బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
217 - ధర్మశ్రైష్ఠ్య వర్ణనమ్
మునివరులు యమ మార్గము నరక యాతనలను గురించి విని తిఱిగి వ్యాసుని యీ క్రింది సందేహ మడిగిరి.
భగవంతుడా! సర్వ ధర్మజ్ఞా! సర్వశాస్త్ర విశారద! మానవునకు సహాయులు తండ్రియా తాతయా కొడుకా గురువా! జ్ఞాతులు, బంధు వర్గమా, మిత్రవర్గమా జనులు చని పోయిన వాని శరీరము కట్టెను రాతినట్లు విసరి పార వేయుదురు గాని వాని వెంబడిని బోవు వాడెవ్వడు? అన వ్యాస దేవులు
నరు డొక్కడే పుట్టును ఒక్కడు గానే గిట్టును. ఒక్కడే దుర్గతిని దాటును. ఒక్కతే దుర్గతి నందును. జీవుడు నిస్సహాయుడు. చచ్చిన శరీరమును మీరు అన్నట్లు పారవేసి బంధువులు కొలది సేపేడ్చి వెను దిరిగి పోవుదురు. వారు పారవేసిన యా జీవుని ధర్మ మొక్కటే వెంబడించును. అందుచే ధర్మమన్ని యవస్థ లందు అన్ని లోకము లందు సహాయ మగును గావున నరులు దానిని సేవింప వలయును. లోభ మోహముల వలన జాలి వలన భయము వలన బహు శ్రుతుడు (పండితుడు) కూడ యితరుల కొరకు లోభ వశుడై తప్పిదములు చేయును. బ్రతుకునకు ఫలము ధర్మము అర్థము కామమునను మూడు పురుషార్థములు. ధర్మము తప్పకుండ నీ మూడు ఫలములను బొంది తీర వలెను. అన విని మునులిట్లనిరి.
వ్యాసదేవా! నీవలన పరమ హితమైనది ధర్మ యుక్తము నైన వాక్యము విన్నాము. శరీర సిచయము = శరీర నాశస్థితి నెఱుంగ గోరెదము. మానవుల మృత శరీరము సూక్ష్మమై అవ్యక్త స్థితి నంది కనబడని దైనప్పుడు దానిని ధర్మమెట్లు వెంబ డించును? అన వ్యాసు లిట్లనిరి.
భూమి వాయువు ఆకాశము నీరు జ్యోతి (తేజస్సు) అంతరంగము (మనస్సు) బుద్ధీ యనునవేకీ భావమొంది ధర్మమును జూచును. అన్ని జీవులకు వారు వారు చేయు పను లన్నిటికిని రేయిం బవళ్ళు సాక్షులయి యుండును. వీనితో పాటు ధర్మము జీవుని వెంట నేగును. చర్మము ఎముకలు మాంసము శుక్రము రక్తము ననునిది ప్రాణము పోయిన వెంటనే శరీరమును విడిచి పెట్టును. అందు వలన ధర్మవరు డొక్కడే ఇహమందు పరమందును సుఖ పడువాడు. ఇంకేమి తెలుపుదు నన మునులిట్లనిరి.
మునులు:
మునులు:
ధర్మమెట్లు వెంట బడునో తాము కనుల గట్టినట్లు తెలిపినారు. ఇక రేతస్సు ఎట్లు ప్రవర్తించునో యిదియు పిండోత్పత్తి క్రమమును తెలుపుమని ప్రార్థింప వ్యాసుడిట్లనియె.
ఓ విప్ర శ్రేష్ఠులార! శరీర మందున్న దేవతలు (ఆయా యింద్రి యాధిష్ఠాన దేవతలు) అన్నము నార గింతురు. వారు పృథివ్యప్తేజో వాయ్వాకాశము లను పంచ భూతములు మనస్సు స్వరూపమున నుందురు. ఆ రూపమున పంచ భూతములు మనస్సు తృప్తిపడ గానే పరి శుద్ధమైన రేతస్సు రూపొందును. దాని వలన స్త్రీ పురుష సంయోగమున గర్భ మేర్పడును. ఇదంతయు మీ కెఱింగించితిన నేమి విన వలతురన మునులిట్లనిరి.
ఎముకలు చర్మము మాంసమును విడిచి ఆ జీవాత్మ ఎక్కడ నిలచి సుఖ దుఃఖము లను అనుభవించును. అని ఋషులడుగగా వ్యాసు లిట్లనిరి.
అది పురుషుడై పుట్టి ప్రవర్తించు రీతి తెలుపుమన వ్యాసులు పురుషుడు (జీవుడు) పంచ భూత సమావేశ మంది వానికి లోబడి యుండును. వానితో విడివడి తిరిగి మఱొక గతి కేగును. భూత సంబంధము పొంది ప్రాణ ధారణము చేయును. అప్పుడు జీవ రూపమున నున్న వీడు చేయు పుణ్య పాపములను బంచ భూతములం దంతర్యామి రూపమున నున్న దేవతలు గాంచు చుందురు. మఱి మేమి విననెంతురు? అన మునులిట్లనిరి. చర్మాస్థి మాంసములను విడిచి యా భూతము లన్నింటిని విడిచి జీవుడు తనకు దానై సుఖ దుఃఖముల ననుభవించును గద? యన వ్యాసుడు, జీవుడు కర్మ సంబంధము నంది రేతస్సును బొంది స్త్రీ యొక్క పుష్పమును (ఆర్తవమును)బొంది జనించును. అవ్వల యమ భటుల వలన బాధలను చావును దుఃఖములను సంసార చక్ర పరిభ్రమణమును బొంది నానా క్లేశములకు వశు డగును. ఇహ లోకమున నా ప్రాణి పుట్టినది మొదలు మున్ను దా జేసిన పుణ్యము ధర్మము యొక్క ఫలము నాశ్రయించి సుఖ మనుభవించును. పుట్టిన దాదిగ ధర్మమునే సేవించిన యెడల పురుషుడై నిత్యమును సుఖించును. అనంతరము తాజేసిన యధర్మ ఫలము ననుభవించును. సుఖము తర్వాత దుఃఖముం బొందును. అధర్మ యుక్తుడు యమలోక మేగి మహాదుఃఖ మొంది పశు వక్ష్యాదు లందు పుట్టును. ఏ యే కర్మ మిక్కడ జేసి యేయే యోని యందు మోహ వశుడై పుట్టునో యిపుడు విరముగ వినుండు.
ఈ విషయము శాస్త్రములు ఇతిహాసాదులు వేదము నందును తెలుప బడినది. మర్త్య లోకము ఘోర యమ లోకమునకు విషయమై యున్నది. ఈలోక మందు దేవ తుల్యములు పుణ్యములగు స్థానము లున్నవి. అవి పశు పక్ష్యాది జీవ భావమునకు భిన్నములు. బ్రహ్మ లోకము వంటి దివ్యమైన యమ మందిర మందు జీవుడు కర్మ బద్ధుడై దుఃఖముల నుభవించును. ఏయే స్వరూపమున నేయే కర్మ ఫలమును బురుషు డందునో అయా ఘోరగతులను దెలిపెదను. నాల్గు వేదములు చదివి ద్విజుడు మోహము నొంది పతితుని వలన (కుల భ్రష్ఠుని వలన) పరిగ్రహము సేసి (దానము పట్టి) గాడిదయై పుట్టును. గాడిద పదు నైదేండ్లు బ్రతుకును. గాడిదయై చచ్చి యేడేండ్లు ఎద్దగును. ఎద్దు చచ్చి బ్రహ్మ రాక్షస్సగును. అందు మూడేండ్లుండి బ్రాహ్మణు డగును. కులభ్రష్ఠుని చేత యజ్ఞము సేయించిన వాడు కృమి (పురుగు)గా పుట్టును. అందు పదు నైదేండ్లుండి గాడిద యయి యైదేండ్లు నక్కగా నైదేండ్లు కుక్కగా నొక యేడు నుండి యటుపై మానవు డగును.
ఉపాధ్యాయు నెడ బుద్ధి పూర్వముగ బాపము సేసిన శిష్యుడు మూడు జన్మము లిహ లోకమున సంసార మందు గుములును. అవ్వల కుక్కగును. అటుపై పచ్చి మాంసము తిను జంతువై గాడిదయై చచ్చి నరక మనుభవించి యవ్వల బ్రాహ్మణ జన్మ మెత్తును. ఏ శిష్యుడు గురు పత్నిని మనసు చేతనైన బొందునో వాడధర్మ చిత్త సంస్కారముచే భయంకర సంసార దుఃఖితు డగును. కుక్కగా మూడేండ్లు జీవించి చచ్చి బ్రాహ్మణ జన్మ మెత్తును. గురువు బుద్ధి పూర్వకముగ పుత్రు డట్లున్న శిష్యుని హనన మొనర్చినచో ఘాతుక మృగ మగును. ఏ కొడుకు దల్లిని దండ్రిని యవమానించునో వాడు తొలుత గాడిద యగును. పదేండ్లట్లుండి యొక యేడు కుంభీర మగును. ముసలి తలిదండ్రు లిద్దరు నెవ్వనికి దుష్టులుగ దోచుదురో దారుణమైన యా అపధ్యానము వలన (పొరపాటు తలంపు వలన) వాడు గార్దభ మగును. ఆ విధముగ రెండేడ్లుండి వాడు పిల్లియై యేడు నెలలుండును. తల్లి దండ్రులను గోలపెట్టిన వాడు కోకిల యగును. వారిని గొట్టిన వాడు మూడేండ్లు శాత్వక మగును (డేగ). అటుపై నాఱు మాసములు వ్యాళమై (పామై) యామీద మానవుడు పుట్టును. యజమాని యన్నము గాజేసిన వాడు రాజ ద్వేషుల యన్నము దిన్న వాడు కోతి యగును. పదేండట్లుండి యేడేండ్లెలుక యగును. ఆఱు మాసములు కుక్కయై యవ్వల మానవు డగును. అసూయా గ్రస్తుడు శార్జక మగును. విశ్వాస ఘాతకుడు చేప యగును. ఎనిమిదేండ్ల ట్లుండి నాల్గు నెలలు మృగ మగును. అవ్వల మేక యగును. ఒక్క యేడాదికి జచ్చి కీటక మయి యా మీద మానుష జన్మ మందును. ధాన్యములు యవలు దొంగిలించిన వాడెలుక యగును. అటుపై జచ్చి పందియై రోగముచే జచ్చును. అవ్వల మూగ కుక్కయై యైదేడ్లుండి మానవు డగును. పరదార గమనము చేసినవాడు తోడే లగును. కుక్క నక్క గ్రద్ద పాము కంకము రాబందు కొంగయు నగును. ఏ పాపి సోదరుని భార్యను బలాత్కరించి మగ కోకిల యయి యొక్క యేడుండును. స్నేహితుని యొక్క గురువు యొక్క రాజు యొక్క భార్యను గామించిన వాడు పంది యగును. అయిదేండ్ల ట్లుండి పదేండ్లు కొంగయై మూడు నెలలు చీమయై యొక నెల కీటమై క్రిమియై పదునాల్గు నెలలుండి యవ్వల మనుజు డగును. తొలుత కన్య నిత్తునని వాగ్దానము సేసి మఱొక్కని కిచ్చిన వాడు క్రిమి యగును. పద మూడేండ్లట్లు బ్రతికి పాపము క్షయించి మనజు డగును. దేవ పితృ కార్యములు సేయక వారికి తర్పణము సేయకున్న వాడు కాకియై నూరేండ్లు మీదట కోడి యగును. ఆ మీద నొక నెల పామై నరజన్మ మందును. తండ్రితో సముడైన పెద్ద యన్నను దమ్ముని నెవ్వ డవమానించునో వాడు బెగ్గురు పక్షిగ పదేండ్లుండి జీవక మగును. (చకోర పక్షి) అవ్వల నరుడగును. వృషలుడు (శూద్రుడు) బ్రాహ్మణ స్త్రీని సంగమించి కృమియై పందియై రోగముచే జచ్చును. అటుపై కుక్కయై తుదకు నరు డగును. అపుడు సంతానముం గని చచ్చి ఎలుక యగును. కృతఘ్నుడు (చేసిన మేలు మరచిన వాడు) యమలోక మేగి యమ భటుల క్రౌర్యమునకు గుమిలి కుమిలి వారి దండా ఘాతములకు ముద్గర శూరాగ్ని దండముల దెబ్బలకు గురియై ఘోరమైన అసిపత్ర వనము నందు (కత్తుల బోనున) కూటశాల్మలి యను మిడమిడ గాలు నిసుక మేట లందు నడిపింప బడి ఘోర యాతన లనుభవించి సంసార చక్ర పరిభ్రమణ మంది క్రిమి యగును. పదేనేండ్లట్లుండి యక్కడ కడుపు వచ్చి యటనే చచ్చును. అవ్వల ననేక గర్భముల నంది తుదకు పశు పక్షి జన్మ మందు పెక్కేండ్ల ట్లుండి తాబేలగును. పెరుగు దొంగిలించి కొంగ యగును. పచ్చి చేపలను హరించిన వాడు తేనెటీగ యగును. పండు మూలకము (ముల్లంగి) అప్పము దొంగిలించి చీమ యగును. పాయసము దొంగ తిత్తిరి (తీతువు) పక్షి యగును. పిండితో జేసిన యప్పచ్చి నపహరించి గ్రుడ్లగూబ యగును. మంచినీళ్లు హరించి కాకి యగును. కంచు దొంగిలించి హారితము (పచ్చపిట్ట) యగును. వెండిగిన్నె కాజేసిన పావుర మగును. బంగారు బిందెను హరించి క్రిమి యగును. పట్టుబట్ట దొంగిలి కురరము (టిట్టిభము=తీతువు పక్షి) యగును. పట్టు పురుగులను హరించిన వాడు నర్తకుడు (నటకుడు) అగును. వస్త్ర సామాన్యమును హరించిన వాడు చిలక యగును. నార పట్టు బట్ట హరించి హంస జన్మ మెత్తును. నూలుబట్ట హరించి తీతువు పక్షి యగును. పట్టునూరు ఆవికము గొఱ్ఱ ఉన్నితో నేసిన బట్ట నార చీరను (తెల్ల పట్టుబట్ట) దొంగిలించి కుందేలు (చెవుల పిల్లి) యై పుట్టును. ఎఱ్ఱ వస్త్రముల హరించి చకోర పక్షి యగును. చందనాది సుగంధ వస్తువుల హరించిన వాడు చుంచుగా బుట్టును. ఆ జన్మములో బదియేనేండ్లుండి యా పాపము క్షమింప జేసికొని మానవుడై జనించును. పాలు దొంగిలించిన వాడు బలాక పక్షి (పెద్ద కొక్కెర) యై పుట్టును. నూనె (నువ్వుల నూనె) హరించిన గబ్బిలము (తైలముంద్రావు) జంతు వగును. అర్థము కొఱకు (డబ్బు కొఱకు) చేతిలో నాయుధము లేనివాని సాయుధుడై కొట్టిన వాడు (చంపిన వాడు) గాడిద యగును. ఆ జన్మలో రెండేండ్లు బ్రతికి చివరకు ఆయుధముచే నరక బడును. అట్లు చచ్చి వాడు మృగముగా బుట్టి నిరంతరాం దోళనముతో నుండును. ఒక్క యేడాది తర్వాత వాడాయుదము దెబ్బతిని కూలును. ఆ మీద వాడే వలలో దగుల్కొన్న చేపయై నాల్గవ నెలలో అడవి జంతు వగును. పదేండ్లంట్లుండి పులిజన్మ మెత్తి యైదేడ్లుండి మరణించి అధర్మ క్షయమై మనజు డగును.
వాద్యమును హరించినవాడు గొఱ్ఱె యగును. పిండితో కూడిన అన్నమును దొంగిలించిన వాడు బభ్రుసటువు అను (ముంగి పింగళ వర్ణము గల వేంట్రెకలు గలది) దారుణమైన మూషికముగా బుట్టును. అట్టి మనుజులను నిత్యము గఱచు చుండును. నేతిని హరించిన వాడు నీరు కాకియగును. చేప మాంసము దొంగిలి కాకి యగును. ఉప్పు దొంగిరి చిరి కాక మగును. చెముడు కాకి బొంత కాకి మొదలగు వానిలో రకము. తనపై విశ్వాసము (నమ్మకము) గల్గియున్న వాని మోసగించిన వాడు చేపయై పుట్టి మనుజు డగును. అప్పుడా యుర్దాయు తక్కువ యుండును. నరుడు పాపములు సేసి పశు పక్ష్యాది జన్మము లందును తన తాహతేదో ధర్మమేదో వాడెరుంగ లేడు. అట్టివారు వ్రతదూరులై వ్యాదిగ్రస్తులై దుఃఖితులగు చుందురు. ఒడలిపై బట్ట కూడ లేకుండ మ్లేచ్చులై పావులై లోభమోహాది వశులై పుట్టుదురు. (మ్లేచ్ఛుడు అనార్యుడు గోమాంస భక్షకుడు అప శబ్దములు భాషించు వాడు శిష్టాచార రహిత మగు కామ రూపాది దేశముల నుండు వాడు) పుట్టిననాటి నుండి యెవ్వరు పాపములను విడిచెదరో వారా రోగ్యవంతులు. ఐశ్వర్య వంతులు రూప వంతులు నగుదురు. ఈ చెప్పిన కల్పము ప్రకారము స్త్రీలు కూడ యాయా పాప ఫలము లందుదురు. అట్టి పాపాత్ములకే భార్య లగుదురు. ఇంత వరకు విశేషించి యాయా వస్తువుల దొంగ తనము వలని దోషములు తెలుప బడినవి. ఇది వేశ మాత్రముగ మీకెఱింగించితిని. వాటి యొక కథా సందర్భ మందు ఓద్విజులారా! ఇంకను విశేషముగ విందురు గాక! నేనిది బ్రహ్మ దేవర్షులకు దెలుపు తఱి విన్నది విన్నట్లు మీకు దెలిపితిని. ఇది విని ముని వరులార! మీరు మనస్సును ధర్మము నందు నిలుపుడు.
