బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

28 - కోణాదిత్యమాహాత్మ్యమ్‌

దక్షిణ సముద్ర తీర మందోఢ్ర దేశము గలదు. అది స్వర్గ మోక్ష ప్రదము. సముద్రము నకుత్తరముగా విరజ మండలము సరిహద్దుల దాక అది యున్నది. అచటి బ్రాహ్మణులు జితేంద్రియులు. తపస్స్వాధ్యాయ నిరతులు. వంద్యులు పూజ్యులును. యజ్ఞదాన వివాహాది శుభ కర్మము లందు శ్రాద్ధాదుల యందు వీరు చాలా ప్రశస్తులు. షట్కర్మ నిరతులు. ఇతిహాస పురాణార్థ విశారదులు. సర్వ శాస్త్రార్థ సమర్థులు, మాత్సర్య హీనులు, పుత్ర దారధన క్షేత్ర సంపన్నులు, సత్య వచనులు, దాతలు. క్షత్రియాది వర్ణముల వారును స్వధర్మ నిరతులు ధార్మికులు శాంతులు. ఆ దేశ మందు కోణాదిత్యుడను పేర సూర్య భగవానుడు వెలసి యున్నాడు. తద్దర్శనము సర్వపాప నికృంతనము.

ఆ దేశమందు కోణాదిత్యుడను పేర సూర్య భగవానుడు వెలసి యున్నాడు. లవణ సముద్రోత్తర తీరము వాలుకాకీర్ణము. మనోహరము సర్వ పుష్ప ఫల భరిత తరు సుందరము రమారమి సార్థ యోజన విశాలముగా నచట సూర్య క్షేత్రము భక్తి ముక్తి ప్రదము. అది నానా తరులతా సుందరము.

మాఘమాస శుక్ల సప్తమి నాడు వేకువ నక్కడి సముద్రమున స్నానము చేసి దేవ ఋషి పితృ తర్పణము చేసి ధౌత వస్త్రములు దాల్చి యాచమించి యమ్మహో దధియం దుదయ వేళ నాసీనుడై రక్త చందన జలముల సూర్యునకు ఎనిమిదిరే కులు గల కేసరా వృతమైన వర్తులాకార పద్మమును (అష్టదళ పద్మమును) గర్ణికతో గూడ లిఖించి తిల తండుల తోయముల రక్త చందనముతో గూర్చి రక్తపు ష్పములు దర్భలు రాగి పాత్ర యందుంచి యాదానిని మరొక పాత్రతో మూసి అంగన్యాస కర న్యాసములు చేసి తనను భాస్కరునిగా ధ్యానించి శ్రద్ధతో నడుమ నగ్నిదళ మందు నైఋతి వాయవ్య ఈశాన్య స్థాన మధ్య యందు పూజచేయ వలెను. (కేసరము = కింజల్కము) ఆ పద్మమును నారాదించి యందు గగనము నుండి భాస్కరుని నాహ్వానించి తామర పువ్వు దుద్దు మీద ప్రతిష్టించి ముద్రా ప్రదర్శనము చేసి రెండు భుజములు తేనె రంగు కన్నులు గల వానినిగా నరుణ పద్మా రుణాంబర ధారిగా సర్వాభరణ భూషితునిగా సర్వ లక్షణ లక్షితునిగా శాంత మూర్తిగా వరద ముద్రా ధారిగా ప్రభామండల మండితునిగా సాంద్ర సిందూర వర్ణునిగ నుదయ భాస్కరుని ధ్యానించి మోకాళ్ళపై గూర్చుండి యా పాత్రము నెత్తి శిరంబున దాల్చి త్య్రక్షర మంత్రముతో సూర్యునకర్ఘ్య మీయ వలెను. సూర్య మంత్ర దీక్షలేని వాడు. సూర్య నామముతోనే యర్ఘ్య మీయ నగును. ఆగ్నేయ, నైఋతి, వాయు, ఈశ, మధ్య పూర్వాది దిశలందు హృదయ, శిర శ్శిఖా, కవచ, నేత్ర అస్త్రముల పూజింప వలెను. ఆర్ఘ్య మర్పించి గంధ ధూప దీప నైవేద్యాదు లొసంగి జపము జేసి నమస్కరించి స్తుతించి ముద్రా బంధముతో విసర్జనము చెప్ప వలెను. భక్తితో నిట్లర్కునకర్ఘ్య మిచ్చిన పుణ్యులు భుక్తి ముక్తులను బడ యుదురు. త్రైలోక్య దీపసు డైన భాస్కర దేవుని గగన సంచారి నెవ్వరా శ్రయింతు రాజనులు సుఖ భాజనులు. భాస్కరున కర్ఘ్య మీయ కుండ విష్ణు శంకల సురేశ్వర నర్చింప గూడదు.

రోగ విముక్తి, ధన సంపత్తి, విద్యాసిద్ధి, పుత్ర పౌత్రా భివృద్ధి యన్నియు దీన గల్గును. చేతం బూవులు ధరించి సూర్యాలయమున కేగ వలయును. మూడు మార్లు ప్రదక్షిణము చేయ వలెను. ఆ మీద నా దేవుని పూజింప వలెను. దాన దశాశ్వమేధ ఫలము కల్గును, తుదకు సూర్యుడట్లు వెలుగు విమానము నెక్కి గంధర్వులచే నుపగీయ మానుడయి సూర్య భక్తుడు సూర్య లోక మందును, తిఱిగి వచ్చి యోగి కులమందు దయించి భానుయోగము నంది ముక్తి నందును. చైత్రశుక్ల మందు మదన భంజికయను (కామ దమనము) యాత్రను జేసియు నీ ఫలమందును. శయనో త్థానైకా దశీతిధు లందు భాను సంక్రమణ మందు నీ యాత్ర చేసిన వారు విమాన యానులై భానులోక మరిగెదరు. ఆ సముద్ర తీరమున రామేశ్వరుడను పేర శివు డున్నాడు. అయన నర్చించిన వారికి రాజ సూయ ఫల మొదవును. కామగమైన విమానమున నీ మున్ను చెప్పిన ప్రభావముతో శివపురి కేగును. ఈ రవి క్షేత్రమున మేను బాసిన జీవి సూర్య లోక మంది మానవ జన్మమెత్తి ధార్మిక ప్రభువై సూర్య సారూప్య మంది మోక్ష మందును. ఇది కోణార్క స్వామి మహిమ.