బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

24 - ధ్రువ సంస్థితి నిరూపణమ్‌

భగవంతుడగు హరి యొక్క తారా (నక్షత్ర) మయమైన రూపము శిశుమార నక్షత్ర మంతరిక్ష చక్రము నందు ప్రకాశించు చున్నది. దాని తోక యందు ధ్రువు డున్నాడు. అతడు దాను దిరుగుచు చంద్రా దిత్యాది గ్రహములను ద్రిప్పు చున్నాడు. తిరుగు చున్న యీ ధ్రువు ననుసరించి నక్షత్రములు చక్రము వలె తిరుగు చుండును. సూర్య చంద్రులు తారా నక్షత్ర గ్రహ సమూహము వాయుమయము లైన బంధములచే ధ్రువుని యంద నుబద్ధములై యున్నవి. అంతరిక్ష మందు జ్యోతిశ్చక్రము శిశుమారాకారమున (మొసలి వలె) నున్నదని వర్ణిత మైనది. ఆ మ్మూర్తి కాధారమై హృదయ మందు నారాయణుండు న్నాడు. ఉత్తానపాదుని కుమారుడు ప్రజాపతి నారాధించి తారా రూప మయిన యా శిశుమారము యొక్క తోక యందున్నాడు. శిశుమారము నకాధారము సర్వా ధ్యక్షుడైన జనార్దనుడు. ధ్రువున కాధారము శిశుమార చక్రము. ధ్రువుని యందు భానుడున్నాడు. సురాసుర మానుష మయిన యీ జగత్తంతయు నా సూర్యుని యాధారమున నిలిచి యున్నది. సూర్యుడీ జగత్తు నంతకు నే విధానమున నాధారముగ నుండెనో నా వలన వినుడు!

సూర్యు డెనిమిది మాసములు రసన్వ రూపములైన జలములను బీల్చి వర్షించును. ఆ వర్షము వలన అన్నము దాని వలన సకల జగత్తు పొడమును. తీక్ష కిరణములచే నర్కుడు జగమ్మున గల నీటి నాకర్షించి సోముని పోషించును. ఆయన వాయునాడీ మయమైన జలముచే యాకాశము నందుండి పొగ అగ్ని వాయువు యను వానియొక్క సన్నిపాత స్వరూప మయిన మేఘము లందు జలముల జిమ్మును. అమ్మేఘముల నుండి నీరు భ్రంశము కానందున నమ్మబ్బులకు “అభ్రములు” అను పేరు వచ్చినది. ఈ మేఘము నందున్న నీళ్ళు వాయు ప్రేరణమున కాల జనిత సంస్కారమును బొంది నిర్మలములై వానగా నవనిపై బడును. ప్రాణికోటి పుట్టుటకు కారణము లయి భౌమము లయిన యీ అప్పులు (నీళ్ళు) నదులు, సముద్రములు. భూమి ప్రాణి జన్యము లని నాలుగు రూపములతో నున్న యీ జలమును భగవంతుడైన నవిత అదానము చేయును (గ్రహించును). సూర్యుడు అభ్రగతము కాకుండ ఆకాశ గంగా గతమైన నీటిని కూడ కిరణములచే గ్రహించి ఆప్పటి కపు డవనిపై వర్షించును. అట్టి ఆకాశ గంగోదకముల స్పర్శ వలన పాపములు వాసిన మర్త్యుడు నరకమున కేగడు. అది దివ్య స్నానమని ఋషులు చెప్పిరి. సూర్య దర్శన మాత్రమున దివంబు నుండి రవి కిరణములచే నాయాకాశ గంగోదకము వెదజల్ల బడును.

కృత్తికాది విషమ (బేసి) నక్షత్రము లందు సూర్యుని దర్శనముతో వర్షించు నయ్యు దకము దిగ్గజము లెత్తి వర్షించి నట్టి గంగోదక మని తెలియ నగును. సూర్యుని కిరణముల ద్వారమున సరి సంఖ్య కల నక్షత్రము లందు కురియు వాన అప్పటి కప్పుడు సూర్య కిరణములచే స్వీకరింప బడి వర్షింప బడినది యీ ఉభయమును నరులకు పాపహరము పుణ్య కరమును నగు దివ్య స్నానమని తెలియ నగును. మేఘముల వెంట కురియు నుదక మోషధులను బోషించును. ప్రాణులకు జ్జీవనమగు నా జలము అమృతము. దానం బెంపొందిన సక లౌషదీ గణము ఫల పాకాంతమై (పంట పండగానే నశించు నదియై) ప్రజలకు సాధక మగును. అందుచే శాస్త్ర చక్షువులగు మానవులు వేదములు సెప్పిన యజ్ఞము సహరహము నాచరించి దేవతల కాప్యాయనము కలిగింతురు. ఇట్లు యజ్ఞములు వేదములు బ్రాహ్మణాది వర్ణములు సర్వ దేవని కాయము సకల పశు భూత సంఘాతము స్థావర జంగమాత్మక మైన సర్వ జగత్తు వర్షాధారమున రాజిల్లు చున్నది. ఆ వర్షము సూర్యుని వలన నేర్పడు చున్నది. అట్టి సూర్యుని కాధారమై ధ్రువు డున్నాడు. ఆతనికి శిశు మారము దానికి నారాయణుడును అశ్రయమై యున్నారు. శిశుమార చక్ర హృదయ స్థాన మందు నారాయణు డుండి సర్వ భూతములను ధరించుచు సనాతనుడు సర్వా దిభూతుడై యలరారు చున్నాడు. భూ సముద్రాది సహితమైన బ్రహ్మాండము యొక్క స్వరూప మిది. మీకు తెలిపితిని. మరి యేమి విన దలతురో యానతిండు.