బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

233 - ప్రాకృతలయ నిరూపణమ్‌

ఓ బ్రాహ్మణోత్తములారా! ఈ ప్రళయ మేఘములు వర్షించుటచే కలిగిన జలము సప్త మహర్షు లుండు స్థానము వరకు వ్యాపింపగా ఈ త్రైలోక్య మంతయు ఏక సముద్ర మగును. విష్ణు వంతట తన నిట్టూర్పు వాయువు తోనే నూరేండ్లకు పై బడిన కాల వ్యవధిలో నశింప జేయును. సర్వ భూత మయుడును ఊహింప నలవి కాని వాడు భూతముల నన్నిటిని సృష్టించు వాడు ఆది లేకయు లోకమునకు ఆదియగు విష్ణు భగవానుడు వాయువు నంతటిని పూర్తిగా పీల్చి వేసి బ్రహ్మ రూపమును ధరించి ఆ ఏకార్ణవమున శేష శయ్యపై పరుండును. అప్పు డతనిని జనలోక మందలి సనకాది సిద్ధులు బ్రహ్మ లోకము నందలి వారు స్తుతించు చుందురు. మోక్షము కోరిన వారు ధ్యానించు చుందురు. ఆ పరమేశ్వరుడు వాసు దేవుడను తన స్వరూపమును చింతించుచు తన స్వమాయా రూప యగు యోగ నిద్ర నాశ్రయించి యుండును. ప్రళయాంతమున హరి సృష్టికి నిమిత్త కారణుడుగా బ్రహ్మ రూపము ధరించి శయనించి యుండుటచే దీనికి నైమిత్తిక ప్రళయమని పేరు. వేయి చతుర్యుగముల పరిమాణము కల బ్రహ్మ దేవుని పగటి వలెనే అతని రాత్రియు అంతే పరిమాణము కలది. అంత కాలము గడచిన తరువాత విష్ణువు మరల బ్రహ్మ యొక్క రూపముతో సృష్టిని ఆరంభించును. ఇట్లు ఓ విప్రులారా! మీకు నైమిత్తిక ప్రళయ విధము తెలిపితిని. ఇక ప్రాకృత ప్రళయము తెలిపెదను వినుడు.

అనావృష్టి అగ్ని మొదలగు ఉపద్రవములతో భూలోక పాతాళాది లోకము లందలి ఉపరి తలమున గల పదార్థము లన్నియు మొదట నశించును. తరువాత విష్ణుని ఇచ్ఛకు లోబడి మహాదాది ప్రకృతి వికారము లన్నియు నశించును. ఇదే ప్రాకృత ప్రళయము. దాని క్రమమిది. మొదట జలము పృధివి యొక్క గంధ గుణమును హరించును. అంతట పృథివియు జల రూపము ధరించును. అపుడవి మహా ధ్వనితో మహా వేగమున ప్రవహించి లోకాలోక పర్వతము వరకు నిండి పోవును. అంతట అగ్ని తత్త్వము జలమును దానిలోని రస తన్మాత్రను హరించును. అంతట జలము జల రూపము వదలి అగ్నిగా నగును. అపుడీ జల మంతయు పృథివి లేక జలము లేక కేవల మగ్ని జ్వాలలతో నిండి యుండును. అంతట వాయువు అగ్ని యొక్క విశేష గుణ మగు రూప తన్మాత్రను హరించును. అప్పుడు అగ్ని యంతయు అగ్నిత్వమును కోల్పోయి వాయువుగా నగును. ప్రపంచ మంతయు వాయువు మాత్రమే అయి అది పది దెసల వీచు చుండును. అంతలో అకాశము వాయువు యొక్క విశేష గుణమగు స్పర్శ తన్మాత్రను తన లోనికి లయము చేసి కొనుటచే వాయువు వాయువుగా నుండక లయము నొందుటచే అంతటను ఆకాశము కేవల శూన్య తత్త్వము మాత్రము ఉండును. అంతలో ఆకాశము యొక్క విశేష గుణమగు శబ్ద తన్మాత్రను భూతాది తత్త్వము తనలో లయ మొందించు కొనును. అదియు మహత్తత్త్వము నందును అదియు ప్రకృతి యందును లయము నొందును. అదియే త్రి గుణముల సామ్యావస్థ. అనగా అప్పుడు సత్త్వ రజన్తమో గుణములలో ఏ యొక్కటియు ఎక్కువగ ఉద్రేకింపక మూడును సమ స్థితిలో నుండును.

ఈ ప్రకృతినే ప్రధాన హేతువు పరమ కారణము అనియు వ్యవహరింతురు. ఇది వ్యక్త అవ్యక్త స్పష్ట అస్పష్ట స్వరూపము కలది. ఈ వ్యక్తావ్యక్త తత్త్వము అవ్యక్తత్త్వములో లయము నందును. ఆ అవ్యక్తమే అక్షరము నాశము లేనిది నిత్యము సర్వ వ్యాపియై యుండును. అదియు సర్వ భూతాత్మకు డగు పరమాత్మ యొక్క అంశమే. సత్తా మాత్ర జ్ఞాన మాత్ర సత్‌ చిత్‌ రూపుడును అన్ని తత్త్వముల కంటె గొప్పవాడును అగు ఆ పరమాత్ము నందే ఈ ప్రాపంచిక వ్యవహారమునకు సంబంధించిన నామము జాతి మొదలగు కల్పన లన్నియు లయము పొందును. ఆ తత్త్వమే బ్రహ్మము పరంధామము పరమాత్మ పరమేశ్వరుడు విష్ణువు అనబడును. అతనిని చేరిన వారు మరల జన్మ లోనికి రారు. వ్యక్తావ్యక్త స్వరూప యగు ప్రకృతియు అవ్యక్త రూపుడు అక్షరుడును పురుషుడును ఈ రెండును పరమాత్మ యందు లయ మగును. అయనయే అన్ని తత్త్వములకును అశ్రయమగు చోటు. అతడు విష్ణువను పేరుతో వేదముల వేదాంతముల యందు గానము చేయబడు చున్నాడు. వేదోక్త మగు కర్మలు ప్రవృత్తి ప్రధానములు నివృత్తి ప్రధానములు అని రెండు విధములు. ఋగ్యజుః సామ వేదానుసారి యగు మార్గమున యజ్ఞేశ్వరుడుగా యజ్ఞ పురుషుడుగా పరమాత్మ నారాధించుట ప్రవృత్తి మార్గము. జ్ఞానమూర్తి, చిద్రూపుడు అగు ఆయనను జ్ఞాన యోగమున ఉపాసించుట నివృత్తి మార్గము. ఆయన తత్త్వము వాక్కులకు అంద రానిది. ద్విపరార్ధ పరిమితి గల కాలము విష్ణువునకు ఒక పగలు అంతే ఆయనకు రాత్రి పరిమాణమును. ఇది కూడ లోక సామ్యమును బట్టి చెప్పుటయే కాని ఆ పరమాత్మునకు పగలును రాత్రియు అనునవి లేవు. ఓ ఋషులారా! ఈ చెప్పినది ప్రాకృత లయ స్వరూపము.