బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

189 - రాసక్రీడా విలాసము. అరిష్టవధ.

వ్యాసులు:

గోపాలు రింద్రు డేగిన తరువాత గోవర్ధన గిరి నవలీలగ నెత్తిన కృష్ణుం గని ప్రీతితో నిట్లనిరి.

“కృష్ణా! కొండ నెత్తిన యద్భుత లీలచే నీవు గోవులను మమ్ములను మహా భయము నుండి కాచితివి. ఈ బాల లీల యనుపమము. ఆల కాపరి యగుట నింద్యము. నీ చేసిన పనియో దివ్యము. ఇదెట్లు జరిగినో తెలుపుము. మడువులో గాళియు డణగద్రొక్క బడెను. ప్రలంబుడు గూల్ప బడెను. ఈ గోవర్ధన మెత్త బడెను. ఇవి చూడ మానసములు సంశయ గ్రస్తము లగుచున్నవి. శ్రీహరి నీ పాదములే మాశ్రయించెదము. నీ బలిమి చూచి నిన్ను నర మాత్రునిగ భావింప లేకున్నాము. సత్యము! సత్యము. నీవు దేవుడవో దానవుడవో యక్షుడవో గంధర్వుడవో. ఆ విమర్శ మాకేల? మాకు బంధువుడవు. నీకు నమస్కారము. ఆ బాల గోపాలమునకు నీ యెడల బ్రీతి గల్గినది. నీ చేసిన పని నెల్ల దేవత లొక్క టైనను జేయ జాలరు. ఒక వంక బాల్యము వేఱొక వంక నద్భుత వీర్యము నివి యన్నియు నిట్లుండ గొల్లల మగు మాలో సామాన్యులలో నీవు జన్మించుట విమర్శింప మాకు సంశయము గల్గించు చున్నది అన విని కృష్ణుడు క్షణ మాత్రము పలుకకుండ నిలిచి ప్రణయ కోపమున నటించి యిట్లు వారికి బదులు పలికెను.

నా సంబంధముచే మీకు సిగ్గు గలుగ దేని నేను శ్లాఘ్యడనే గద! అందు వలన కార్యాకార్య విమర్శ యెందులకు? మీకు నా యందు బ్రీతి యున్న యెడల మీ మెప్పునే బొంద దగిన వాడనయిన యెడల బంధు సమానమైన గౌరవము మీరు చూపుడు. నేను దేవుడను గాను గంధర్వుడను యక్షుడను దానవుడను గాను నేను మీకు జుట్టుమునై పుట్టితిని. ఇందు వలన వేఱొక విధముగ మీ రాలోచింప బనిలేదు అన శ్రీహరి వాక్యము విని గోపకులు మహానుభావులు మౌనము వట్టి పొల యలుక గన్న యాతని నుండి బలరాము దరి కేగిరి.

ఆకాశము స్వచ్ఛమై శారద చంద్ర చంద్రికా మనోహరమై కలువ తీగలు వికసింప దిగంతములు సువాసనల ఘుమ ఘుమలాడ దుమ్మెదల ఝం కారములచే నింపు గొలుపు వనపాళిం జూచి కృష్ణుడు గోపికలతో గ్రీడింప మనసు పడెను. బలరామునితో గృష్ణుడు పద్మము వంటి పాదములతో నవ్వనమున విహరించుచు గోపాం గనలకు మిగుల నింపు గూర్చును. వేణు గాన మొనరించెను. రమ్యమైన యా గీత ధ్వనిని విని గోపిక లిండ్లు వెడలి సత్వరము కృష్ణుని దరి కేతెంచిరి. ఒక గోపి యతని యడుగుల మెల్లమెల్లన నను గమించెను. వేణు గానము విన గుతూహలము గొని వేఱొకతె యతనినే స్మరించెను. మఱొకతె కృష్ణా! కృష్ణాయని పలికి యంతలో సిగ్గు పడెను. వేఱొకతె ప్రేమ కనులు గప్ప సిగ్గు విడిచి యాతని పజ్జ నిలిచెను. మఱియొక గోపిక యింటనే నిలిచి వెలినున్న బెద్దల (మామగారిని) గని బృందావనమునకు వెళ్ళుటకు సాహసము జేయలేక తన్మయతను జెంది గనులు మూసికొని గోవిందునే ధ్యానించెను. శరచ్ఛంద్ర మనోహరమైన యొక రాత్రివేళ గోపికలు వెంబడింప గోవిందుడు రాస క్రీడారంభ రసోల్లాసియై వారల నాదరించెను. గోపికలు గుంపులుగ కృష్ణ విలాస వివశలై యతుడు చాటువడ విరహాతరలై కృష్ణ దర్శనాపేక్షతో బృందావన మెల్లను వెదకుచు దిరిగిరి. రాత్రి కృష్ణుని యడుగు జాడలను జూచి యతని వివిధ శృంగారానుభవములకు మురిసి మైమరిచి పరిపరి విధముల నా వనమున బరిభ్రమించిరి. కృష్ణుడు కనిపింపమి నిరాశ జెంది మరలి యమునా తీరమునకు వచ్చి కృష్ణ చరిత్రమును మధురముగ స్వర సమ్మేళన మొనరించి పాడిరి. అంతలో హరి ముఖ పంకజము వికసింప దటాలున నెదురు వడగ గోపికలు ముల్లోకములను రక్షింప గల పుణ్య శీలురు గావున యమ్మూర్తిని దర్శించిరి. ఏతెంచు చున్న గోవిందుని యొక సుందరి చూచి కను దుమ్ములు విప్పార నానంద భరితయై కృష్ణా! కృష్ణా! యని యాలాపనము సేసెను. ఒకతె కనుబొమలు ముడిపడ హరిం జూచి యా ముఖ పంకజమును దన నయనములను దుమ్మెదలచే నాస్వాదించెను. మఱి యొకతె కను లల్లన మూసికొని యతని రూపమును ధ్యానించుచు యోగారూఢ యైనట్లు భాసించెను. అవ్వల ప్రియ భాషణము లచే నొక్కతెను. భ్రూభంగ విలాసములచే నొక్కతెను గర స్పర్శముచే నింకొకతెను ననునయించి మాధవుడు వారి నందరిని నన్నిలీలలంగలక దేర్చి వారితో రాసక్రీడా విలాసవై భవమున రమించెను.

గోపికా జనము వర్తు లాకారముగ దీరి రాసక్రీడ యందిమిడి యున్నను నొకే లక్ష్యమందు స్థిర పడిన మనస్సుతో కృష్ణుని యందేకాగ్రత చెందిన మనస్సుతో సుస్థిరమైన సమాధి యోగము చేత గృష్ణుని పార్శ్వ భాగమును విడవ కుండ నిరంతర సాన్ని ధ్యానందము ననుభవించెను. శ్రీహరి యొక గోపిక చేయి పట్టుకొని తనకర స్పర్శచే గల్గిన యానంద పారవశ్యము చేత నరమోడ్పు వెట్టిన కన్నులు కల దానినిగా నొనరించెను. అవ్వల చలించు నొడ్డాణముల చిరు గంటల స్వనములచే గ్రమ గ్రమముగ శరద్దృతు సమయ కావ్య గీతము ననుసరించి లయాను గుణముగ గోపికా కృష్ణుల నృత్య మారంభ మయ్యెను. ఒక గోపిక బాహు లతలు సాచి కృష్ణుని గౌగింలించు కొని గోపికల సంగీత మాధుర్యమును స్తుతించు నెపమున దోచు నైపుణ్యమున స్వామిని ముద్దు పెట్టు కొనెను. ఆగోపి చెక్కిళ్ల కలయిక (నంశయమును) నొంది కృష్ణుని భుజములు ఒడలు పులకరించుట యను బంట నుజ్జీవక మగు స్వేద మనెడి జలమును వర్షించుటలో జలధర భావమును బొందినది. (అనగా నొక సస్యమునకు వర్షము గురియు మేఘము జ్జీవకమై నట్లు కపోల స్పర్శము వలన కల్గిన శృంగారా నుభవముచే గోపికలు మైమరపు జెంద వారి తనువల్లరి పులకరించిన దని భావము) కృష్ణుడు తార స్థాయిలో రాస క్రీడా గేయ మాలపించి నంతట భేష్‌ భేష్‌ కృష్ణా! యని రెట్టించి వంత పాడిరి. హరి ముందడుగు వేయ నా వెంబడిని వారడుగు వేసిరి. అతడు వెను తిరిగిన వారతనికి సమ్ముఖ మైరి (ఎదరైరి) ఇట్లు లయాను గుణమైన బాద విన్యాసమున గోపాంగనలు ప్రతిలోమా నులోమముగ హరిని దారిసిల్లిరి. ఇట్లా గోప సుందరులతో గృష్ణుడు రమింప నతనితో నగు క్షణ మెడబాటు వారికి గోటి సంవత్సరముల వియోగముతో సమానమై తోచెను.

తండ్రులు భర్తలు అన్న దమ్ములు నెంత వారించినను నత్యు ల్లాసమున వ్రజ సుందరులు రాత్రు లందు గృష్ణునితో గ్రీడించిరి. అతడును గైశోరక వయస్సున వారి నాదరించుచు ననేక రాత్రులు రమించెను. వారి పతులందు గోపిక లందు సర్వ భూతము లందు సర్వేశ్వరుడు గావున నాత్మ స్వరూపమై సర్వమున వ్యాపించి హరి యుండెను. సమస్త భూతము లందు బృథి వ్యాపస్తేజో వాయు రాకాశములను పంచ భూతములు నెట్లు వ్యాపించి యున్నవో యట్లే కృష్ణ పరబ్రహ్మ మయ్యెడ సర్వ వ్యాపకమై యుండెను.

ఒకతరి నర్థాన్తమయ సమయమున (ప్రదోష కాలము సగము గడచిన తరువాత) జనార్ధనుడు రాసక్రీడా వినోదము నందాసక్తుడై యుండ నరిష్టుడను రక్కసుడు మద మెక్కి హడల గొట్టుచు గోశాల కరు దెంచెను. కారు మబ్బువలె నల్లగ నుండి పదునైన కొమ్ములు గల్గి సూర్యునట్లు జ్వలించు చూపులతో డెక్కల తాకున భూతలము జీల్చుచు నాలికచే బెదవులను నొరయించి నాకుచు దోక లువ్వెత్తున బైకెత్తి మిగుల కఠిన మగు స్కంధ బంధమున మిగుల వెడదయగు మూపుతో నొడ్డు పొడువులను మిగుల గడువరాని వాడై మూత్ర పురీషము లంబూత పడిన పిరుదులతో నొడలితో గోవులకు వెరపు గొల్పుచు మెడవ్రేల నెదురై చెట్ల తాకిడి వడిన ముఖముతో వృషభ రూపము గొని గోవులకు గర్భపాతము చేయుచు నెల్ల యడవులం గూల్చుచు నొకదైత్యు డచట నెల్లపుడు సంచరించు వాడెదుట బడెను. భయంకర మగు కన్నులతో నున్న వానిని గని గోపకులు గోపికలు కృష్ణా! కృష్ణా! యని యాక్రందించిరి. అంతట కేశవుడు సింహ గర్జనము చేసి చప్పట్లు జరచెను. వీడా సడివిని దామోదరున కెదురుగ జని కొమ్ములు ముందునకు నిగిడించి కృష్ణుని కడుపు నెడ చూపు నిలిపి యా దుష్టుడు పరువులు వెట్టెను. అట్లు వచ్చుచు న్న వృష భాసురుని గని కృష్ణుడు వాని నీసడించు సూచనగ నొదవిన చిరునవ్వు సొగసు జూపి తా నిలిచిన చోట నుండి కదలక నిలు చుండెను. మఱియు దాపునకు వచ్చిన వానిని హరి మొసలి పట్టినట్లు పట్టి కొమ్ములు చేకొని కడుపు నందు మోకాళ్లం బొడిచెను. వాని గొమ్ముపట్టి వాని దర్పమును బలమునుం గోట్టి తడి బట్టను బిండినట్లు వాని కంఠమును మెలి పెట్టెను. మరియు వాని కొమ్మొకటి పెరకి దాని చేతనే వానిం గొట్టెను. అమ్మ హాదైత్యుడు నోట నెత్తురు గ్రక్కుచు మరణించెను. వాడట్లు హతు డైనంత గోపకులవుడు జంభాసురు డీల్గినపుడు దేవత లింద్రునట్లు జనార్దనుని స్తుతించిరి.