బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

65 - కృష్ణస్నాన మాహాత్మ్య వర్ణనమ్‌

మునులు అడుగగా, బ్రహ్మ బలరామ కృష్ణ సుభద్రా ప్రీతిగ చేసిన స్నాన ఫలమును గూర్చి ఇట్లు చెప్పెను. జ్యేష్ఠమాస మందు చంద్ర దేవతాక మగు నక్షత్ర మందు పూర్ణిమ నాడు సర్వ తీర్థములు పురుషోత్తమ క్షేత్రము నందున్న నూతి యందుండును. భోగవతి యను పుణ్య తీర్థము అచ్చట ప్రత్యక్ష మగును. ఆనాడు బంగారు కలశములచే నాకూప జలమును దోడి యా ముగ్గురి దేవతలకు నభిషేకము చేయ వలెను. ఒక మంచము వస్త్ర పుష్పాదులచే నలంకరించి పతాకము లెత్తి తెల్లని వస్త్రము పఱచి ధూప దీపాదు లలంకరించి వివిధ మంగళ వాద్యములు మ్రోయ బలరామ కృష్ణులను సుభద్రను పూజింప వలెను. సుభద్రను వారిద్దరికి నడుమ నిలుప వలెను. ఆ విధముగ యధావిధి పూజ జేసి మంగళ వాద్యములను మ్రోయించి వేద పారాయణము కూడ చేయించ వలెను. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు కూడ నీ పూజ చేయవచ్చును. అపైన స్తుతి చేయవలెను.

ఆస్తుతి “నమస్తే దేవదేవేశ” అని ఆరంభించి “నమస్యామహే భక్త్యా సర్వకామ ఫలప్రదమ్‌” అనును వరకును పఠింప వలెను.

ఈ పూజకు ఇంద్రాది దేవతలు కూడ వత్తురు. ఆ వచ్చెడి దేవతల పేర్లు “శక్రాద్యాః” అను వరకు మూలము నందు సులభముగా పేర్కొన బడినది.

పై శ్లోకాలల్లో అభిషేక సామాగ్రి వర్ణింప బడినది.

జయజయ లోకపాల అని ప్రారంభించి జయవిష్ణో నమోస్తుతే వఱకు కృష్ణస్తవము.

ఈ విధముగ దేవతలు మొదలగు వారు బలరామ సుభద్రా కృష్ణులను అర్చింతురు. ఈ అర్చన వలన సర్వాభీష్టములు సిద్ధించును. సర్వదాన ఫలము కల్గును. గ్రహ బాధలు తొలుగును. సంతాన సిద్ధి కలుగును. ఆయా ఫల సిద్ధులను మూలము నుండి సులభముగ ఆర్ధము చేసుకొన వచ్చును.