బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

27 - భారత వర్ష వర్ణనమ్‌

భుక్తి ముక్తి ప్రదమై వేద సమ్మితమైన పురాణ మెరిగించెద. వినుండు. భారత వర్షము కర్మభూమి యనంబడు. కర్మ ఫలభూములు స్వర్గము నరకమును. బ్రాహ్మాణాదులీ భారత వర్షమందే స్వకీయ కర్మముల నాచరించి సిద్ధి పొందిరి. ఇందు సందియము లేదు. ధర్మాది పురుషార్థప్రదమీ భూమి. ఇంద్రాదు లిచట శుభకర్మ మాచరించి యింద్రాది పదవులందిరి. ఈ వర్ష మందలి బుధులు శాంతులు వీతరాగులు విమత్సరులు నైన మరికొందరు మోక్షము నందిరి. విమానయానమున స్వర్గమున నిర్భయముగ నుండు సురలు కూడ నీ వర్షము నందు శుభ కర్మముల నాచరించియే స్వర్గమున కేగినారు. సురాసురులు కూడ నీ భారత భూమి యందు వసింప వేడుక పడుదురు. ఎన్నడా పుణ్య భారతము దర్శింతుమా యని యువ్విళు లూరు చుందురు.

నీచే చెప్పబడిన కర్మ భారత వర్షమున తప్ప ఇతర లోకమున ఫలప్రదము కాదు. కావున భారత భూమియే యుత్తమము స్వర్గాదులు మధ్యమము లనుచు నానలిచ్చితిరి. అట్లయిన నా పవిత్ర భూమి వృత్తాంతము సమగ్రముగ నానతిమ్మన పద్మజుండుట్లనియె.

భారత వర్షమున భాగములు తొమ్మిది. ఇంద్ర ద్వీపము, కశేరువు, తామ్రపర్ణము, గభస్తిమంతము, నాగ ద్వీపము, సౌమ్యము, గాంధర్వము, వారుణము అను తొమ్మిది భాగములు గలవు. ఈ భారత ఖండము సముద్ర పరివృతము. ఇచటి నదులు ఉప నదులు ఈ పురాణము నందు పందొమ్మిదవ యధ్యాయమున బేర్కొన బడినవి.

మహాత్ముడైన భార్గవుని పురము గోవర్థన మతిరమ్యము. ఇందుత్తర దేశములు వాహేక - వాటథాన - సుతీర - కాలతోయద ఆవరాన్త - శూద్ర వర్షా కాలమందు మాత్రమే ప్రవహించునని. ఎల్లప్పుడు ప్రవహించునవియు నగు నదులు గలవి మత్స్యములు మకుట కుల్యములు కుంతలములు కాశి కోశములు. ఆంధ్రకములు కలింగములు సమకములు వృకములు నను దేశములు మధ్య ప్రదేశ మందలి దేశములు. నహ్య పర్వతమున కుత్తరము గోదావరి పుట్టి ప్రవహించిన ప్రదేశము. మొత్తము భూమండలమున కెల్ల నిది మనోహర మైనది. వాహ్లీక వాటధాన సుతీర కాలతోయద అపరాంత శూద్ర బాహ్లిక కేరళ గాంధార యవన సింధు సౌవీర మద్రక శతద్రుహకళింగ పారద హారభూషిక మాఠర కనక కైకేయ దంభమాలిక అనునవి క్షత్రియ వైశ్య శూద్రజాతి నివాసము లైన దేశములు. కాంభోజ బర్బర లౌకిక వీర తుషార ప్రహ్లావ ఆధాయత నర ఆత్రేయ భరద్వాజ పుష్కలదశేరక లంపక శునశ్శోకకులిక జాంగల ఔషథి చలచంద్రములు కిరాత జాతులు గల దేశములు. తోమర హంస మార్గ కాశ్మీర కరుణ శూలిక కుహకమాగధములు అనునవి భారతోత్తర దిశ నున్న దేశములు. ఇక తూర్పు దేశములం దెల్పెద తెలిసి కొనుడు.

ఆంధ వామజ్కరాక బల్లక మఖాంతక అంగ, వంగ, మలద, మాలవ, ఋత్తిక, భద్రతుంగ, ప్రతిజయ, భార్యాంగ (దర్భాంగ), అపమర్దక, ప్రాగ్జ్యోతిష, మద్ర, విదేహ, తామ్రలిప్తక, మల్ల, మగధక నందములు దక్షిణావథ దేశములు. పూర్ణకేవల, గోలాంగూల, ఋషిక, ముషిక, కుమార, రామఠ, శక మహారాష్ట్ర, మూహిషక, కలింగ, ఆభీర, వైళిక్య, అటప్య, సరప, పులింద, మౌలేయు, వైదర్భ, దండక, పౌలిద, మౌలిక, అళ్మక, భోజ వర్థన, కాలిక, కుంతల, దంభక, నీలకాలకములు. ఇవి దాక్షిణాత్య దేశములు.

శూపరిక, కాలిధనలోక తాంకటములు, అపరాంత దేశము లనం బరగును. మలజ, కర్కశ, మేలక, జోశక, ఉత్తమర్ణ దశార్ణ, భోజ, కిష్కింధ, తోషల, కోశల, త్రైపుర, వైదిశ, తుంబుర, చర, యవన, పవన, అభయ, రుండికేర, బర్బర, హోత్ర ఋతువులు. వింధ్య పర్వత ప్రాంతములు. ఇక పర్వతాశ్రయము లైన దేశములు. నీహార, తుషమార్గ కురు, తుంగణ స్వస కర్ణ, ప్రావరణ, ఊర్ణ, దర్ఘ, కుంతక, చిత్రమార్గ, మాలవా, కిరాత తోమరములు. ఇక్కడ చతుర్యుగ ధర్మము నడచును. ఈ భారత వర్షమునకు పూర్వ దక్షిణములుగా “మహోదధి” యను పేరు సముద్ర మున్నది. ఉత్తరమున హిమవంతము వింటినారి యట్టున్నది. ఈ భారత వర్షము సర్వ బీజము. సర్వ జీవులు కర్మా చరణము చేసి తత్తత్ఫలభాజను లగుట కిదియే స్థానము. దేవతలు కూడ యిందు మానవ జన్మమెత్తి సుకృత మొనరించి తత్ఫల మవ్వలి లోకముల ననుభవింప గోరుదురు. ఇది తపః ఫల మిచ్చు భూమి. తీర్థ క్షేత్ర యాత్రా దాన దేవతారాధన స్వాభ్యాయాది సకల సత్కర్మ ఫలప్రద పుణ్య భూమి యిది. బ్రహ్మచర్యాద్యాశ్రమములు, శాస్త్రములు, వ్రతములు, ఇష్టా పూర్తములు, మఱియే కల్యాణాచరణ మేని యిచట సఫలము కాక తప్పదు. ఈ భారత వర్ష ప్రశంస సర్వ పాప హారము పుణ్యము ధన్యము జ్ఞాన వర్థనము. ఇది చదివిన విన్నవారు సర్వపాప విముక్తులై విష్ణు లోక మందును.