బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
201 - అనిరుద్ధ వివాహే రుక్మి వధ నిరూపణమ్
చారుదేష్ణుడు సుదేష్ణుడు చారు దేహుడు సుషేణుడు చారు గుప్తుడు భద్ర చారుడు, చారు బిందుడు (చంద్రుడు), సుచారుడు. అనువారు రుక్మిణి కుమారులు. చారుమతి యనునామె కుమార్తె. కృష్ణునకు మఱి యేడ్వురు భార్యలు కాళింది, మిత్రవింద, సత్య, నాగ్నజితి, జాంబవతి, నిత్యసంతుష్ట యగు రోహిణి, మద్రరాజ కుమార్తె యుత్తమ శీలము గలది యగు శీలమండల. వీరుకాక పదహారు వేల మంది భార్యలు హరికి గలరు. ప్రద్యుమ్నుడు రుక్మి కూతురుని స్వయం వరమున గ్రహించెను. ఆమె అతనిని స్వయంవర మందే స్వీకరించెను. అతనికి నామె యందు “అనిరుద్ధుడ”ను గుమారుడు గల్గెడు. యుద్ధము లందు నిరోధించుటకు శక్యము గాని బల సమృద్ధు డగుట వలన నతనికా పేరు వచ్చెను. వానికి రుక్మి పౌత్రి నిమ్మని కోరెను. అతడును గృష్ణునితో స్పర్థ బెట్టు కొన్నను దౌహిత్రున కిచ్చెను. ఆ వివాహ మందు బలరామాది యాదవులు రుక్మి రాజధాని యగు “భోజకటము”నకు కృష్ణునితో దరలి వెళ్ళిరి.
ప్రద్యుమ్న కుమారుని వివాహ మచటనైన తరువాత కళింగ రాజు మొదలైన వారు రుక్మింగని బలరాముడు పాచిక లాట నెరుగడు. కావున నతనిని జూదము లోనే యోడింతమన రుక్మి యా రాజులం బిలిచి బలగము గూర్చు కొని సభ యందు బలరామునితో జూద మాడెను. ఆ యాటలో రుక్మి వెయ్యి నిష్కముల పందెము గెలిచెను. రెండవ రోజున మఱి వేయి నిష్కములను గెలుచు కొనెను. ఆ మీద పదివేల నిష్కములను బందెము గాసెను.
అత్తఱి కళింగ రాజు బలరాముని జూచి పండ్లు బయలు పడ పరిహాస పూర్వముగ నవ్వెను. అయ్యెడ రుక్మి చెలరేగి బలభద్రుడు జూద మాడుట నెరుగడు. కావున లేని యహంభావముతో నేను యాట గాడనని జూదమునకు సిద్ధపడి నాడని గేలి చేసెను.
హలాయుధుడు పండ్లుపై బడ నిగిలించిన కళింగరాజును బరి హసించుచు పేలిన రుక్మింజూచి కుపితుడై కోటి నిష్కములను బందె మొడ్డి గెలిచెను. రుక్మి పాచికలను విసరిపార వేసెను. బలరాము డట్లు గెలిచి “గెలుపు నాదియని” బిగ్గరగ బలికెను. “గెలుపు నాదని యబద్ధ మాడకు మని” యరచెను. నీవొడ్డిన పందెమునకు నేనా మోదింప లేదు. “ఇట్లు గెలుపు నీదగు నేని నాదెందులకు గాదు” అని రగడ సేయుచుండ
నాకాశవాణి గంభీరముగ బెద్ద పెట్టున మహాత్ముడగు బలరాముని కోపముం బెంచుచు “బలరాముడే గెలిచి నాడు రుక్మి మాట యబద్ధము. ఏమియు బలుకక చేసి నదియే చేసి నట్లగును” అనెను.
అంత బలరాముడు కోపముచే కన్నులెర్ర బడ రుక్మిని కొట్టెను. ఎగిరెగిరి పడుచున్న కళింగ రాజును కూడ బలుడు బలముచే బట్టి, వేనిం దెరచి నవ్వెనో యాపండ్ల నూడ గొట్టెను. మఱియు నా జూద మందిర మందున్న బంగారు స్తంభమును లాగి వాని పక్షమున నున్న రాజులను వైచెను. అంతట సభయంతటను హాహా కారము పుట్టి యా రాజమండల మెల్ల బలాయన మయ్యెను. బలరాముడు కోపోద్రిక్తు డయ్యెను. రుక్మి బలునిచే హతు డగుట విని రుక్మిణికి బలరామునకు జడిసి మధువైరి యేమియు బలుక కుండెను. అవ్వల యదు సంఘము పెండ్లి కుమారుని యనిరుద్ధునిం గొని కేశవుని తోగూడ ద్వారకకు వచ్చెను.
