బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
185 - కాలీయ దమనమ్
వ్యాసులు:
కృష్ణుడు గోపకులతో నడవి పూల మాలలు దాల్చి బలరాముడు రాకుండ నొకతరి బృందావనము నకు వెళ్ళెను. అచట తరగలు లేచి నురుగు లోడ్డులం దొరయ నవ్వు చున్నదా యన్నట్లున్న కాళిందీ నదికి జని యందొక భయంకరమైన విషాగ్నిని జిమ్ము కాళీయ సర్పమునకు నివాసమైన మడుగును జూచెను. విషాగ్ని వ్యాపించి మాడిపోయి యా తీర మందలి తరువులతో గాలి తాకిడికి లేచిన విష జల స్పర్శచే మాడి పోయిన పక్షులతో మరొక మృత్యు ముఖమో యన్నట్లు మహా రౌద్రమై యున్న యమ్మడుగు జూచి మధుసూదనుడు ఈ మడుగులో విషాయుధుడు. కాళీయుడు అను దుష్ట సర్ప రాజున్నాడు. ఇంత మున్ను వీనిని సముంద్ర మందు నిర్జించి వదలి పెట్టితిని. వానిచేత సాగరమున గలియు యమునా నది విష దూషిత యైనది. దాన నరులు గోవులు దప్పిక గొనియు దీని దరి జేరరు. కావున వీనినశ్యము నిగ్రహింప వలెను. వ్రేపల్లె లోని జనము నిత్యము వీనికి జడియు చుందురు. వారెల్లరు నిక నిట సుఖముగ సంచరింతురు గాక. ఇందు కొఱకే నీలోకము నంద వతరించితిని. ఇది సత్పురుషులకి రాకపోకల కనువైన చోటు. దురాత్ములకు శాస్తి చేయ వలెను. కావున ననతి దూరములో నున్న కదంబ వృక్షమును(కడిమి చెట్టును) యొక్కి జీవ నాశకమైన యీ విషపు మడుగులో దూకెదను. అని తలచి నడుమున వలువ బిగించికొని యా కాళీయుని మడుగు నందు కృష్ణుడు దూకి పడెను.
అట్లు దూకిన హరిచే నా మడుగు కలగ బడి దూర దూరమున నున్న వృక్షములను గూడ దన జలములచే దడపెను. విష జ్వాలలచే గ్రాగిన నాయుడుకు నీటిచే దడుప బడిన చెట్లంటు కొని నలుదెసల జ్వాలలు గ్రమ్ముకొనియె. కృష్ణుడు అ ముడుపును బాహువులచే గలకుండు పరచెను. అ శబ్దము విని నాగరాజు కోపముచే నిండ నెరుపెక్కిన కనులతో విషజ్వాలా కులమైన బుడగలతో మఱి పెక్కు యెఱ్ఱని మహావిష సర్పములతో జుట్టుకొన బడి యుండెను.ఆ నాగుని భార్యలు మనోహర హారముల దాల్చి మేనులు కంపింప కుండలముల జలించి మణికాంతులు మిరుమిట్లు గొలుప నూరునకు మించి యందందగ్రమ్ము కొనిరి. ఆ ఫణిరాజు ఫణాగ్ర మందు జొచ్చి కృష్ణడు పడగల బంధ మందు జిక్కు కొనియె. కాళియుని బరివార మగు పాములు విష జ్వాలలు జిమ్ము ముఖమలం గరచెను. అమ్మడుగున బడి నాగని భోగము నందు నిరుకు గొనియున్న హరిని గాంచి గోపకులు వ్రేపల్లెకు జని శోక వివశులై గోల పెట్టిరి.
ఇడిగో కృష్ణుడు కాళీయుని మడుగున విషముచే మూర్ఛ వోయినాడు. సర్పరాజు వీనిని దినివేయ గలడు. రండు, త్వరగా రండని కేకలు పెట్టిరి.
అది విని గోపకులు గోపికలు పిడుగు పడినట్లై యశోద మున్నుగా నందరు మడువు దరికేగిరి. “కృష్ణు డెక్కడ” యనుచు వ్రేపల్లెలో యశోదతో దెదరి బెదరి తడబడుచు నటకు వచ్చిరి. నందుడు గోపకులు బలరాముడు మొదలగు నద్భుత పరాక్రమ సంపన్నులు కూడ హడలెత్తి కృష్ణుని జూడ యమున కేగిరి. సర్పరాజు వశము నుండి యన్ని పడగలచే జుట్టబడి యేమి జేయక మిన్నకున్న కృష్ణుని జూచిరి. నంద గోవుడు నిశ్చేష్టుడై కొడుకు నెమ్మోము చూచుచు నిలువ బడెను. యశోదయు నిశ్చేష్టు రాలయ్యెను. మఱియుం గల గోపికలు ఏడ్చుచు కేశవుని గూర్చి శోకాక్రాంతులై భయ భ్రాంతలై యశోదతో గూడ నీ పెను మడువున జొత్తుము చత్తుము గాక తిరిగి పల్లెకుం బోరాదు. సూర్యుడు లేని పగలేమి చంద్రుడు లేని రాత్రి యేమి రాత్రి పాలులేని యావులు ఏమి యావులు. కృష్ణుడు లేని వ్రేపల్లె యేమి పల్లె. ఈ కృష్ణుడు లేకుండ గోకులము నకు బోనేపోము. అను నీ గోపికల మాటి విని రోహిణి కొడుకు బలరాముడు కృష్ణ దూరులైన గోపకులను జూచి చూపు నిలిపి బిడ్డ ముఖమున జూవు వెట్టి దిగులు పడియున్న నందుని మూర్చాకుల యైన యశోదను నుద్దేశించి కృష్ణు ప్రభావ మెఱిగి యిట్లనియె.
“దేవ దేవ! నీ మానుష భావము వెల్లడించు చుంటివా? ఆత్మ స్వరూపమును నీ వెరుగవా? వేరొక రూపే చూపనేల? నీవే జగత్తునకు నాభి భూతుడవు. దేవతల కాశ్రయు డవు. త్రైలోక్య మునకు కర్తవు. భర్తవు హర్తవును. వేదత్రయీ రూపుడవు. ఇట నవతరించిన మన కిద్దరకు కృష్ణా గొల్లలే చుట్టాలు కదా! గోపికలునంతే కదా! ఇట్లు పరితపించు నీ బంధువులను చూచి యెందు వలన నుపేక్షించు చున్నావు. మానుష భావము చూపితివి. బాల చేష్టలు ప్రదర్శించితివి. కోర లాయుధ ముగ గొనిన ఈ దురాత్ముని దమింపుము.” అని హలిచే జ్ఞప్తి చేయబడి కృష్ణుడు చిరు నవ్వున నధర బింబము దెరచుకొన భూజాస్పాదన ముజేసి పాము పడగల బంధముల నుండి తన మేనిని వదలంచు కొనెను.
రెండు చేతుల నా పాము మధ్యమ ఫణమును వంచి వ్రాలిన వాని తలపై నెక్కి యవక్ర విక్రమమున నర్తనము జేసెను. హరి పాదకుట్టనము లచే (రాపిడిచే) వాని పడగలు పుళ్ళు పడెను. త్రోక్కిన తల వొంగి పోయెను కాళీయుడు కృష్ణపాద ఘట్టమున మూర్చ నొందెను. దండపాతమట్లు పడిపోయి నెత్తురు గ్రక్కెను. శిథలములైన శిరస్సుల ముఖముల నుండి రక్తము స్రవించ జూచి వాని భార్యలు మధుసూదడమని శరణోందిరి.
దేవదేవ! సర్వేశ్వర! పురుషోత్తమ! నీవు పరంజ్యోతి స్వరూపుడవు. అత్మ యొక్క భాగమే నీవు. నిన్ను స్తుతింప దేవతలును జాలరు. అట్టి నీ స్వరూప వర్ణన మండుది యెట్లు చేయ కలదు. పృథి వ్యప్తేజో వాయ్వా కాశములను జాలవు. అట్టి నీస్వరూప వర్ణన మడుది యెట్లు చేయ కలదు. పృథివ్వప్తేజో వాయ్వాకాశ రూప మయిన బ్రహ్మండ మనీలో యల్పాల్ప మైన యంశము. అట్టి నిన్నేమి స్తుతింప గలను. కావున నోజగత్ప్రభో! ఈ నాగుని యెడ దయ జూపుము. అణగి మణగి ప్రాణములు వదలు చున్నాడు. భర్తృ భిక్ష పెట్టుము. అని నాగ పత్నులు పలుక
కాళీయుడు వొడ లెల్ల నలుగుడు వడి కూడ దేవదేవ! యనుగ్రహింపు మని మరిమరి ఇట్లు పలికెను.
నీ ఐశ్వర్య మెనిమిది విధములు. అది స్వభావ సిద్ధము. దానిని యతి శయించునది మఱి లేదు. అట్టి యణిమిది విభూతి సంపన్ను డగు నిన్నేమి స్తుతింప గలడు. నీవు పరుడవు పరున కును మూలము నీవు. నీకంటె పరమైన తత్వము నీవె. పరతత్వమునకు వరము నీవు. అట్టి నిన్నేమి స్తుతింప గలను. జాతిచే రూపముచే దామిట్లు నన్ను సృజించితిరి. దాని కణుగుణ మైన స్వభావము కూడిన వాడను. తదనుగుణ మైన చేష్టను చేసితిని. సర్ప స్వభావమైన కాటు వేయుటను గరచుటను మాని వేఱొక తీరున ప్రవర్తింతు నేని స్వామి! నన్ను దండించుట న్యాయము. అట్లయ్యు నో జగత్ప్రభు నాపై దండనము వైచితివి. ఈ దండనము నీవు విధించినది కావున యిది వరముగ నేను స్మరింప వలసి నదే. ఇంతకంటె నీవలన మఱొక వరము వలదు. అచ్యుత! వీర్యము హత మైనది, విషము హత మైనది. నీచే నేను దమితుడ నైతిని. బ్రాణ మొక్కటి మాత్ర మిమ్ము. మఱియేమి నేను సేయ వలేనో ఆజ్ఞాపింపుము అన విని
ఓ పాము! ఈ యమున జలమున నిక్కడ నీవెపుడు నుండ వలదు. భృత్య పరివారముతో నీవు సముద్ర జలములం జనుము నీ తలపై నా పాదములను జూచి సముద్రమున పన్నగారి యైన గరుడుడు నిన్ను జంపడు అని హరి సర్పరాజును వదలెను
వాడును కృష్ణునకు మ్రొక్కి సముద్రమున కేగెను. సర్వ భూతములు చూచుచుండ భృత్యులతో సంతతితో బంధువులతో భార్య లందరితో నమ్మడుగు విడిచి సర్పము వోయినంత గోపకులు చనిపోయి మఱి వచ్చిన వాని నట్లు గోవిందుని కౌగిలించు కొని భాష్పములచే నాతని శిరస్సు దడిపిరి. ఎల్లరు మనసు లచ్చరువు బడ నానంద భరితులై యానది మధుర మంగళ రసపూరితముగా జూచి స్వామిని స్తుతించిరి. గోపికలచే గీర్తింప బడి గోవకులతో గృష్ణుడు వ్రేపల్లె కరుదెంచెను.
