బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)

Table of Contents

47 - ప్రాసాదకరణమ్‌

ఇట్లా రాజు విష్ణుప్రాసాద నిర్మాణమును గురించి యాలోచించి ప్రారంభము చేసెను. జోతిష్కులను బిలిపించి భూ శోధనము చేయించెను. అంతియే గాక జ్ఞానులు, వేదశాస్త్ర పారంగతులు, అమాత్యులు, మంత్రులు, మొదలగు వారితో సమాలోచించి సుముహూర్తమున చంద్ర తారాబల సంపత్తి గ్రహాను కూల్యము గల శుభ సమయమున వాస్తు విద్వాంసులతో నీ యారంభము జరిపించెను. మంగళ వాద్యములు, వేదా ధ్యయనము మనోహరముగా జరిగెను. పూవులు, నక్షతలు, పేలాలతో దీపములతో పూర్ణ కుంభములతో నా మహీపతి భక్తితో భగవంతున కర్ఘ్యమిచ్చెను. కళింగోత్కళ, కోశలా ధీశ్వరులను ఆహ్వానించెను.

మఱియు నా నరేంద్రులను స్వామి విగ్రహము కొఱకనువయిన శిలకై వెళ్ళుడని యానతిచ్చెను. శిల్పులను వెంటగొని వింధ్యాద్రికి జని బండ్లపై పడవలపై నేగి పాషాణములను గొని రండని పంపెను. ఇట్లాజ్ఞ యిచ్చి యమాత్యులతో పురోహితుల కిట్లానతిచ్చెను.

నా యానతి గొని దూతలు ఈ పుడమి కల రాజు లందరికి శుభవార్త తెలిపి రండనెను. దూతలు రాజు వచనమును రాజులకు దెయిప నేగిరి.

దూతలేగి రాజులకు వార్త నెఱింగింప వారు ససైన్య పరివారముగా నరుదెంచిరి. నలు దెసల రాజ్యముల వారు పర్వత ద్వీపాది పర్వత ప్రాంతముల వారు నయ్యు త్సవమునకు వచ్చిరి.

అట్లరుదెంచిన రాజులను గని యీ పుణ్య క్షేత్రము భుక్తిముక్తి ప్రదము. ఇంద శ్వమేధమును జేసి విష్ణు ప్రాసాద నిర్మాణమును గూడ జేయ కుతూహల పడుచున్నాను. కావున మీరందరూ నాకిందు సహకరింప వలెను.

బుద్ధిశాలి యగు రాజిట్లు పలుకుటకు నృపతు లెల్లరు నానందించిరి. అతని శాసనము ననుసరించి ధన కనక, రత్న, ముక్తా మణి రాసులను అనర్ఘ వజ్ర వైడుర్యాదులను, శాలువలను నూత నాంబరములను, నేనుగులపై గుర్రములపై నసంఖ్యాకముగ తరలించుకొని వచ్చరి. నానా విధ ఆహార పదార్థములను నవ ధాన్యములను, మాష ముద్గ తండుల తిలాదులను, గొని తెచ్చి గాదులను నింపిరి, ఆ యజ్ఞ సంభారములను జూచి నృపతి పరమానంద భరితుడై మహర్షులను, దేవర్షులను, బ్రహ్మచారి ప్రముఖ చతురాశ్రమ స్థులను ఆచార్యో పాధ్యాయ ఋత్విజ వర్గమును సర్వశాస్త్ర కుశలు రయిన సదస్యులను నా శ్రీమంతుడు దర్శింప నానంద భరితుడై పురోహితునితో నిట్లనియె.

అశ్వమేధాశ్వమునకు వేద పారగులైన బ్రాహ్మణు లాయా దేశముల కేగి పరీక్షింతురు గాక యనెను.

రాజ పురోహితుడానంద భరితుడై రాజులతో బ్రాహ్మణ పురస్సరముగా నొక గ్రామ ప్రాంతమున యజ్ఞ వాటమును శాస్త్రీయముగా నిర్మింప జేసెను. అది అనేక రాజ ప్రాసాదము లతో మణిమయము లయిన వేదికలతో, బంగరు స్తంభములతో తోరణములతో సుమనోహరముగా శోభిల్లు చుండెను. నానా దేశ రాజులకు నంతః పురములను ఏర్పరచెను. ఆ దేవుని సంతోష పరుప నమూల్య మయిన వస్తువులను స్వర్ణ రత్నాదులను గాన్కలంగొని వారివారి శిబిరము లందు విడిసిరి. ఆ సందడి సముద్ర ధ్వనిని మించి ఆకాశ మంటెను. నానాదేశా గతులైన బ్రాహ్మణ వైశ్యులకును విడుదులను యథా విధిగ నేర్పాటు చేయించెను.

మఱియు నందాగతులైన వారికి శయ్యాస నాదులు మృష్టాన్న సంతర్పణముల నాడేర్పరచెను. ఆ యజ్ఞమునకు మహానుభావులు బ్రహ్మ వేత్తలు శిష్యులతో నేతెంచిరి. రాజు వారికి నెట్టి డాంబికము లేక హృదయ పూర్వకముగా స్వయముగా స్వగత మొసంగెను. ఆ మీదట శిల్పులు నందు తమ శిల్ప నైపుణ్యముం బ్రదర్శించిరి. రాజు మంత్రులతో నేమాత్ర మేమరుపాటు లేకుండ నా యజ్ఞ సన్నాహముం దిలకించి పులకితాంగుడయ్యె.

ఆ యజ్ఞ మారంభము నంత సదస్యు లొండొరులను గెలువ నిత్యద్బుత శాస్త్రార్థములు గావించిరి. దేవేంద్ర వైభవమును మించిన ఆ యజ్ఞవాట నిర్మాణ శోభను దిలకించి, మంగళార్థము లయిన పూర్ణ కలశల వీక్షించి శ్రౌతము చెప్పినట్లు నిలువ బడిన దారుమయ యూప స్తంభము లంగని, జల స్థలము లందు బుట్టిన యజ్ఞ పశువుల నావులు గేదెల నాలోకించి యజ్ఞమున కేతెంచిన ప్రజలానంద భరితులైరి. జరాయుజాదులు నాల్గు రకముల జీవులు పర్వతము లందు పండెడి ధాన్యములు మొదలయిన యజ్ఞ సంభారము లనేక ములం జూచి రాజు లాశ్చర్యానంద వివశులైరి. బ్రాహ్మణాదులకు మృష్టాన్న సంతర్పణములు జరిగెను. ఇట్లు విప్ర సహస్ర సంకులమైన యయ్యజ్ఞ వాటము నందు మంగళార్థము లైన దుందుభి ద్వనులు విన సొంపైనవి. పాలు పెరుగు లందేరులై ప్రవహించెను. జంబూ ద్వీపమంతయు నట కేతెంచి నట్లు కనిపించెను. విప్రులు సువర్ణ మణికుండ లాదులను వేలకొలది బహుమాన ములందందు కొని యేగిరి. అందు బ్రాహ్మణులు రాజ భోజ్యము లయిన విందు లారగించిరి. ఋత్విజులకు భూరి దక్షిణ లొసంగెను. మరియు నాఱేడు రాజులకు గూడ మిక్కిలి సత్కరించెను. ఆరాజు నంతఃపురము యజమాన నత్నీగణము కులశీల సంపన్నము పరమ శోభన స్వర్ణ రత్నా భరణము లందాల్చి ముక్తారత్న హారములు మెఱయ నా యజ్ఞమున కద్బుత శోభను సంపాదించెను. మహా గజములు సింధు జాతము లైన అశ్వములు పలు రంగులు గలవి నానా విధాయుధ ధారు లయిన భటులు నా యజ్ఞ మునకు రక్ష యిచ్చు చుండ జూచి యా యజమాని మానవేశ్వరు డుప్పొంచుగు నిట్లనియె.

సర్వ శుభ లక్షణ లక్షితమైన అశ్వమేధాశ్వమును గొని రండు, సుసన్నద్ధు లయి రాజ కుమారులా గుఱ్ఱము వెంట రక్షణ యిచ్చును ననుగమింతురు గాక ధర్మశాస్త్ర విదు లయిన విప్రులు ఋత్విజు లిక్కడ హోమాదులను నిర్వర్తింపుడు నల్లమేక, నల్లలేడి, జాతి గల యెద్దు దున్నపోతు గోవులు గోపాలురును నిందు గొనిరండు. ఇష్టి విశేషములను జరిపింపుడు. ఆ మీద విష్ణు దేవాలయ నిర్మాణము నిర్వర్తింప బడును. విప్రులేది కోరిన నది యెల్ల నిండు, మఱి యిందు వచ్చు యాచకు లెల్లరకు లేదన కుండ సర్వ ద్రవ్యములు నీయ బడుగాక. నాకు భగవంతుడు విష్ణువు సాక్షాద్దర్శన మిచ్చు దాక యీ యజ్ఞము జరుగ వలసినదే యని యారాజు బంగారు రాసులను గజ తురగ గో వృషభాదులను కోట్లు నర్బుదములుగా దానములు గావించెను. గోవుల కొమ్ములకు బంగారు తొడుగులు పాలు పితుకుటకు కంచు బిందెలు జతసేసి అనేక గోవులను వేద విదుల కొసంగెను.

అనర్ఘ సువర్ణ మణిమయాంబరా భరణములను తెల్లని శయ్యాసనా స్తరణములను, పగడములను వజ్ర వైడూర్య గోమేధికాది రత్నములను నమూల్యము లనమేయముల నిచ్చెను. సాలంకృత కన్యా దానములు సేసెను. సర్వాంగ సుందరు లయిన యంగనా మణులను విలాస వతులను చీరలతో రావికలతో హార కేయూర కంకణాదులతో గాన్క లిచ్చెను. భక్ష్య భోజ్య చోష్య లేహ్యాత్మ ములయిన చతుర్విధ మృష్టాన్న సంతర్పణము ఘృత పాయసావూప సమృద్దముగా గావించెను. సర్వజీవ సంతృప్తిగా నన్నదానము సేసెను. ఆ దానముల కాంతు దరి గానా రాదాయ్యె. ఈ అద్భుత యజ్ఞ వైభవమును గాంచి దేవతలు దైత్యులు చారణులు గంధర్వుల ప్సరసలు సిద్దులు ఋషులు రాజులు నెంతేని యాశ్చర్య మందిరి. ఋత్వి గ్వర్గము పురోహిత మంత్రి సామంతులు నాడిన యానందము నకు హద్దులు లేవు. అందు నొడలు వలువలు మాసిన వాడు దీనుడు నాకలి గొన్న వాడు, ఇబ్బందులకు లోనైన వాడు. దిగులు వడిన వాడు. వ్యాధి గ్రస్తుడు మనో వ్యాధి గ్రస్తుడు నైన జీవి యొక్కడును లేడు. ఆ రాజ్యమున నకాల మరణము గ్రహా వేశము భూతప్రేత పిశా చావేశము విష స్పర్శము నన్నది లేనే లేదు. హృష్ట పుష్ట జన సంకుల మాఱేని దేశము. మునులు తమతమ సేయు తపస్సు లందు బరమ సిద్ధిని బడసిరి. చిరంజీవు లైరి. ఎన్నడు నీవర కిట్లు దనధాన్య సమృద్ధముగ యజ్ఞము జరిగినది లేదు. ఇట్లా రాజేంద్రు డింద్రద్యుమ్నుడు యధా విధిగ నయ్యశ్వ మేధమును విష్ణు ప్రాసాదమును నిర్వర్తించి జగన్మంగళము సేకూర్చెను.