బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
236 - సాంఖ్య యోగ నిరూపణమ్
ఓ వ్యాస మహామునీ! నీ ముఖమను క్షీర సముద్రము నుండి ఉద్భవిల్లిన వాగ్రూప మగు అమృతమును ఎంత త్రావినను మాకు తృప్తి కలుగుట లేదు. అందుచేత సంసార విముక్తిని కలిగించు యోగమును ఓ పురుషోత్తమా! సాంఖ్యమును గూడ మాకు విస్తరించి చెప్పుము. మాకు వినుటకు కుతూహలము కలుగు చున్నది. ప్రజ్ఞా వంతుడును శ్రోత్రియుడు తన శాఖకు చెందిన వేదమును సంపూర్ణముగా అధ్యయనము చేసిన ద్విజుడు యజ్ఞము లాచరించి ప్రసిద్దుడు, విశేషముగ అన్ని విషయముల నెఱిగిన వాడు అసూయ లేనివాడు సత్య ధర్మముల యందు స్థిర బుద్ది కలవాడు అగు ముముక్షువు తపస్సు బ్రహ్మ చర్యము సర్వ కర్మఫల త్యాగము చేసియు మేధా వంతుడయ్యు ఏ సాధనమున్నచో ముక్తి నందును? యోగము చేతనా? మాకు తెలుపుము. పురుషుడు ఏ యుపాయముచే ఇంద్రియముల కును మనస్సున కును తత్త్వము నందు ఏకాగ్రత సంపాదించ గలగును? వివరింప వలయును. అని ప్రార్ధించిరి. (పురుషు డనగా జీవుడు, మగ వాడని కాదు.)
జ్ఞాన తపస్సులు ఇంద్రియ నిగ్రహము సర్వసంగ పరిత్యాగము లేనిదే ఎవరును సిద్ధి పొందలేరు. స్వయంభూ బ్రహ్మయొక్క మొదటి సృష్టి యగు ఐదు మహా భూతములను జీవుల దేహ సముదాయము నందు ఇమిడి యున్నవి. భూమి నుండి దేహము (దేహము లోని గట్టి అంశ) జలము నుండి ద్రవాంశము అగ్ని నుండి కన్నులు వాయువు నుండి ప్రాణాపానాది వాయువు లైదు ఆకాశము నుండి ఉదరము ఏర్పిడి నవి. జీవుల నడకలో విష్ణువు బలము నందు ఇంద్రుడు ఉందురు. ఉదరమున అగ్ని యుండి అకలి నేర్పరచును. చెవులలో దిక్కులు జిహ్వ యందు సరస్వతి ఉండును. చెవులు చర్మము కన్నులు నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియుములు మరి ఐదు కర్మేంద్రియములు కలిసి ఈ పదియు తమకు ఆహారమునకై శబ్ధ స్పర్శ రూప రస గంధములను ఆయా కర్మేంద్రియ వ్యాపారములను కోరు చుండును. జీవాత్ముడు మనస్సును మనస్సు ఇంద్రియములను ప్రేరణ చేయుటచే ఆయా పది ఇంద్రియ వ్యాపారములను జరుగు చున్నవి. మనీషి, విద్వాంసుడు, మనస్సుతోనే తనలో నున్న ఆత్మను చూచును. ప్రకాశము నొందిన మనస్సుతో తప్ప ఆత్మను ఇంద్రియము లతో దర్శింప అనుభవింప శక్యము కాదు. ఈ దృశ్య ప్రపంచ మంతయు ఆ మహా త్తత్వముతో వ్యాప్తమై యున్నది. స్థిర చర జడ చేతన పదార్థము లన్నింటి యందును ఆతడొక్కడే నిలిచి యున్నాడు.
జీవుడు తనలో సర్వ భూతములును సర్వ భూతములలో తన కంటే అభిన్నుడగు పరమాత్ముని చూడ గలిగినచో బ్రహ్మమే తానగును. దృశ్య ప్రపంచము నందే రూపమున ఎంత యాత్మ కలదో పరమాత్ముని యందును అదే అంతే తత్త్వము కలదని ఎఱిగిన వాడు అమృతత్వమును మోక్షమును పొందును. తాను బ్రహ్మమే యగును. సర్వ భూతములను తానై సర్వ భూతములకు హితుడగు ఆ మహానుభావుడు పాదములు లేకయే సంచరించు వాడు. కాన అతడు నడచు మార్గము ఏదియో దేవతలు కూడ ఎఱుగ జాలరు. ఆకాశమున పక్షుల మార్గము వలె నీటిలో చేపల మార్గము వలె జ్ఞానుల మార్గము ఎవరికిని కనబడదు. అన్ని భూతములను కాలము పరిపాకము నొందించి తనకు లోబరుచు కొనును. కాని కాలమును కూడ పరిపాకము నొందించుచు తన యధీనములో నుంచుకొను పరతత్త్వమును ఎవరో తప్ప ఎఱుగ జాలరు. ఆ పర తత్త్వమునకు మీద, క్రింద, అడ్డముగా, ప్రక్కగా మరల మరల మధ్యలో ఇది యున్నది అని చెప్ప శక్యము కాదు. ఏలయన అంతయు తానే యగు ఏకైక అఖండ పదార్థమది. ఈ లోకము లన్నియు దానయం దున్నవి. అవి అదియే కనుక వానికి వెలుపల ఏదియు లేదు. వింటి త్రాటి నుండి వెడలిన బాణము వలె సూటిగా మనో వేగముతో ఎంత దూరము ఎంత సేపు పరుగుతో పోయినను ఆ మహా తత్త్వము యొక్క కడపటి మేర దొరకదు. దాని కంటె చిన్నది కాని పెద్దది కాని ఏదియు లేదు. ఆ తత్త్వమునకు కాలు సేతులు కన్నులు తలలు నోళ్ళు చెవులు అన్ని వైపులకును కలవు. అది అంతట అన్నిటిని ఆవరించి యున్నది. అది చాల చిన్న వాని కంటె చాల చిన్నది. చాల పెద్ద వాని కంటె చాల పెద్దది. అన్ని భూతముల లోపల ఎప్పుడు ఉండియు అది కనబడ కుండును. ఈ తత్త్వము క్షరము, అక్షరము అని రెండు విధములు. సర్వ భూతముల యందును సర్వ భూతముల రూపము తోను నున్నది క్షరము నశించునది. దివ్యము అమృతము నగు తత్త్వము అక్షరము నశింపనిది. హంస అని వ్యవరింపబడు ఈ పర తత్త్వమును స్థావరములు చరములు కదలని కదల గల సర్వ భూతముల యందును దేహము అనెడి నవ ద్వారములు కల పురమును (రెండు ముక్కలు రెండు చెవులు రెండు కన్నులు నోరు గుదము మర్మాంగము మొత్తము తొమ్మది) నిర్మించుకొని నియమము లతో ఇంద్రియములను తన అధీనములో నుంచుకొని యుండును. ఆయనకు మనకు వలె సంకల్ప వికల్పములు ఉండవు కనుకను అన్ని ప్రాణుల శరీరములను తన అధీనమున నుంచు కొనుట చేతను అతనిని హంస అందురని తత్త్వవేత్తలు చెప్పుదురు. ఇది ప్రపంచ రూపమున నుండుటచే క్షరరూప మైనది. ఈ రూప వికల్పములు లేని అవికారి యైన కూటస్థ రూపము అక్షరము. దానిని ఎఱిగిన వాడు అది తానే యగును. ఇదియే తత్త్వ సారము.
ఓ విప్రులారా! మీరడిగిన తత్త్వ వివేచన రూప మగు సాంఖ్య తత్త్వమును ఉన్న దున్నట్లు తెలిపితిని. ఇక మీదట యోగ ప్రకారమును తెలిపెదను. బుద్ది మనస్సు ఇంద్రియములు ఏకత్వ మొందు నట్లు చేయుచు సర్వవ్యాపి యగు ఆత్మను ఎఱుగు ఉత్తమ జ్ఞానము మనస్సును బాహ్య ఇంద్రియము లను నిగ్రహించు కొని ఆధ్యాత్మ తత్త్వము నెఱుగుట నభ్యసించుచు కామము క్రోధము లోభము భయము స్వప్నము అనెడి ఐదు యోగ దోషము లను విడిచి తనలో తానే అనందమును తృప్తిని పొందుచు పవిత్రము లగు కర్మలు మాత్ర మనుష్టించుచు ఆత్మ తత్త్వము నెఱుగ వలెను. మనో నిగ్రహముచే క్రోధమును సంకల్పములు విడిచి కామమును సత్త్వ గుణము పెంచు కొనుటచే స్వప్నము, నిద్ర, మనస్సు నిబ్బరముచే తిండిపై కామ సుఖముపై వాంఛను కంటితో కాలు సేతులతో చేయు పనులను మనస్సుతో కన్నులను చెవులను పవిత్ర కర్మతో మనస్సును వాక్కును ఏమఱు పాటు లేకుండుటచే, భయమును వివేకవంతులను సేవించుటచే కపట ప్రవృత్తిని ఇట్లీ యోగ దోషములను ప్రయత్నముతో జయింప వచ్చును. ఎప్పుడును అగ్నులను బ్రాహ్మణులను దేవతలను నమస్కరించు చుండవలెను. మనస్సునకు తోచినట్లు ఇతరులను నొప్పించు పొగరు మాటలు పలుక రాదు. సర్వ చరాచర భూతాత్మాకు డగు పరమాత్ముడు స్వయం జ్యోతియై ప్రకాశించు తేజో రూపుడు. ఈ పరమాత్మ రూప మగు తేజస్సు వృద్ది నొందుటకు పాపము నశించుటకు ధ్యానము అధ్యయనము దానము సత్యము బిడియము ఋజు (వంకర గాని) స్వభావము క్షమ శౌచము మనః శుద్ది ఇంద్రియ నిగ్రహము అనునవి సాధనములు. సర్వ భూతముల యందు సమబుద్ది కలిగి యత్నము లేకయే లభించిన దానితో జీవించుచు పాపములు విడిచి తేజస్సు వృద్ది పరచుకొని లఘు ఆహారము తినుచు ఇంద్రియము లను కామ క్రోధములను జయించి ఇంద్రియములను మనస్సును ఏకాగ్రములుగా చేసి రాత్రి మొదటి కడపటి జాములందు పర తత్త్వమున మనస్సు నిలిపి తత్త్వ సాధనము చేయ వలెను. ఏ ఒక్క ఇంద్రియ మైనను కోరికలతో తడిసినచో పర్వతము ప్రక్క నుండు మిట్ట నుండి నీరువలె జీవుని ప్రజ్ఞ పరతత్త్వము నుండి క్రిందికి జారును. కనుక చేపల పట్టువాడు గాలముతో వలె మనస్సుతో శ్రోత్రము చక్షుస్సు జిహ్వ ఘ్రాణము అను క్రమమున జ్ఞానేంద్రియము లను నిగ్రహించి మనస్సున నిలిపి పిమ్మట మనస్సు లోని సంకల్పము లను కూడ అణిచి దానిని హృదయమున నిలుప వలెను. దానిని అత్మ తత్త్వముపై నిలుప వలెను. అప్పుడు పొగ లేని నిప్పువలె మేఘ వరణము లేని సూర్యుడు వలె ఆకాశ మందలి మెఱుపు వలె పరమాత్మ తత్త్వము ప్రకాశించును. అది తన యందు తానై అంతయు తన యందు అంత యందు తానై వ్యాపించి యున్నది. బ్రాహ్మణులు మనుషులు (బ్రహ్మ తత్త్వము నందు శ్రధ్ద గలవారు. మనస్సును దానిపై నిలిపిన వారు అగు మహాత్ములు, మహత్ = గొప్ప, ఆత్మ = మనస్సు కలవారు.) నిబ్బరము కలవారు మహా వివేకంతులు సర్వ భూతముల కును హితము కోరు వారును మాత్రమే ఆ తత్త్వమును దర్శింప గలరు. ఈ చెప్పిన విధమున ఏకాంతము నందు పరిమిత మగు నియత కాలమున కూర్చుండుచు నిశితమైన పవిత్ర కర్మలు మాత్రమే ఆచరించుచు తత్త్వమును అభ్యసించి నచో అక్షర తత్త్వముతో ఏక మగును. (అభ్యసించుట యనగా ఆ పనిలో సిద్ది కలుగు నంత వరకు మరల మరల చేయు చుండుట) ఇతరుల పొగడి నను తిట్టినను నమస్కరించి నను లేకన్నను దానిని మంచిగా గాని చెడుగా గాని తలచక లాభమున సంతోషించక లభించ నపుడు దుఃఖించక అన్ని విషయము లందు సమ దృష్టియై అన్ని భూతముల యందు వాయువు వలె సమాన భారము కలవాడయి ఎడ తెగక ఆరు మాసములకు తక్కవ లేకుండ సాధనము చేసినచో శబ్ద బ్రహ్మా నుభవము కలుగును. ఇది మట్టిగడ్డ, ఇది బంగారము, ఇది గొప్పది, ఇది కాదు అని తలచుచు లోకులు పొందు దుఃఖముల చూచి తాను ఆ భేద బుద్ది వదల వలెను. ఎన్నడును అజ్ఞాన ముచే ఈ అభ్యాస యోగమును విడువ రాదు. అట్లైనచో ఎంత తక్కువ కులమున పుట్టినను స్త్రీకాని పురుషుడు కాని ముక్తిని పొందుదురు. ఓ బ్రహ్మణులారా! మనీషు లైన వారు ఇట్టి మార్గము నను సరంచినచో అజుడు, పురాణుడు, సనాతనుడు, ఇంద్రి యాతీతుడు అగు ఆ వాసుదేవుని దర్శించి ఆ బ్రహ్మ తత్త్వముతో ఒక్కటిగా అగుదురు.
