బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

177 - పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్య వర్ణనమ్‌

ఇట్లేను అనంత మహిమ పురుషోత్తమ క్షేత్ర మహిమయు భుక్తి ముక్తుల నిచ్చునని తెల్పితిని. అచ్చట గృష్ణుని సంకర్షణుని సుభద్రను దర్శించిన వారు ధన్యులు ముక్తులును సమంత్రకముగా నొనంగిన హవిస్సు అగ్నిం బొంది నట్లు కృష్ణుని రాత్రు లందు నుషః కాలము నందు జేయు ధ్యానము వలన భక్తులు దేహము విడిచి కృష్ణుని బొందుదురు. శయనము నుండి లేవగానే కమలాక్షుని హరిని బలరాముని సుభధ్రను దలచు కొనువారు హరి సాలోక్య మందుదురు. వర్ష ఋతువు నాల్గు మాసములా పురుషోత్తమ క్షేత్ర నివాసము చేయువారు భూమిం గల సర్వ తీర్థములు సేవించిన ఫలము గాంతురు. ఇంద్రియ నిగ్రహము సేసి కోపము జయించి యెల్లపుడు నచట వసించి వారు తపః ఫలముము నొందుదురు.

అన్య తీర్థము లందు పది వేలేండ్లు సేసిన తపస్సు ఫలము పురుషోత్తమ క్షేత్రమున నొక్క మాస మాచరించిన లభించును. బ్రహ్మ చర్యాదులచే నిస్సంగులై చేయు పుణ్య మిచ్చట సేవించిన గల్గును. ఇది సర్వ యజ్ఞ ఫల ప్రదము. ఇచట దేహము విడిచిన ముక్తి కల్గును. మఱ్ఱి వృక్షమునకు సాగరమునకును నడుమ మేను విడిచిన ముక్తి సిద్ధము. కృమి కీటకాదులు పశు పక్షులు నిక్కడ శరీరము వాసిన బరమ గతినందను. అన్య తీర్థముల వెంట దిరుగవలె ననుకొనుట వట్టి భ్రాంతి పురుషోత్తమ దర్శన మొనరించిన వాడు పురుషోత్తము డగును. ప్రకృతి కతీతు డాతడు. వేద పురాణము లందుచేతనే హరి పురుషోత్తము డని కీర్తించెను. దారిలో స్మశానములో గృహమున మఱియొటనేని శ్రీపురుషోత్తమ క్షేత్రమున నిష్టమున్నను లేకున్నను దేహము లంబాసిన మనుజుడు మోక్షమంది తీరును.

అందు వలన మోక్ష కాంక్షులు పురుషోత్తమ క్షేత్రమున దేహము త్యాగము చేయ యత్నింప వలెను. పురుషోత్తమ మాహాత్మ్యమును మించినది కలుగదు కలుగ బోదు. క్షేత్ర గుణ సంపదలో గొంత మాత్రమే నేను చెప్పితిని. సమగ్రముగా తెలుప సాధ్య పడదు. ఓ మునులారా! మీరు మోక్షార్థుడేని యా పుణ్యక్షేత్ర మందు వసింపుడు.

బ్రహ్మ వచన మాలించి యా మునులా క్షేత్ర మందు వసించి పరమపద మందిరి. కావున బ్రహ్మాదు లారా! మీరునట్లు గావింపుడు.