బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
230 - వ్యాస ముని సంవాదే మహాప్రళయ వర్ణనమ్
ఓ వ్యాసమునీ! ఎఱుగ శక్యము కాని విష్ణు మాయా తత్త్వము నీ వలన వింటిమి. కల్పాంతమున జరుగు మహా ప్రళయమున సృష్ట్యుప సంహారమును విన గోరు చున్నాము. అని మునులు వ్యాసుల నడిగిరి.
ప్రాకృత ప్రళయమున సృష్ట్యుప సంహారము జరుగు విధము వినుడు. మానవుల మాసము పితరులకునను సంవత్సరము దేవతల కును ఒక ఆహోరాత్ర మగును. కృతము త్రేతా ద్వాపరము కలి అను చతుర్యుగము బ్రహ్మకు ఒక పగలు. ఇది దేవతల పండ్రెండు వేల సంవత్సరములకు సమానము, కల్పాది యందలి కృత యుగమున సృష్టియు కల్పాంతము నందలి కలి యుగమున ఉప సంహారము ప్రళయమును జరగును.
ధర్మము నాలుగు పాదములతో నడువక వైకల్యము నొందు కలియుగ స్వరూపము వి నగోరెద మని మునులనిరి.
కలి యుగమున నరులు ఋగ్యజుః సామ వేదములు ప్రమాణముగా వర్ణాశ్ర మాచార ధర్మముల యందు ప్రవర్తించరు. వివాహములు ధర్మములు ఉండవు. శిష్యులు గురువుల నాదరించరు. పుత్రులు తమ ధర్మమును పాటించరు. అగ్ని హోత్రాది క్రియలు ఉండవు. ఏ కులమున పుట్టిన వాడైనను బలమున్నచో సర్వేశ్వరుడై పాలకు డగును. అన్ని వర్ణము లందును జనులు తమ కుమార్తెల మూలమున ధన మార్జింతురు. విప్రులు తమకు తోచిన ఏదో యొక విధానమున యాగ దీక్షను వహింతురు. తమకు తోచిన విధానమున ప్రాయశ్చిత్తములు చేయుదురు. ఎవరు ఏది చెప్పిన అదే శాస్త్రము. అందరును అందరకును దేవతలే. అందరకును అన్నియు బ్రహ్మ చర్యాది ఆశ్రమములే. తమకు ఏది ఇష్టమై అనుష్ఠించినచో వారికి అదియే ఉపవాసము. అదే తపస్సు అదే దానము. కొంచెము ధన మున్నను మదము ఎచ్చును. బంగార మణులు రత్నములు అన్నియు నశించగా స్త్రీలకు కేశములే అలంకారమునకు సౌందర్యమునకు కారణమై యుండును. స్త్రీలు ధనవంతునే భర్తగా గ్రహింతురు. ధనహీనుడగు భర్తను వదలుదురు. సేవకులు తమకు ఎక్కువ ధనము ఇచ్చిన వానినే యజమానునిగా గ్రహింతురు. తనమునకు గృహములే ప్రధానోప యోగము తెలివి యున్నందులకు ధన మూర్జించుటయే ప్రధానో పయోగము అస్తి యున్నందులకు సుఖములే ప్రధానోపయోగము. అని కలి యుగ జనులు భావింతురు.
కలియుగమున స్త్రీలు స్వేచ్ఛా ప్రవృత్తి విలాసముల యందు వాంఛ కలిగి యుందురు. అన్యాయముగా ధన మార్జించిన పురుషులను వాంఛింతురు. మిత్రులు కూడ ఎంత వేడినను మానవులు అల్పముగా కూడ తమ ధనమును వదలుకు ఇష్ట పడరు. మనస్సు ఎప్పుడును లౌకిక మైన పురుషార్దములను సాధించుట యందే యుండును. పాలెక్కువగా ఇచ్చుటను బట్టియే గోవులపై గౌరవము. జనులు తరచుగా అనావృష్టికి గుఱియై ఆకలిచే బాధ నొందురు ఆకాశము వైపు వానకై చూచు చుందురు. వేళ్ళు పండ్లు ఆకులు తినుచు తమ్ము తాము చంపుకొని చుందురు. కఱువులతో పడరాని బాధలు పడుచు తట్టు కొనలేక సుఖములు లేక ఉందురు. స్నానము చేయకయే ఆహారము తిందురు. అగ్నిని దేవతలను అంధులను పూజింతురు. పిండోద కాది పితృ క్రియలు చేయరు. స్త్రీలు విషయ సుఖ వాంఛ, చిన్న దేహము, అధికాహారము తినుట, ఎక్కువ సంతానము, తక్కువ భాగ్యము కల వారగుదురు. వారు రెండు చేతులతో తలగోకి కొందురు. దేహమును నిండుగా కప్పుకొనక యుందురు. పెద్దల యొక్క భర్త యొక్క అజ్ఞ మీరుదురు. తమ పొట్ట నింపు కొనుచు కోపనలై దేహ సంస్కారము లేక అసత్యములు పరుషములు మాటాడు చుందురు. దుఃశీలము కలిగి దుఃశీలురగు పురుషుల యందు ఆసక్తి దుష్ర్ప వర్తనము కలిగి యుందురు.
బ్రాహ్మణులు ఉపనయనము లేక యే వేదా ధ్యయనము చేయుదురు. గృహస్థులు హోమములు తగినట్లు దానములు చేయరు. యతులు అడవులలో నివసించుచు మొఱటైన ఆహారము తినుచు పుత్రాది స్వజనము పై ప్రీతి కలిగి యుందురు. ప్రభువులు ప్రజలను కాపాడక పోగా పన్నులను పేరుతో ప్రజల ధనమును హరించు చుందురు. అశ్వరథ గజములు ఉన్న వాడే రాజు, బలహీనుడే సేవకుడు. వైశ్యులు కృషి వాణిజ్యము వంటి తమ వృత్తలు విడిచి వడ్రంగము మొదలగు పనులతో శూద్ర వృత్తితో జీవింతురు. శూద్రులు అధములై సన్యాసి వేషముతో నుండి ధర్మములు సంస్కారములు లేక భిక్షా వృత్తితో యతివలె జీవింతురు. జనులు కఱవు వలన పన్నుల వలన బాధలు పడలేక గోధుమలు యవలు ఆహారముగా తిను దేశములకు పాఱి పోదురు. లోకమున వేద మార్గము నశించి అవైదిక ప్రవర్తన పెరిగి అధర్మ మెక్కువై నందున జనులు అల్పాయువు లగుదురు. శాస్త్ర విహితములు కాని ఘోర తపస్సుల చేయు జనులను రాజు దండించక పోవుటచే రాజ దోషము వలన పసివారు మరణింతురు. ఎనిమిది తొమ్మిది పది ఏండ్ల మగవారి వలన ఐదాఱేడేండ్ల స్త్రీలకు కాన్పులు అగును. పండ్రెండేండ్ల కంటె పైబడి చాల తక్కువ మంది జీవింతురు. తక్కువ తెలివి వ్యర్థముగా వేషము ధరించుట దుష్ట మగు అంతః కరణము కలిగి జనులు అల్ప వయస్సుననే మరణింతురు.
వైదిక మార్గము ననుసరించి వారికి హాని కలిగి నప్పుడెల్ల అధర్మము పెరుగు నని ఎఱుగ వలెను. అప్పుడే కలి విజృంభించును. ధర్మము నాచరించు వారి ప్రయత్నములు నెఱవేర కుండును. వేద వాదము లందు ఆసక్తి తగ్గును. నరులు ఆవైదికుల ప్రభావమునకు లోబడుటచే సర్వస్రష్ట సర్వేశ్వరుడగు విష్ణుని అర్చింప కుందురు. వేదముల తోను బ్రాహ్మణుల తోను దేవతల తోను నీటితో పవిత్రత సంపాదించుట తోను పనియేమి? అని పలుకు చుందురు. వానలు ఎక్కువగా కురియవు. పంటలు ఎక్కువగా పండవు. పండ్లలో సార మెక్కువగా ఉండదు. అణుప్రాయ మగు ధాన్యము. మేక పాలకు ప్రాముఖ్యము. వట్టివేళ్ళ గంధము పూసి కొనుట అధిక మగును. నరులకు అత్త మామలే గురువులుగా మిత్త్రులే ముని శ్రేష్ఠులుగా అగుదురు. నరులు మామ గారలు చెప్పినది వినుచు మానవుడు తన పని తాను చేసికొను నపుడు ఎవరికి ఎవరు తండ్రి? ఎవరు తల్లి? ఎవరు కుమారుడు? అందురు. అల్ప ప్రజ్ఞ కలవారై వాజ్మనఃకాయిక దోషములకు వశులై అను దినమును పాపముల చేయు చుందురు. సత్యము శౌచము సిగ్గు వీనిని విడిచిన వారికి కలుగ వలసిన దుఃఖము లన్నియు కలిగి జనులు బాధలు పడుదురు. స్వాధ్యాయము స్వధాస్వాహ వషట్కారములు లోపించును. సరి యగు బ్రాహ్మణులు అరుదుగా నుందురు. కృత యుగమున దీర్ఘ కాలము తపస్సు చేసి సాధించిన పుణ్య స్కంధమును కలి యుగములో అల్ప కాలము లోనే సాధించి కొందురు.
ఏ కాలములో అల్ప ధర్మము నాచరించినను అధిక పుణ్య ఫలము కలుగునో తెలుపు మని వ్యాసులను మును లడిగిరి.
ఓ విప్రులారా! ధన్యమగు అల్ప క్లేశముతో తపస్సు చేసినను మహా ఫలము లభించును. ఈ విషయములో స్త్రీలును శూద్రులును మఱియు ధన్యులు. కృత యుగమున పండ్రెండేండ్లు తపస్సు చేయుటచే కలుగు ఫలితము త్రేతా యుగమున ఒక సంవత్సరము ద్వాపరమున ఒక మాసము కలిలో ఒక అహోరాత్రము తోనే కలుగును. తపస్సు బ్రహ్మ చర్యము జపము మొదలగు వాని ఫలము కలి యుగములో ఇట్లు నరుడు అల్ప శ్రమముతోనే పొంద గలడు. అంతేకాక కృత యుగమున ధ్యానము చేత, త్రేతలో యజ్ఞముల చేత, ద్వాపరములో అర్చనము చేత, కలుగు ఫలము కలి యుగమున కేశవ సంకీర్తనము తోనే కలుగును. బ్రాహ్మణులు కలి యుగమున ఉపనయనము చేసికొని వేద వ్రతము లనుష్ఠించుచు వేదా ధ్యయనము చేయ వలెను. తరువాత ధర్మానుసారముగ సంపాదించిన ధనముతో విధానము ననుసరించి యజ్ఞములు చేయ వలెను. వ్యర్థముగా భాషించుట భుజించుట ధన మార్జించుట బ్రాహ్మణులు పతితులు అగుటకు హేతు వగును. కనుక విప్రులు ఆయా విషయములలో నిగ్రహము కలిగి ఉండ వలెను. వారు ఏ విషయముల నైనను సరిగా చేయక పోవుట దోష కరము. భోజ్యములను తినుట పానీయములను త్రావుట వలన ద్విజులకు కోరికలు నెర వేరవు. జనులును అట్టి బ్రాహ్మణులకు అధీనులై అన్ని కార్యముల యందును ప్రవర్తించి నచో వారు ఎంతో శ్రమకు ఓర్చి వినయ వంతులై జనులచే ఆయా యజ్ఞాదులను చేయింతురు. శూద్రుడు బ్రాహ్మణులను సేవించు చున్నచో పాక యజ్ఞమునకు అధికరాము కలిగి తాను సాధింప దగిన ఉత్తమ లోకములను సాధించు కొనును. త్రికరణములతో పతిసేవ చేయుట వలన స్త్రీలు తన భర్తతో పాటు అతడు పుణ్యములు చేసి సాధించిన లోకముల కేగి సుఖింతురు. ఓ బ్రాహ్మణు లారా! మీరు ఏ విషయము తెలియ గోరి ఇక్కడకు వచ్చితిరో అది తెలిపితిని. ఇంకను ఏమి కావలయునో అడుగుడు.
