బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
203 - అదితి కృతా భగవత్త్సుతిః
గరుత్మంతుడు వరుణు డిచ్చిన ఛత్రమును, మణి పర్వతమును పత్నీ సమేతుడైన హరిని విలాసముగ వహించుచు బయనించెను. స్వర్గ ద్వారమునకు జేరి హరి శంఖము నొత్తెను. దేవతలు అర్ఘ్య పాత్రముం గొని యెదురు వచ్చిరి. వేల్పులచే బూజింప బడి తెల్లని మేఘ మట్లున్న శిఖరములతో నున్న దేవమాత యగు నతిది గృహముం బ్రవేశించి ఇంద్రునితో గూడ తానామెకు నమస్కరించి మణి కుండలము లొసంగి నరకుడు నశించె నని తెల్పెను. జగ జ్జనని యదితి సంప్రీతయై జగత్కర్త యగు హరిని మనస్సతని యందు నిలిపి తొట్రు వడక ఇట్లు స్తుతించెను.
పుండరీకాక్ష! భక్తాభయ ప్రద! సనాతన స్వరూపా! సర్వభూత భావన! మనో బుద్ధేంద్రియములకు ప్రేరకుడా! హ్రస్వ దీర్ఘాది వికల్ప రహిత! జన్మాది రహిత! స్వప్నాద్యవ స్థాత్రయ పర్జిత! నీవు సంధ్యాది కాల స్వరూపుడవు. భూమ్యాది పంచభూత స్వరూపుడవు. మనోబుద్ధి చిత్తాహంకారములు నీవే. సృష్ట్యాది కర్తవు కర్తలకు పతివి నీవే. మాయా కృతములగు బ్రహ్మాది మూర్తులతో నంతట చరాచరాత్మక జగమెల్ల వ్యాపించి యున్నాడవు. అత్మ గాని దాని యందు ఆత్మ బుద్ధి నీ మాయ. దాని వలననే యహంకార మమకారములు గల్గును. సంసార మందు ఇదెల్ల నీమాయ యొక్క చేష్టయే. స్వధర్మ పరులచే నీవారాధింప బడుదువు. వారే ఈ మాయను తరింతురు. బ్రహ్మాదులు మనుష్యులు పశువులు సకలము విష్ణు మాయ యను నుడిలో పడి మోహమను గాఢాంధ కారమున గ్రమ్ముకొన బడుదురు. నిన్నా రాధించి యభీష్టము లంది భవము తరింతురు. నీ పదము నందుకొందురు. పుత్ర కామనచే శతృక్షయము కొరకు నిన్ను నేనారాధించితిని. మోక్షమునకు గాదు. మాయ యొక్క విలాస మిది. ఈ కోరిన కల్ప వృక్షము నుండి కూడ గోచి గుడ్డ నడుగుట వంటిది. పుణ్యకర్మలు చేయని వారు ఇట్టి ఫల వాంఛ చేయుట యను నీ యపరాధము తమకు తాము చేసు కున్నదే. సకల జగన్మాయా మోహపరుడ వగునో పరాత్పర! నాయెడ ప్రసన్నుడ వగుము. కేవల జ్ఞానసత్తా స్వరూపుడవు. నా అజ్ఞానమును నశింప జేయుము. శార్ఙ్గ చక్ర గదా హస్త! నీకు నమహ్కరము. స్థూల చిహ్నములచే శోభిల్లు నీరూప మిదే చూచు చున్నాను. నీ కేవల తత్త్వము నెరుగను. ప్రసన్నుడ వగుము.
ఇట్లు విష్ణువు స్తుతింప బడి సురారణిని (దేవ మాత) గూర్చి యల్లన నవ్వి యిట్లనియె. (అగ్ని పుట్టుట కాధారము అరణి. అట్లే దేవతల ప్రాదుర్భావమున కాధార మదితి గావున యామెను సురారణి యను వైదికభాషతో చక్కగా వ్యాసులిచ్చట పేర్కొన్నారు.)
దేవీ! మాకు నీవు మాతవు. దయ చూపుము. వర ప్రదాత్రివి గమ్ము. అని కృష్ణుడు స్తుతింప
నీయిష్ట మట్లే యగుగాక! సురాసురలకు నీవ జయ్యుడవై మనుష్య లోకమున నుందు వని యదితి యనెను.
అటుపై శచీదేవితో గూడిన అదితికి సత్యభామ మ్రొక్కి మాయెడ ప్రసన్ను రాలవు గమ్మని మరిమరి కోరెను.
అదితియు నా ప్రసాదమున ముదిమి రూప వికృతియు నీకు కలుగదు. సర్వకామ సిద్ధి నంద గలవని దీవించెను.
అదితి యనుజ్ఞ గొని దేవేంద్రుడు హరిని సబహుమానముగ యథావిధి బూజించెను. అవ్వల కృష్ణుడు సత్యభామ వెనుకొన నందన వనము మొదలైన దేవోద్యాన వనము లన్నింటిని దర్శించెను. మరియు సువాసనల నించు పూల గుత్తులతో చలువలం జిమ్ముచు నెర్రని చివుళ్ళతో నాహ్లాదకరమై యమృత మథనము నందు పుట్టి సువర్ణ ప్రభ నొప్పు దివ్యమైన పారిజాతమును దర్శించెను. ఆ దివ్యతరు రత్నమును గని భామా రత్నము సత్యభామ యిట్లనియె.
కృష్ణ! యీ దివ్య వృక్షము ద్వారకకు మన మేల గొని పోరాదు? సత్య నాకెంతెని ప్రియురాలను నీ మాట నిజమే యగు నేని నాయింటి పెరటిలో నాటుటకు దీనిం గొనిరమ్ము. నీయంతగ ప్రేమ పాత్రము జాంబవతి గాదు. రుక్మిణియు గాదు. అని పలు మారులు పలికితివి. ఆ పలుకులు నిజ మైనచోనది మాట మాత్రము కాదేని (ఉపచార మాత్రమున నన్నది కాదేని) యీ పారిజాతము నా గృహ భూషణ మగుగాక! ఈ పారిజాత కుసుమ మంజరిని నా కొప్పునం దుఱుము కొని సవతుల నడుమ నందరి కన్న మిన్నగ రాణింప గోరు చున్నానని పలుక
కృష్ణుడు నవ్వి పారిజాతము గరుడునిపై కెక్కించెను. అతనిం గని నందన వన పాలకు లిట్లనిరి.
దేవరాజ పట్టమహిషి శచేదేవి, ఆమె సొత్తు పారిజాతము. గోవింద దానిని నీవు కొల్లగొన దగదు. శచీదేవి యలంరారము నకే దేవత లమృత మంథనమున దీని నావిర్భవింప జేసినారు. దానిం జేకొని నీవు క్షేమమున నరుగ జాలవు. తెలియక దీనిని గోరెదవు. ఎవడు దీనింగొని పోగలడు? దీని వలన దేవేంద్రుడు వికృతి నంద గలడు. (అతని మనసు చెడునని భావము.) వజ్రముం జేబూనిన శక్రుని నమరులు వెంబడింప గలరు. దేవత లందరి తోడి విరోధము అచ్యుత! నీకు వలదు. పరిణామ మందు కటువైన (చేదైన) పనిని పండితులు మెచ్చరు (పర్యవసానమున దేవ విరోధము కొని తెచ్చు విషమమైన పని యీ పారిజాతా హరణమని భావము) అని వన పాలకులు పలుక
ప్రచండ కోపమున సత్యభామ యిట్లనియె.
పారిజాతమునకు శచి యెవతె? సురాధిపుడు శక్రు డెవరు? ఈ వృక్ష మమృత మథనము నందే పుట్టిన యెడల యిది సర్వ లోకములకు జెందిన సమాన మైన యాస్తి. వాసవు డొక్కడే దాని నెందులకు గైకొనును? దేవతలు చంద్రుడు లక్ష్మి సర్వ లోకమునకు సామాన్య ధన మైనట్టు పారిజాత వృక్షముc గూడ సామాన్యమే. మగని బాహువుల నండగొని గనిని గర్వాతి శయముచే నిపుడు శచి దీనిని నిరోధించు చున్నది. అందు వలన పరుగునం బోయి పౌలోమికీ నా మాటను చెప్పుదు. భర్తృ గర్వమున (సౌభాగ్య గర్వమున) నుద్ధత మైన భాషలో సత్యభామ యిట్లు చెప్పు చున్నది. నీవు గనక మగనికి గూర్చు దానవేని యతనికి ప్రియురాల వైన నీ తరువును హరించు నా భర్త నాపింపుము. నీ మగని నింద్రు నెరుగుదును. దేవతలకు ప్రభువని యెరుగుదును. అదంతయు నట్లుండ మనుష్య స్త్రీని నేను నా పారిజాతమును గొనిపోయు చున్నానని సత్యభామ పలుక
వనపాలకు లేగి సత్యభామ చెప్పినది చెప్పినట్లు పెద్దగ ఘోషించుచు శచీదేవికి జెప్పిరి. శచియు దేవాధిపతిని ప్రోత్సహించెను.
అంతట నెల్ల దేవ సేనలు తన్న నుగమింప పారిజాతము కొర కింద్రుడు యుద్ధము సేయింప ప్రవృత్తు డయ్యెను. అవ్వల పరిమ నిస్త్రింశ గదా శూలాద్యా యుధ విశేషములను గొని త్రిదశు లింద్రుడు వజ్రాయుధము గొని నిలువ యుద్ధ సన్నద్ధులైరి. అంతట గోవిందు డైరావత గజరాజ మందున్న శక్రుని దేవ పరివారమును యుద్ధ సన్నద్ధులం గని దిక్కులు పిక్కటిల్ల శంఖ నిర్ఘోష మొనరించెను. వేలు లక్షలుగ బాణములను వదలెను. దిక్కులు నాకాశము బాణములు నిండ దేవత లనేక శస్త్రాస్త్రము లను విసరిరి. జగదీశ్వరుడు మధుసూదను డొక్కొక అస్త్రమును శస్త్రమును వేవేలు తునకలుగ భేదించెను. వరుణుని పాశము నురగాశనుడు (గతుత్మంతుడు) పాముపిల్ల దేహ మనట్లు ఖండ ఖండముల సేసి ఎగిరెను. భగవంతుడు దేవకీ కుమారుడు యముడు వదలిన దండమును గదచే నడచి ఖండించి పొడమిం బారవైచెను. ఆ ప్రభువు శౌరి కుబేరుని పల్లకిని చక్రముచే నువ్వు గింజంత తునక తునకలు సేసెను. సూర్య చంద్రులకు దేరిపార జూచి తేజో హీనులం గావించెను. అగ్ని వందల కొలది బాణములకు గురి యయ్యెను. వసువులు నలు దిక్కులకు దరుమ బడిరి. చక్రాయుధముచే శూలగ్రములు దెగబడ రుద్రులు పుడమిపై వడగొట్ట బడిరి. శార్జ్గ (శారర్గ్జ మను ధనుస్సును బట్టెడి హరి) సాధ్యులను విశ్యే దేవతలను మరుత్తులను గంధర్వుల నమ్ములచే నాకాశమున బూరుగు పింజల నట్లు ఎగుర గొట్టెను. గరుడుడు తుండముతో రెక్కలతో గోటి కొనలతో దేవ దానవులను దినుచు చంపు చుండెను. బాణ సహస్రముల నింద్రో పేంద్రులు రెండు మేఘములు వర్ష ధారల నట్లొండురు లపై వర్షించు కొనిరి. సంకుల యుద్ధమున గరుడు డైరావతముతో దేవతలతో నింద్రునితో జనార్ధునుడును బోరిరి. శస్త్రములు నస్త్రములును తెగి విరిగి విడిపోవ సత్త్వరముగ నింద్రుడు వజ్రమును బట్టెను. కృష్ణుడు సుదర్శన చక్రము నెత్తెను. అంత చరాచర మగు ముల్లోక మెల్ల వజ్ర చక్ర ధరులైన యా దేవరాజ జనార్ధనుల జూచి హాహాకార మొనరించెను.
అవ్వల నింద్రుడు విసరిన వజ్రాయుధము జేతం బట్టకొని శ్రీకృష్ణడు చక్రా యుధమును మాత్రము వదలక నిలునిలు మని తర్జించెను. వజ్రము గోల్పడి వాహనము గరుడుని దెబ్బతిను నంత పలాయన మంత్రము జపింప నున్న శచీవతిం గని సత్యభామ యిట్లనియె.
త్రిలోకేశ్వరా! శచీ భర్తకు బారి పోవుట యుక్తము గాదు. పారిజాత కుసుమ మాలసిగను ముడుచు కొని శచి నిన్ను సేవిం పగలదు. పారిజాత మాలచే దేజ రిల్లుచు వలపు గొని యేతెంచిన శచిని మునుపటి యట్లు గనని నీ దేవ సామ్రాజ్యమే బాటిది? ఇంద్రా చాలు చాలు సిగ్గు వడకుము. దేవతలు పారిజాతము గౌంపోదురు గాక. వారు వ్యధపడ కుందురుగాక. పతి గర్వమున తాను గర్వము గొని తన ఇంతటికి వచ్చిన నన్ను శచి బహుమానముగ జూడలేదు. స్త్రీనగుట వలన ఉదారమైన మనస్సు లేని దాననై నా భర్తను మెచ్చు కొనుటయే పనిగా నో యింద్రా! నీతో తగవు బెట్టు కొంటిని చాలు పరుల సొత్తుతో దొంగిలుటతో పారిజాతముతో బనిలేదు. రూపమునకు కీర్తికి నేమాడుది గర్వింపదు? అని పలుక
నింద్రుడు సంరంభము డిగి ఓ సఖి చండి(తీవ్ర కోపమున) మిగుల ఖేదపడ వలదు. సృష్టి స్థితి సంహారకర్త యగు విశ్వ స్వరూపునిచే నోడుటకు నేను సిగ్గు పడను. ఎవని యందీ జగమెల్ల నున్నదో, కల్గు చున్నదో, లయించు చున్నదో యట్టి ప్రభువు చేత నోడిన వానికి సిగ్గేల కల్గును. సకల భువన స్వరూపుడగు నాయన సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపము సకల వేదవిధులచే నెరుగ బడునది ఆన్యులచే నెరుగ బడుటెట్లు? అట్టి యజుని, నీశ్వరుని శాశ్వతుని తనంతట తాను జగ దుపకారము సేయు మొట్టమొదటి వాని నెవ్వడు జయింప సమర్థుడు?
