బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
235 - యోగాభ్యాస నిరూపణమ్
సంసార దుఃఖ నివార ణౌషధ మగు యోగమును తాము తెలిపినచో దాని యందు పురుషోత్తము డగు అవ్యయుడగు విష్ణుని అనుసంధానము చేయుదుము. అని మహర్షులు కోరగా యోగ వేత్తలలో శ్రేష్ఠుడగు వ్యాసుడు మిగుల సంతోషముతో యోగ ప్రకారమును ఇట్లు చెప్ప నారంభించెను.
ఓ విప్రులారా! సంసార నాశక మగు యోగమును తెలిపెదను. దాని నభ్యసించి యోగియైన వాడు పరమ దుర్లభ మగు మోక్షమును పొంద గలుగును. మొదట యోగ శాస్త్రములను శ్రవణము చేసి భక్తితో గురువును ఆరాధించి యోగ విషయముల నెఱిగి ఇతిహాస పురాణ వేదములతో చెప్పిన విషయములను ఆహార గుణ దోషములను దేశకాల స్థితిగుణ దోషములను తెలిసి కొని పిమ్మట సుఖ దుఃఖాది ద్వంద్వములకు అతీతుడై ఎవరి నుండి ఏదియు ప్రతిగ్రహించుట పై ఆశను మాని యోగము న్యభసింప వలెను. పేల పిండి గంజి మజ్జిగ దుంపలు వేళ్లు పండ్లు రవ్వతో వండిన అన్నము యవ పిండితో చేసిన వంట యోగ సాధనకు పనికి వచ్చు ఆహారము. మనస్సు ఆవేశము చెంది యున్నప్పుడు మనస్సు వికలమై యున్నప్పుడు శ్రమగా అకలిగా ఉన్నప్పుడు చలి ఉష్ణము గాలి భాదించు చున్నప్పుడు ధ్వనులు వినబడు చుండగా నీటి సమీపమున శిథిలమైన గో స్థానములో నాలుగు బాటలు కలిసిన ప్రదేశములో పాములు తిరుగు చోట శ్మశానములో నదుల చివరలలో అగ్ని సమీపమున చైత్యముల గ్రామములలో జనులు సమావేశ మగుటకును దేవతా భావనతో పూజించుటకును నాటిన చెట్ల దగ్గరను, పుట్టల దగ్గరను భయమునకు అవకాశము గల చోట్లను బావుల దగ్గరను ఎండిన ఆకుల కుప్పల దగ్గరను యోగ సాధన ఎప్పుడును చేయరాదు. ఒకవేళ ఇట్టిచోట్ల యోగ సాధనను మూఢుడై చేసిన యెడల చెవుడు బుద్ది మాంద్యము జ్ఞాపక శక్తి లోపము మూగి తనము గ్రుడ్డి తనము జ్వరము కలుగును. అజ్ఞానము సంభవించును. నాలుగు పురుషార్థము లకును దేహమే సాధనము కావున పై విషయములను పాటించి దేహమును రక్షించు కొనుచు యోగ సాధన చేయ వలెను.
ఆశ్రమములో జనులు లేని చోట రహస్య స్థానమున శబ్దము విన బడని చోట నిర్భయము చోట కొండ మీద శూన్య గృహమున శుచి స్థానమున అందమైన చోట ఏకాంత స్థానమున దేవాలయమున రాత్రి యొక్క మొదటి జామున చివరి జామున పగలు ప్రాతః కాలమున మధ్యాహ్నమున యోగ సాధన చేయ తగును. తగిన ఆహారమును మితముగా భుజించుచు ఇంద్రియముల జయించి సుఖమును నిశ్చలమును నై ఎక్కువ ఎత్తును కాని రమ్య మైన ఆసనమున ప్రాజ్ముఖుడై కూర్చుండ వలెను. సత్య వచనుడు శుచి తగినంత నిద్ర కలవాడు క్రోధము జయించిన వాడు సర్వ భూతములకు హితమును కోరు వాడు చలి వేడి మొదలగు అన్ని ద్వంద్వముల సహించు వాడు మనసున నిబ్బరము కలవాడు శరీరము పాదములు శిరస్సు సమముగా నుంచిన వాడు కావలెను. హస్తములను నాభిపై నిలిపి శాంతుడై పద్మాసనమున నుండ వలెను. మౌనియై దృష్టిని ముక్కు కొనపై నిలిపి ప్రాణాయామము చేయవలెను. జ్ఞానేంద్రియముల నైదింటిని మనస్సుతో కూడ హృదయము లోనికి ఉపసంహరించ వలెను. మునియై ప్రణవమును దీర్ఘముగా పూనికతో ఉచ్చరించుచు మిగుల నిశ్చలుడై తమో గుణ వ్యాపారము రజో గుణము చేతను రజో గుణ వ్యాపారమును సత్య గుణము చేతను కప్పి వేసి కన్నులు మూసి కొని నిర్మల శాంత స్థితిలో నుండ వలెను. ఇట్లు హృదయ గుహ యందు దాగిన వాడును సర్వ వ్యాపియు నిరంజనుడును అగు పురుషోత్తముని తన చిత్తమున అనుసంధానము చేయ వలెను. జ్ఞాన కర్మేంద్రియము లను భూతములను మొదట క్షేత్రజ్ఞుడు అగు జీవ చైతన్యము నందును తరువాత ఆ క్షేత్రజ్ఞుని పరమాత్మ తత్త్వము నందును అనుసంధానము చేయ వలెను. సహజ చంచల మగు మనస్సు బాహ్య విషయ సుఖములను వదలి పరమాత్ముని చేరిన వానికి యోగ సిద్ది నిశ్చయముగా కలుగును. చిత్తము విషయముల పైకి పోక బ్రహ్మము నందు లయ మొందినచో యోగ సమాధి ఫలమును సిద్దింప జేయుటచే సాధకుడు పరమ పదమును పొందును. యోగ సాధకుని చిత్తము ఏ కర్మాచరణము నందును ఆసక్తి నొందక ఆనందమును పొంది నప్పుడు యోగ సాధకుడు మోక్ష సిద్ది నొందును. ఏ కోరికలును లేక అన్నిటిని ప్రీతికరమైన వానిని గానే చూచుచు పరతత్త్వము తప్ప మిగిలిన దంతయు అనిత్య మని ఎఱుగనిదే మోక్షము సిద్ధింపదు. యోగ సాధకుడు వైరాగ్యముతో నుండ వలెను. ఇంద్రియ సుఖముల సేవింప రాదు. యోగము నభ్యసింప వలెను. పద్మాసముతో కూర్చుండుట నాసాగ్రమున దృష్టి నిలుపుట మాత్రమున యోగ సిద్ధి కలుగదు. మనస్సు ఇంద్రియములు కలిసి లయము నొందుటయే యోగము. ఓ ముని శ్రేష్ఠులారా! సంసార మోక్ష సాధన మగు యోగ ప్రకారమును తెలిపితిని. మఱి యేమి విన గోరుదురో ఆడుగుడు.
