బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

11 - సోమ వంశ వర్ణనమ్‌

 ఆయుఫు పుత్రులు మహరధు లయిదుగురు స్వర్భానుని (రాహువు) కుమార్తె ప్రభ యను నామె యందు జన్మించిరి. వారు సహుషుడు, పృద్ధశర్మ, రంభుడు, రజి, అనేనుడు అనువారు త్రిలోక ప్రసిద్దులు. రజి యైదు వందల మంది కుమారులం గనెను. ఈ క్షత్ర కుటుంబము రాజేయమని ప్రసిద్ది కెక్కినది. ఇంద్రునికి గూడ ఇది భయంకర మయ్యెను. దేవాసుర యుద్దమైన తఱి నయ్యు భయులును మా యిర్వురకును జరుగు యుద్ద మందెవ్వరు జయింతురో వినవలతుము నిజ మేఱిగింపు మని బ్రహ్మ నడిగిరి.

 రజియను ప్రభు నాయుధ మెత్తి యెవ్వరి వంక పోరాడునో వారు ముల్లోక ములం గెలువ గలరు. రజి యెటుండునో యటనే ధైర్యము ఉండును. ధృతి యెటుండనో యట లక్ష్మి యుండును . థృతియు శ్రీయు నెందుండునో నక్కడ ధర్మము జయమును గల్గును.

దేవదానవు లది వివి ప్రీతులై రజిని దమవంక రమ్మని వరించిరి. స్వర్బానుని దౌహిత్రుడు (రాహువు యొక్క కూతురు కొడుకు) ప్రభ యందు పుట్టిన వాడు, పరమ తేజస్వి, సోమ వంశ వర్ధనుడు నగు రజింగని వారు మాకు జయము కల్గుట కీవు విల్లు గైకొను మని వేడి కొనిరి. అతడు విని అర్ధజ్ఞుడు గావున స్వార్ధమెంచి తన కిర్తిం బ్రకాశింప జేయుచు నిట్లనియె.

దైత్వ గుణముల నెల్ల గెలిచి ధర్మమున సేవింద్రుడ నగుదునేని యప్పుడు యుద్ధమున బోరెదను. అని రజి యనగా వేల్పులు మొదట సంతోష పడిరి. అట్లే నీ కోరిక సఫలము సేసి కొమ్మనిరి. అవ్వల నసుర ముఖ్యుల జూచి దేవతల నడిగి నట్లడిగెను. దానవులు దర్ప సంపూర్ణులు గావున స్వార్ధముసే చూచికొని సాభిమానముగ నతని కిట్లు బదులు పలికిరి.

మా కింద్రుడు ప్రహ్లాదుడు. ఆయన కొరకే మేము గెలుపు పడయ నెంతుము. రాజా! నీవీ సమరమున నిలువు మనిరి.

అతడట్లే యని దేవతల చేత గూడ వీనిని (ప్రహ్లాదుని) గెలిచి యింద్రుడవై తీరెదవని ప్రేరేపింప బడి దానవు లందఱ సంహరించెను. వజ్రపాణికి గూడ వధింప నలవి గాని వారింగూడ తుద ముట్టించి పరమ శ్రీమంతుడైన రజి మున్ను నష్టమై పోయిన వేల్పుల ఐశ్వర్యమును పునః ప్రతిష్ఠ చేసెను. అప్పుడింద్రుడ మరులతో గూడి మహాధీరు డయిన రజింజూచి నిక్కముగ నీవు దేవేంద్రుడవ నావనులచే నేను నీకు పుత్రుడనను ప్రఖ్యాతి గాంచెద ననెను. రజి యునట్లు మాయచే శత్రువుచే మోసగింప బడి యట్లే యగుగాక యసంప్రీతి నెంచెను. అట్లా నృపతి దేవ సముడై దివమ్ము నకరుగ, నాతని పుత్రులైదు వందల మంది యాతని ఆస్తిని (పిత్రార్జితమును ఇంద్రు నుండి గైకొనిరి, అట్లు స్వర్గ మాక్రమించి వారు రాగ మత్తుతై దమకు దాము మూఢులై ధర్మ దూరులై బ్రహ్మ ద్వేషులై వీర విక్రమముల గోల్పోయిరి). అందుపై కామక్రోథ వశులైన వారింజంపి ఇంద్రు డెప్పటి యట్ల స్వస్థానమును బొంది స్వస్థు డయ్యెను ఈ శత ముఖుని స్థాన భ్రంశమును పునః ప్రతిష్ఠానమును విన్న వాడును ధారణ జేసిన యతడును దుర్గతి పాలుగాడు.

రంభునకు సంతానము లేదు. ఇక యనేననుని వంశము వర్ణించెద. అనేననుని కుమారుడు యశస్వియైన ప్రతిక్షత్రుడు అను రాజు. వాని తనయుడు సంజయుడు. వాని బిడ్డడు జయుడు. వాని వాడు విజయుడు. వాని తనయుడు కృతి. వాని సుతుడు హర్యత్వతుడు. వాని యాత్మజుడు సహదేవుడు. మంచి ప్రతాపశాలి. వాని కొడుకు ధర్మశీలి యగు నదీనుడు. జయత్సేనుడు వాని కుమారుడు. వాని యౌరసుడు సంకృతి. వాని బిడ్డడు ధర్మ పరుడైన క్షత్రవృద్ధుడు కీర్తిశాలి. అనేననులు చెప్పబడిరి. క్షత్రవృద్ధుని వంశము చెప్పెదను. క్షత్రవృద్ధుని తనయుడు సునహోత్రుడు. యశస్వి వాని సంతానము, పరమ ధార్మికులు కాశుడు, శలుడు గృత్సమదుడు ననువారు. గృత్సమదుని కుమారుడు శునకుడు. వాని కొడుకు కొడుకు శౌనకుడు వాని వలన బ్రహ్మణ, క్షత్రియులు, వైశ్య శూద్రులు కలిగిరి. అర్ష్టిసేనుడు శలుని కుమారుడు. వాని తనయుడు కాశుడు. కాశుని కొడుకులు కాశిపుడు దీర్ఘతవుడు. ధనవు దీర్ఘతవుని కుమారుడు. విద్వాంసుడు, వాని తనయుడు ధన్వంతరి. ఆయన మహత్తర తప మ్మొనరించి వృద్ధుడయిన దశలో ధనువునకు గల్గినాడు. దేవతాంశమున మున్ను దయించిన ధన్వంతరియే యిపుడు మానవాంశమున జన్మించెను. కాశీ మహారాజై భరద్వాజుని వలన నాయుర్వేదమును జదివి వైద్యము సేసి సర్వరోగ హరుడై యా శాస్త్రము నెనిమిది భాగములు గావించి, (అష్టాంగ మొనరించి) శిష్యుల కుప దేశించెను.

ఆ ధన్వంతరి తనయుడు కేతుమంతుడు. భీమరధు డాతని తనయుడు. దివోదాసు డతని తనయుడు. అతడు ధార్మికుడు. కాశి నగరము నేలిన వాడు. ఈతని కాలముననే క్షేమకుడను రాక్షసుడు వారణాసిని శూన్యముం గావించెను. మహాత్ముడైన నికుంభుని శాపముచే వేయేండ్లు కాశీ క్షేత్రమట్లుగా వలసి వచ్చెను. అట్లు శాప నష్టమైన రమ్యమైన నగరమున దివోదాసుడు గోమతీ తీరమందు పునర్ని ర్మించెను. ఇంతకు ముందు వారణాసి భద్ర శ్రేణ్యుని పాలన యందుండెను. దివోదాసుడు వాని కుమారులను నూర్వురను మేటి విలుకాండ్రను జంపి భద్రశ్రేణ్యుని రాజ్యము గెలిచి నూతన నగర నిర్మాణము సేసెను.

భద్రశ్రేణ్యుని తనముయుడు దుర్దముడు దివోదాసునిచే బాలుడని కరుణచే విడువ బడినవాడై హైహయుని దాయాద్యమును (పరంపరా గతమైన రాజ్య సంపదను) హరించెను. బలాత్కరించి హరించిన సామ్రాజ్యమును మహానుభావుడగు దుర్దముడు లాగి కొనెను తన ప్రతాపముచే వైరమును అంతము చేసెను. దివోదాసునికి దృషద్వతి యందు వీరుడగు ప్రతర్ధను డుదయించెను, బాలుడయ్యు నాతడు పరబలమును హరించెను. వాని తనయులు వత్సుడు, భర్గుడు ననువారు మిక్కిలి కీర్తి శాలురు. వత్సుని కుమారు డలర్కుడు. అలర్కుడు బ్రహ్మజ్ఞాని, సత్య ప్రతిజ్ఞుడు. వానికొడుకు నంనతి. రాజర్షియగు అలర్కుని గూర్చి ప్రాచీనుల శ్లోక మొకటి గలదు. అతడు యరువది యారు వేలేండ్లు కులోద్ధారకుడై లోపాముద్రా నుగ్రహ పాత్రుడయ్యెను. రూప యౌవన సంపన్నుడైన అతనికి సువిశాలమైన సామ్రజ్య ముండెను. శాపాంతమున క్షేమకుడను రాక్షసుని జంపి వారణసీ నగరమును రమ్యముగ పునర్మిర్మాణము గావించెను.

సంనతి కొడుకు సునీధుడు. వాని నుండి క్షేముడు, వానికి కేతుమంతుడు. వానికి సుకేతువు, వానికి ధర్మకేతువు వానికి మహారధుడగు సత్యకేవువు, వానికి విభువు. వానికి అనర్తుడు, వానికి సుకుమారుడు, వానికి ధృష్టకేతువు, వానికి వేణుహోత్రుడు, వానికి భార్గుడు ననుపుత్ర పరంపర యేర్పడెను. వత్సునికి వత్సభూమి యనువాడు భార్గునకు భార్గభూమి యను వారు పుత్రులు. నీరందరును అంగిరసుని పుత్రులు భార్గవ వంశము వారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వేల కొలది జన్మించిరి. ఇది కాశ్యప వంశము ఇక సహూషుని పరంపర వినుండు.