బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
30 - ఆదిత్య మహాత్మ్యమ్
సూర్య భగవానుని మహిమ నీవు చెప్పగా విన్నాము. ఇంకను విన కుతూహల మగుచున్నది. బ్రహ్మచర్యా శ్రమస్థులు ముక్తి నందుటకే దేవత నుపాసింప వలయును. స్వర్గము నుండి దిగజార కుండుట కేమిచేయ వలయును? దేవతలకు బితృ దేవతలకు పరమ దేవత ఎవరు? ఈ సృష్టి ఎవని వలన నగును? ఎవ్వని యందు లీన మగును. తెలుప వలయును.
ఓ ద్విజో త్తములారా! ఈ యాదిత్యు డుదయించుచునే తన కరంబులచే జీకటిని హరింప జేయును. ఇంత కంటే మరి దైవ మెవ్వరు? ఈ పురుషుడు మొదలు తుద లేనివాడు శాశ్వతుడు. అవ్యయుడు. ముల్లోకముల దన కిరణముల వెలిగించు చుండును. సర్వ దేవ మయుడు సర్వ జగన్నాధుడు సర్వసాక్షి జగత్పతి సర్వ భూతముల సృజించును. పెంచును. సంక్షేపించును. ఈయనయే వేడిమి నిచ్చును. వర్షించును, ధాత, విధాత, భూతాది భూత భావనుడు ఈయనకు క్షయము లేదు. అన్ని వేళల నక్షయ మండలుడు పితరులకు పిత. దేవతలకు దేవత. ఈయనది ధ్రువ స్థానము. ఇందుండి మరలడు. ఆదిత్యుని నుండి జగత్తు పుట్టును. అందు లయించును. యోగులు కళేబరము వీడి వాయు రూపమంది తేజోరాశి యైన దివాకరుని యందు ప్రవేశింతురు. ఈయన వేలకొలది కిరణముల నాశ్రయించి పక్షలు తరుశాఖల నాశ్రయించి యున్నట్లు, సిద్ధులు, దేవతలు నీయన యందు వసింతురు. యోగులు గృహస్థులైన జనకాది రాజర్షులు వాల ఖల్యాదులు, బ్రహ్మ వాదులైన మహర్షులు వ్యాసాదులు వాన ప్రస్థులు భిక్షువులు యోగముం బూని సూర్య మండలమున బ్రవేశింతురు. వ్యాస కుమారుడు శ్రీ శుకుడు యోగ ధర్మమూని యాదిత్య కిరణముల జొచ్చి పునరావృత్తి లేని పదమంది యున్నాడు.
బ్రహ్మ విష్ణు శివాది దేవతలు శబ్దమాత్ర శ్రుతి గమ్యులు. ఈయనయే ప్రత్యక్ష పరదేవత. తమో హరుడు. విష్ణుముఖ దేవతా వర్గము కంటికి గానరారు. ఈయన ప్రత్యక్ష నారాయణుడు. ఈయనయే తల్లి తండ్రి గురువు అనాది రశ్మిమాలి జగత్పతి మిత్రుడు నిత్యుడు ఆక్షయుడు. ఈయన సాగర ద్వీపములను పదునాల్గు భువనములను సృజించి చంద్ర నదీ తీరమున నున్నడు. సహస్రాంశువై యవ్వక్తు డయ్యు ద్వాదశ మూర్తలచే వ్యక్తుడే ప్రత్యక్ష నారాయణుడై యాదిత్య స్థానమున వెలుంగు చున్నాడు.
ఇంద్రుడు. ధాత, పర్లన్యుడు, త్వష్ట, పూష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, ఆంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు అను నీ పండ్రెండు మూర్తులచే నీ పరమాత్మ సర్వ జగమ్ములు వ్యాపించి యున్నాడు. దేవశత్రు నాశిని యైన మూర్తి ఇంద్ర రూపమున దేవ రాజ్యనుందున్నది మొదటిది. రెండవది ప్రజాపతి రూపమున సృష్టి గావించునది. మూడవది మేఘము లందు వర్షించునది. నాల్గవది వనస్పతు లందు నోషథు లందున్నది. ఐదవ మూర్తి పూష అన్న గతమై ప్రజల పోషించును. అఱవ మూర్తి ఆర్యమా రూపమై దేవత లందున్నది. సప్తమ మూర్తి భగనామమున దేహుల దేహము లందు, సంపద లందు నున్నది. ఎనిమిదవది వివస్వాన్ అగ్నిగా నుండి జీవుల యాహారమున పచనము చేయు చున్నది. తొమ్మిదవది “విష్ణువు” అను మూర్తి. దేవశత్రు సంహారమునకు ప్రపర్తించును. పదవ మూర్తి వాయువు నందుండి జీవులకు సుఖ స్పర్శ నొసంగి యానంద పెట్టును. పదు నొకండవ మూర్తి వరుణ నామకము, జలము లందుండి ప్రజాపుష్టి కూర్చును. పదిరెండవ మూర్తి మిత్ర సంజ్ఞకము. లోక హితమునకై చంద్ర నదీ తీర మందున్నది. ప్రభాకరుడీ మూర్తితో వాయుభక్షణ సేయుచు మైత్రీ ప్రయుక్తమైన చూపుతో వరము లిచ్చి భక్తా నుగ్రహము చేయుచు చంద్ర నదీతట మందు తపము చేయు చుండును. కావున నతడు మిత్రుడను బిరుదు నామ మందెనని స్మృతులు తెలపు చున్నవి. ఇట్లు ద్వాదశ మూర్తియగు పరమాత్మ స్థావర జంగమముల కెల్ల ఆత్మ రూపుడైన సూర్య భగవానుడై ధ్యానమునకు లక్ష్యమై నమస్యుడు. ఈ ద్వాద శాదిత్యులను గూర్చి నిత్యము నమస్కరించుచు పఠించుచు వినువారు సూర్యలోక ముందు వెలు గొందుదురు.
సూర్యుడు సనాతనుడగు నాది దేవుడైనచో ప్రాకృత జనుని వలె వరములగోలి తప మెందులకు చేసెను.
ఇది మిక్కిలి రహస్య విషయము. నారదుడు సూర్యు నడగిన విషయమిది. ఇంతకు మున్ను సూర్య భగవానునుని పండ్రెండు మూర్తల గురించి చెప్పితిని. అందు మిత్రుడు. వరుణుడు అనువారు తపస్సు నందుండిరి. అందు జలాహారియై వరుణడు పశ్చిమ సముద్రము నందును, మిత్రుడు వాయు భక్షకుడై యీ వనమందు నున్నారు. ఈ మిత్రుడు మేరు శిఖరము నుండి గంధ మాదనము నుండి జారెను. మహాయోగి యైన నారదుడు మిత్రుని దగ్గరకు వచ్చెను. తపస్సు చేయు చున్న యాయనను జూచి చాల వేడుక పడెను. ఆవ్యయము వ్యక్తావ్యక్తము త్రిలోక ధారకము సర్వ దేవతా పరాయణము సర్వ జనకము నైన మిత్ర మూర్తి మఱి యే దేవతలను పితృ దేవతల నుద్దేశించి మనస్సుచేత ధ్యానించుచు యజించు చున్నాడు.” అని ఆలోచించి యాయనతో నిట్లనియె.
సాంగో పాంగములైన వేదము లందు నీవు గానము సేయ బడుదువు. భూత భవద్భవ్య మయిన యీ దృశ్యమెల్ల కేవల ద్రష్టవైన నీ యందు నిలుపు నందును. గృహస్థాద్యా శ్రమస్థులు నల్గురు నిన్నే పూజింతురు. నీవు సర్వ జగజ్జన కుడవు జననివి యున, దైవమును, నీవు నీకు పితయైన మఱియే దేవతను యజింతువో మేమెఱుంగము.
నీ వడిగిన ప్రశ్న పరమ గుహ్యము. తెలుప రానిది. నీవు భక్తుడ వని తెలుపు చున్నాను. సూక్ష్మము అవ్యక్తము అచలము ధ్రువము ననబడు నాది వస్తువేది గలదో యది భూతేంద్రీయ వివర్జితము. సర్వ భూతాంతరాత్మ క్షేత్రజ్ఞు డనంబడును. త్రిగుణా తీతము. పురుష శబ్ద వాచ్యము. హిరణ్య గర్భ నామక మదియే బుద్ధియని చెప్ప బడును. మహత్తు ప్రధాన మనియు యోగ సాంఖ్యము లందు పెక్కు పేరుల పిలువ బడును. ఆ వస్తువు త్రిరూపము. ఈశ్వరు డనియు, అక్షర మనియు పేర్కొన బడినది. అది ఏక రూపమై యీ త్రిలోకము ధరించును. శరీరులందశరీరుడై యుండును. కర్మలేప మతనికి లేదు, అంతరాత్మ యన నది, సర్వసాక్షి. ఈ తత్త్వము సగుణము, నిర్గుణము, విశ్వరూపము, జ్ఞాన గమ్యము. సర్వతః పాణిపాదము. సర్వతోక్షి శిరోముఖము. సర్వత శ్రుతి మంతము. సర్వ మావరించి యున్నది. విశ్వమూర్ధము విశ్వభుజము విశ్వపాదాక్షి నాసికము. క్షేత్ర మందు (దేహ మందు) స్వేచ్ఛా సంచారియై యొక్కడుగా నుండును, తానున్న ఉపాధుల నెఱుంగు వాడు గావున క్షేత్రజ్ఞుడనం బడును. అవ్యక్త మయిన పురమందు శయించును. కావున పురుషడనం బడును. విశ్వము బహు విధము. అది యాయనయే కావున విశ్వ రూపుడన నగును. ఆయన యొక్కనికే మహత్త్వ ముండుటచే మహా పురుష వాచ్యుడతడు. ఆకాశము నుండి పడిన నీరు భూమి యొక్క రుచిని బట్టి రుచి భేధమంది నట్లు గుణ భేదమును బట్టి యతడు పలు విధ రూపములం గాన వచ్చును. ఒక్కటే వాయువు దేహ మందయిదు తీరులుగ నున్నట్లాయన యొక్కడే నానారూపు డగును. అగ్ని స్థాన భేధముం బట్టి పలు రీతులం గనవచ్చి పలు నామము లందినట్లు ఆయనయు నుపాధి నిమిత్తముగా నానాత్వ మందును. ఒక్క దీపము నుండి పలు దీపములు ముట్టింప బడి వెల్లి నట్లొక్క డయ్యు నాత డనేక రూపములం గన్పించి వెలుగును. తన్ను తానెరిగిన తరి నతడు కేవలుం డగును. ఏకత్వ ప్రళయము నందు బహుత్వము నొందును. నిత్యుడత డొక్కడే. అతని వలన త్రిగుణ రూప మవ్యక్తము పొడమి నది. వ్యక్తావ్యక్త భావస్థ యగు దానినే ప్రకృతి యందురు. అది బ్రహ్మకు కారణము. బ్రహ్మ సదస దాత్మకుడు. దేవపితృ కర్మము లందితడే పూజింప బడువాడు. అతడు, తండ్రి, దేవుడు, ఆత్మచే దెలియ దగిన వాడు. అతనినే నేను బూజించు చున్నాను. నానా రూపముల నానా దేవతల నర్చించు నందరి పూజలు నాత నొక్కనే చెందును. అయన సర్వగతి. ఆయనయే సూర్యుడును. కావున దివాకరుని నామ రూపమునే నేనా రాధింతును. ఏకత్వ విశ్వాసము గల వారేకైక మైన యా పర తత్వమునే యందుదురు. ఇది గుహ్యాతి గుహ్యమైన యంశము.
ఇట్లు మున్ను నారదునికి సూర్యుడు తెలిపెను. మీకిది తేట తెల్లం బొనరించితి. ఆదిత్య భక్తి లేని వానికిది తెలుప రాదు. ఇది చదివిన విన్న నరులు సహస్ర కిరణు సాలోక్య మందెందరు, సర్వదుఃఖ హరమిది. అభీష్ట సిధ్ధిదము. సూర్య భగవానుని మీరెల్లప్పుడు స్మరింపుడు. ఆయనయే ధాత విధాత సర్వ జగత్ప్రభువు.
