బ్రహ్మ పురాణము (గౌతమీ మహాత్మ్యము మినహా)
202 - నరకాసుర వధ వర్ణనమ్
వ్యాసులు:
“ఇంద్రు రైరావత మెక్కి ద్వారవతి యందున్న కృష్ణుని జూడ వచ్చి యతనికి నరకాసురుని చర్యలను దెలిపెను.”
దేవతలకు దిక్కయిన నీవు మనుష్య రూపమున నుండియు సర్వ దుఃఖ ప్రశమనము జేసినావు. తపశ్శాలుర రక్షణకు నరిష్టుడు మొదలుగ గంసుని వరకు గల జగ దుపద్రవ మైన వారిని నశింప జేసితివి. నీ బాహుదండము చేతను బ్రబోధము చేతను ద్రిభువనములు రక్షణము బొంది దేవతలు యజ్ఞము లందు హవిర్భావము లారగించి తృప్తులగు చున్నారు. నేనిపుడు ఎందులకు వచ్చితినో విని ప్రతిక్రియకు నెత్నింపుడు. భూమి పుత్రుడు నరకుడను వాడు ప్రాగ్జ్యోతిష పురాధిపతి సర్వ భూతములకు బాధ చేయు చున్నాడు. దేవ సిద్ధులు సురులు మొదలగు వారి కన్యకల హరించి తన యింట నిర్భంధించి నాడు. ఉదకమును స్రవించు వరుణుని యొక్క గొడుగును వాడు హరించెను. మణులకు ఆకరమైన మందర పర్వత శిఖరమును గొని పోయినాడు. మా తల్లి యదితి యొక్క కుండలములను అమృతము స్రవించు వానినిగా జేసినాడు. ఇపుడు ఐరావతము కావలెనను చున్నాడు. వాని దుష్కృత్యము నీకు నివేదించి నాను. ఇందు జేయ వలసిన ప్రతిక్రియ నీవు స్వయముగా విమర్శింపుము.
అన విని భగవంతుడు దేవకీ సుతుడు అల్లన నవ్వి ఇంద్రుని జేత బట్టుకొని పీఠము నుండి లేచెను. తలచి నంతన వచ్చిన గరుత్మంతుని పై సత్యభామను ఎక్కించి ప్రాగ్జ్యోతిష పురమున కేగెను. ఇంద్రుడు ఐరావతము నెక్కి ద్వారకా వాసులు చూచుచుండ స్వర్గమున కేగెను.
ప్రాగ్జ్యోతిష పురము చుట్టునూ నూరు యోజనములు భయంకరము లైన పాశములచే జుట్టబడి యుండెను. పరసైన్య నిరోధమునకు ఏర్పడిన యా పాశములను సుదర్శ నాయుధము విసరి హరి ఖండించెను. అవ్వల మురాసురుడు ఎదిరింప రాగ హరి వానిని గడ తేర్చెను. మరియు వాని కొడుకులను ఏడువేల మందిని మిడుతలను వలె చక్ర ధారాగ్ని దగ్ధులను జేసెను. అచ్చటనే హయగ్రీవుని జంపి బుద్దీశాలి యగు హరి తొందరతో ప్రాగ్జ్యోతిష పురమునకు బరువెత్తెను. అచ్చట నరకునితో మహా సైన్యముతో ఘోర యుద్ధ మయ్యెను. గోవిందుడు వేల కొలది దైత్యులను గూల్చెను. అవ్వల శస్త్రాస్త్రములను వర్షించు చున్న భౌముని మీదికి జక్రాయుధమును విసరి దైతేయ చక్ర సంహారి వానిని రెండుగ జేసెను. నరకుడు కూలగా భూదేవి యదతి యిచ్చిన కుండలములు గొని జగన్నాధు సన్నిధికి వచ్ఛి యిట్లనియె.
“స్వామి! వరాహ మూర్తివై ననుద్ధరించి నపుడు ఆ నీ స్పర్శ వలన నీ పుత్రుడు పుట్టి నాడు. నీవిచ్చిన వాడు వీడు. నీ చేతిలో కూలి నాడు. ఈ కుండలములను గై కొనుము. ఈ నరకుని సంతానమును రక్షింపుము. నా భారమును దింపుటకు నీవీ లోకమున నంశావతార మెత్తినావు. అనుగ్రహ సుముఖు డవు గమ్ము. నీవు కర్తవు. వికర్తవు. (వేరు చేయు వాడవు) సంహర్తవు. సృష్టి హేతువవు. జగత్ స్వరూపుడవు. నిన్ను నేనెక్కడ స్తుతింప గలను, వ్యాపించు వాడవు, వ్యాపింప బడు వాడవు, చేయు వాడవు, చేయ నగు పని చేయుటయు నీవె, సర్వ భూతములకు నాత్మ స్వరూపుడవు, నేనెక్కడ స్తుతింతును. ఆత్మ (జీవుడు) భూతాత్మ (భూత స్వరూపము) పరమాత్మవు నీవె. నరకుడు చేసిన దానిని దప్పిదము కాకుండ క్షమింపుము. ప్రసన్ను డవు కమ్ము. వీడు నా కుమారుడు. కూల్ప బడినాడు.” అని భూదేవి హరిని స్తుతించెను.
కృష్ణుడు ధరణితో నట్లేయని నరకునింట నున్న రత్నములను దీసి కొనెను. (రత్నము లనగ మణులే కాదు ఆయా వస్తువులలో కెల్ల నుత్తమ మయిన యెల్ల వస్తువులను) అంతః పురమున పదహారు వేలు పైన నూర్గురు నగు కన్యకలను గూడ గైకొనెను. నాలుగు దంతములు గల యారువేల యేనుగుల నచట జూచెను. కాంభోజ దేశీయము లైన గుఱ్ఱములు ఇరువది యొక్క నియతముల సంఖ్య గలవి వాని యింట నున్నవి. నరకుని కింకరులచే నప్పటి కప్పుడు గోవిందుడు ద్వారకా పురికి దరలింప జేసెను. వారుణ చ్ఛత్రమట గనిపించెను. అట్లే మణి పర్వతమును. హరి దానిని ఖగరాజు గరుడ నెక్కించెను. సత్యభామతో దాను నధిష్ఠించి యదితికి కుండలము లిచ్చుటకు ద్రిదశపురి కేగెను.
