బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

31 - మార్తండస్యైక వింశతి నామ కీర్తనమ్‌ ఆదిత్య మాహాత్మ్య వర్ణనము

 ఓ మునులార! సదేవాసుర మానుషమైన సర్వ జగత్తు ఆదిత్య మూలము. ఈ తేజస్సు ఇంద్రో పేంద్రాది సర్వ దేవతా మయము. పరమ దైవత మిదియే. అగ్ని యందు యధావిధి వేల్వ బడిన యాహుతి యాదిత్యు నందును. ఆదిత్యుని వలన వృష్టి, వర్షము వలన నన్నము దాని వలన బ్రజలు గల్గుదురు. ధ్యాన నిష్ఠులకు ధ్యానము మోక్షులకు మోక్షము, ఈతత్వమే. క్షణ, ముహూర్త, దివస, నిశా, పక్ష, మాస, సంవత్సర, ఋతు, యుగాది కాలగణన మాదిత్యుని వలననే. కాలము లేక నియమము లేదు. అగ్ని విహరణ క్రియ లేదు. ఋతు విభాగము లేదు. అపుడు పుష్ప ఫలము లెక్కడ? సస్య నిష్పత్తి యెక్కడిది. తృణౌషధి గణ మెక్కడ ! ఇక్కడ దివంబునను జీవ వ్యవవహారము లేనేలేదు. వారి తస్కరుడైన భాస్కరుని వలననే జగద్వ్యవహారము సాగును. వృష్టి లేక సూర్యుడు తపింపడు నీటిని శోషింప జేయడు. గుడి కట్టడు. ఉదకము ననే వెలుంగును. వసంతమున కపిల వర్ణుడు. గ్రీష్మముస బంగారు రంగువాడు. వర్ష ఋతువున తెల్లని వాడు. శరత్కాలమున పాండు వర్ణము వాడు. హేమంతమున రాగి రంగు గలవాడు. శిశిరమున లోహితుడు (ఎఱ్ఱని వాడు). ఋతు స్వభావ సిద్ధము లయిన రంగులం బట్టి కూడ సూర్యుడు క్షేమము సుభిక్షము సేయువాడు.

సూర్యునకు అదిత్య, సవితృ, సూర్య, మిహిర, అర్క, ప్రభాకర, మార్తాండ, భాస్కర, భాను, చిత్రభాను, దివాకర, రవి, ఇత్యాదిగ పండ్రెండు సామాన్య నామములు. విష్ణు ధాత, భగపూష, మిత్ర, ఇంద్ర, వరుణ, అర్యమ, వివస్వత్‌ అంశుమత్‌, త్వష్ట, పర్జన్య యను నీ పంద్రెండు నామములు విశేష నామములు. విష్ణువు చైత్ర మందు పంట్రెండు వందల కిరణములతో వెలుగును. అర్యముడు వైశాఖ మందు పదమూడు వందల రశ్ములలో దీపించును. వివస్వంతుడు జ్యేష్ఠ మందు పదునాల్గు వందల కరముల తోడను, అంశుమంతుడు ఆషాఢమున పదునేను వందల యంశువుల తోను వర్జన్యుడు శ్రావణ మందు పదునాల్గు వందలును వరుణుడు భాద్రపద మందు నన్నియే కిరణముల చేతను, ఇంద్రుడా శ్వయుజమున పన్నెండవందల కిరణముల లోను ధాత కార్తీక మందు పదునొకండు వందల కిరణముల చేతను మార్గశిరమున మిత్రుడు పై విధముగాను, పౌషముస పూష తొమ్మిది వందల కిరణముల తోను మాఘమున భగుడును ఫాల్గుణమున త్వష్ట పదునొకండు వందల కిరణముల తోను వెలుంగుదురు, ఉత్తరాయణము నుండి సూర్య కిరణములు పెంపొందును. దక్షిణాయనము నుండి తగ్గును. ఇట్లు వేల కొలది కిరణములు గ్రహముల నను సరించి సూర్యుని నుండి వెలుపడి వెలుంగును. సూర్య సామాన్య నామములు. విశేష నామము లును గలిసి యిరువది నాల్గు ప్రసిద్ధములు. ఇవి గాక సూర్య సహస్ర నామములు వేఱుగా నున్నవి.

 ఓ పరమేశ్వరా! ప్రజాపతీ! సహస్ర నామములతో సూర్యుని స్తుతించిన మానవునకు నే పుణ్యం ప్రాప్తించును? ఏ గతి సిద్ధించును? తెలుపుమని యడిగిరి.

మునులార! సూర్య సహస్రనామ పారాయణము వలన నే ఫలము గల్గునో పవిత్రము శుభావహము, గుహ్యములు నైన యా సూర్య నామములను మీకు దెల్పెదను వినుండు.

సూర్యుని యిరువది యొక్క నామములు మూలమున స్పష్టము. ఈ పవిత్ర నామ స్తుతి సూర్యునకు సదా ప్రీతిని గూర్చును.

ఇది శరీరారోగ్యము, ధనవృద్ధి యశస్సును గూర్చును. రెండు సంధ్య లందు నీ స్తుతి పఠించిన పాపము లెల్ల పోవును. ఒకసారి జపించిన త్రికరణ కృతమైన దురితము నశించును. ఒక మారీ నామములచే హోమము సంద్యో పాసనము చేసిన ఆర్ఘ్య మందు బలియందు అన్నదాన మందు స్నానమున నమస్కార మందు ప్రదక్షిణ మందు నీ మహా మంత్రము పఠించిన సర్వపాప క్షయ మగును. శుభ మగును. కావున మీరీ మంత్రము పఠించి వరదుడైన సూర్య దేవుని నుతింపుడు.