బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
67 - ద్వాదశ యాత్రా మాహాత్మ్యమ్
ఉత్థాన యేకాదశి యందు ఫాల్గుణ పూర్ణిమ నాడు విషువ పుణ్య కాల మందు ‘గుడివా’ యాత్ర దర్శనము చేసిన వాడు పదునాల్గు రింద్రుల పరిపాలన కాలము వరకు విష్ణు లోకము నందుండును. పురుషోత్తమ క్షేత్రమునకు జ్యేష్ఠ మందు యాత్ర చేసిన వాడు కల్పాంతము వరకు విష్ణు లోకమందు సుఖించును. విధానమున లోభత్వము డాంబికము లేకుండ భగవత్ప్రతిష్ఠ చేసి పూజించిన యతడు వైకుంఠ భోగముల ననుభవించి మోక్షము నందును.
భగవత్ప్రతిష్ఠా విధానము, అర్చనము, దానము మొదలైన వాని ఫలము గురించి అడుగ. బ్రహ్మయిట్లనియె.
జ్యేష్టశుక్ల యేకాదశి నాడు ఇంద్రద్యుమ్న సరసు నందు యథావిధిగ స్నాన మాచరించి దేవర్షి పితృ తర్పణము లొనరించి మడి వస్త్రములను ధరించి సూర్యాభి ముఖుడై వేదమాత గాయత్రిని యష్టోత్తర శతము (108) జపించి సౌర మంత్ర పారాయణము జేసి ముమ్మార్లు ప్రదక్షిణము జేసి త్రివర్ణముల వారు వేదోక్త విధానమున సూర్య నమస్కారములను చేయ వలెను. స్త్రీ శూద్రులు స్నానాదు లందు జపము లందు వేదోక్తము గాక పురాణొక్త విధానము ననుసరింప వలెను.
అటు మీద గృహమున కేగి మౌనమూని పురుషోత్తముని ధ్యానా వాహనాది విధానమున పూజింప వలెను. ఆ దేవుని ఆవు నేతితో పాలతో నభిషేకింప వలెను. పంచామృత స్నానము కూడ చేయింప వలెను. చందనో దకముతో స్నాన మాడింప వలెను. ఆ మీద వస్త్రయుగ్మ సమర్పణ చేయ వలెను. చందనాగరు కర్పూర కుంకుమలు పూయ వలెను. విష్ణు ప్రియము లైన తామర మల్లియలతో జగన్నాథుని పూజింప వలెను. ధూపమీయ వలెను. అవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని పండ్రెండు దీపములను పెట్ట వలెను. పాయసము చక్కెలములు లడ్డూ వటకము బెల్లపు పాకము నివేదింప వలెను. మధుర ఫలములను గూడ నివేదింప వలెను, పంచో పచారములచే నిట్లు పూజించి “నమః పురుషోత్తమాయ” అను మంత్రము 108 మార్లు జపింప వలెను. అటుపై నా దేవుని నమస్తే “నమస్తే సర్వలోకేశ భక్తానా మభయప్రద” అని ప్రారంభించి స్తుతించి యీ పండ్రెండు యాత్రలు నీ యనుగ్రహమున సంపూర్ణ ఫలవంతము లగు గాక యని యా దేవుని యనుగ్రహింప జేసుకొని దండవ త్ప్రణామము గావింప వలెను. పుష్ప వస్త్ర గంధాదులచే నటుపై గురువుని పూజింప వలెను. గురువున కును దేవున కును భేదము లేదు. ఆ మీదట పుష్ప మండప నిర్మాణము జేసి వేదాది విద్యలను స్వామికి నవధరింప జేసి యా రాత్రి జాగరణ చేయ వలెను. అందు వాసుదేవ కథా ప్రసంగము, సంకీర్తనము చేయ వలెను. చేయింప వలెను. ధ్యానించుచు పఠించుచు శ్రీహరిని స్తుతించుచు నమస్కరించుచు నారేయి గడుప వలెను. ద్వాదశి యందు ప్రభాతమున పండ్రెండుగురు వ్రత స్నాతులు వేద పారగులు ఇతిహాస పురాణజ్ఞులు జితేంద్రియులు నయిన బ్రాహ్మణులను ఆహ్వానింప వలెను. తాను యథావిధి స్నానము జేసి పురుషోత్తముని పూజింప వలెను. బ్రాహ్మణులను బూజించి గొ, స్వర్ణ, ఛత్ర, పాదుకా దులను వస్త్రా భరణములను నొసంగి బూజింప వలెను. ఆచార్యునకు కూడ పైన చెప్పిన ద్రవ్యముల నొసంగి యందరికిని మృష్టాన్న భోజనము పెట్ట వలెను. ఆ బ్రాహ్మణులకు మోదకములతో గూడ పండ్రెండు ఉదకుంభ దానములను సదక్షిణముగ చేయ వలెను. జ్ఞాన ప్రదుడైన గురువును బ్రాహ్మణులను విష్ణు తుల్యులుగా భక్తితో భావించి యిట్లు బూజింప వలెను. అటుపై వారికి నమస్కరించుచు నీక్రింది “సర్వవ్యాపీ జగన్నాథః శంఖచక్ర గదాధరః అనాదినిధనో దేవః ప్రీయతాం పురుషోత్తమః” శ్లోక రూప మయిన మంత్రమును పఠింప వలెను. ఆ శ్లోక భావమిది. “అంతటను నిండి యున్నవాడు. ఆది మధ్యాంతములు లేని వాడు శంఖచక్ర గదా ధరుడు జగన్నాధుడు నగు పురుషోత్తమ దేవుడు సంప్రీతు డగుగాక”. అని యిట్లు పలికి విప్రులకు నమస్కరించి యాచార్యుని తోబాటు వారికి శిరసు వంచి నమస్కరించి వారిని తన యింటి సరిహద్దుల వరకు సాగనంపి నమస్కరించి వచ్చి బంధు జనముతో వాజ్నియమము వహించి భగవ త్ప్రసాదము నారగింప వలెను. ఉపాసకులకు దీనులకు భిక్షుకులకు అన్నాతురులకు గూడ భోజనము బెట్ట వలెను. ఇట్లు చేసిన పురుషుడేని స్త్రీ యేని యశ్వమేధ రాజసూయ శత సహస్ర పుణ్యము బొందును. నూరు తరములు వెనుక వారిని ముందు వారిని తరింప జేసి దివ్య రూపధారియై సూర్యునట్లు వెలుగు కామగ మగు విమానమున గంధ ర్వాప్సరో బృందము స్తుతింప దన పుణ్య విశేషముచే దశ దిశలను వెలిగించుచు నాతడు హరిపుర మేగును. నూరు కల్పములు వైకుంఠ భోగముల ననుభవించి సర్వస్తుతి పాత్రమయి జగన్నాధ స్వామి సారూప్య మంది సర్వ భోగముల ననుభవించి బ్రహ్మలోక మేగును. అచట తొంబది కల్పములు సుఖించి రుద్ర లోకమున కేగును. అచట నెనుబది కల్పములు సుఖ మనుభవించి గోలోకమున కేగును. డెబ్బది కల్పము లచట నుండును. అట నుండి ప్రజాపతి లోకమేగి యఱువది కల్పములు నానా భోగముల ననుభవించును. అట నుండి యింద్ర భవనమున కేతెంచి యేబది కల్పములు సుఖించి నలుబది కల్పములు సురలోకమున సుఖ మనుభవించి నక్షత్ర లోకమున కేగి ముప్పది కల్పము లుండి చంద్ర లోకమున నిరువది కల్పము లుండి యాదిత్య లోకమున కేగి పది కల్పములు సుఖించి గంధర్వ భువనమున నొక కల్పము భోగించి భూమి కేతెంచి ధర్మ పరుడైన చక్రవర్తి యగును. ఇచట రాజ్యమును ధర్మముగ పాలించి సంపూర్ణ దక్షిణము లగు యజ్ఞము లాచరించి యోగి గమ్యమగు మోక్షప్రద మయిన శివలోక మందును. అందు భూత ప్రళయము దాక సర్వ భోగముల ననుభవించి మరల నిటకు వచ్చి యోగుల కులమందు విష్ణు భక్తుడైన విప్రుల వంశమందు జనెంచి చతుర్వేదా ధ్యాయిమై సుదక్షిణములై యజ్ఞములను జేసి విష్ణు భక్తి యోగము నూని మోక్ష మందును.
భుక్తిముక్తుల నొసంగు గుడివా యాత్రాఫలము మీకు చక్కగ వినిపించితిని. ఓ విప్రులార! మరి యేమి విన వలతురు?
