బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
22 - నరకవర్ణనమ్
ఓ విప్రులారా! పాపాత్ములు పడ వేయబడు రౌరవాది నరకము లనుగూర్చి యిక వినుడు.
రౌరవము, శౌకరం, రోధము తాలము, విశసనము, మహాజ్వాల, తప్తకుడ్యము మహాలోభము, వియోచనము రుధిఠాంధము, వసాతప్తము, కృమీశము, కృమి భోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షము, పూయ వహము, వహ్నిజ్వాలం, అధశ్శిరము, సదంశము, కృష్ణసూత్రము, తమస్సు, ఆవీచి, శ్వభోజనము, అప్రతిష్టము మావీచి అనునవి. పరమ దారుణము లైన మరి పెక్కు నరకములు గలవు. ఇవి యముని పరిపాలన దేశములు శస్త్ర, అగ్ని, విషములం బ్రయోగించు యమ భటులు పాప కర్మాసక్తి గల వారు వీని యందుందురు.
దొంగ సాక్ష్య మిచ్చిన వాడు, పక్షపాత బుద్ధితో మాట్లాడు వాడు, అబద్ధము చెప్పు వాడు రౌరవమున కేగును. భ్రూణ హత్య నగర ధ్వంసము గోహత్య చేసిన వాడు జీవుల యూపిరి యాడకుండ చేసిన వాడు భయంకర రౌరమున కేగుదురు. బ్రహ్మ హత్యా కారకుడు బంగారమును దొంగిలించిన వాడు వాని స్నేహితుడు శూకర నరకమున బడుదురు. క్షత్రియ వైశ్య ఘాతకురు, గురు పత్నిని, అప్ప చెల్లెండ్రను గూడిన వాడు రాజ భటుని హత్య చేసిన వాడు తప్త కుంభమను నరకమున గూలును. మద్య విక్రేత వధ్య పాలుడు ఉరి తీయు స్థానమును గాయువాడు (లేక) వధింప దగిన వానినిగా పాడిన వాడు కేసర విక్రేత (విష మమ్మువాడు.) భక్తుని విడిచిన వాడు తప్త లోహమను నరకమున గూలుదురు.
కూతురును కోడలిని సంగ మించిన వాడు, మహా జ్వాలమను నరకమున పడవేయ బడును. వేద దూషకుడు. వేద విక్రయి అగమ్యగామి, శబలమును నరకము పాలగును. దొంగ హద్దు మీరిన వాడును విమోహ నరకమున బడును. దైవ బ్రాహ్మణ పితృ ద్వేషియు రత్నములను (శ్రేష్ఠ వన్తువులను) దూషించిన వాడు కృమి భక్ష్వమును నరకమును పొందును. దుర్యాగము చేసిన వాడు కృమీ శమును నరకము పాలగును. పితృ దేవతా తిధులను విడిచి కుడిచిన వాడు లాలా (చొంగ) భక్ష్యమను నరకమున బడును. బాణములను చేయు వాడు వేధక నరకమున బడును, ఖడ్గాదులను చేయు వాడును, కర్ణికారుడు, (కర్ణి + ఒక విధమైన యాయుధము) పరమ దారుణమైన విశసన మను నరకమున పడుదురు. అపాత్ర దానము పట్టిన వాడు అయాజ్య యాజనము చేయ కూడని వానిచే యజ్ఞము చేయించిన వాడు నక్షత్ర సూచకుడు జ్యోతిష శాస్త్రము వెలియకయే జాతక ముహూర్త ములు చెప్పువాడు అధో ముఖ నరకము నందును అతిథికి పెట్టక మృష్టాన్న మారగించు వాడు కృమిపూయ నరకమున కేగును. లాక్ష = లక్క, మాంసము, రనములు, మధుర పానీయములు, నువ్వులు, ఉప్పు అనువాని నమ్ము బ్రాహ్మణుడు కూడ కృమిఫూయ నరకమున పడును. పల్లి, కోడి, మేక, కుక్క, పంది పఱులు వీనిని పెంచు వానికీని అదేగతి. రంగోపజీవి నాటకాము లందు నటించి జీవించు వాడు జాలరి కుండాశి భగ భక్షకుడు (వీర్య పానము చేయు వాడు) లేక జూరజుని అగ్రము నుతించు వాడు, విషము పెట్టువాడు, సూచి చాడీకోరు, పేచీకోరు మూహిషకుడు, దున్న పోతుల వ్యాపారి, పర్వము లందు స్త్రీ సంయోగము సేసిన బ్రాహ్మణుడు, కొంప లంటించు వాడు, మిత్ర ఘాతకుడు, శకునములు చెప్పు వాడు, గ్రామ పాచకుడు, సోమ విక్రయ రుధిరాంధ కూపమున పడుదురు. తేనె పుట్టలను రేపిన వాడు గ్రామ నాశనము చేసిన వాడు వైతరిణిం బడును.
రేతః పానము చేసిన వాడు, మర్యాదో ల్లంఘనము చేసిన వాడు (సదాచారములను కట్టు బాట్లను దప్పిన వాడు) మాయా జీవనులు, ఆచార హీనులు, కృచ్ర్ఛ నరకమున బడుదురు. జౌర భ్రికులు (గొఱ్ఱల మందచే జీవించు వారు.) మృగ వ్యాధులు వహ్ని జ్వాలమను నరకమునం బడుదురు. అపాక మలందు ((వండ గూడని వస్తవులకు))అగ్నిని పెట్టిన వాడు అదే నరకమునం బడును. వ్రత లోపము ఆశ్రమ ధర్మచ్యుతి చేసిన వాడు సందంశ యాతనమను నరకమున బడును. దివాస్వాపకా లయిన బ్రహ్మచారులు, కొడుకుల దగ్గర యధ్యయనము చేసిన వారు శ్వభోజన మను నరకమున బడుదురు. ఇట్టివి నూర్ల కొలది వేల కొలది నరకములు కలవు. పాపములను చేసిన వారు ఈ బొంది విడిచి యాతనా శరీరముల నొంది యిందు హిసింప బడుదురు. వర్ణా శ్రమ విరుద్గ మైన కర్మను త్రికరణము లచే చేసిన వారు నరకము పాలగుదురు. ద్యులోక మందలి దేవతలు, తల క్రిందులుగా నుండు నరకలోక జీవులచే చూడబడు చుందురు. దేవతలు నరక లోక వాసులను అథో ముఖులుగా జూచు చుందురు. జీవులు స్థావరములు, కృములు, జల జంతువులు, పక్షులు పశువులు, నరులు, ధార్మికులు, దేవతలు నను వరుసలో జన్మించి క్రమ ముక్తి నందుదురు.
స్వర్గ మందెందరు జీవు లుందురో నరక మందు నందరుందురు పాపము చేసి ప్రాయశ్చిత్తము చేసి కొనని వాడు నరక మేగును. ఆయా పాపముల కను రూపము లైన ప్రాయశ్చిత్తములను పరమర్షులు స్మరించి (స్మృతులలో) పెద్ద పాపమునకు పెద్దగ చిన్న దానికి చిన్నగా ప్రాయశ్చిత్తములను దెల్పిరి. స్వాయంభువ మనువు మొదలయిన వారా ప్రాయశ్చిత్త కాండను రచించిరి. అన్నిటికిని ప్రాయశ్చిత్తము కృష్ణ స్మరణము. దానిని మించినది లేదు. ప్రాయశ్చిత్త మనగా తపస్సు. పాపము జేసి యను తాపమి నొందెనేని హరిస్మరణ చేసె నేని దానిని మించిన పుణ్య సాధనము లేదు. దాన జీవి నారాయణుని జెందును. ప్రాతః కాలాహో రాత్రము లందు సంధ్యా సమయము లందు నారాయణ స్మరణ చేసి పాపక్షయ మంది నరుడు నారాయణుని పొందును. ఎవ్వని మనస్సు జప హోమార్చనము లందు, వాసుదేవు నందు లగ్నమై యుండునో వాడు ముక్తి నొందును. విష్ణువు నందప్పుడప్పుడు మనసు నిలువక చలించె నేని, వానికి దేవేంద్రాది పదవి లభించును. పుసరావృత్తి లక్షణ మ్తెన స్వర్గ గమన మెక్కడ? ముక్తి బీజమైన వాసుదేవ నామ స్మరణ మెక్కడ? కావున అహర్నిశము పురుషుడు, విష్ణు స్మరణ జేయుచు పాపక్షయ మంది. శుద్ధు డైనచో నరక ధర్శనము జేయడు. స్వర్గము మనః ప్రీతి గూర్చి నది, దానికి వ్యతిరేకము నరకము. నరక స్వర్గము లనగా పాప పుణ్యములే. అవి వానికి పర్యాయ పదములు, వాసుదేవై కచిత్తుడు అపునరావృత్తి లక్షణ మైన సాయుజ్య ముక్తి కర్హుడన్న మాట.
ఒకే వస్తువు దుఃఖము నకు, సుఖముకు ఈర్ష్యకు కోపము నకు కారణ మగును. కావున నే వస్తు వైనను దుఃఖాత్మకమే. ఆ వస్తువే యొకప్పుడు కోపమునకు హేతువై యదే ప్రసన్నతకు గారణ మగును. కావున కేవలము దుఃఖాత్మకము కేవలము సుఖాత్మకము నయిన వస్తువు లేనే లేదు. సుఖ దుఃఖాది లక్షణ మైన యీ పరిణామము కేవల మానసికము, బ్రహ్మజ్ఞాన మొక్కటియె జ్ఞానము. లౌకిక మయిన జ్ఞానము బంధ మునకు బ్రహ్మ జ్ఞానము ముక్తికిని కారణ మగును, ఈ ప్రపంచ వ్యవహారము తెలివి వలననే జరుగును. కాని ధీనికే మందదు. విద్య అవిద్య యను వానిని బ్రహ్మ జ్ఞానము, లౌకిక జ్ఞానము నుగా గ్రహింప వలెను. (మోక్ష విషయక మైన జ్ఞానమే జ్ఞాన మనియు, తదన్య విషయక మైన తెలివి విజ్ఞాన మనియు సమరుడు చెప్పెను.) అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృత మశ్నుతే అనగా నవిద్యచే జరా మరణము లను లేకుండ జేసికొని విద్యచే సమృత స్థితిని (మోక్షమును) బొందునని శ్రుతి చెప్పినది. ఔపనిషద మైన జ్ఞానము బ్రహ్మజ్ఞాన మగును. పేర విద్యాశబ్ద వాఛ్యమై కేవల మవునరావృత్తిక మైన ముక్తికి హేతు వగును తక్కిన వేద వేదాంగాది విద్యలు, తదుదిత కర్మా నుష్ఠానమున విద్యగా బేర్కొన బడి స్వర్గాది భోగమాత్ర సాధనములగు నన్నమాట. వీనిచే జిత్తశుద్ది వడసి పునరావృత్తి సహితము లయిన పుణలోక భోగములను బొంద వచ్చును. కేవలము విద్య వలననే మోక్షస్థితి కలుగునను భావము. ఈ విధముగ నా చే భూ మండలము సమస్త పాతాళములు, నరకములు, మీకు చెప్పబడినవి, సముద్రము, పర్వతములు, ద్వీపములు, నదులు, సంక్షేపముగ చెప్ప బడినవి. ఇంకేమి వినగోరు చున్నారు.
