బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

231 - వ్యాస ముని సంవాదే ద్వాపర యుగాంత కథనమ్‌

ఓ వ్యాస మహామునీ! ప్రళయ కాలము దగ్గరలో నున్నదో దూరములో నున్నదో మాకు తెలియదు. కనుక ఎప్పుడు ద్వాపర యుగము అంతమై కలి యుగము ఆరంభ మగునో ప్రళయము ఎప్పుడు వచ్చునో గుర్తించు విధము తెలిసికొన గోరి ఇటకు వచ్చితిమి. అల్పమగు ధర్మానుష్ఠానము తోనే అధికమగు ధర్మ ఫలము లభించు విధమును ధర్మము నాశము నొందుటచే మహా భయంకర మగు ప్రళయ సమయమును గుర్తించు విధమును ఓ మునీ! మాకు తెలుపుము.

యుగాంత కాలమున రాజులు ప్రజలను రక్షింపకయే పన్నులు గ్రహించుచు తమ్ము తాము రక్షించు కొనుట యందాసక్తి కలిగి యుందురు. క్షత్రియులు కానివారు రాజు లగుదురు. బ్రాహ్మణులు శూద్రుల సేవించి జీవింతురు. శూద్రులు బ్రాహ్మణుల ఆచారములను పాటింతురు. వేద పండితులు కాండపృష్ఠులు వేదములను నిరర్థకముగా మోయువారు అగుదురు. కర్మానుష్ఠానము సరిగా చేయకయే హవిస్సును అగ్నిలో వేల్చెదరు. అన్ని కులముల వారును ఒకే పంక్తితో భుజింతురు. జనులు శిష్టాచారములు లేక ధనము ముఖ్యమని భావించుచు మద్య మాంసముల యందు ప్రీతి కల వారగుదురు. నరాధములై మిత్రుల భార్యల ననుభవింతురు. దొంగలు రాజుల వలెను రాజులు దొంగల వలెను ప్రవర్తింతురు. భృత్యులు తమకు అర్హము కాని దానిని అనుభవింతురు. ధనములకు గౌరవము కలుగును. సత్ర్పవర్తనకు ఆదరము కలుగదు. భ్రష్టుడైన వానిని ఎవరును నిందింపక మెచ్చు కొందురు. పురుషులు వివేక హీనులు జుట్టు ముడివేసి కొనక విడిచిన వారు విరూపులు అగుదురు. పదునా ఱేండ్లలోపు స్త్రీలకే కాన్పు అగును. జనపదము లలో అన్నము అమ్మ బడును. నడి వీథులలో వేదము విక్రయించ బడును. స్త్రీలును మానమును అమ్ము కొందురు. బ్రాహ్మణులు అంత్యజులగు వారితో కలిసి వసించుచు శూద్రుల వలె మాటలాడు చుందురు. శూద్రులు తెల్లని దంతములు కలవారు ఇంద్రియముల జయించిన వారునై తలలు బోడిగా చేసికొని కాషాయ వస్త్రములు ధరించి కపట ధూర్త బుద్ధితో జీవించుచు ధర్మము ప్రవచింతురు. కుక్కలు ఎక్కు వగును. గోవులు తగ్గును. సాధువులును తగ్గి పోవుదురు. గ్రామాంతరముల యందు నివసింప వలసిన వారు గ్రామ మధ్యమునను, గ్రామ మధ్య నుండ వలసినవారు గ్రామాంతమున నివసింతురు. జనులు అందరు సిగ్గు లేని వారయి తత్ఫలముగా నశింతురు. బ్రాహ్మణులు తపోయజ్ఞ ఫలమ్ము కొందురు. ఋతు ధర్మములు తారు మారగును. రెండేండ్ల గిత్తలచే నాగళ్ళు లాగింతురు. వానలు క్రమము ననుసరించి కురియ కుండును.

దొంగల వంశములలో పుట్టిన వారందరును ప్రభువు లగుదురు. దానికి తగిన వారుగానే ప్రజలు నుందురు. తండ్రులకు ఈయ దగినవి అన్నియు ఇతరులకు ఈయ బడును. కుమారులు గాని ఇతర మానవులు గాని తాము తాము ఆచరించ వలసిన ధర్మములను ఆచరింపరు. భూమి ఎక్కువ చవిటి నేల యగును. త్రోవలు అన్నియు దొంగలతో నిండి పోవును. తండ్రి నుండి దాయ భాగముగా వచ్చిన ఆస్తిని కుమారులు పంచు కొనుటలో లోభముతో నిండిన వారై పరస్పరము కలహించు కొనుచు తామే ఎక్కువ హరించుకొన వలెనను ప్రయత్నముతో కూడిన వారై యుందురు. స్త్రీలు తమ సౌకుమార్యము రూపము నశించి పోగా కేశములతో మాత్రమే అలంకారము చేసి కొందురు. పురుషుడు నిర్వీర్యుడై యుండియు అట్టి భార్యలతో సుఖింతురు. భార్యతో సుఖించుటయే పరమ సుఖముగా భావింతురు. జనులు చాల భాగము దుఃశీలము కలవారు అనార్యులు ఐయుందురు. నిరుపయోగముగా రూప సౌందర్యముల పోషించు కొందురు. పురుషులు తగ్గి పోవుదురు. స్త్రీల సంఖ్య అధిక మగును. పైరులలో పంట తక్కు వగును. యాచకు లెక్కు వగుదురు. ఒకరి కొకరు ఇచ్చు కొనుట ఉండదు. రాజ దండనము చోరపీడల వలన బాధ నొంది జనులు నశింతురు. యువకులు కూడ వృద్ధుల వలె అలవాటులు కలవారుగా నుందురు. శీలము లేనివారు సుఖింతురు. వర్షాకాల మందును పరుష మైన గాలులు ఇసుకను వర్షించు చుండును. పర లోకము లేదా ఉన్నదా అని సందేహింతురు. క్షత్త్రియులును వైశ్యుల వలె ధన ధాన్యములపై అధార పడి జీవింతురు. బంధు ప్రీతి తగ్గి పోవును. ఒడంబడికలు శపథములు పని చేయక నశించును. ఋణము తీర్చు విషయములో సద్వ్యవహార ముండదు. సంతోషము నిష్ఫలమై క్రోధము సఫల మగును. అనగా కోపము చేసిన వారికి మనుష్యులు భయ పడుదురే కాని నిదానముగా చెప్పిన మాట వినరు. పాడికే మేకలను గొర్రెలను కట్టివేసి కొందురు. యజ్ఞములు శాస్త్ర విధానము ననుసరింపకయే జరుగు చుండును. నరులు ఎవరికి వారు తామే పండితుల మనుకొనుచు శాస్త్ర ప్రమాణము లతో పనిలేక అయా కార్యము లాచరింతురు. శాస్త్ర విషయములను ప్రవచించు వారుండరు. పెద్దలను సేవించి విషయములను తెలిసి కొనకయే తనకు విషయము తెలిసెనను. ప్రతి వాడును కవియే. నక్షత్రములు సరియైన యోగములతో నుండవు. బ్రాహ్మణులు తమ ధర్మ కర్మములను సరిగా ఆచరింపరు. రాజులు దొంగల వంటి వారగుదురు. బ్రాహ్మణులు మోస గాండ్రు కల్లు త్రాగువారు నగుదురు. అశ్వమేధ యాగము చేయుదురు. యాగము చేయింప తగని వారిచే యజ్ఞముల చేయింతురు. తినరాని దానిని తిందురు. ధనాశాపరు లగుదురు. అందరును ‘‘భోః’‘ అను శబ్దమును ఉచ్చరింతురే కాని ఒక్కడును అధ్యయనము చేయడు. స్త్రీలు గడ్డితో తలలు కప్పికొందురు. నక్షత్రములు కాంతి తగ్గును. దిక్కులు తారు మారగును. సాయం సంధ్యా కాలపు ఎఱుపు దిక్కులు మండు చున్నట్లు కనబడును. కుమారులు తండ్రులకును కోడళ్ళు అత్తలకును పనులు ఆజ్ఞాపింతురు. బ్రాహ్మణులు హోమములు చేయరు. ఏమియు ఇతరులకు మిగుల్చక అంతయు తామే తిందురు. నిద్రించు చున్న భర్తలను మోసగించి స్త్రీలు మఱియొక చోటికి పోవుదురు. స్త్రీలు రోగులు గాను రూపహీనులు గాను ప్రయత్న పరులు గాను తన తప్పులు గుర్తించు వారు గాను నుండు భర్తలను పొందరు. ఉపకారికి ఎవరును ప్రత్యుపకారము కూడ చేయరు.

ఇట్లు యుగాంతమున ధర్మము లోపింపగా మనుష్యులు కష్టములు పొందుచు ఏ ఆహార విహారములు కలిగి ఏ కర్మ లాచరించుచు ఏ కోరికలు కోరుచు ఎంత ప్రమాణము (ఎత్తు కొలతలు) ఎంత ఆయువు కలవారై కాలము గడుపుచు మరల కృత యుగమును అందు కొందురు ? అని మునులు వ్యాసులు నడిగిరి.

అటు మీదట క్రమముగా ధర్మము భ్రష్టమై పోగా ప్రజలు సద్గుణ హీను లగుదురు. శీలము నశించును. ఆయువు క్షీణ మగును. బలము తగ్గును. దానిచే దేహము వన్నె తఱుగును. దానిచే వ్యాధుల బాధ కలుగును. దానిచే వైరాగ్యము కలుగును. దానిచే ఆత్మజ్ఞాన సిద్ధికై ప్రయత్నించి దానిని పొంది మఱల జనుల ధర్మశీలు రగుదురు. ఇట్లు మరల ఉన్నత స్థితికి పోయి పోయి కృతయుగమును అందు కొనెదరు. అంతకు లోగా మాత్రము కొందఱు నామ మాత్రమునకు ధర్మ శీలము కలవారు కొందఱు ధర్మము తెలిసియు పట్టించు కొనని తటస్థులు కొందఱు అల్పముగా ధర్మ శీలము కలవారు కొందఱు వేడుకకు మాత్రము ధర్మమును అనుష్ఠించు వారు అగుదురు. ప్రత్యక్షముగా ఇంద్రియములకు గోచరించు నదే ప్రమాణమని కొందఱు అనుమానము హేతువుచే నిర్ణయించినది కూడ ప్రమాణ మేయని మఱి కొందరు ఏ ప్రమాణముతోను పనిలేదు మఱి కొందరు వాదింతురు. నాస్తికత్వమును పూనువారు ధర్మమును లోపింప జేయువారు అగుదురు. బ్రాహ్మణులను తామే పండితులమను అహంకారముతో నుందురు. అప్పటికి పని జరుగు విషయముల మీద మాత్రము శ్రద్ధకల వారై శాస్త్ర జ్ఞానము లేక దాంభికులై పరమార్థత త్త్వజ్ఞానము లేకుందురు. ఇట్లు ధర్మము నశించగా జనులు మరల శ్రేష్ఠులగు పెద్దలను ముందు పెట్టుకొని దాన గుణము సుశీలము కలవారై శుభము కలిగించు కర్మలను ఆచరింతురు. జనులు సిగ్గులేక సర్వము భక్షింతురు. తమకై అన్నియు దాచు కొందురు. నిర్దయు లగుదురు. జ్ఞానము సాధించుట యందు నిష్ఠ ఉండదు. అట్టి స్థితిలో జ్ఞాన నిష్ఠ కలవారు మాత్రము అల్పకాల తపము తోనే సిద్ది పొందుదురు. యుగాంతమున తక్కువ కులముల వారు బ్రాహ్మణుల ప్రవర్తనమును వహింతురు. మహా యుద్ధములు మహా వర్షములు పెను గాలులు తీవ్రమగు ఎండలు సంభవించును. రాజులు కర్మవాదులు అయి భూమిని రాజ్యమును అనుభవింతురు. రాక్షసులు బ్రాహ్మణులై జన్మింతురు. వారు స్వాధ్యాయము వషట్కారములు మొదలగు యజ్ఞ వాక్కులు లేక జనులను చెడు మార్గములలో నడపుచు దురభిమానులై సర్వము భక్షించుచు వ్యర్థముగా కపటమునకు మాత్రము కర్మానుష్ఠానము చేయుదురు. వారు మూర్ఖులు ధన ప్రధానులు లోభులు క్షుద్రులు క్షుద్రులను పరివార జనముగా పెట్టుకొనిన వారు శాశ్వత మగు ధర్మమును వదలి లోక వ్యవహారము నకై పాటు పడువారు అగుదురు. పర ధనముల హరింతురు. పరదారలను ఆశింతురు. కామముతో దురాత్ములై కపటులై సాహసము మీద ఇష్టము కలవారై ఉందురు. బ్రాహ్మణులు ఇట్లు కాగా మునులు అనేక లక్షణము లతో ఉందురు. జనులలో జరుగ రాని చెడుగులు జరుగును. ప్రధాన పురుషులుగా ఏర్పడిన వ్యక్తులను గూర్చిన కథలకు ప్రాముఖ్య మిచ్చి అట్టి వారిని పూజించు చుందురు. జనులు పంటలు పైరులు వస్త్రములు భక్ష్య భోజ్యములు వస్తువులు దాచుకొను డబ్బీలు దొంగిలించు వారగుదురు. దొంగల ధనము హరించు దొంగలు వధించు వారిని కూడ వధించు క్రూరులు అగుదురు. ఇట్లు దొంగలు ప్రాణివధ చేయు వారు నశించిపోగా ప్రజలకు క్షేమము కలుగును. ఇట్లు లోకము నిఃసారమై క్షోభము చెందగా ఏమియు చేయలేక పన్నుల బరువు మోయలేక జనులు అడవులకు పారి పోవుదురు. యజ్ఞ కర్మలు లోపించుటచే జనులకు రాక్షసుల క్రూర మృగముల కీటక మూషిక సర్పముల వలన భయమెక్కు వగును. ప్రజలలో క్షేమము సుభిక్షము ఆరోగ్యము బంధు సమృద్ధి ఉండ వలెనను ఉద్దేశము కలవారె వరైన నున్నచో అట్టివారు నర శ్రేష్ఠులని భావించ వలసిన కాలము వచ్చును. ఇట్టి స్థితిలో జనులు నిఃసారులై తమ వారితో కూడ స్వదేశములు విడిచి పోవుదురు.

జనులంతట కుమారులను వెంట తీసికొని భయముతో పారి పోవుచు కౌశికీ నదిని (హిమాలయ సమీపమున) దాటి ఆకలితో బాధ పడుచు అంగవంగ కశింగ కాశ్మీర కోసల దేశములను కొండ లోయలను హిమ వత్పర్వత ప్రాంతమును సముద్ర తీరము నంతటిని ఆశ్రయించి నివసించుచు తమకు తామే శ్రమించి సంపాదించు కొనిన ఎండుటాకులు తినుచు చర్మములు చెట్ల నారలు ధరించుచు జీవింతురు. భూమి శూన్యమును కాక అడవియును కాక యుండును. ప్రభువులు ప్రజల రక్షింపని వారగుదురు. మానవులు మృగములను చేపలను పక్షులను క్రూర మృగములను పాములను పురుగులను తేనెను ఆకు కూరలను పండ్లను దుంపలను వేళ్ళను ఎండు టాకులను తిని జీవింతురు. తమ వంశము వారిపై కూడ స్నేహ భావము లేక కర్రలతో చేసిన శంకువులతో కొట్లాడు కొనుచు మేకలను గొర్రెలను గాడిదలను ఒంటెలను పశువులుగా పోషించు కొను చుందురు. నదీ తీరములను ఆశ్రయించి నివసించుచు నీటికై నదీ జల ప్రవాహములను అడ్డు కట్టలతో అడ్డగింతురు. జుట్టు మొలచినది మొలిచి నట్లు లోపల మురికితో నిండి పెరుగు చుండ అట్లే వదలుదురు. కొందఱికి సంతానము అధికము. కొందఱికి సంతానమే కలుగదు. కుల శీలము లుండవు. వండిన ఆహార పదార్థములు అమ్ముచు కొనుచు వానితో వ్యాపారము చేయుదురు. ప్రజలు హీనులై హీన ధర్మమును అనుసరింతురు. విషయ సుఖములకు పాల్పడి దుర్బలులు రోగులునై ఇంద్రియములు క్షీణములై జరా శోకములచే బాధ నొందుదురు. ఆయువు తగ్గునని భయము కలుగగా చివరకు ఇంద్రియ సుఖముల నుండి వెనుకకు మరలుదురు. లోక వ్యవహారము చేతకాక పోవుటచే వైరాగ్యము కలిగి సత్పురుషుల దర్శించి సేవించ వలెనను కోరిక కలుగును. సత్యముపై శ్రద్ధ కలుగును. పెద్దల ఆజ్ఞను పాటించి సద్గుణముల వైపునకు మరలుట చేత ధర్మమే మంచిదని తోచి దాని ననుష్ఠింతురు. కోరికలు తీరుటకు అవకాశము లేక పోవుటచే ధర్మశీలులు లగుదురు సుఖ క్షయముచే బాధనొంది చిత్తసంస్కారము సంపాదింతురు. ప్రాణులపై దయ కలుగును. ఇట్లు పాదపాద క్రమమున మరల ధర్మము వృద్ధి యగుట కారంభమగును. ఇట్లు మరల జనులు కృత యుగము లోనిక వత్తురు. కాలము ఎప్పుడును ఒక్కటియే. కలి యుగమున ధర్మక్షయము కృత యుగమున ధర్మవృద్ధి ఇదే భేదము. చంద్రు డొక్కడే రాహువు కప్పినచో మలినుడై విడిచి నపుడు ప్రకాశించును కదా! కలి యుగమున పర బ్రహ్మతత్త్వము అర్థ వాదముగా పొగుడుటకు చెప్పిన గొప్ప మాటగా భావింతురు. కృత యుగములో ఆ పర బ్రహ్మమును వేదముచే తెలియ దగిన వస్తువుగా గ్రహింతురు. ఆ తత్త్వము కలిలో తెలియ రానిదై వివేచింప రానిదై శత్రు భావముతో చూడ బడును. కలిలో తపస్సు అనునది ఇష్ఠముతో వేడుకకు చేయు పనిగా ఉండును. కృత యుగములో అదే తపస్సు గౌరవించ బడును. ఇదే రెంటికి భేదము. సద్గుణము లున్నచో కర్మ లనుష్ఠించ గలరు. కర్మలు అనుష్ఠించినచో గుణములు సంస్కారము నొంది శుద్ధము లగును. ఆయా యుగము లందలి పురుషుని యోగ్యతను బట్టి దేశ కాలాను సారముగా వారివారి కోరికలును ఆచరణములు నుండునని ఋషులు చెప్పిరి. యుగ యుగమునను పురుషుని యోగ్యతా నుసారమే ధర్మార్ధ కామ మోక్ష సాధనకై కర్మా నుష్ఠానము దేవతల అనుగ్రహము శుభములు పుణ్యములు నగు కోరికలు జనులకు కలుగును. ఇట్లు యుగముల పరివర్తన ములు విధి చేసిన సృష్టి స్వభావము ననుసరించి అనాది నుండియు ప్రవర్తిల్లు చున్నవి. ముందును ఇట్లే ప్రవర్తిల్లు చుండును. ఈ జీవ లోకము కూడ యుగ స్వభావము ననుసరించి క్షయమును వృద్ధిని పొందుచు మార్పుల నొందు చుండునే కాని ఒక్క క్షణము కూడ మార్పులేక నిలుకడగా నుండదు.