బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

14 - శ్రీ కృష్ణజన్మానుకీర్తనమ్‌

క్రోష్టుని భార్యలు గాంధారి మాద్రియును, గాంధారి అనమిత్రుని మాధ్రి యుధాజిత్తును దేవమీఢుఘడనను నిద్దరిం గనెను. వారి వంశమే వృష్టి వంశముగా మూడు శాఖలుగా వృధ్ది నందెను. మాద్రి కొడుకులు వృష్ణి అంధకుడు అనువారు. శ్వఫల్కడు, చిత్రకుడను వారు వృష్ణి యొక్క కుమారులు.

శ్వఫల్కుడు ధర్మపరుడు, వాని పాలనము నందు వ్యాది భయము, అవృష్ణి తాపము మొదలైన బాధలు లేకుండె. ఒకప్పుడు కాశీ రాజు పాలించు దేశము నందింద్రుడు మూడేండ్లు వర్షింపనే లేదు. అపుడు కాశీ రాజు శ్వఫల్కుని తన రాజ్యమునకుం గొన వచ్చెను. అతడచ్చేట మసలిన కతన హరి వాహనుడు (ఇంద్రుడు) వాన గురియించెను. అపుడు శ్వఫల్కుడు కాశీశ్వరుని కుమార్తె గాంధిరిని వివాహ మాడెను. అమె నిత్యము విప్రునికి గోవు నొసంగు చుండెను.

దాత యజ్వ వీరుడు పండితుడు అతిధి ప్రియుడు భూరి దక్షిణుడైన అక్రూరుడు ఉపమద్గువు మద్గువు మందరుడు అరిమేజయుడు, అవిక్షుతుడు అంధకరువు అవాహుడు ప్రతివాహుడును సుందరి యను కన్వయు శ్వఫల్కునకు పుట్టిరి. దేవవర్చస్సు గల ప్రసేనుడు, ఉప దేవుడు అనువారు ఉగ్రసేన యందు అక్రూరునకు ఉదయించిరి. వృష్ణి కుమారుడగు చిత్రుకునకు పృధువు వివృధువు అశ్వగ్రీవుడు, లశ్వబాహువు, స్వపార్శ్వుడు, గవేషణుడు, అరిష్టనేమి, అశ్వుడు, సుధర్ముడు, సుభాహువు, బహుబాహువు నను కుమారులు. శవిష్ఠ శ్రవణయను కుమార్తెలు పుట్టిరి. దేవమీఢుడు అసిక్ని యందు శూరుడను వానిని గనెను. శూరునకు భోజ్య యందు పది మంది శూరులను వారు దయించిరి. వసు దేవుడు ఆనక దుందుభియను పేరున ముందుగ పుట్టెను. పుట్టగానే దివంబున అనకము లనెడి వాద్య విశేములు దుందుభులు మ్రోగినవి. పుష్ప వృష్టి గురిసెను. వసు దేవునితో సముడయిన యందగా డీలోకమున లేడు. అతడు చంద్రుని వంటి కాంతితో తేజరిల్లెను.

ఈయనకు దేవ భాగుడు, దేవశ్రవుడు, అనాధృష్ఠి, కనవకుడు, వత్సవానుడు, గృంజముడు, శ్యాముడు, శమీకుడు, గండూషుడునను కొమరులు, పృథుకీర్తి, పృథ, శ్రుతదేవ, శ్రుతశ్రవ రాజాధిదేవి అను నైదుగురు కూతురులు వీర పత్నులు గల్గిరి, శ్రుత శ్రవ యందు చైద్యుడు శిశుపాలుడను పేర గల్గెను. ఇతడే క్రింధటి జన్మమున దైత్యపతి హిరణ్య కశివుడు, వృద్ధశర్మ వలన వృధ కీర్తి యందు కరూశాధిపతి యైన దంతవక్త్రుండు పుట్టెను. కుంతియను రాజు పృథను కుమార్తెగా పెంచు కొనెను. అమెను పాండురాజు పెండ్లాడెను. అమె యందు యముడే ధర్మవేత్తయైన ధర్మరాజై (యుధష్టిరుడు) యుదయించెను. వాయువు వలన భీమసేనుడు గల్గెను. ఇంద్రుని వలన ధనంజయుడు అప్రతి రథుడు, ఇంద్ర పరాక్రము డుదయించెను. కనిష్ఠుడయిన అనమిత్రుడను వృష్ణి నందనునికి శిని యనువాడు కల్గెను. శిని కొడుకు (శైనేయుడు) సత్యకుడు సత్యకుని కుమారుడు యుయుధానుడు (సాత్యకి) దేవభాగునకు మహానుభావుడు. ఉద్దవుం డావిర్భవించెను. దేవశ్రవుని పండితాగ్రణి యందురు, దేవశ్రవుడు కీర్తి శాలియగు ఆశ్మక్యుడను సుతునిం బడెసెను. అనాధృష్టిని కృత్తశత్రు వసు కుమారిని శ్రుతదేవ యను నామె శత్రుఘ్ననిం గనెను. శ్రుతదేవ కుమారుండు ఏకలవ్యుడు నిషాదుని పెంపకములో పెరిగెను. వత్సవంతునకు పుత్రులు లేనికతన శౌరి (శూర వంశము వాడగు వసు దేవుడు) తన కుమారుని కౌశికుని ధారాదత్తము సేసెను. అపుత్రకుడైన గండూఘనకు విష్వక్సేనుడు తన కుమారులగు చారుదేష్టుడు, సుదేష్ణుడు పంచాలుడు కృత లక్షణుడు నను వారిం దతత్త యిచ్చెను.

చారుధేష్ణుడు యుద్ధమున కేగి యెన్నడు వెను దిరిగిన వాడు గాడు అతడు రుక్మిణి తనయు లందు కడగొట్టు వాడు మహా వీరుడు, చారుధేష్ణునిచే హతులైన వారిని (చారూన్‌ రుచిగ నున్న వారివి) ఇపుడు తిన వలయునని యాత్ర పోవు నపుడు వేలకొలది కాకు లాతని వెంట పోయెడివట. కనవకునికి తంత్రిజుడు, తంత్రిపాలుడు నను నిద్ధరు కల్గిరి. గృంజమునికి వీరువు అశ్వహనువు గల్గిరి. శ్యమ పుత్రుడగు శమీకుడు రాజ్య మేలెను. భోజ వంశమున జనించుటచే నేపగించు వాడైనను రాజసూయ మొనర్చె. అతనికి శత్రు నాశకుడగు అజాత శత్రపు గల్గెను. ఇక వసు దేవుని సంతానము దెల్పెద. వృష్ణి యొక్క (వృష్ణి అంధకభోజ) త్రిశాఖ మైన (మూడు శాఖలై) యీ వంశము యొక్క చరిత్ర ధారణము చేయు నతడు వంశాభివృద్ధి నందును అనర్థములను బాయును.

వసుదేవుని భార్యలు పదునల్గురు, పురు వంశమున పుట్టిన (1) పౌరవి, (2) రోహిణి, (3) మధిరా, (4) ఆది, (5) వైశాఖి, (6) భద్ర, (7) నునామ్నీ, (8) సహదేవ, (9) శాంతిదేవ, (10) శ్రీదేవి (11) దేవరక్షిత, (12) వృకదేవి, (13) ఉపదేవి, (14) దేవకి అని సుతనుపు బడబ అను వారిరువురు పరిచారికలు, పౌరవి, రోహిణియు బాహ్లికుని కుమార్తెలు. వసుదేవుని పెద్ద భార్యకు రాముడు, శరణ్యుడు, శరుడు, దుర్దముడు, దమనుడు, శుభ్రుడు, పిండారకుడు, ఉశీనరుడు, చిత్రయను కూతురుం గల్గిరి మొత్తం వీరు తొమ్మండుగురు. చిత్రయే సుభద్రయను పేరుతో గూడ ఖ్యాతి గాంచినది. వసు దేవునికి దేవకీ యందు శౌరి (కృష్ణుడు) అవతరించెను. రామునికి రేవతి యందు నిశఠుడను, ప్రియుపుత్రు డుదయించె. పార్ధునికి సుభద్ర యందు రథికుడగు అభిమన్యుడు గల్గెను. అక్రూరునికి కాశికన్య యందు సత్యకేతువు జనించె. వసుదేవని యేడ్వురు భార్య లందు కలిగిన శూరుల క్రమమిది. శాంతి దేవకు భోజుడు విజయుడు నను నిద్ధరు గల్గిరి. సునామ యందు వృక దేవుడు, గదుడు గల్గిరి. వృకదేవికి అగావహుడు పుట్టెను.

త్రిగర్త రాజు కూతురు శిశిరాయణి యొక్క భార్య గార్గ్యముని వర్యుని పౌరుష పరీక్షకు పూను కొనెను. కాని యతని వీర్యము స్ఖలనము కాలేదు. పన్నెండవ సంవత్సరమున పరిహసితు డైన యా ముని ఒక ఘోష కన్యతో మిథున క్రీడకు పక్రమించెను. అఘోషాంగన ఘోష వేష ధారిణి యైన గోపాలి యను నొక అప్సరస. గోపకన్యా వేషము ధరించి యాతని ధరింప నలవి కాని గర్భమును (శిశువు) ధరించెను. మనుష్య స్త్రీ యైన యాగార్గ్యుని భార్య యందు శివునాజ్ఞచే కాలయవను డను వాడు సింహము వంటి మహా బలశాలి పుట్టెను. వాని పూర్వ కాయము వర్తులాకారము సింహము వంటి యాకారము గల్గి యుండెను. అపుత్రకు డైన యవన రాజు యొక్క అంతః పురమున వాడు పెరిగెను. అందు వలన యవనునికి వాడు కుమారడయి కాలయవనుడన నొప్పెను. వాడు యుద్ధ కుతూహలము గొని యేరితో తలపడుదు నని యడుగగా దేవర్షి నారదుడు వృష్ణి, అంధక కులములను జెప్పెను. అక్షౌహిణి సేనతో వాడు మధుర పైనేగి దూతను బంపెను. అపుడు వృష్ణ్యంధకులు మహామతి యైన కృష్ణునిం బురస్కరించు కొని పోయి కార్యాలోచన చేసి యొక నిశ్చయమునకు వచ్చి పారిపోవుట కంగీకరించిరి. పినాక పాణియైన శివుని అభిప్రాయమును గౌరవించి మధురను వదిలి కుశస్థలిని ద్వారకను జేరి నివాసము సేయ నెంచిరి. ఇది శ్రీ కృష్ణ జన్మ వృంత్తాంతము. శుచియై ఇంద్రియములను నియమించుకొని పర్వము లందు వినిపింప వలెను. అట్లు వినిపించిన విద్వాంసుడు ఋణములను బాసి సుఖి యగును.