరాననే కని బెదరి ప్రేలాపన సేయుచు మూర్చ పడుదురు. అటుపై యమ భటులు వారిం గొట్టుచు సంకెళ్లం బాశములం గట్టి యీడ్చుచు దండములం బెదరింతురు. ఆ జీవులు తెలివొంది రక్తము నందడిసి యడు గడుగునం దడవడుచు దక్షిణ ద్వార ముంజొత్తురు. ఆ దారి ముండ్లతో గులక రాళ్లతో కత్తులతో బాషాణములతో నొక్కెడ బురదతో దాటరాని గోతులతో నినుప సూదు లట్టి దంతములతో దుర్గమ మయి యుండును. అందు జీవులు దుఃఖించుచు ఒడ్డులం గూల్చు కొండలు చెట్లతో నిప్పులతో గూడిన దారిం బోదురు. కొన్ని యెదల నొరకములు కొన్ని యెడల మట్టి పెళ్లలు కణకణ లాడు నిసుక పదునైన శంకువులు సలసల కాగు నేలతోడి నలు దారులు కలిసిన బాటలు కాలిన షాషాణములు కొన్ని యెడల మంచుతో పీకదాక దిగిపోవు నిసుక మేటలతో ముఱుగు నీటితో గనగదే మండు నిప్పులతో గూడి యుండును. సింహములు తోడేళ్ళు ఈగలు దోమలు దారుణము లయిన పురుగులు నొక్కెడ పెద్దపెద్ద జలగలు మీద కొండ చిలువలు కందురీగలు విషము గ్రక్కు పాములు దుష్టగ్గములు పదునైన కొమ్ములతో దారి నేలరాయు నెడ్లతో దున్నలతో నొంటెలతో గూడి యుండును. రౌద్రము లయిన ఢాకిని శాకిన్యాది పిశాచములు రాక్షసులు వ్యాధులు పీడింప నాదారిం బీడితులై పోవుదురు. మహాధూళి గ్రమ్మ మహా ప్రచండ వాయువులు వీవ మహా పాషాణములు వరిక్షంచు చుండ యమ భటులు బాదు చుండ నిలువ నీడ గానక నొక్కెడ పిడుగు పాటున నొడలు పగుల బాణ వర్క్షమున బ్రద్దలు కాగా దారుణముగ గొఱవులు పడు చుండ పైని నిప్పులు గురియు చుండ నాదారిం జనుదురు. పెను ధూళి కురియు చుండ నందు బ్రుంగి యేడ్తురు. మేఘముల యురుముల కడలి పోవుదురు. బాణ వర్షములచే జూర్ణమై పోయెదరు. పెద్ద యుప్పు నీటి దారలం దడియుచు పుండు వంటి చలిగాలికి బిగియుచు పగులుచు నొగులుచు నాదారి నాకలి వడి తినుట కేమియు లేక గుములుచు నిరాలంబము నిర్జలము నైన యా దుర్గమ యమ మార్గమునం బడి అతి శ్రమ గుడుచుచు దేహులు మూఢులు పాపాత్ములా వెంటం జనియెదరు. యమునాజ్ఞం గొని దూత లతిఘోర రూపు లీడ్వ నొంటరిగ పరాధీనులై బంధు మిత్రాదులు లేక తాము మున్ను జేసిన పాపములకు మఱిమఱి యేడ్చుచు నడుమ నడుమ యమ భటులు నోరెత్త వలదని కొట్టు చుండ నోరు నాలుక యెండ ప్రేతలై నొగులుదురు. బక్క చిక్కిన మేనులతో జడిసి జడిసి పోవుచు నాకలి చిచ్చునకు దహింప బడుచు సంకెళ్ళం బంధితులై కొందరు తలక్రిందుగా పాదములు మీదుగా గైకొని దూతలచే యీడ్వ బడుదురు. కొందరు మొగము క్రిందుగా నీడ్వబది యేడ్తురు. అన్నము నీరు లేక మఱిమఱి దేహిదేహి అని అడుగు కొనుచు కంట నీర్వెట్టుచు గద్గదికతో జేతులు మొగిచి దీనులై ఆకలి దప్పులం గుమిలి మంచి భక్ష్యములు పేయములు భోజ్యములు గమగమ వాసనలు జిమ్ముచుండ జూచుచు మఱిమఱి ప్రాధేయపడి యడిగి కొనుచు పెరుగు పాలు నెయ్యియుం గలిపిన యన్నముం జూచి సుగంధ భరిత పానీయములం జల్లని నీరుంగని యమ దూతలం బిక్క మొగము వెట్టి యాచించి కొను చుందురు. వారింగని యమ దూతలు భయంకరులు క్రోధమున గనుకెలకు లెఱ్ఱవడ బెదరించుచు నిట్లందురు.
సకాలమున మీరు హోమము సేయలేదు. విప్రుల కేమియు నీయలేదు. ఎవరేని యిచ్చు చున్న దాని కడ్డు తగిలితిరి. దాని వలని పాపమిది యనుభవింప వలసి నది. అగ్నిచే గాలలేదు. నీటి పాల్గాలేదు. రాజులు దొంగలు నపహరింప లేదు. మున్ను మీరు సేయని దాన మిప్పుడు బ్రాహ్మణ ముఖమున నీయ బడుచున్నది. సాత్త్విక దానము సేసిన సాధువుల కివిగో అన్న పర్వతము లెదురగు చున్నవి. భక్ష్య భోజ్య లేహ్య పేయాది రూపమగు నాహార సమృద్ధి యిది మీకు గాదు. మీరు విప్ర ముఖము నెన్నడు నింత యన్నము పెట్టియుండ లేదు. బ్రాహ్మణులం బూజింపనైన లేదు. ఆ విధముగ జేసిన పుణ్యాత్ములదీ యన్న సమృద్ధి. వారిది గొనివచ్చి మేము మీకెట్లు పెట్ట గలము?
యమ కింకరుల మాట విని దిగులు వడి యాకలికి గుమిలి యా జీవులు దారుణ శస్త్ర పీడితు లయిరి. ఇనుప గుదియలు ఇనుప దుడ్లు శక్తి తోమర పట్టి నపరిషు బిండిపాల గదా పరశు బాణాదులచే వీపునం బాదుచు పరమ నిర్దయులు కింకరుల వేధింప నరిగి యరిగి సింహ హ్యఘ్రాదులచే పాపులు భక్షింప బడుదురు. అట్లు మిగుల పీడించి కింకరులు పాపులను యమ ప్రభువు నెదుటకుం గొంపోదురు. అయన ధర్మాత్ముడు ధర్మకర్త సర్వ ప్రాణి నియామకుడు నైన యముడు ఇట్లతి కష్టమైన దారింజని ప్రేత పురముం జేరిన నరులను ప్రభువు నెదుర బెట్టి యమ దూతలు వారు వారు సేసిన కర్మముల నివేదింప ప్రాణు లాయన నతి భయంకరుని జూచెదరు. పాపముచే గనులు మూత వడి బుద్ధులు చెడి ప్రాణి కోరలతో భయంకరమయి కను బొమలు ముడివడి మిడిగ్రుడ్ల జడుపు కూర్చు మొగము నిక్కిన జుట్టు పెద్ద గడ్డముతో బెదవు లదర బదునెన్మిది చేతులతో కాటుక వలె నల్లని మేనితో సర్వా యుధములం గరములం బూని పెద్ద దున్న పోతు నెక్కి పెద్ద మబ్బువలె నిప్పులట్లు మండు కండ్లు రక్త మాల్యములు పూని ప్రళయ మేఘ మట్లురుముచు సముద్రు నాపోశన పట్టు నాయాన్నట్లు ముల్లోకములను మ్రింగునా యన్నట్లు నిప్పులు గ్రక్కు చున్నట్లు దగ్గరగా నిల్చి కాలాగ్ని ప్రభతో నున్న మృత్యువుం గని మహా మారి కాల రాత్రియు వివిధ వ్యాధులు కష్టాలు నానా రూపాలు శక్తి శూలాస్త్ర పాశ చక్రాంకుశ ఖడ్గాదులు దాల్చి వజ్ర దండములం గొని చుర కత్తెలు అమ్ముల పొదలు విండ్లును నసంఖ్యాకముం బూని మహా వీర్యులు క్రూరులు కాటుక వలె నల్లని మేనికాంతి గలవారు సర్వాయుధ హస్తులయి యమదూత లతి భయాన కులై ఘోరముగ పరివారమై గొలువ గొలు వైన యముని చిత్రగుప్తునిం బాపాత్ములు దర్శింతురు. యముడుగ్రుడై వారి నురిమి యురిమి చూచును. అపుడు చిత్రగుప్త భగవానుడు ధర్మ వచనములచే బ్రబోధించుచు నిట్లనును.
ఓపాప కర్ములారా! పర ద్రవ్యాపహారులారా! రూపముచే బలముచే బొగరెక్కి పరదా రాభిమర్శనము సేసిన ఫలమది యనుభవింప వలయును. దుఃఖము కుడువక తప్పదు. ఈ తప్పెవనిది కాదు. ఈ రాజులు నా కడకు వచ్చిన వారు తెలివి చెడి బల గర్వితులై చేసిన తమ కర్మము ననుభవించు చున్నారు. ఓ రాజులారా! ప్రజా నాశన మొనరించితిరి. అల్ప రాజ్య సుఖమునకై ఘోరములు సేసినారు. మీరు రాజ్య లోభముతో మోహముతో బలత్కారముగ ప్రజల దండించి నారు. దాని ఫలమిపు డనుభవింపుడు. రాజ్యమేది ఇక్కడ భార్య యెక్కడ? ఇపు డేకాకియై చేసిన యశుభ మనుభవింప వలసి నదే ఏ బలముకొని ప్రజల భాదింతురో యాబల మిపుడే మాత్రమీ లోకమున గనబడదు. యమ కింకరుల వలని బాధలకు గురి యైతిరి పాపము. అని యిట్లు పలు తీరుల దెప్పి పొడుచుచు నొవ్వనాడుచు యముడుత్కట కోపియై పడదిట్ట నేడ్చుచు చేసిన పాపములకు పశ్చాత్తాపించుచు ప్రాణులు నోరెత్తక నిల్తురు.
ధర్మరాజిట్లు చిత్రగుప్తుని వారివారి కర్మల లెక్కలు సెప్పు మని విని యాపాప విశుద్ధికి విధింప నగు దండన ములం గూర్చి దండధరు డిట్లా దేశ మిచ్చును.
ఓరి చండ! మహాచండ! ఈ నర పతులం గొంపోయి నరకాగ్ను లందు బడనేసి పాపముల నుండి విశుద్ధుల జేయుడన
వెనువెంట లేచి యమ భటులు నృపులకాండ్లు పట్టుకొని యెత్తి విసరి పారవేసి పాప పరమాణముం బట్టి బండపై నడిచి పిడుగుచే మహాతరువు నట్లు గొట్టిరి. అంతట రక్తము ప్రవాహ మెత్తినట్లు ముక్కున నోట జాల్కొనం దెలివి తప్పి యాదేహి పడి పోవును. అటుపై దానిపై వాయువు వీవ తెలివిగొని నంత వారిని పాప విశుద్ధికి నరక సాగరమున విసరుదురు. ఆ దూతలు మహా దుఃఖములం గుములు మఱియుం గల జీవులను యమునికి నివేదింతురు.
ఇడుగో వీనిని మహాపాపిని మూర్ఛ బడనేసి కొని వచ్చితిమి. ధర్మ విముఖుడు నిత్య పాపరతుడు. ఇడుగో వీడు పరమ లుబ్ధుడు. మహా పాతకో పపాతకము లెన్నో సేసినాడు హింసా పరుడు అనాచారుడు. కూడ రానిదిం గూడిన వాడు పర ద్రవ్యాపహారి. కన్యా విక్రయి కూట సాక్షి కృతఘ్నుడు మిత్రద్రోహి. మరియు వీడు ధర్మ నింద సేసి నాడు. పాపములు సేసి నాడు. దురాత్ముడు వీనిని శిక్షించుటో రక్షించుటో ప్రభువు వీవు సెలవిమ్ము. నీచెప్పిన దములు సేయుటలో మేము సర్వదా విధేయులము
అని యిట్లు విన్నవించి ధర్మప్రభువు నెదుట నిలిపి వేలకొలది లక్షకోటి నరకములం బడ వైతురు. ఆపై మఱి కొందఱిం బట్ట బోదురు. చేసిన తప్పు నిర్ధారణ సేసిన మీద తన కింకరుల కానయిచ్చి వశిష్ఠాది మహార్షు లేయే నేరముల కేయే దండనము విధించిరో యాయా రీతి దండింప జేయును. యమ కింకరులు క్రోధమూని అంకుశ ముద్గర దండాదులు ఱంపములు శక్తి తోమరములు కత్తులు శూలములుం గొని అడచి కొట్టి కోసి యేసిగ్రుచ్చి నరకి చీల్చి పాప శోధనము సేయుదురు.
నరకముల భయానక స్వరూపము వాని ప్రమాణములు వినుండు. మహావీచి అను నరకము రక్త పూర్ణము. వజ్రకంటక మిశ్రము. పదివేల యోజనముల విరివి గలది పాపినందు ముంచి వజ్రకంటక ములం గ్రుచ్చి చీల్తురు. లక్ష యేండ్లక్కడ గోహత్య చేసిన వాడు గూలి యుండును. కుంభీ పాకము మహాదారుణ నరకము. నూరు లక్షల యోజనము లుండును. కాలుచున్న రాగి బిందెలతో నది మిడమిడ కాలు నిసుక నిప్పులతో గూడి యుండును. బ్రహ్మఘ్నుడు భూమిహర్త ధన నిక్షేపములను (నిధులను) హరించిన వాడచట గూలును. భూత ప్రలయము దాక జీవు లందు కాల్ప బడుదురు. అటుపై రౌరవము జ్వలించు వజ్ర బాణములతో నిండి యుండును. అరువది యోజనముల పొడవు వెడల్పు గల్గి యుండును. జ్వాలలు గ్రమ్ము నానరకమున బాణములచే పాపులు జీల్ప బడుదురు. అయోమయ నరకము మంజూషాకారము (బొను వంటిది) దానిలో బావుల బడనేసి చెఱకు నాడించి నట్లాండింతురు. అదియును జ్వలించు చుండును. ఆప్రతిష్ఠమను నరకము మల మూత్ర పురీష మయము. పాపియంద ధోముఖుడై కూలును. బ్రాహ్మణులను బీడించిన వాడు బ్రాహ్మణ ద్రవ్య మపహరించిన వాడు దానం గూలును విలేపకమను నరకము సలసల కాగు లక్కతో నుండును. మద్య పానరతులందు మున్గుదురు. మహా ప్రభమను నరకము కాలిన శూలములతో నిండి యుండును. ఆలు మగలకు తగవు పెట్టిన వారా శూలములచే బొడువ బడుదురు. జయంతియను ఘోరనరకము ఉక్కు పరచిన రాతినేల. పరభార్యా నంగి దానంబడి యుడికి పోవును. శాల్మల మను నరకము నిప్పుల ముళ్ళతో నిండినది. బహుజన వ్యభిచారిణి యైన స్త్రీ దానిం గౌగలించు కొనును. ఎవ్వరి తరుల యాయువు పట్టుల కుందగులు నసత్యములు పల్కుదురో వాండ్ర నాలుకను లాగి ఱంపములం గోయుదురు. ఎవ్వరు సరాగ ములగు చూపులం బరాంగనం జూతురో వాండ్ర కన్నులం బాణములం గ్రుచ్చి పగిలింతురు. తల్లిని సోదరిని గోడలిని గూతురుం బొందిన వాండ్రను స్త్రీ బాల వృద్ధ హంతకులను పదు నల్వురింద్రుల కాలము జ్వాలా మాలా కాకులమైన రౌద్ర మగు మహా రౌరవమను నరకమునం గూల్తురు. అది యిరువది నాల్గు యోజనముల విరివి యైనది. ఎవ్వడు పుర గ్రామ క్షేత్ర గృహాదులకు నిప్పు వెట్టునో ఆ మూఢుడు కల్పాంతము దాక పై నరకమున గాల్పబడును. తామిస్రమను నరకము లక్ష యోజనములు. కత్తులు పట్టిసములు ముద్గరములు పరచినది. అందు దొంగలను విసరి వైతురు. యమ కింకరులు శూల శక్తి గదా ఖడ్గాదులచే కల్ప శతమచట పాపుల నడంతురు. తామిస్రము కంటె రెట్టింపు విశాలము మహా తామిస్రము. అందు జలగలు పాములు నుండును. కారు చీకటి పరమ దుఃఖదము. మాతృ పితృ హంతకులు మిత్రవిశ్వాస ఘాతకులు నందు బాడితెలం జెక్కబడు చుందురు. భూమి యున్నంత దాక యది యనుభవింతురు. అసిపత్ర వనము (కత్తుల బోను) మహా దుఃఖదము. కాలుచున్న కత్తులతో నిండినది. ఒక్క యోజనము విరివి గలది. అందు మిత్రఘ్నుడు భూత ప్రలయము దాక కత్తులచే నూరు వ్రక్కలు గావింప బడును. కరంభవాలుక మను నరక మొక్క యోజనము. కూపాకారము మిడమిడ గాలు నిప్పులతో ముండ్లతో నిసుకతో నిండినది. అందు ఒక లక్షా పదివేల మూడు వందలేండ్లు జనులను మాయో పాయములచే దారుణముగ మ్రగ్గుదురు. దహించిన వాండ్రందు దహింప బడుదురు. కాకోలమను నరకము కృమి మయము మల మయమును. మృష్టాన్నముం దా నొక్కడ దిన్నవాడు దానం గూలును. మలమూత్ర శోణిత మయ ముకుడ్మలమను నది. పంచ యజ్ఞములు మానిన వాండ్రందు బడుదురు. మాంసము రక్తముతో నది పాడుకంపు గొట్టు చుండును. భయంకరము. అభక్ష్యాన్న భక్షకులందు గూలుదురు. క్రిమి కీటక మయము శవ సంపూర్ణము మహా వటమను నరకము. కన్యా విక్రయము సేసిన వాడక్కడ తలక్రిందుగా నా పెద్ద మఱి చెట్టునుండి క్రింద పడును. తిలపాకమను నరకము దారుణము. పరులను బీడింప గోరిన వాండ్రు అందు గానుగ యందు నువ్వు లట్లాడింప బడుదురు. అందు నలనల క్రాగు నూనెలో నుడికి పోదురు. మిత్రఘ్నుడు శరణాగత హంతకుడు వజ్ర కపాట మను నరకమున వజ్ర మయము లయిన గొలుసులం బంధింప బడును. పాలమ్ము వాడు నిర్దయముగ నిరుచ్ఛ్వాస మగు గాఢాంధకార బంధురము గాలి యాడని నరకమునం బీడింప బడును. బ్రాహ్మణునికి చేయు దానమున కడ్డు పడినవాడు చేష్టలు దక్కి యందు గుములును. గనగన మండు నిప్పుల నరకమది. అంగారో వచయము. విప్రునికి దానము సేసి చేయ లేదన్న వాడు దాన బడును. మహాపాయి యను నరకము లక్ష యోజనములు. అనృతము లాడిన వాడు అందధో ముఖముగా బడవేయ బడుదురు. మహా జ్వాలమను నరకము పెను మంటలతో భయంకరము. పాపులందు దహింప బడుదురు. క్రకచమను నరకమున వజ్రము వంటి పదునైన ఱంపములచే నగమ్యామ గమనమును జేసిన పాపులు గోయ బడుదురు. గుడ పాకమను నరకము క్రాగుచున్న బెల్లపు పాకము మడుగు. అందు వర్ణ సాంకర్యము సేసిన వాడు పడవేయ బడును. క్షుర ధారమను నరకము పదునైన కత్తుల నరకము బ్రాహ్మణ భూమి కాజేసినవా డందు కల్పాంతము దాక కోతలం బడును. అంబరీష మను నరకము ప్రలయ కాలాగ్ని దీపితము నూరుకల్ప కోటులందు స్వర్ణస్తేయి (బంగారపు దొంగ) గూలును. వజ్రకుఠార నరకము కేవల వజ్ర మయము. చెట్లను నరకిన వాండ్రట బడుదురు. పరితాపము ప్రలయాగ్ని మయము. విషము పెట్టిన వాడు మధుహర్త (మధువు = తేనె) దానంబడును. కాలసూత్రము వజ్రసూత్ర మయము. ఇతరుల పంటలను హరించిన వాండ్రందు బడుదురు. కశ్మలమను నరకము చీమిడి శ్లేష్మముతో నిండినది. ఒక కల్ప మక్కడ నిరంతర మాంసాభిరుచి గలవాడు గూలును. ఉగ్ర గంధమను నరకము లాలా (చొంగ) మూత్ర పురీష మయము. పితరులకు పిండ ప్రదానము చేయని వాండ్రందు బడవేయ బడుదురు. జలగలు తేళ్ళతో నుండెడి దుర్భర నరకము పది వేలేండ్లందు తిండిపోతు గూలును. వజ్ర మయము వజ్రమహా నీడమను నరకమున ధనధాన్య హిరణ్యములును హరించిన వాండ్రు కుములుదురు. యమ కింకరులు లేశ లేశముగా దొంగలనట చెక్కుదురు. కాకిని గ్రద్దనట్లు ప్రాణుల నరకితిను వాండ్రను యమ కింకరులు కల్పాంతము దాక వాండ్ర మాంసమును వాండ్ర చేతనే దినిపింతురు. బరుల శయనాసన వస్త్రాదులం గాజేసిన వాండ్రను శక్తి తోమరాదులచే యమ భటులు ఖండింతురు. పండ్లు ఆకులు హరించిన కుబుద్ధులు గడ్డి నిప్పునం గాల్ప బడుదురు. కాలభటులు పరదా రథనాదుల యెడ బుద్ధిగల వాని గుండెలలో గాలిన యినుప శూలముం గ్రుచ్చుదురు. మనో వాక్కాయ కర్మలందు ధర్మ విముఖు లయిన పాపులు యమ లోకమున బలు ఘోర మలయిన యాతన లందు వేలు లక్షలు కోట్ల సంవత్సరములు దుఃఖములు గుడువ వలసి యుండును.
